తనకు మిగిలిన వంశాకురం ఆ పసికూన.వెంటనే రాజవల్లి తన ఆస్థిపాస్తులన్నీ తన తదనంతరం శకుంతలకు చెందేలా వీలునామా వ్రాసి, ఆమె తండ్రిని ఆ ఆస్తికి గార్డియన్ గా పేర్కొంది. ఆ సమయంలో తన వీలునామా, తన మనుమరాలి జీవితంలో ఎలాంటి ప్రళయం సృస్టించబోతుందో, పాపం రాజవల్లికి తెలీదు.
డబ్బు సంపాదించటమూ, జల్సాగా జీవితం గడపటమూ, తప్ప మరొక ధ్యేయంలేని రమేష్ ఈ వీలునామా సంగతి తెలుసుకొని డేగలాగ తాను శకుంతల తండ్రినంటూ, విమల జీవితాన్ని చీకాకు చేశాడు.
ఈ విషయం రచ్చకెక్కాక రాజవల్లి విభ్రాంతిపొందింది. ఇలాంటి విషయాలు ఆవిడ జీవితంలో కాని, విని ఎరుగదు. ఆవిడ ఊహకి కూడా అందని విషయం ఇది. మొదట్లో మనసంతా అయోమయంగా అయిపోయినా, చెదు అనుభవాలతో తూట్లుపడిన ఆవిడ మనసు ఉత్తముడయిన శర్మ వేపుకే మొగ్గింది.
కేవలం తనమీది జాలితో విమలనూ, శకుంతలనూ తనదగ్గరికి తీసుకొచ్చాడేకాని, తన సంపదమీద ఆశతో కాదని అర్ధం చేసుకోగలిగింది. ఆ దంపతులిద్దరూ తన సంపదను తృణపాయంగా నిరాకరించటం ఎంత నిరాశ కలిగించిందో; అంత గౌరవం కలిగించింది.
తను ప్రాణంగా ప్రేమించే శకుంతలకు రమేష్ కారణంగా ఇన్ని చికాకులు రావటం, సంఘం దృష్టిలో శకుంతల తేలిక కావటం, ఎప్పుడూ శర్మ శకుంతలకు అండగా నిలవటం__ఆవిడకు రమేష్పట్ల అంతులేని అసహ్యాన్ని కలిగించాయి. అతడు శకుంతలకు జన్మనిచ్చిన తండ్రి అనే ఆలోచనను ఏమాత్రం భరించలేదావిడ.
ఈ విషయాలన్నీ శకుంతలకు తెలుసు. అయితే, ఇప్పటికీ శకుంతలకు అర్ధంకాని విషయాలు కొన్ని ఉన్నాయి. ఇంత జరిగినా ఇంకా ఈ రమేష్ తన తండ్రినంటూ తన వెంటపడటం దేనికి? రాజవల్లి రమేష్ ని ఎందుకు తరిమెయ్యలేకపోతోంది? ఒకసారి ఈ విషయమే అడిగేసింది.
"వాడు విషసర్పం తల్లీ! మన కళ్ళముందే ఉంచుకుని, ఎప్పటి కప్పుడు కట్టిపడెయ్యాలి తప్ప, విచ్చలవిడిగా వదిలేస్తే ఎలాగో ఒకలాగ కాటేస్తాడు. ప్రస్తుతం ఆ పామును కట్టిపడేస్తున్న మంత్రం మన డబ్బు" అంది. కానీ అంతకుమించిన లావాదేవీలేవో ఉన్నాయని శకుంతలకు తోచింది.
శర్మ వచ్చిన మరునాడే విమలను చూడటానికి వెళ్దామని అన్నాడు. శకుంతల సంతోషంతో ఆ ఏర్పాట్లు చూడటానికి శామికోసం వెతికింది. ఎక్కడా కనబడలేదు. శకుంతలకు ఆశ్చర్యం కలిగింది. మామూలుగా తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. తండ్రివచ్చిన హడావుడిలో దాని విషయం అసలు పట్టించుకోలేదు. ఆ రాత్రంతా కూడా శామి రాలేదు. ఆ మరునాడు పదిగంటలకు కనిపించింది. ఆ భవనం గూర్ఖాలు పని వాళ్ళ రాకపోకలు పట్టించుకోరు.
"ఎక్కడికెళ్ళావ్?" కోపంగా అడిగింది శకుంతల.
శామి తడబడింది.
ప్రభాకర్ బాబుగారు కబురెట్టారమ్మా! ఆడ మావోళ్ళంతా వొచ్చి నారు."
ఎప్పటిలా శకుంతల అక్కడి విశేషాలు అడగకుండా__
"నేనూ, నాన్నగారూ మీ గ్రామానికి వస్తున్నాం నువ్వు తీసుకెళ్ళాలి త్వరగా తయారవు!" అంది.
శామికి తనలా శుభ్రంగా ఉండటం నేర్పింది శకుంతల. అదిచూడటానికి నాగరికుల అమ్మాయిలాగే ఉంటుంది.
"అమ్మా! ప్రభాకర్ బాబుగోరు శానా మంచోరమ్మా! ఎట్టాఅయినా మావోళ్ళకు మేలు చేయాలని శానా పాటుపడతన్నారు."
శకుంతల ఆ మాటలు వినిపించుకోనట్లు అంది___"సరేలే! ముందు బయల్దేరు."
"ఆరెంత సక్కగుంటారమ్మా! సిదిమి దీపం పెట్టచ్చు. బాగా సదూకొన్నారు. ఆరి భార్య కాటానికి ఏయమ్మ పున్నెం సేసుకుందో కాని...."
పకాలున నవ్వింది శకుంతల.
"ఏమిటీ ధోరణీ! కొంపదీసి అతన్ని ప్రేమిస్తున్నావా ఏమిటి?"
"ఏటమ్మా, మాలాంటోళ్ళకి పేమలేటి?" కష్టంగా, నిష్టూరంగా అంది.
"అదికాదు శామీ! నీకేం? ఆణిముత్యంలాగ ఉంటావు. అందుకే జాగ్రత్తపడమంటున్నాను. మా చదువుకున్న వాళ్ళలో మీ అడవుల్లో ఉన్నవాళ్ళకంటె భయంకరమయిన మృగాలున్నాయి."
"ప్రభాకరగోరు కొన్నాళ్ళలో మంత్రవుతాడంట! రమేష్ బాబు సెప్పారు."
ఏమాట అనకూడదో ఆ మాట అనేసింది శామి. శకుంతల కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం చిట్లించింది.
"ఈ మాటలన్నీ నాతో ఆ రమేష్ బాబే చెప్పమన్నాడా?" ఉరుము తున్నట్లు అంది.
కంగారు పడిపోయింది శామి "లేదమ్మా! నాకే మంచిగనిపించి.....నేనే అట్లనుకొని...." అని ఏదో అసందర్భంగా గొణిగి "రండమ్మా! మా వూరికి పోదాం!" అని మాట మార్చేసింది.
బయటినుంచి చూడటానికి కీకారణ్యంలా భయంకొలిపే ఆ అడవి మధ్య కాలిబాట శర్మకు ఆశ్చర్యం కలిగించింది. ఏమి మహత్తరశక్తి మానవుడిది! కారడవులలో సహితం మార్గాన్ని తాను నిర్మించుకోగలడు.
"ఈ దారంట పులులూ అయ్యీ రావండి. మనం వస్తా పోతా ఉంటామని ఆటికి తెలుసు."
ముందు నడుస్తూ చెపుతోంది శామి. ప్రకృతిలో ఎక్కడి కక్కడ అడ్జస్టుమెంట్!
"అమ్మా మీవూసు నన్ను శానా సార్లడిగింది! ఏం చేస్తది, ఎట్టా పాడింది, ఎవరితో మాట్టాడుద్ది.....' ఇయ్యాన్ని - మల్లా మల్లా అడుగుద్దండి....."
శకుంతలతో చెప్పింది. శకుంతల మాట్లాడలేదు. శర్మకూడా ఆలోచిస్తున్నాడు విమల ఈ అరణ్యాల మధ్య అజ్ఞాతవాసం చేస్తోందన్న విషయమే వింతగా వుందతనికి. ఎంతో అమాయకంగా అబలల్లా ఉండే ఆడవాళ్ళలో ఎంత కార్యదక్షత ఉందో!
తండ్రిని చూసాక అయినా తల్లి మంకు వదిలేసి తనను చేరదీస్తుందని శకుంతల ఆశ. తల్లితోపాటు రాజు కూడా కనబడక పోతాడా అని మరొక ఆశ.