Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 42


    "బాగానే వున్నానండీ" అంది నెమ్మదిగా.
    
    రజనీకాంత్ ని చూడగానే ఆమెకు ముళ్ళమీద నిలబడినట్లుగా వుంది. అతని చూపులు అంకుశాల్లా పొడుస్తున్నాయి.
    
    "నేనిహ వెడతానండీ" అంది మంజుభార్గవితో.
    
    ఆమె పడుతోన్న యిబ్బంది గ్రహించి ఆమెని ఇంకా వుండమని బలవంతం చెయ్యలేదు.
    
    చెయ్యిపట్టుకుని మృదువుగా నొక్కి "ఎప్పుడైనా వస్తూండండి" అంది సభ్యతగా.
    
    చిన్మయి బయటకు వచ్చి కారులో కూర్చుంది.
    
    ఇంటికి వెళుతూంటే ఏవేవో జ్ఞాపకాలు తరిమి తరిమి కొడుతున్నాయి.
    
    ఇరవై నాలుగుగంటలూ మొగుడ్ని తిట్టిపోస్తూ అతనితో అసహ్యించుకోబడుతూ విడాకులిచ్చేస్తానని బెదిరిస్తూ, అతన్నిగురించి బయటకూడా హీన్మగా మాటలాడే ఆనంద హాయిగా కాపురం చేసుకుంటూనే వుంది. భర్త స్నేహితులతో మితిమీరిన సౌఖ్యంగా వుంటూ.... రజనీకాంత్ తో... ఆమె కాపురం చెడగొట్టుకోకుండా భర్తచేత లైక్ చేయబడుతూ హాయిగా జీవితం గడుపుతోంది మంజుభార్గవి.
    
    తను...?
    
    కళ్ళలోకి నీళ్ళు నిండుకొచ్చాయి.
    
                                                  17
    
    బయట హారన్ మ్రోగటం విని తనూజ లేచి డోర్ తీసింది.
    
    రాజీవ్ రాగానే కారు పార్క్ చేసి బయటకు దిగుతున్నాడు.
    
    దగ్గరకు రాగానే ఆహ్వానిస్తున్నట్టుగా చెయ్యి అందించింది.
    
    లోపలకు వచ్చి డోర్ వేసేశాక ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.
    
    "రాజీవ్!" అంది అతని కళ్ళల్లోకి చూస్తూ "వారంరోజులయింది నువ్వు కనిపించి."
    
    రాజీవ్ నవ్వాడు. "ఢిల్లీలో వుండిపోయాను."
    
                                                               * * *

    చిన్మయినుంచివిడిపోయాక రాజీవ్ అయిదారు నెలలపాటు దుర్భరమైన జీవితం గడిపాడు. అతనికి మొదట్నించి ఫ్రెండ్స్ ఎక్కువగా లేరు. ఉద్యోగ నిర్వహణలో, సంసార తాపత్రయంతో అతనికి కాలక్షేపం సరిపోయేది. అలా హఠాత్తుగా విరుచుకుపడిన ఈ వంటరితనం తట్టుకోలేకపోయాడు.
    
    ఓ రోజు రాత్రి వంటరితనం భరించలేక తనూజ దగ్గరకెళ్ళాడు.
    
    అప్పటికి పదకొండు దాటివుంటుంది. ఆ వేళలో వచ్చిన రాజీవ్ ను చూసి అప్రతిభురాలయింది.
    
    "సారీ! ఇలా వచ్చి మీకు ఇబ్బంది...."
    
    అతని కళ్ళల్లోకి చూస్తూ తనూజ నవ్వింది. "నిజం చెప్పాలంటే మీరిప్పుడు వస్తే బావుండుననుకుంటున్నాను."
    
    "ఎందుకని?"
    
    "మీ రాకలో నాకానందం వుంది కాబట్టి. మీకోసం ఎదురుచూడటంలో నాకు తృప్తి వుంది కాబట్టి."
    
    అతను చాలా అలసటగా, నీరసంగా కనిపించాడు.
    
    "నిజం చెప్పండి. అన్నం తిని ఎన్నాళ్ళయింది?"
    
    "రోజూ తింటూనే వున్నాను. అయితే సరిగ్గా తిని ఎన్నాళ్ళయిందో తెలీదు" అతను నవ్వాడు.
    
    "రండి కాసేపు విశ్రాంతి తీసుకుందురుగాని."
    
    అతను సందేహించలేదు. అంతవరకూ ఆమె పడుకున్న ప్రక్కమీద శరీరం వాల్చాడు.
    
    అతనికి దగ్గరగా కుర్చీని లాక్కుని కూర్చుంది.
    
    "నేనిలా రాత్రివేళ రావటం మీ ఇంటి ఓనర్స్ చూస్తే ఏమైనా అనుకోరా?"
    
    "ఎందుకనుకోరు?"
    
    "మరి?"
    
    "అనుకోనివ్వండి. మనగురించి అందరూ మంచిగా అనుకునేలా బ్రతకాలంటే మనం చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది."
    
    "మరి దానివల్ల నీకేం నష్టంలేదా?"
    
    "ఏమిటి నష్టం? ఈ ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపొమ్మంటారు. నేను గయ్యాళిదానిలా దెబ్బలాడతాను" తనూజ నవ్వింది.
    
    అతను మాట్లాడకుండా ఆమె మొహంలోకి చూస్తున్నాడు.
    
    "ఒక్క ప్రశ్న అడగమంటారా?"
    
    "ఏమిటి?"
    
    "ఇంత భయంకర నిర్ణయం తీసుకునేముందు ఒక స్నేహితురాలిగా నా సలహా ఎందుకు తీసుకోలేదు?"
    
    "ఇష్టంలేదు."
    
    "మీ సొంతవిషయాల్లో యితరుల జోక్యమిష్టం లేదు. అవునా?"
    
    "ఇప్పుడు కూడా నేను పశ్చాత్తాపపడటంలేదు."
    
    తనూజ అతనికి మరికొంచెం దగ్గరగా జరిగి అతనిచేతిని తనచేతిలోకి తీసుకుంది.
    
    "దిసీజ్ ఫూలిష్."
    
    "ఏమిటి?"
    
    "ఒక్క స్మఘటన ఆధారంగా జీవితాన్నంతటినీ చీకటిమయం చేసేసుకుంది."    
    
    "ఐ కాన్ట్ హెల్పిట్."
    
    "రాజీవ్! మనిషిలోని నిజాయితీని ఎప్పుడూ అభినందించగలగాలి. చిన్మయి ఈ రహస్యాన్ని దాచిపెట్టి వుంటే గడుసుగా ప్రవర్తించివుంటే ఆమెను నువ్వేమీ చేయగలిగి వుండేవాడివి కావు. ఒక రహస్యం చెప్పనా? ప్రపంచ చరిత్రలో ఇలా గుట్టుగా దాచబడి గుంభనంగా సాగిపోతున్న జీవితాలు కోకొల్లలు."

 Previous Page Next Page