Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 42


  

     పిల్లలంతా తలస్నానాలు చేసి, చక్కగా ముస్తాబై వీధుల్లో పడ్డారు. స్త్రీలు ఇళ్ళంతా అలికి, శుభ్రం చేస్తున్నారు. మగవాళ్ళు రథం దగ్గరికి, ఇంటి దగ్గరికి తిరుగుతూ హడావుడిగా వున్నారు.

 

    ఊరిలోని యువకుల్లో కొందరు వీధికి ఇరువైపులా గుంజలు నాటుతున్నారు. మరికొందరు వాటికి రంగు కాగితాల తోరణాలు కడుతున్నారు. మల్లాం నుంచి వచ్చిన గ్రామ్ ఫోన్ గొంతు సవరించుకుంటూ వుంది.

 

    పూజారి ఆదేశాలిస్తుంటే కొందరు రథాన్ని పూలమాలలతో అలంకరిస్తున్నారు.

 

    సాయంకాలం నాలుగు గంటలకే వాతావరణం మారిపోయింది. ప్రతి ఇంటిముందూ నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టారు. నీటి చెమ్మమీద తేలుతున్న ముగ్గులు ముత్యాలను ఆరబెట్టినట్లున్నాయి. ఎర్రమట్టి గీతలతో  అలరారుతున్న ఇళ్ళు అందమైన పావురాళ్ళు పెట్టుకున్న గూళ్ళలా వున్నాయి.

 

    వీధి మధ్యలో వేలాడుతున్న మామిడాకుల తోరణాలు ఆకాశం మెడలోని పచ్చల హరాల్లా మెరిసిపోతున్నాయి గ్రామ్ ఫోన్ రికార్డు లోంచి వినిపిస్తున్న భక్తకన్నప్పలోని సినిమా పాట గ్రామం చేత  నృత్యం చేయిస్తున్నట్లుంది.

 

    సాయంకాలం అయిదు గంటలకి ఊరేగింపులోని మొదటి భాగం వసంతోత్సవం ప్రారంభమవుతుంది. రథం ముందు అటూ ఇటూ రెండు పెద్ద బిందెల్లో వసంతం కలుపుతారు.

 

    వసంతం అంతే నీళ్ళల్లో పసుపు, సున్నం కలిపితే వచ్చేదే. గ్రామస్తులు ఆ నీటిని చెంబుల్లోకి తీసుకుని తమకు ఇష్టమైన వాళ్ళమీద చల్లడమే వసంతాలు పోసుకోవడం. ఈ ఘట్టం ప్రారంభం అయిన  తరువాత ఊరేగింపు జరుగుతుంది. ఎదుటి వ్యక్తి మీదున్న ఇష్టాన్ని ఇలా  వసంతాలు  పోయడం  ద్వారా గ్రామస్తులు  వ్యక్తపరుస్తారు. చాలా  ఉత్సాహంగా, అంతకంటే ఉద్రేకంగా జరుగుతుంది ఇది. తమకు  ఇష్టమైన  వ్యక్తి ఎక్కడున్నా వెదికి పట్టుకుని వసంతం పోస్తారు. అప్పటికే చాలామంది యువకులు చెంబులు తీసుకుని రథం దగ్గర తయారైపోయారు.

 

    ఊరేగింపులో వసంతోత్సవాల ఘట్టం అంతే నరుడికి చాలా ఇష్టం.

 

    అబ్బాయిలు, అమ్మాయిలు చక్కగా ముస్తాబై వసంతాన్ని నింపుకుని తమను మనసుపడ్డవాళ్ళ కోసం హాడావుడిగా వెదకడం- వాళ్ళు కనిపించగానే తొందర తొందరగా వసంతాన్ని నెత్తిమీద  కుమ్మరించడం వసంతం తనను పూర్తిగా తడిపేసినప్పుడు కళ్ళు తుడుచుకుంటూ తన మీద వసంతాన్ని పోసిన వ్యక్తికేసి కొంటెగా, అంతకంటే ఆత్మీయతతో చూడడం అబ్బాయిలయితే అమ్మాయిలవైపు 'తెలిసిందిలే- గుట్టు తెలిసిందిలే' అన్నట్లు చూడడం- అమ్మాయిలు సిగ్గు బరువుతో ఎదుటి వ్యక్తికేసి ఆరాధనతో పెదవులపై చిరునవ్వులను పూయించడం. ఇవన్నీ చూస్తూ చిన్నపిల్లాడే అయిపోతాడు అతను. అందుకే నాలుగు గంటల నుంచే రథం దగ్గరకు వెళదామని తన గురుడ్ని పోరుపెట్టాడు.

 

    గోపాలకృష్ణకూ తొందరగా అక్కడికి వెళ్ళాలని వుంది. వర్ష తప్పక అక్కడికి వస్తుందని తెలుసు. గ్రామంలోని వాళ్ళంతా వసంతాల దగ్గర  గుమికూడుతారు. అందులో చాలామందే పాల్గొంటారు. వసంతాల దగ్గర గుమికూడుతారు. అందులో చాలామందే పాల్గొంటారు. వరసయిన వాళ్ళ మీద వసంతాలు చల్లడం అక్కడి సాంప్రదాయం. కాస్త వయసైన వాళ్ళు మాత్రం అందులో పాల్గొనకుండా ప్రేక్షకులైపోయి, వసంతాలు పోసుకుంటున్న వాళ్ళను చూస్తూ ఎంజాయ్ చేస్తారు.

 

    వసంతాలను చూడడం ఎవరూ మిస్ చేయారు. కాబట్టి వర్షను ధాన్య అక్కడికి తీసుకువస్తుందని అతని నమ్మకం. కాని మరీ నాలుగు గంటలకే అక్కడికి వెళ్ళడం  ఇబ్బందిగా అనిపిస్తుందని వెళ్ళలేకపోయాడు.

 

    చివరికి  ఆరుగంటల ప్రాంతాన ఇద్దరూ అక్కడికి  చేరుకున్నారు.

 

    వీధుల్లో నీళ్ళు చల్లడంతో మట్టి వాసన  గమ్మత్తుగా ఆ ప్రాంతమంతా ఆవరించింది. ముగ్గులు ఎవరో  వనదేవత మెడలోని ముత్యాలదండల్లా వున్నాయి. కాలం చెక్కమీద సంధ్యకాంతిని అరగదీసి కలిపినట్టు వసంతం నీళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి.

 

    పంతులు రథం ఎక్కి అందులోని ఉత్సవ విగ్రహానికి పూజ చేస్తున్నాడు. గోపాలకృష్ణను చూడగానే అందరూ అడ్డు తొలిగారు. అతనూ, నరుడూ ముందుకు సాగి రథం ముందు నిలుచున్నారు.

 

    గోపాలకృష్ణ కళ్ళు వర్ష కోసం వెదుకుతున్నాయి. ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఏదో తెలియని నిరాశ గుండెను మెలిపెడుతోంది.

 

    ఇంకా పంతులు పూజ చేస్తున్నాడు.

 

    అప్పటికే కుర్రకారంతా చేతుల్లో చెంబులు పుచ్చుకుని పూజ ఎప్పుడు ముగుస్తుందా, వసంతాలు చల్లుకుందామా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఎవరిమీద వసంతం పోయాలోనని ఆలోచిస్తున్నారు.

 

    పంతులు చివరిసారిగా మంత్రాలు బిగ్గరగా చదివి, విగ్రహం మెడలోని పూలమాలను సరిచేసి కిందకు దిగాడు.

 

    వృద్ధులు అలా చేతులు జోడించి ఉత్సవమూర్తిని భక్తి పారవశ్యంతో చూస్తున్నారు.

 

    పులిరాజు, వెంకట్రామయ్య ఓ మూలచేరి గోపాలకృష్ణ వంక గుర్రుగా చూస్తున్నారు. ఇంకెంత కాలం ఈ భోగం అన్నట్లు వాళ్ళిద్దరూ అతనివైపు చులకనగా చూస్తూ ఏదో గొణుక్కుంటున్నారు. ఈ మసక  వెలుతురులో వాళ్ళు వేటకు బయలుదేరిన నక్క, తోడేలు జంటలా వున్నారు.

 

    అలా కళ్ళు తిప్పుతున్న గోపాలకృష్ణ ఓ దగ్గర ఆగిపోయాడు.

 

    అక్కడ ధాన్య, ఆమె వెనక వర్ష నిలబడి చూస్తున్నారు.

 

    ఆరోజు విచిత్రంగా చంద్రోదయం ఆకాశంలో కాకుండా జనంలో జరిగినట్టు మెరిసిపోతున్న వర్ష ముఖారవిందాన్ని చూసి అతను ఎగ్జయిట్ మెంట్ కు గురయ్యాడు.

 

    అక్కడి నుంచి చూపులను మరల్చుకోవడం సాధ్యం  కావడం లేదు. ఏదో ట్రాన్స్ లో వున్నట్లు అతను అటువైపే చూస్తున్నాడు.

 

    "వసంతాలు ప్రారంభిద్దామా బాబుగారూ?" పంతులు మెల్లగా అడిగాడు అతడ్ని.

 

    అలాగేనన్నట్లు తల వూపాడు.

 

    వసంతోత్సవం ప్రారంభమైనట్లు పంతులు జనంవైపు చూసి  సంజ్ఞ చేశాడు. దీనికోసమే ఎదురుచూస్తున్న యువకులు ఒక్కసారిగా  ముందుకు  దూకారు. తమమీద ఎవరైనా వసంతాలు పోస్తారేమోనని  తమను తాము  రక్షించుకోవడానికి కొందరు ఇళ్ళవైపు పరుగెత్తారు. వాళ్ళను వెంటాడుతూ చెంబులోని వసంతం చిందిపోకుండా పరుగెడుతున్నారు మరికొందరు.

 

    క్షణంలో అక్కడి వాతావరణం కోలాహలంగా తయారయ్యింది.

 

    అంతలో పునర్వాసు జనం మధ్యలోంచి దూరి వసంతాన్ని తీసుకుని, అంతే వేగంతో వచ్చి గోపాలకృష్ణ మీద దాన్ని కుమ్మరించింది. తెల్లటి బట్టలు ఎర్రగా, అక్కడక్కడా పసుపుపచ్చగా తయారై సాక్షాత్తూ ఆ మన్మథ దేవుడు అక్కడ ప్రత్యక్షమైనట్లు అతను మెరిసిపోయాడు.

 

    పులిరాజు కళ్ళల్లో వసంతం పడి మండినట్లు గిజగిజలాడిపోయాడు. అతనికి తెలియకుండానే అతని పిడికిలి గోపాలకృష్ణ మీద కసితో  బిగుసుకుంది.

 Previous Page Next Page