అయితే నా దగ్గర మాత్రం ఆయన ప్రేమగానే మాట్లాడుతున్నాడు. ఆప్యాయంగానే పలకరిస్తున్నాడు. వాత్సల్యంతోనే చూస్తున్నాడు. మరి అత్తమ్మ ఆయన గురించి ఎందుకలా చెప్పిందో అర్ధం కాలేదు.
నేను కాపురానికి వెళ్ళిన రెండు నెలలకనుకుంటాను. వేసవికాలం ప్రారంభం కావడం వల్ల డాబామీద పడుకుందామని మావారిని అడిగాను. ఆయన సరేనన్నారు. ఇద్దరం పైకి వెళ్ళి పడుకున్నాం. నాకు ఒకవేళప్పుడు మెలకువ వచ్చింది. కొద్దిగా చలిగా వుంది. దుప్పట్లు పైకి తెచ్చుకోలేదు. బహుశా టైమ్ మూడు అయి వుండవచ్చు. ఇక అక్కడి చలికి నిద్ర రాదని క్రిందకు దిగి రూమ్ లో పడుకున్నాను. తెల్లారి అయిపోయింది. కాబట్టి, గదికి బోల్టు కూడా పెట్టలేదు.
అలా పడుకున్న కొంతసేపటికి ఎవరో నా గుండెలమీద రాస్తున్నట్లనిపించి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిస్తే మామయ్య పక్కన కూర్చున్నాడు చేతులు పెట్టింది ఆయనేనా?
నేను ఆందోళనతో దిగ్గున లేచి కూర్చున్నాను.
"గదికి బోల్టు పెడదామని వచ్చాను. చలికి వణికిపోతున్న నిన్ను చూసి బ్లాంకెట్ కప్పాను. పడుకో - పాపం ఉదయమే నిద్ర లేవాలి" అని ఆయన లేచి వెళ్ళిపోయాడు.
ఈ సంఘటన తరువాత మామయ్యలో ఏదో మార్పు వచ్చినట్లు నాకనిపిస్తోంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం, పైట తొలగినప్పుడు వెంటనే చూపులతో గుచ్చడం, అయినదానికీ, కానిదానికీ అలా దగ్గరికొచ్చి చేతుల్ని పట్టుకుని మాట్లాడడం ఎప్పుడైనా ఎదురుపడి భుజంతో నా భుజాన్ని రాయడం జరుగుతోంది. దాంతో ఆయన్ను చూస్తూనే భయమేస్తోంది. రకరకాల కారణాల వల్ల ఇంటిల్లిపాదీ ఆయనికి భయపడిపోతున్నాం.
ఓరోజు నాకు కడుపునొప్పి ప్రారంభమయింది. ఇంట్లో ఏవో చిట్కా వైద్యాలను చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు మాధవ్ ఊర్లో లేడు. సిమెంటు లోడ్ కోసం కడపకు వెళ్ళాడు.
"ఇక ఇక్కడ లాభం లేదు టౌన్ కెళదాం" అన్నాడు మామయ్య.
సరేనని నేనూ, ఆయనా బయలుదేరాం. టౌన్ లో డాక్టర్ కి చూపించాము. రెండు ఇంజెక్షన్ లు, నాలుగు గొట్టపు మాత్రలూ వేసేటప్పటికి నొప్పి బాగా తగ్గింది.
నర్సింగ్ హోమ్ నుంచి బయటపడేటప్పటికి సాయంకాలం ఆరుగంటలయింది. ఏడున్నరకి మా ఊరికి వెళ్ళే లాస్టు బస్సు వుంది. దానికి వెళ్ళిపోదామని అంటే మామయ్య ఒప్పుకోలేదు.
"ఊరికి వెళ్ళాక కడుపునొప్పి వస్తే ఏం చేయడం? రాత్రికి ఇక్కడే ఏదో హోటల్ లో వుండి, నొప్పి రాకుండా వుంటే ఉదయాన్నే వెళ్ళిపోదాం" అన్నాడు.
నేను ఇక ఏం చెప్పినా లాభం లేదు. నాకూ ఓపిక లేకుండా వుంది సరేనన్నాను. ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నాం. కలిపివేసిన డబుల్ కాట్ లో ఒకదాన్ని పక్కకు లాగి పడుకున్నాను. రూమ్ కెళ్ళే ముందు టిఫిన్ చేయడం వల్ల నిద్ర పట్టేసింది నాకు.
టౌన్లో వున్న సిమెంట్ కొట్టుకెళ్ళి, లేకక్లామ్తా చూసుకుని పదిగంటలకి కాబోలు మామయ్య వచ్చాడు. తలుపుతీసి తిరిగి పడుకుండి పోయాను.
మరు నిముషంలోనే నా మీద చేయి పడింది పక్కకు తిరిగి చూస్తే ఆయన నవ్వుతున్నాడు.
"ఎందుకట్లా బెదిరిపోతావు! నేను పరాయివాడిని కాదు గదా! మామయ్యని, నీ భర్తకి తండ్రిని, నువ్వు వూఁఅంటే చాలు నీకేం కావాలంటే అదిస్తాను. వాడు పిల్లాడు వాడితో ఏం సుఖపడతావ్? నాకు ఉపయోగపడతావనే చిన్న వయసులోనే వాడికి పెళ్ళిచేసింది మీ అత్తని కూడా మన సంబంధానికి ఒప్పిచ్చానులే" అన్నాడు.
నాతో సంబంధం పెట్టుకోవడానికి ఒప్పుకోమని ఆయన అత్తమ్మను ఎన్నిసార్లు బెల్టుతో కొట్టి వుంటాడో వూహించుకోగలను. ఇలాంటి నీచులు, దుర్మార్గులూ వుంటారని ఎవరయినా చెప్పి వుంటే బహుశా నమ్మేదాన్ని కానేమో! ఇప్పుడు ప్రయ్త్యక్షంగా చూస్తున్నాను కనుక నమ్మకుండా యెలా వుండగలను.
ఇప్పుడు ఆయన్ని ఎదిరించి లాభం లేదు, ఒకవేళ యెదిరిస్తే బలప్రయోగం చేయొచ్చు! అందువల్లే ఆ మాటలు వినగానే "అబ్బా! కడుపు నొప్పి" అంటూ విలవిల్లాడి పోతున్నట్లు మెలికలు తిరిగిపోయాను.
కొంతసేపటిలో తీరబోతున్న కోరిక అలా బెడిసి కొట్టడంతో కుదేలయి పోయాడు ఆయన.
కానీ ఏం చేయగలడు? 'తగ్గిపోతుందిలే' అని నాఎద పక్కన చేత్తో తట్టడం ప్రారంభించాడు. నేను ఏడుపు ఆపల+ేదు- నొప్పి అంటూ అరవడం మానలేదు!
"డాక్టర్ దగ్గరికి వెళదాం"
ఇక తప్పదని ఆయన ఆటో పిలిచారు.
ఇద్దరం నర్సింగ్ హోమ్ కెళ్ళాము. ఆటోలో కూర్చోవడంతోనే నేను నటించడం మానేశాను, ఆయనకి అర్ధం కావాలనే అలా చేశాను. నర్సింగ్ హోమ్ లో ఓ బెడ్ మీద పడుకుండిపోయాను.
"డాక్టర్ ని పిలవనా?" అని నర్సు అడిగినప్పుడు వద్దు అని మాత్రమే చెప్పాను.
ఆయన కొంచెంసేపు వుండి, నన్ను తినేసేలా చూస్తూ "నేను హోటల్ కెళ్ళి పడుకుంటాను. తెల్లవారి లేచి వస్తాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.
నేను ఆయన వచ్చేవరకు ఆగలేదు! ఐదుగంటల బస్సుకి వచ్చేశాను. పదిగంటల బస్సుకి మామయ్య వచ్చాడు! రాత్రి జరిగిందంతా తెలిసినా తనను ఎవరూ ఏమీ అనలేరన్న ధీమాతో ఇంట్లో అడుగుపెట్టాడు.
నేను తప్పించుకు తిరుగుతున్నాను. తనకన్నా బలమైన జంతువును చూసి చిన్న జంతువు ఎలా దాక్కుని తిరుగుతుందో అలా ఒదిగి ఒదిగి ఉండిపోయాను.
రెండోరోజు రాత్రి మాధవ్ కదప నుండి వచ్చాడు. ఏదో పెద్ద ఆసరా దొరికినట్లు ఫీలయ్యాను! కొంతలో కొంత ధైర్యం వచ్చింది! భోజనాలయ్యాక పడకలు తీసుకుని డాబామీదకి వచ్చాను.
ఆయన మరో అరగంటకి పైకి వచ్చాడు.
"మనం టౌన్ కి ఫ్యామిలీ మార్చేద్దాము! ఇక్కడ నావల్లకాదు" అని ప్రారంభించి మొత్తం జరిగినదంతా చెప్పాను. చెప్పకపోతే టౌనుకి షిఫ్ట్ అవరేమోనన్న భయంతో డైలాగులతో సహా చెప్పాను.
ఆయన ముఖంలో రంగులు ఎలా మారాయో నాకు ఆ చీకటిలో తెలియలేదు! తండ్రిని చితక్కొట్టడానికి వురుకుతారేమోనన్న భయం తప్ప మరో భావన రాలేదు! నేను అంతా చెప్పాక ఆయన రియాక్షన్ ను వినడానికి శరీరాన్నే చెవిగా చేసుకున్నాను!
"ఇదంతా జరిగే వుంటుంది, కాదనను! కానీ ఆయన్ని కాదని మనం ఎలా బతుకుతాం? ఇదంతా పూచికపుల్లతో సహా అంతా ఆయన స్వార్జితం! ఆయనకి తప్ప యీ ఆస్థిలో మరెవరికీ హక్కులేదు! ఆయన వద్దంటే సిమెంట్ అంగట్లో యెలా కూర్చోగలను? భూముల్లో ఎలా వ్యవసాయం చేయగలను? నువ్వు ఒప్పుకోలేదని ఆయన మనల్ని ఎక్కడ బయటికి గెంటేస్తాడేమోనన్న భయం పుట్టుకొస్తోంది!"