'జయంతిలో చాలా మార్పు కనిపిస్తుంది కదూ' అంటున్నాడు తండ్రి ఓ రోజు తల్లితో. తను ఆఫీసుకి బయలుదేరాక-రుమాలు మర్చిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిన జయంతి గుమ్మంలొ ఆగింది. 'మారక ఏం చేస్తుంది లెండి, అదలా ఇంట్లోంచి వెళ్ళడం మంచిదే అయింది. కాస్త బుద్ది జ్ఞానం వచ్చాయి- తల్లి దండ్రులు కంటే తన మేలుకోరే వాళ్ళు ఎవరూ లేరని వంటరిగా ఉన్నప్పుడు అర్ధం అయి వుంటుంది. దమయంతిని గోపాలకృష్ణ చూశాక అతన్ని వదులుకుని తను పొరపాటు చేశానన్నది తట్టినట్లుంది.
అన్నింటిని మించి వయసు మీద పడ్తుంటే కుర్రతనం అహంకారం తగ్గుతుంది. తన ఈడు వారందరికి పెళ్ళిళ్ళయి సంసారాలు చేసుకుంటే, తనింకా పిచ్చిపిచ్చి కోరికలతో వచ్చిన సంబంధాలన్ని జారవిడుచుకొన్నందుకు బాధపడ్తుండవచ్చు. ఏది ఏమైనా పరిస్థితులే మనిషిని వంగదీస్తాయి.
'ఏమో... ఇప్పటికయినా మనం చూపించిన సంబంధాలు నచ్చితే బాగు పడ్తుంది. ఇంక పంతం పట్టింపులు పెట్టుకుంటే నష్టపోయేది అదే అని గ్రహించి వుంటే మంచిదే...' అంటున్నాడాయన.
జయంతి రుమాలు తీసుకోకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయింది. దారిలో ఆత్మవిమర్శ చేసుకుంటే.... నిజమే తను మారింది. తల్లితండ్రి మాటల్లో వున్న నిజం అర్ధం అయినట్లనిపించింది. వాళ్ళిలా అన్నా ఇదివరకులా కోపం రాలేదు. ఇప్పుడు తల్లి తండ్రి ఏదన్నా సంబంధం తీసుకొస్తే ఇదివరకులా అన్నింటికీ వంకలు పెట్టకూడదు అని నిర్ణయించుకుంది. ఈ జీవితంలొ ఏదో మార్పు కావాలని ఆమెకీ చాలా అనిపించసాగింది.
* * *
దివాకర్ మనీషాతో ఆ రోజు ఏ సంగతి మాట్లాడి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆమె మనసులో ఏముందో అర్ధం కాకుండా తను వెర్రి వెధవలా గాలిలో మేడలు కట్టకుండా తొందరగా ఏదో ఒకటి తేల్చుకోదలిచాడు. ముఫ్ఫై ఏళ్ళు నిండాయి-ఇంకెప్పుడూ పెళ్ళి చేసుకుంటావంటూ ఇంట్లో వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ, ఫోటోలు పంపిస్తూ ఊదరగొడ్తున్నారు. అతనికీ బాచిలర్ లైఫ్ విసుగొచ్చింది-వీలయినంత త్వరలో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు.
ఆ రోజు సాయంత్రం ఇంటికి వెడ్తూ మనీషా బుటిక్ వైపు వెళ్ళాడు. ఎవరో ఒకరిద్దరు కష్టమర్స్ డ్రెస్సులు సెలక్ట్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో వచ్చిన అతన్ని చూసి కాస్త ఆశ్చర్యపడిపోయింది. 'హలో' సారీ బిజీగా వున్నట్టున్నారు' అన్నాడు దివాకర్. 'ఊ... ఫరవాలేదు లెండి.....కూర్చోండి. ఏమిటి ఏదన్నా పనివుందా?' అంది ఆమె ఇంకేం అనాలో తెలియక.
'మీతో ఓ విషయం మాట్లాడాలని....'
'ఫోను చెయ్యకపోయారా....దానికోసం మీరు రావడం...' సందిగ్ధంగా చూసింది.
'ఫోనులో చెప్పేది కాదు... పర్సనల్ గా మాట్లాడాలి' ... దివాకర్ మెల్లగా అన్నాడు.
'సరే చెప్పండయితే...'
'వాళ్ళని పంపించి రండి. ఐవిల్ వెయిట్' అన్నాడు. కష్టమర్లు వెళ్ళిన కుర్చీలో కూర్చుంటూ 'చెప్పండి' అంది కుతూహలంగా అతను అటు ఇటు చూసి కాస్త ఇబ్బందిగా 'మనం ఎటన్నా బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే బాగుంటుందేమో'
'ఇప్పుడా షాపు వదిలి రావడం కుదరదు' మనీషా అంది.
'ఒక్క అరగంట అలా కారులో వెడుతూ మాట్లాడుకుందాం-ప్లీజ్' అన్నాడు.
'ఏమిటి అంత అర్జంటా...రేపు ఆదివారం ఇంటికి రావచ్చుగా...' అంది.
'ముందు మీతో మాట్లాడాక ఇంటికి ఎలాగూ వచ్చి మాట్లాడుతాలెండి' అన్నాడు నర్మగర్భంగా.
మనీషాకి అర్ధమయి అర్ధమయినట్లనిపించింది-దివాకర్ వంక చూసి 'సరే పదండి' అంటూ సేల్స్ గర్ల్ కి అప్పచెప్పి బయటికి నడిచింది.
'మనీషాజీ....మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు' కారు డ్రైవ్ చేస్తూ మొదలుపెట్టాడు దివాకర్.
'ఇదడగడానికా ఇలా పిలిచారు' మనీషా నవ్వింది.
'ఆహా...అది కాదు, అడిగే విషయానికి నాంది. మన పరిచయం అయిన మూడు నాలుగు నెలలు అయింది కదా. నన్ను గూర్చి మీ అభిప్రాయం ఏమిటి?'
'అభిప్రాయం ఏమిటి, అసలు అలా ఏమి అనుకోలేదు నేను' సిన్సియర్ గానే అంది.
'అంటే మన స్నేహం గురించి... నా గురించి....'
'ఇది స్నేహం అంటారా. నేను పరిచయం అనుకుంటున్నాను తప్ప, మన మధ్య పెద్ద స్నేహం వుందంటారా' గడుసుగానే అడిగింది.
దివాకర్ మొహం కాస్త ముడుచుకుంది. అంటే స్నేహానికి మూడు నెలలు తక్కువ టైమనా మీ ఉద్దేశం. ఇద్దరి మధ్య స్నేహం కుదరడానికి ఈ టైము చాలని, మనిద్దరి మధ్య మంచి స్నేహమే వుందని నాకనిపిస్తూంది"
మనీషా ఏం మాట్లాడలేదు. చూపు తప్పించింది. 'సర్లేండి....ఇంతకు మీరు ఏం మాట్లాడాలనుకున్నారో చెప్పనే లేదు"
"మనీషాజీ.... నేనూ సూటిగా ఒక్క ప్రశ్న అడిగేస్తాను సమాధానం చెప్పండి. ఈ నాన్చడం, కవిత్వం చెప్పడం ఇదంతా ఇదంతా వద్దు. ఈ తీయగా మాట్లాడటం నాకు రాదు. అందుకే ఫ్రాంక్ గా మీ అభిప్రాయం కావాలి. మనీషాజీ, నేను మిమ్మల్ని పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను. మీకిది ఇష్టమేనా! మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను నేనుగా లేను. మీ అందానికి ఎంతో ఆకర్షితుడనయ్యాను. మిమ్మల్ని ఈ మూడు నెలలుగా ఎంతో అభిమానిస్తున్నాను. మీ అందం, మీ స్వభావం నాకెంతో నచ్చాయి. అందుకే మీతో స్నేహం పెంచుకున్నాను. మీ ఇంట్లో వాళ్ళతో పరిచయం పెంచుకున్నాను. ఇన్నాళ్ళుగా నన్ను చూస్తున్నారు. మాట్లాడుకున్నారు. మీకు నా పట్ల ఇలాంటి అభిప్రాయం కల్గిందా, నా ప్రపోజల్ని మీరు అంగీకరించగలరా. మీకేం అభ్యంతరం లేదంటే నేను మీ వాళ్ళతో మాట్లాడుతాను. మన కులాలు, భాష, సంస్కృతి అన్ని వేరే కాని ఈ రోజుల్లో ఇవన్నీ చాలా చిన్న విషయాలు. కేవలం మీరు ఎస్ అంటే మిగతా అభ్యంతరాలు లెక్కలోకి రావు.... గబగబ గుక్క తిప్పుకోకుండా ప్రాక్టీసు చేసిన మాటలు అప్పచెప్పినట్టు అనేశాడు.
మనీషా మొహం ఎర్రబడింది. ఇది ఆమె అనుకోని విషయం. డైరెక్ట్ గా పెళ్ళి ప్రసక్తి తెచ్చేశాడు. అసలు నిజానికి మనీషా మనసులో ఇలాంటి ఆలోచన లేదు. తనంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ వెనక తిరుగుతున్నాడన్నది అర్ధం అయింది గాని ఆమె ఇంకా దివాకర్ అంటే ఏ అభిప్రాయమూ ఏర్పరచుకోలేదు. బావగారి స్నేహితుడన్న మర్యాద, తనతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూంటే కాదనలేక లంచ్ లకి, డిన్నర్ కి ఆహ్వానిస్తే తిరస్కరించలేక ఇంటికొచ్చి తండ్రి తమ్ముడు వగైరాలతో మాట్లాడుతూంటే ఏదో స్నేహం అనుకుంది. తన వెనకపడ్డాడంటే తను అందగత్తె అన్నది ఆమెకీ తెలుసు గనక ఓ బాచిలర్ తన చుట్టూ తిరగడం వింతగా అనిపించలేదు. దివాకర్ అంటే యిష్టమూ లేదు, అయిష్టమూ లేదు. ఏదో తామిద్దరి మధ్య గట్టి స్నేహమూ వుందని అనుకోలేదు. ఇంత తొందరగా అతనిలా అడిగేసరికి ఆమె ఆశ్చర్యంతో పాటు ఇబ్బందిపడింది... తండ్రి అక్క పెళ్ళికాంగానే తన పెళ్ళి ప్రయత్నాలు ఆరంభించి వరులకోసం వెతుకుతున్నాడన్నది ఇంట్లో అప్పుడప్పుడు అనుకునే మాటల్లో తెల్సు. తల్లితండ్రి ఆమెని ఇప్పటివరకు ఏ ఏ సంబంధం గురించి ప్రత్యేకంగా అడగలేదు. పెళ్ళి గురించి నీ ఉద్దేశ్యం, నీ కోరికలు ఏమిటీ అనీ అడగలేదు. అడిగినపుడు చూడచ్చు. అయినా ఇప్పుడే పెళ్ళికేం తొందరలేదు. తనకి నచ్చిన వాడు దొరికితే చూద్దాం అన్న ధోరణి తప్ప ఆమెకి పెళ్ళి పట్ల పెద్ద ఇంటరెస్ట్ లేదు. అసలు దివాకర్ గురించి ఆలోచనా రాలేదు.
'ఏమిటి మనీషా అంత ఆలోచిస్తున్నారు' ఆరాటంగా అడిగాడు దివాకర్.
మనీషా స్థిరంగా అతనివంక చూసింది... 'టు టెల్ యూ ఫ్రాంక్ లీ.... అసలు నేను ఇప్పటి వరకు పెళ్ళి గురించే ఆలోచించలేదు. ఇంత తొందరగా నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. మీరు ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు అని భావించాను తప్ప ఇలాంటి ఉద్దేశం మీకుందని నాకు తెలీలేదు..."