Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 42


    పైకిలేచాను ఒళ్ళంతా తియ్యటి సలుపు  ప్రారంభమైంది 'థాంక్స్' అన్నాడు అతను తన  ఆనందాన్నంతా నా కళ్ళల్లో కూరుతూ.

     'దేనికి?'

    ' నువ్విచ్చిన సుఖానికి అనుభూతితో అతని గొంతు మూగబోతోంది.

     "నేనివ్వడమేమిటి! మనిద్దరం గతజన్మలో ఒకరిలో ఒకరు పారేసుకున్న సుఖాన్ని తిరిగి శరీరాల్లో వెదికి పట్టుకున్నాం" అన్నాను.

     నేను అంత  బాగా మాట్లాడగలనని ఎప్పుడూ    అనుకోలేదు. అందుకే మగవాడు తిరక్క,ఆడది  తిరిగీ చెడుతుందని అంటారు. నేనది ఒప్పుకోను.ఇద్దరూ తరిక్కుండానే చెడిపోతారు.

      "ఎక్కడికో బయల్దేరావుకదా. పద పోదాం" అన్నాడు.

     " ఆ బుర్రకథ దగ్గరికి"

     ఇద్దరు బయల్దేరాం.  రమణ కొంతదూరం నాతో వచ్చి  ఆతరువాత తనదారంట తాను వెళ్ళిపోయాడు. నేను బుర్రకథ దగ్గరికి వెళ్శాను.

     పతివ్రత కావమ్మ కథ  వింటూ జనం విషాదంలో రెక్కలుతెగిన కీటకాల్లా కొట్టుకుంటున్నారు. అప్పుడే శీలం  పొగొట్టుకునివచ్చి పతివ్రత కావమ్మ కధ వినడం ఏదో పొసగనట్ట అనిపించింది. తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటూవుండగా జనంమధ్యలో వున్న అమ్మ పిలిచింది. వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాను.

     కథ అయిపోయింది. తిరిగి ఇంటికొచ్చి పడుకున్నాను.ఎవరి తోనూ మాట్లాడాలనిపించలేదు. తల్లినీ, తండ్రినీ, స్నేహితురాళ్ళనీ, బంధువుల్నీ మరిపించింది ఆ అనుభవం.

ట    ఇక  అప్పట్నుంచీ మొదలు- రమణతోటే  నాలోకం అయిపోయింది. అతను ఎదురుగా వుంటే అతని రూపాన్ని కళ్ళల్లో కలిపేసుకోవడం- మాట్లాడుతున్నప్పుడూ హృదయాన్ని నగ్నంగా   అతనికి చూపిస్తు నట్టు ఎంతో గాఢంగా ఫీలవడం తప్ప మరొకవిధంగా ప్రవర్తించలేక పోయాను.

    మా మధ్య ఏదో జరిగిందని మొదట గుర్తించింది వేదవతి. "ఏమిటి కథ" అంటూ కొంటెగా కళ్ళెగరేసింది.

      "ఏం లేదు-  ఏదో ఇష్టం" అన్నాను చివరి పదాన్ని నొక్కి పలుకుతూ.

      "ఈ వయసులో ఆడపిల్లకు కావాల్సింది ఓఅబ్బాయిని  కొంగుతో ముడేసుకోవడంకాదు. కొంగు ముడిపడేట్టు చేసుకోవడం"

    "అంటే పెళ్ళి?"

    " ఆ చక్కటి కుర్రాడు. మంచి సంబంధం"

    "కానీ అమ్మానాన్న!"

     "నీ ఇష్టాన్ని భయపడకుండా చెప్పేసయ్"

    అలాగేనన్నట్టు తల ఊపానుకానీ అదెంత  కష్టమో తరువాత తెలిసింది. ఎప్పుడు ఆ  విషయాన్ని చెప్పాలని ప్రిపేర్ అయినా ఏదో జంకు ఎప్పటికప్పుడు  వెనక్కి లాగేది. మా ప్రేమ విషయాన్నిచెప్పలేకపోవడం నా తప్పు కాదు.
పిరికితనం అంతకన్నా కాదు. ఏ విషయాన్నైనా నిర్భయంగా చెప్పగలిగే ఛాయిస్ మొదటినుంచి  ఇవ్వరు పెద్దలు. వాళ్ళకు ఇష్టంలేని పనులు చేయకూడదని  చిన్నప్పట్నుంచీ నూరిపోయడంవల్ల పెద్దయ్యాక కూడా   కూడా జంకు పోదు.

     పిల్లలకి ఇష్టమైన వేటినీ మనస్ఫీర్తిగాఒప్పుకోరన్న అభిప్రాయాన్ని కూడా కలుగజేస్తారు పెద్దలు. ఈ కారణాలవల్లే నేనూ చెప్పలేక పోతున్నా. వేసవికాలం అయిపోగానే  రమణ ఎం.ఏ ఫైనల్ లో చేరాడు.

    "డబ్బు  ఇబ్బందికదా" అన్నాను  చివరిరోజు నాతో  చెప్పినప్పుడు- మరుసటి ఉదయం   అఅతను యూనివర్శిటీకి వెళ్ళిపోతాడు.

     "ఆ డబ్బులేకనే ఫిస్టియర్  పాసైనిలిచిపోయాను. ఇప్పుడు మన లాంటికళ్ళకి కూడా ఇ బి,సి. స్కాలర్ షిప్ లు ఇస్తున్నారట. అందువల్లే తిరిగి చేరుతున్నాను"

    టెన్త్ క్లాస్ ఫెయిలైనందుకు అప్పుడు బాధపడ్డాను.  టెన్త్ వుంటేనేనూ ఇంటర్ కి టౌన్లో వుండేదాన్ని . రెండేళ్ళు ఇద్దరం. టౌన్లో చెట్టాపట్టా లేసుకుని తిరిగి వుండేవైళ్ళం ఆ ఛాన్స్ పోయింది.

     "మరి నేనొక్కదాన్నే ఈ ఊర్లో" అంటూ అతని చొక్కా బొత్తాముసల్ని సవరిస్తూ నా బాధను ప్రకటించాను.  '  వారం వారం నీకోసం వస్తుంటానుకదా' అన్నాడు ప్రేమగా నా బుగ్గలు నిమురుతూ.

     అతణ్ణి వదల్లేక తప్పదనిపించి  కన్నీళ్ళతో సాగనంపాను.

     చెప్పినట్టే శనివారం సాయంకాలం ఊరికి వచ్చేవాడు. ఇంటికి రావడం బ్యాగ్ ను ఇంటిలో విసిరికొట్టి  నాకోసం పరిగెత్చుకొచ్చేవాడు.

 Previous Page Next Page