Previous Page Next Page 
సుహాసిని పేజి 42


    "అమ్మాయ్, నీ వరస నాకేం నచ్చలేదమ్మా" అంది సుభద్ర.

    "మీ వరస నాకూ నచ్చలేదు. అన్ని విధాలా అందరూ అంగీకరించిన ఈ పెళ్ళికి మీరంతా పడే తొందర చూస్తూంటే నాకిదంతా ఏదో గూడుపుఠాణిలా ఉంది" అంది ఆమె.

    "నీతో ఒక్క క్షణం పర్సనల్ గా మాట్లాడాలి...." అన్నాడు రమణ....

    "ష్యూర్...." అంది హాస.

    ఇద్దరూ అతడి గదికి వెళ్ళారు.

    రమణ తాత్సారం చేయలేదు, "నీ గంధర్వుడి వివరాలు కావాలి" అన్నాడు.

    "నాకెంత తెలుసో అంతా చెప్పేశాను. అంతకు మించి నాకేం తెలియదు."

    "అతడిని ప్రేమిస్తూంటే పెళ్ళెలా చేసుకుంటావు?"

    హాస నవ్వి, "నీకు నేనో అబద్ధం చెప్పాను. గంధర్వుడు మన పెళ్ళికి వ్యతిరేకి కాడు. అతడికి నా క్షేమం ముఖ్యం. నన్ను కాపాడుకుందుకు హెచ్చరిస్తూంటాడు...." అంది.

    "గంధర్వుడి సంగతి వదిలి నీ సంగతి చెప్పు. నన్ను పెళ్ళి చేసుకోవడం నీకిష్టమేనా?"

    "ఊఁ"

    "హాసా, ప్లీజ్! నాతో ఆడుకోకు. వెంటనే పెళ్ళి జరగాలి. మనకి టైము లేదు...."

    "నాకింకా ఇరవై నిండలేదు. నీకేమో పాతికుంటాయేమో. అప్పుడే టైము లేదనడానికేమొచ్చింది?"

    ఈ ప్రశ్నకు రమణ దగ్గర సరైన సమాధానం లేదు, "అదంతా యిప్పుడు చెప్పలేను. కానీ నేను నీ శ్రేయోభిలాషిని....ప్లీజ్! పెళ్ళికి ఒప్పుకో"

    "నేను నా మనసెలా చెబితే అలా చేస్తాను. దురదృష్టవశాత్తూ నువ్వు నా మనసువి కాదు" అంది.


                         *    *    *    *


    రాత్రి పదయింది.

    గదిలో హాస, సుభద్ర.

    "అతడిని నువ్వు బాగా ఏడిపించావు...." అంది సుభద్ర.

    "అది అతడి ఛాయిస్....నా తప్పులేదు...." అంది.

    "తప్పంతా నీదే!" అంది సుభద్ర.

    "అతడికి నన్ను పెళ్ళిచేసుకోవాలనుంది. ఒప్పుకున్నాను. నాకిప్పట్లో పెళ్ళిచేసుకోవాలని లేదు. అతడు ఒప్పుకోడు. తప్పెవరిది?"

    "కానీ రేపు అని మోసం చేయడం తప్పుకాదా?"

    "సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి శనిపీడ విరగడ చేసుకుందుకు రేపు నాశ్రయించాడని మన పురాణాలు చెబుతున్నాయి."

    "కానీ రమణ శని కాదు. దేవత!"

    "శని పూర్తి పేరు శనిదేవత!" అంది హాస.

    "నీతో వాదించి నెగ్గలేను. కానీ నా మీద గౌరవముంచి నా మాట విను."

    "గౌరవాన్ని బట్టి మాట వినడం మంచి లక్షణం కాదు. మాటను బట్టి మనిషిని గౌరవించాలి."

    సుభద్ర ఉద్రేకంగా "నేనంత కాని మాటన్నానా? అతణ్ని పెళ్ళి చేసుకోమన్నాను" అంది.

    "కానీ నువ్వంత ఉద్రేకపడతావేం? ఇప్పుడంత తొందరేమొచ్చింది"

    సుభద్ర నోటికి తాళం పడింది. "సరేలే పాలు తాగు!" అంటూ ఆమె టేబిల్ మీదున్న ప్లాస్క్ లోని పాలు గ్లాసులోకి వంపి కూతురి కందించింది.

    హాసకు పాలగ్లాసు నోటిదాకా వెళ్ళింది.

    అప్పుడే గది తలుపునెవరో తట్టారు. సుభద్ర వెళ్ళి తలుపు తీసింది.

    బోట్ హౌస్ యజమాని. అతడు కంగారుగా హాసను చూసి "నువ్వా పాలు తాగలేదు కదమ్మా!" అన్నాడు ఇంగ్లీషులో.

    హాస తల అడ్డంగా ఊపింది.

    "వాటిని తాగొద్దు. బహుశా విషముందేమో పరీక్షించాలి."

    హాస తెల్లబోయింది. పాలగ్లాసును వణికించిందామె చేయి.

    "ఎవరు చెప్పారు?" అందామె.

    అతడు వివరించాడు.

    బోట్ హౌస్ సదుపాయాలు చూడ్డానికి సాయంత్రం ఓ మనిషి వచ్చాడు. అతడు మారువేషంలో వున్నట్లు ఎవరికీ తెలియదు. హాస గదికని నిర్దేశించిన ప్లాస్క్ లో అతడు విషం వుంచాడు తెలివిగా. ఎవరికీ అలా జరుగుతుందనే అనుమానమే లేదు. ఆ విధంగా విషాన్నుంచినందు కతడికి పదివేల రూపాయలు ముట్టాయి. తానెవరి ప్రాణాలు తీయనున్నాడో ఆ వ్యక్తినతడు కాసేపటి క్రితం చూశాడు. చిరునవ్వులు చిందించే ఆమె ముఖం, అద్భుతమైన ఆమె అందం అతణ్ని ముగ్ధుణ్ని చేశాయి. ఈ ప్రపంచానికా నవ్వుల రాణిని మాయం చేయడం అయిదునిముషాల్లో అమానుష మనిపించింది. భరించలేక బోట్ హౌస్ యజమానికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పి హెచ్చరించాడు.


                            *    *    *    *


    పరీక్షలో ఆ పాలలో విషముందని ఋజువయింది.

    జరిగింది తెలిసి రమణ అవాక్కయిపోయాడు.

    ఎవరో హాసను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అంటే తమ పెళ్ళి జరిగేరోగానే ఆమెను చంపడానికి మరో బృందం పని చేస్తోంది.

    తానిక జాప్యం చేయడానికి వీల్లేదు.

    ఏం చేయాలో కూడా అతడు నిర్ణయించుకున్నాడు. 

    పెళ్ళి మాటెత్తగానే రేపు.... రేపు.... అంటోంది హాస.

    "పోనీ ఆమె మాటే వింటాను!" అనుకున్నాడు రమణ.


                           *    *    *    *


    "పాపిష్టిదాన్ని, నా చేతుల్తో నీకు విషమందించాను" అంది సుభద్ర.

    "భయపడకమ్మా, ఇందులో కంగారు పడాల్సిందేం లేదు. ఇదంతా ఆ రమణ ఆడించిన నాటకం" అంది హాస.

    "ఇదేం నాటకం, అతడే నిన్ను చంపాలనుకున్నాడా?" అంది సుభద్ర అదోలా.

    "కాదు. మనిషికి ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియదని ఋజువు చేయడానికి బోట్ హౌస్ యజమానితో కలిసి ఇలా నాటకమాడాడు. ఎవరో నామీద హత్యా ప్రయత్నం చేశారన్న అనుమానం నాలో కలిగితే, ఏ క్షణంలోనైనా నేను చనిపోగలనన్న భావం నాలో పుడితే- పెళ్ళికొప్పుకుంటానని అతడి ఆశ...."

    "నేనింక దూరం ఆలోచించలేదు...." అంది సుభద్ర.

    "అసలా పాలలో విషం లేదు...."

    "ఏమో.... నా వళ్ళంతా ఇంకా వణుకుతోంది."

    "ఎందుకమ్మా, భయపడతావు! నేనేమైనా ఇక్కడ చావడానికొచ్చానా? విహారానికీ, ఆరోగ్యం బాగు చేసుకుందుకూ వచ్చాను, కాదంటావా?"

    సుభద్ర మాట్లాడలేదు. కానీ హాస ఇంకేదో మాట్లాడబోయి దగ్గు తెచ్చుకుంది.

    మరోసారి రుమాలు మీద రక్తపు చారికను చూశాకే సుభద్రకు పడుకునే అవకాశం వచ్చింది.

    "భగవంతుడా! నా ఆయువు తీసుకో.... నా కూతుర్ని బ్రతికించు" అనుకుంది సుభద్ర.

    ఇలా అంటున్న వాళ్ళ కుటుంబంలో ఇంకా వున్నారు. వాళ్ళు సుభద్రకంటే కూడా ఎంతో పెద్దవాళ్ళు.


                          *    *    *    *


    మర్నాడుదయం హాస స్నానానికి వెళ్ళినప్పుడు రమణ సుభద్రతో మాట్లాడేడు. సుభద్ర రాత్రి కూతురుకు మళ్ళీ రక్తం పడిందని చెప్పింది.

    రమణ భారంగా నిట్టూర్చాడు.

    "బాబూ! దానదృష్టం దానికి తెలియడంలేదు. కాదని మొండిపట్టు పడితే మందలించడం నావల్ల అవడంలేదు. నువ్వే ఏదైనా ఉపాయం చూడు...." అంది సుభద్ర.

    "ఈరోజు మనం మొఘల్ గార్డెన్స్ చూడ్డానికి వెడుతున్నాం. హాస పద్ధతి చూస్తుంటే మధ్యాహ్నానికల్లా నాలుగు చోటలూ చూడ్డం అయిపోతుందనిపిస్తోంది. సాయంత్రం నేను, హాస బోటు షికారు చేస్తాం. అప్పుడామెకు అన్నీ నచ్చచెబుతాను. మేము ఇంటికి బాగా ఆలస్యంగా వచ్చినా మీరు కంగారు పడకూడదు...." అన్నాడు రమణ.

    "నువ్వంటే నాకు నమ్మకమే నాయనా! కానీ అసలే దానిమీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది."

    "హాసకానీ బెదిరిపోలేదు కదా!"

    "అది బెదరలేదు సరిగదా నిన్నే అనుమానించింది" అంటూ జరిగింది చెప్పింది సుభద్ర.

    "ఇలాంటి పరిస్థితుల్లో నన్ననుమానించిందా? అంటే తనకు నేనంటే సదభిప్రాయం లేదన్నమాట!" అన్నాడు రమణ బాధగా.

    "అదేం కాదు, తనని హత్య చేయాలనుకునేందుకు కారణముండాలి కదా! ఆలోచించి చూస్తే నాకూ దాని మాటల్లో సబబుందనిపించింది. దాన్ని చంపడం వల్ల ఎవరికి లాభముంటుందో నువ్వే చెప్పు!" అంది సుభద్ర.

    రమణ ఆమెను పరీక్షగా చూశాడు. సుభద్ర అతడివంక ఆశగా చూస్తోంది. హత్యా ప్రయత్నం రమణ ఆడిన నాటకమని తెలిస్తే ఆమెకు తృప్తిగా వుంటుంది.

    "హాస బాగానే ఊహించింది" అని నవ్వాడు.

 Previous Page Next Page