కేవలం బతకడం కోసం వాడు తన భార్యని తండ్రికి అప్పగించడానికి రెడీ అయిపోయాడు.
నిజంగా ఇలాంటి మనుషులుంటారా అన్న ఆశ్చర్యంతో నోటిలో మాట బయటికి రాలేదు. నేను సిగ్గు లేకుండా తిట్టాను! మా ఇద్దరి మధ్యా పెద్ద ఘర్షణే జరిగింది. కానీ వేరే కాపురానికి వాడు ఒప్పుకోలేదు.
"అయితే ఏ బావిలోనో దూకి చస్తాను" అని ఆవేశంతో పెరడు తలుపు తెరుచుకుని బయటపడ్డాను" అంటూ చెప్పసాగింది ప్రియ.
"అలా ఎంతసేపు నడిచానో తెలియదు. చీకటిలో నేను చీకటైపోయాను. చచ్చిపోదామని బయల్దేరిన నేను ఎందుకనో చావలేకపోయాను. అలా నడిచి, నడిచీ, తెల్లవారుజాము మూడుగంటలకి టౌన్ కు చేరుకున్నాను! మా అక్కయ్య వూరెళ్ళడానికి లారీ ఎక్కాను! అంత భయంకరమైన సంఘటనలు చూసిన తర్వాత లారీ ఎక్కడమనేది చాలా చిన్న సాహసంగా తోచింది.
నాన్నకు మరో సంవత్సరం ఎక్స్ టెన్షన్ రావడంతో ఆయన హైదరాబాదులోనే వున్నారు అందువల్ల అక్కయ్య ఇంటికి బయలుదేరాను.
నాలుగు గంటలకి ఇల్లు చేరుకున్నాను.
"ఏమైందే? ఇప్పుడెలావచ్చావ్? ఒకర్తివే వచ్చావా?" అక్కయ్య ఏడుస్తూ అడిగింది.
"అదంతా తరువాత చెబుతాను, అలా కొంతసేపు పడుకుంటాను" అని గదిలోకి వెళ్ళి మంచంమీద వాలిపోయాను. మరీ ఒత్తిడి అనుభవించడంలో మెదడు మొద్దుబారి పోయింది- అలా నిద్రలోకి జారిపోయాను.
మరో రెండు మూడు గంటలు అలా నిద్రపోయాననుకుంటా, అక్కయ్య గుండెలవిసి పోయేలా ఏడుస్తూ నన్ను బలంగా తడుతోంది. లేచి కూర్చున్నాను! అక్కయ్యకు మరింత ఏడుపు తన్నుకొచ్చింది! నన్ను కౌగలించుకుని భోరున ఏడ్వడం ప్రారంభించింది.
"ఏమైంది?" అని అడిగే ఓపిక కూడా నాకు లేదు.
అక్కయ్య ఒక పట్టాన ఏడుపు ఆపలేదు. క్షణక్షణానికీ ఏడుపు ఎక్కువవుతోందే తప్ప తగ్గడం లేదు.
అంతలో మాబావ మా దగ్గరికి వచ్చాడు.
"అలా ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు? వెంటనే బయలుదేరుదాం" అన్నాడు.
అప్పుడు చెప్పింది ఏడుపుల మధ్య అక్కయ్య మాధవ్ చనిపోయాడని నేనలా బిగుసుకుపోయాను.
రాత్రి నేను ఇంటి నుంచి బయలుదేరగానే యింటిలో అంతా తెలిసి పోయింది. చుట్టుపక్కల వారంతా నాకోసం బావులన్నీ వెదికారు.
చీకటిలో అలా ఒంటరిగా ఎక్కడికీ పోయుండననీ, చచ్చిపోవడానికే ప్రయత్నిస్తాననీ అందరూ నమ్మడంవల్ల చెరువులూ, బావులూ అన్నీ గాలించారు. చివరికి టౌన్ లోకి వచ్చి బస్టాండ్ లో చూసారు. అక్కడా కనపడక పోయేసరికి తిరిగి ఊరెళ్ళిపోయారు. అక్కయ్య ఇంటికి వెళ్ళి ఉంటానని రాలేదు.
బస్టాండులోనూ లేదనేసరికి నేను చచ్చిపోయుంటానని మాధవ్ కంగారుపడిపోయడు. భార్య చావు, వరకట్నం కేసు, పోలీసులు- ఇవన్నీ వూహించుకుని అతను భయపడిపోయాడు. పిరికివాడు కావడంతో ఇంట్లోనే ఉరేసుకుని చచ్చిపోయాడు.
అక్కయ్య ఏడుస్తూ ఇదంతా చెప్పింది.
నా భర్త చనిపోయాడనే బాధ కన్నా ఆ కొంపకు వెళ్ళే బాధ తప్పిందన్న సంతోషమే యెక్కువయింది నాకు. అందులోనూ ఆ రాత్రి మాధవ్ అలా అనడంతో అతనికీ నాకూ మధ్యనున్న అనుబంధం పూర్తిగా తెగిపోయింది. అందుకే ననుకుంటా నాకు కలగాల్సినంత దుఃఖం కలగలేదు.
అందరం వెళ్ళాం. కర్మక్రియలు అయిపోయాక మరుసటి రోజే బయలుదేరి మా అక్కయ్యతో పాటు వచ్చేశాను. నన్ను ఇంట్లోనే ఉంచుకోవాలని మామయ్య చాలా ప్రయత్నించాడు గానీ వీలయింది కాదు. ఎవరెన్ని చెప్పినా వినకుండా వచ్చేశాను.
కాలం తల్లికంటే గొప్పది. కష్టం వచ్చినప్పుడు తల్లి అక్కున చేర్చుకుని ఓదారుస్తుంది. కాలం కష్టాన్నంతా తనలోకి లాగేసుకుని మరుపునిస్తుంది.
ఆరునెలలు గడిచిపోయాయి. నా పెళ్ళికి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడు జ్ఞాపకానికి కూడా రావడం లేదు. కానీ జీవితంమీద మమకారం పోయింది.
ఏ మనిషికీ రాకూడని స్థితి. బతుకుమీద ఇచ్చపోయాక జీవించి మాత్రం ఏ ప్రయోజనం? ఆత్మహత్యల వెనుకున్న అసలైన కారణం ఇదేననుకుంటా.
నాకెవరూ లేరన్న భావన నాకు తెలియకుండానే నన్ను చుట్టేసుకుంది. అందుకే ఆదివారం పూటవచ్చే సినిమాను కూడా చూడాలన్న కుతూహలం కలగడం లేదు. నా ఎమోషన్స్ అన్నిటినీ పంచుకునే మనిషి అవసరమై పోయాడు.
తెల్లారిగట్ట లేస్తూనే తలుచుకోవడానికి ఒక మనిషంటూ లేకపోయాక ఎంత దిగులేస్తుందో? సాయంకాలం లోకంతోపాటు మనమూ సంధ్యకాంతిలో తడుస్తున్నప్పుడు ఎదురుచూసే మనిషి లేకపోవడం ఎంత బాధో, ఆకాశం నుదుటున చంద్రవంక బొట్టులా కనిపించే దృశ్యాన్ని కళ్ళల్లో కలిపేసుకుంటూ తల వాల్చుకోవడానికి మనిషి లేనపుడు ఎంత నిరాశగా వుంటుందో?
ఇదిగో వీటనన్నటిని పంచుకోవడానికి ఓ తోడుకావాలి. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఆదిత్య మనసులో మెదిలేవాడు. నాకు పెళ్ళయ్యాక అతని గురించి మరిచిపోయాను. ఇదేమీ తప్పు కాదనుకుంటా.
అవసరం లేనప్పుడు అదో మొక్కుబడిగా ఫీలవడం అనవసరం. ఏదయినా సరే పరిస్థితుల మీద ఆధారపడి వుంటుంది.
ఏదీ ఆకాశంలోంచి వూడిపడదు, ప్రేమైనా అంతే.
ప్రేమ వీటికన్నా అతీతమైనది అని బడాయి కోసం చెప్పుకోవాల్సిందే.
ఆదిత్య కోసం గాఢంగా ఫీలయ్యే సమయం రాకముందే నా పెళ్ళయింది. ఇప్పుడు మళ్ళీ ఆ అనురాగం, ఆ ప్రేమ, చీకట్లో నా యెద స్పర్శతో శరీరం నిండా చంద్రోదయాన్ని నింపుకునే ఆ మోహం నాకు కావాలి. అందుకే ఆదిత్య మరో అమ్మాయికి భర్త అయినా కోరుకుంటున్నాను. నా పెళ్ళైన మరో ఆర్నెల్లకి అతనికి వివాహమైంది.
అప్పుడప్పుడూ వీధిలో పోతూంటే కనిపిస్తాడు. ఆ కళ్ళల్లో మా మధ్య వున్న సంబంధం తాలూకు జ్ఞాపకాలు రంగు రంగులుగా చిట్లుతుండడం నేను కనిపెట్టాను. ఇక మిగిలింది ఆ రంగుల్ని నా దోసిళ్ళతో పట్టుకోవడమే కానీ ఏవీ మనం అనుకున్నంత సులభం కాదు, ఇతరులు అనుకునేటంత కష్టమూ కాదు అందుకే దేన్నీ కావాలని వదిలి పెట్టకూడదు. ఏదో విధంగా ఆదిత్యను ఒంటరిగా కలుసుకోవాలను కున్నాను.
ఇలా అనుకోవడంతోనే ఏదో తెలియని ఉత్సాహం నన్ను నడిపించడం ప్రారంభించింది. హృదయం నిండా దీపాల తోరణాలు వేలాడుతున్నట్లనిపిస్తోంది. కాస్తంత శుభ్రంగా తయారుకావటం మొదలయింది.
నుదుట బొట్టు ఒక్కటే తక్కువ. బొట్టు పెట్టుకుంటానని అక్కయ్యను, బావను, అమ్మా-నాన్నలను, మా మేనత్తను, మా అమ్మమ్మలనందరినీ అడిగాను. ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పలేదు.
మన పిరికితనాన్ని కప్పి పుచ్చుకోవడానికే ఇతరులు ఒప్పుకోరనీ, లోకులు కాకులయి పొడుస్తారని అనుకుంటూ వుంటాం. కానీ ఇది నిజం కాదని నాకప్పుడు తెలిసింది. బొట్టు పెట్టుకోవడానికి ఎవరూ అబ్జెక్షన్ చెప్పలేదు. ఎవరయినా, దేనికయినా అభ్యంతరం చెబుతారేమోనని అనుకోవడం మన పిరికితనాన్ని దాచుకోవటానికే.