Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 42

    సమయం చూసుకొని, ఏకాంతంగా తండ్రితో మాటలు మొదలు పెట్టింది శకుంతల.    
    "డాడ్! అమ్మను నేనక్కడ ఆటవిక గ్రామాల్లో చూశాను."    
    "వాట్?"    
    "నిజంగా! స్వయంగా చూశాను. అక్కడ అందరినీ ఎడ్యుకేట్ చెయ్యటానికి ప్రయత్నిస్తోంది. వాళ్ళంతా అమ్మని 'అమ్మా!' అని పిలుస్తున్నారు.    
    నిన్ను చూసిందా?"    
    "చూసింది"    
    "మాట్లాడిందా?"    
    "నో, డాడీ! నన్ను చూసికూడా చూడనట్లు ప్రవర్తించింది. అంతే కాదు. నన్ను అక్కడనుంచి తీసుకుపొమ్మని శామీకి సైగ చేసింది. ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళిచూస్తే అమ్మ అక్కడ కనపడలేదు."    
    అయితే మీ అమ్మ కాదేమో! మీ అమ్మ నిన్నుచూసి మాట్లాడకుండా ఉండగలదా?"    
    "అమ్మను నేనుగుర్తుపట్టలేనా డాడీ! అమ్మకూడా అండర్ గ్రౌండ్ లో ఉందేమో!"    
    "అండర్ గ్రౌండా.....అదేమిటీ? అమ్మ ఏం తప్పుచేసింది?"    
    "తప్పుచెయ్యటం కాదు....." శకుంతల ఆగిపోయింది. ఆ విషయాలు అందరితో చెప్పదగినవి కావని శకుంతల అర్ధం చేసుకోగలిగింది.    
    శర్మ శకుంతల భుజం మీద చెయ్యివేశాడు__"బేబీ! నువ్వు నన్ను నమ్మొచ్చు నా మూలంగా ఏ రహస్యాలూ బయటికి రావు."    
    అప్పటికీ శకుంతల మాట్లాడలేదు.    
    మీ అమ్మ క్షేమంకోసం నా ప్రాణాలైనా వదులుకోగలను." మీ అమ్మకు హాని కలగనిస్తానా?"    
    శర్మ గొంతు విచిత్రంగా వణికింది. శకుంతల ఇక నిగ్రహించుకోలేకపోయింది. తన అనుభవాలన్నీ చెప్పింది. ఆశ్చర్యపోయాడు శర్మ.    
    "రాజు కూడానా!"    
    "నేను కూడా....."    
    "ఓ...." గుటక మింగాడు.    
    "డాడీ!"    
    "యస్"    
    "ఈ ఉద్యమంపట్ల మీకు సానుభూతి లేదా!"    
    "ఈ స్వార్ధత్యాగమూ, ఈ కృషి, పీడిత ప్రజానీకం కోసం ఈ అంకుఠిత దీక్ష, ఇవన్నీ నేను గౌరవిస్తాను. కానీ సిద్దాంత రీత్యా నాకు కొన్ని బేధాభిప్రాయాలున్నాయి. ఏది ఏమైనా మీ అమ్మకోసం నేనేమైనా చేస్తాను."    
    తండ్రి చేతులు పట్టుకుంది శకుంతల.    
    "మీరక్కడికి వస్తారా డాడీ!"    
    "వస్తాను. నువ్వు రాజవల్లిగారితో వెళ్ళు. తరువాత నేనిక్కడ రిజైన్ చేసివస్తాను. ఒక్క ప్రామిస్....."    
    "ఏమిటి చెప్పండి!"    
    "నువ్వు అనవసరంగా దుందుడుకుతనంతో పిచ్చిపనులు చెయ్యకు."    
    "ఓ! నేను ముందుకురికాను కాబట్టే మిగిలినవాళ్ళ ప్రాణాలయినా దక్కాయి. నిష్కారణంగా నిండుప్రాణాలు అయిదు పోయాయి. ముక్కుపచ్చలారని పసివాళ్ళు ఆహుతయిపోయారు. ఏం సాధించారని? పేపర్లో వార్త వచ్చింది. చచ్చిపోయినవాళ్ళ పేర్లు ఒక్కటీ లేవు ప్రభాకర్ పేరు మాత్రం తాటికాయంత అక్షరాలతో ఉంది__ఏదో సాధించినట్లు."    
    "లీవ్ ఇట్! రాజవల్లిగారి మాటలు ఎప్పుడూ కాదనకు. ఆవిడ మనసుకి కష్టం కలిగించేపని చేయకు. ఈ వయసులో ఆవిడ తట్టుకోలేదు."    
    అలాగే అన్నట్లు తలూపింది.
    
                                                        26
    
    రాజవల్లి ఇల్లు ఆనాడు ఏదో ఉత్సవం జరుగుతున్నట్లు కళకళలాడిపోసాగింది. దాసీలందరూ అన్ని గదులకూ బూజులు దులిపి, గచ్చులు కడిగి ముగ్గులు పెడుతున్నారు. మావిడాకు తోరణాలు కడుతున్నారు. వంటశాలలో వంటవాళ్ళు తమ పాకకళా ప్రావీణ్యం చూపటానికి ఒకరితో మరొకరు పోటీపడుతున్నారు.    
    ఇంత సందడికి కారణం శర్మ అక్కడికి రావటం. సేతుపతి సన్యాసాశ్రమం స్వీకరించాడు. అక్కడి బంధాలన్నీ తెగిపోగా, శర్మ తన విమలను అన్వేషించుకొంటూ, కూతురికి అండగా ఇక్కడికి వచ్చేశాడు.    
    తాతగారు సన్యాసాశ్రమం తీసుకున్నారని విన్న శకుంతల ఆశ్చర్యపడలేదు. భార్యను ఒక విలాస వస్తువుగా కాక, ధర్మపత్నిగా మనసారా ప్రేమించి గౌరవించే వ్యక్తిత్వం ఆ కుటుంబంలో అందరికీ ఉంది.    
    ఒక్క రమేష్ తప్ప అందరూ సంభ్రమానందనాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. రమేష్ మనసులోఏముందో, పైకిమాత్రం మామూలు గానే, రాజవల్లిగారిముందు వినయం ప్రకటిస్తూ తిరుగుతున్నాడు.    
    ఇప్పుడు రమేష్ సంగతి శకుంతలకి పూర్తిగా అర్ధమయిపోయింది. తనతల్లిని, గర్భవతిని నిర్ధాక్షిణ్యంగా వదిలేసిన నీచుడు. అతడు తిరిగి తన జీవితంలోకి వచ్చింది- తనమీద కాని, తనతల్లిమీదకానీ, ప్రేమతో కాదు. రాజవల్లి ఇంత ఆస్తికి యజమానురాలయినా దానిని అమ్మేహక్కు కానీ, దానంచేసే హక్కుకానీ లేదు. అది తన వంశస్థులలో ఒకరికి చెందాలని గౌరీశంకరం వీలునామా. అయితే, ఎవరికి చెందాలో నిర్ణయించే అధికారం రాజవల్లికే వదిలాడు. రాజవల్లి డబ్బును అన్నింటికంటే అధికంగా భావించే వంశంలో పుట్టింది. గౌరీశంకరం తనను పెళ్ళి చేసుకున్నప్పుడు ఏమాత్రం బాధపడలేదు సరికదా, తనభర్త సంపద చూసుకుని, తన ఒంటి మీద నగలు చూసుకొని మురిసిపోయింది. ఇప్పటికే ఆవిడ ఒంటిమీద పదివేలరూపాయలపైన విలువ చేసే నగలు అన్ని వేళలా ఉంటాయి.    
    అయితే, ఒక్కగానొక్క కొడుకు తనకు దూరమయినపుడుమాత్రమే ఆవిడకు మమతకు అర్ధంతెలిసింది. అప్పటినుంచీ ఆవిడ అంతరంగం కొడుకు కోసం పరితపిస్తూనే ఉంది. భర్త పోగానే దుఃఖించటానికి బదులు ఏదో విముక్తి లభించినట్లు సుఖంగా గాలి పీల్చుకొని వెంటనే కొడుకునీ, కోడలినీ వెతికించటానికి ప్రయత్నాలు చేసింది.    
    కొడుకు చనిపోయినట్లు, అదీ అనారోగ్యంతో వైద్యం చేయించుకోవటానికి డబ్బులేక దరిద్రానికి బలి అయినట్లు విని ఆవిడ మాతృ హృదయం ఎంతక్షోబించిందో ఆ భగవంతుడికే తెలియాలి. అప్పుడే ఈ ఆచారాలమీదా, కట్టుబాట్లమీదా ఆవిడలో తీవ్రమైన విముఖత బయల్దేరింది.    
    అనసూయణు తనదగ్గిరకు రమ్మని ప్రాధేయపడుతూ ఉత్తరాలు వ్రాసేది. ఒక్కదానికైనా అనసూయ సమాధానం వ్రాయలేదు. ఒక వంక బంధువర్గంలో అనేకమంది రాబందుల్లాగ, ఆస్థికోసం రాజవల్లిచుట్టూ చేరి, తమ ప్రేమప్రకటనతో ఆవిడను హింసించసాగారు. ఆ సమయంలో శర్మ విమలను తీసుకొచ్చాడు. విమల నిరాధరణ కష్టం కలిగించినా, ఆ నిజాయితీ రాజవల్లికి నచ్చింది. అభం శుభం తెలియని శకుంతల, ఆస్థివిలువ తెలియని శకుంతల, తన చిట్టిచేతులతో ఆవిడ కళ్ళు తుడిచి, నిర్మలమైన అనురాగాన్ని పంచి, ఆవిడ మనసుకి దగ్గిరగా వచ్చింది.

 Previous Page Next Page