Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 41


    అందరూ మౌనంగా కూర్చున్నారు.
    బేరర్ కాఫీలు తెచ్చాడు. మౌనంగా కాఫీలు తాగారు.
    గౌతమ్ సిగరెట్ వెలిగించుకున్నాడు.
    విశ్వం దెబ్బలు తిన్న దొంగలా కూర్చుని ఉన్నాడు.
    రవి చెయ్యని నేరానికి మాష్టారు చేత దెబ్బలు తిన్న పసివాడిలా మునగ దీసుకుని కూర్చున్నాడు.
    గౌతమ్ ఇద్దర్నీ మార్చి మార్చి చూశాడు. అతడి కళ్ళలో రవిని చూస్తుంటే ఆత్మీయతాభావం రెపరెపలాడింది.
    "రవీ!"
    రవి తుళ్ళిపడ్డాడు.
    ఆ గొంతు....ఆ గొంతులోని ఆత్మీయత ఉదయం అన్నయ్య పిల్చినట్టే పిల్చాడు. అవును. ఇతను కూడా తన అన్నయ్యేగా? అందుకే అన్నారు "బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్" అని.
    "రవీ! నిన్ను బాధపెట్టే పని చేశానా?"
    "ఉదయం ఆసుపత్రికి ఎందుకెళ్ళావ్?"
    "మన పొజిషన్ ను స్ట్రెంగ్ తెన్ చేసుకోవడానికి."
    "అంటే?"
    "మీ అన్నయ్య జామీను మీద విడుదల అయ్యాడు. అతనికి పలుకుబడి గల స్నేహితులున్నారు. అతడికి తెలిసినవాళ్ళలో మంచిపేరు ఉంది." ఆగి రవి ముఖంలోకి చూశాడు.
    "అయితే?"
    "అందుకే నేను ఆ పని చెయ్యాల్సి వచ్చింది."
    "అర్థం కాలేదు."
    "చెప్పు విశ్వం" అన్నాడు విశ్వంకేసి తిరిగి గౌతమ్.
    "నువ్వే చెప్పు. మధ్య నాకెందుకు?" అలిగినట్టుగా అన్నాడు విశ్వం రవి ఏం చేస్తాడోనని ఇంకా పీచుపీచుమంటూనే ఉంది అతడి మనసులో.
    "మీ అన్నయ్య బయట ఉంటే తను నిరపరాధిగా రుజువు చేసుకొనే అవకాశం ఉంది." ఆగి రవి ముఖంలోకి చూశాడు గౌతమ్.
    "అందుకని మరో అభాండం వేస్తావా అతడి నెత్తిమీద?" విసురుగా అన్నాడు రవి.
    "మరి తప్పదుగా? మళ్ళీ అతన్ని కటకటాల వెనక్కు పంపించాలి. అందుకు పకడ్బందీగా మరో క్రైం అతడిమీదకు వెళ్ళాలి. అతడు బయట ఉంటే డేంజర్ అని పోలీసు శాఖకు భయం కలగాలి. నాకంత బుర్ర ఎక్కడిదీ? విశ్వమే చెప్పాడు ఉపాయం. అందుకు అతన్ని అభినందించడం పోయి చంపుతానంటావా? అకస్మాత్తుగా అన్నయ్య మీద అంత ప్రేమ పుట్టు కొచ్చిందేం?" గౌతం కంఠం గంభీరంగా పలికింది.
    "నాకు చెప్పకుండా ఎందుకు చేశారు?"
    "టైం లేదు. వెంటనే జరిగిపోవాలి."
    రవి మౌనంగా తల వంచుకొని కూర్చున్నాడు.
    "నువ్వు చాలా హైహండెడ్ గా ప్రవర్తించావు."
    "అది నువ్విచ్చిన అవకాశమే!"
    "అందుకని ఇంత మోసం చేస్తావా?"
    "నేనా మోసం చేస్తున్నది? నువ్వా?"
    "ఈ కుట్ర బయట పెడతాను. నావల్ల కాదు భరించడం."
    గౌతమ్ పకపక నవ్వాడు. ఊగి ఊగి నవ్వాడు.
    "వెరీగుడ్! పద! పోలీస్ స్టేషన్ కు వెళ్దాం! లే! నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాను. కాని, నాతోపాటు మీ ఇద్దరు కూడా కటకటాల వెనక కూర్చోవాల్సి ఉంటుంది. శిక్ష నాకంటే మీకే ఎక్కువ పడే అవకాశం ఉండొచ్చు. నన్ను మీరిద్దరూ పావుగా వాడుకున్నారు" అన్నాడు గౌతమ్.
    మధ్యలో నేనెందుకెళ్తాను జైలుకు?"
    రవి, గౌతమ్ ఇద్దరూ తలలు తిప్పి చూశారు. విశ్వం అరచేతులకు పట్టిన చెమట తుడుచుకుంటున్నాడు.
    "అందరికంటే పెద్ద అపరాధివి ఈ కేసులో నువ్వే. అతి తెలివి తేటలతో తప్పించుకున్నా నేను మాత్రం నిన్ను వదలను."
    విశ్వం గాబరాగా గౌతమ్ ముఖంలోకి చూశాడు. అతడి కళ్ళలో అంతకు ముందెప్పుడూ కనిపించని క్రౌర్యం కనిపించింది.
    "ఎటూ నాకు జైలుశిక్ష తప్పదు. నిన్ను చంపేశాననుకో-మరికొన్ని ఏళ్ళు అదనం...."
    "గౌతమ్!" విశ్వం గొంతు కీచుగా పలికింది.
    "అవును! రవిని మాత్రం ఇరికించి తప్పుకుందామని చూస్తున్నావేమో! జాగ్రత్త. నేను చిక్కానే అనుకో. జైలుకు వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను. నాకై నేను మిమ్మల్ని ఇరికించను. కాని ఇరుక్కోక తప్పదు. అందుకే ముగ్గురం ఉంటే బయట. లేకపోతే జైలు లోపల. అంతె!"
    రవి మీద ఆ మాటలు బాగానే పనిచేశాయి. సెంటిమెంటు నుంచి బయటపడ్డారు.
    "మీరిద్దరూ బాగానే ఉంటారు. నేనే పూర్తిగా నాశనం అయిపోతాను" అన్నాడు రవి.
    గౌతమ్ అర్థయుక్తంగా నవ్వాడు.
    ఆ నవ్వుకు రవి మండిపోయాడు.
    "అన్నయ్య పేరుమీద ఉన్న లక్షరూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్ తీశావటగా?" అన్నాడు రవి.
    విశ్వం గౌతమ్ ముఖంలోకి చూశాడు.
    గౌతమ్ తొణక్కుండా "అవును" అన్నాడు.
    "ఎందుకు తీశావ్?"
    "నువ్వెవడివి నన్ను అడగడానికి?"
    "నేనెవర్నా? ఆ అన్నయ్యకు తమ్ముడ్ని."
    గౌతమ్ విరగబడి నవ్వసాగాడు.
    "ఎందుకు నవ్వుతావ్?"
    "నువ్వు ఆ అన్నయ్యకు తమ్ముడివి. అది నిజమే. మరి నేనో?"
    "నువ్వొక ఛీట్ వి."
    "కాదు. ఆ అన్నయ్యకు ఆ అన్నయ్యను ఆ ఫిక్సెడ్ డిపాజిట్ నా పేరు మీద ఉంది. దానిమీద నాకు సర్వహక్కులూ ఉన్నాయ్."
    "యూ....యూ...." రవికి ఆపైన మాటలు పెగల్లేదు.
    "రవి! మై డియర్! ఉద్రేకపడకు. పాపం, పెదవి కొరుక్కున్నావ్. పేదవాడి కోపం పెదవికి చేటు అంటారు. కాని, పిరికివాడి కోపం పెదవికి చేటు అంటాను నేను. నువ్వే నాకు ఆ స్థానం కల్పించావు. నీ అన్నయ్య స్థానంలో నన్ను ప్రవేశపెట్టి కొన్ని పనులు చేయించావు. ఆ స్థానంలోకి వచ్చాక పూర్తిగా నీ చేతిలోని కీలుబొమ్మలా నేను ప్రవర్తిస్తాననుకోవడం నీ ఫూలిష్ నెస్. రిస్కు తీసుకున్నాను. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ముందు ముందు ఏమైనా చేశాను. ఇక నువ్వు నీ అన్నయ్యను-అదే గౌతమ్ ఎస్ ను."
    "గౌతమ్ ఎస్సా?" అంతవరకూ నోరు మెదపని విశ్వం నోరు తెరిచాడు.
    "అవును. గౌతమ్ ఎస్. అంటే గౌతమ్ శంకర్రావన్నమాట. శంకర్రావు కొడుకు గౌతమ్ అన్నమాట."
    "నీ ఇనిషియల్ ఏమిటి?"
    "నాకు ఇనిషియల్ లేదు."
    "అదేమిటి?" విశ్వం కంఠంలో ఆశ్చర్యం.
    "ఏమిటంత ఆశ్చర్యంగా ప్రశ్నిస్తావు? రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగాడట నీలాంటి మూర్ఖుడే ఒకడు నాకు తండ్రి ఎవరో తెలియదని నీకూ తెలుసు. అందుకే నేను గౌతమ్ ను. అతడు గౌతమ్ ఎస్. ఈ క్షణం నుంచి నేను గౌతమ్ ఎస్ ను. అతడు గౌతమ్ జైల్లో ఉంటాడు. నేను శంకర్రావు వారసుడుగా ఉంటాను. రవీ! ఇకనుంచి నన్ను నువ్వెలాంటి ప్రశ్నలూ వెయ్యకూడదు. నువ్వు నా తమ్ముడివి. నేను చెప్పినట్టు వినాలి."
    రవి ముఖంలోకి రోషం, దుఃఖం, కోపం ముప్పిరిగొన్నాయి.
    "అన్యాయం!" రవి దాదాపు ఏడుస్తున్నట్టే అన్నాడు.
    "ఏది అన్యాయం? నువ్వు చేసింది అన్యాయం కదూ! నీ పబ్బం గడుపు కోవడానికి సొంత అన్నయ్యకు ద్రోహం తలపెట్టావు. అందుకు పావుగా మరొకణ్ణి వాడుకున్నావు. నీ పని అయిపోయాక అతడ్ని కూడా వదిలించుకోవాలని చూస్తున్నావు. అది అన్యాయం కదూ?" గౌతమ్ రవి ముఖంలోకి లోతుగా చూశాడు.

 Previous Page Next Page