Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 41

                                 

 

    మాములుగానే అతను భయపడినట్లు నటించాడు.
    "దణ్ణం పెడతాన్సార్! ఇంక దాని జోలికి పోన్సార్ -" అన్నాడు దణ్ణం పెడుతూ. పుల్ గా మందు కొట్టి ఉన్నాడు కాబట్టి మేము అంతకంటే చేసేదేమీ లేక వెనక్కు వచ్చేశాం.
    కాసేపటి తర్వాత లావణ్య మేమేందరం మాట్లాడుతుంటే ఏడుస్తూ వచ్చింది.
    "అన్నయ్యా! ఆ మనిషేమంటున్నాడో తెలుసా? మీరంతా వార్నింగిచ్చారు గనుక నన్నింక కొట్టడంట. కానీ రేపే ఆ 'లై డిటెక్టర్' పరీక్ష చేయిస్తాడంట! అందులో నేనబద్దం చెప్పినట్లు తెలిసిందంటే నన్ను నరికేస్తాడంట-"
    అందరం షాకయ్యాం-- రాజ నరసింహ సంగతి మాకు బాగా తెలుసు! అతనికి అదివరకే క్రిమినల్ రికార్డ్ ఉంది.
    ఆ లై డిటెక్టర్ వల్ల క్రైం పుట్టటానికి అవకాశం ఉందన్న సంగతి మా కర్ధమయింది.
    లావణ్య సంసారం నాశనమయిపోవచ్చు లేదా లావణ్యను వాడు మర్డర్ చేయవచ్చు!
    వెంటనే ఆమెను షైనీ దగ్గరకు తీసుకెళ్ళాం.
    లావణ్యా చెప్పిందంతా వినేసరికి షైనీ కి కూడా కొంచెం భయం వేసినట్లయింది.
    "కానీ అది లేడీస్ ని టెస్ట్ చేయడానికి తీసుకొచ్చింది కాదు -- ' అందామె తప్పించుకోడానికి చూస్తూ!
    'అంటే ఎంతసేపూ మగాళ్ళనే వేదిద్దామనా?" అంటూ ఎదురు తిరిగాడు విజయ్ యాదవ్.
    షైనీ కొంతవరకూ డిఫెన్స్ లో పడింది.
    "అలా అనికాదూ! కానీ మా కమిటి అంతా డిసైడ్ చేయాలి! వాళ్ళంతా ఎలా డిసైడ్ చేస్తే అలా-" అంది తప్పించుకోడానికి మార్గం వెతుకుతూ.
    సరిగ్గా అప్పుడే లావణ్య అన్నలిద్దరూ వచ్చారు. వాళ్ళు సాప్ట్ వేర్ ఇంజనీర్లు. మార్కెటింగ్ లో ఉన్నారు.
    లావణ్య జరిగిందంతా చెప్పి వాళ్ళను ఇంటికి తీసుకెళ్ళింది.
    మర్నాడు ఉదయం మేము మా సొసైటీ రీడింగ్ రూమ్ లో ఉండగా కమినీ వాన్ లో ఇద్దరూ చైనా వాళ్ళోచ్చారు.
    "మాకు షైనీ మేడమ్ కావాలి" అన్నాడు వచ్చీ రాని హిందీలో.
    "పర్మనెంటుగా తీసుకెళ్ళిపోతారా ఆమెని?" ఆశగా అడిగాడు బోసు.
    "ఓ - నో ! మక్కావలసింది ఆమె కాదు. మా కంపెనీ నుంచి ఆమె కొన్ని లై డిటెక్టర్ వాపస్ తీసుకెళ్ళడానికొచ్చాం -"
    ఆ మాటతో ఒక్కసారిగా మా అందరిలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.
    "ఏంటి? ఆ మిషన్ వాపస్ తీసుకెళ్తున్నారా?"
    "అవును-"
    "ఎందుకు?"
    "మా కంపెనీ తయారు చేసిన 2008 బాచ్ మిషన్ ఇది. ఆ మిషన్లన్నిటికీ మాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నాయ్ , అందుకని ఇండియాలో మేము అమ్మిన మిషన్లన్నీ వాపస్ తీసుకెళ్ళి రిపేర్ చేసి ఇస్తాము --" వెంటనే ఆ ఆనందకరమైన వార్త షైనీకి చేరవేశాం!
    షైనీ హడావుడిగా వచ్చింది.
    "ఏంటి అందులో డిఫెక్ట్ ?" అడిగిందామె.
    "అబద్దం చెప్పినా, నిజం చెప్పినా -- సైరన్ వస్తోంది "
    రెడ్డి 'యాహూ" అని గావుకేక పెట్టేసరికి అందరూ గాబరా పడ్డారు.
    "అదేంటలా అరచావ్?" అడిగారు అందరూ.
    "అంటే నేనూ నిర్దోషినే! టీవిలో కనబడింది నేను కాదు" అంటూ అరచాడు శాస్త్రి .
    షైనీకి నోటమాట రాలేదు. మొఖం వాడిపోయింది.
    "మరలాంటి చెత్త మిషన్ మాకెందుకమ్మారు?"
    ",మా చైనా ఏ వస్తువమ్మినా చౌకబారు పార్ట్స్ తోనే తయారు చేస్తారని మీకు తెలుసు. అందుకే మార్కెట్లో మంచి వస్తువు యాభై వేలుంటే -- మేము అయిదువేలకిస్తున్నాం -- కొనే వాళ్ళు కూడా ఆ మిషన్ నాల్రోజులు పనిచేస్తే చాల్లే అని కక్కుర్తి పడి కొనుక్కుంటారు -- అలాంటప్పుడు అది చెత్త మిషన్ అని కంప్లెయింట్ చేయటం మీనింగ్ లెస్' అన్నారు వాళ్ళు.
    షైనీ కేం చేయాలో అర్ధం కావడం లేదు.
    "ఇంతకూ ఇప్పుడెం చేయబోతున్నారు ?"
    "ఆ మిషన్ తీసుకెళ్ళి దాన్ని సరిజేసి మళ్ళీ తెచ్చిస్తాం-"
    "సరే -- తీసుకెళ్ళండి -"
    వాళ్ళు వెంటనే ఒక రసీదు రాసిచ్చి మిషన్ వాన్ లో  వేసుకుని వెళ్ళిపోయారు.
    టెంపరరీగా ప్రాబ్లం సాల్వ్ అయింది గదా అని అందరం హాపీగా ఫీలయ్యాం. సీక్రెట్ గా స్వీట్లు కూడా పంచారు కొంతమంది.  
    అయితే కొద్ది రోజుల తరవాత లై డిటెక్టర్ రిపేర్ అయిందేమో తెలుసుకోడానికి షైనీ ఆ కంపెనీ సర్వీస్ సెంటర్ కెళ్ళినప్పుడు ఇంకో షాకింగ్ న్యూస్ తెలిసింది.
    ఆ లై డిటెక్టర్ లో డిఫెక్ట్ లేనే లేవనీ --- తమ కంపెనీ తరపున ఎవరూ మిషన్ వాపస్ తీసుకోలేదనీనూ!
    షైనీ తెచ్చిన రసీదు చూసి "ఓ ఇది బోగస్ -- మా కంపెనీ కాదు " అన్నారు వాళ్ళు.
    "మరిప్పుడు మేమేం చేయాలి ?"
    "పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి -"
    షైనీ పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది.
    ఇచ్చి సంవత్సరం అవుతోంది గాని ఇంతవరకూ ఇన్ వేస్టిగేషన్ పూర్తవనేలేదు -
    మిగతా లక్షల కొద్ది కేసుల్లాగానే అదీ 'పెండింగ్ ' లెవల్లో కెళ్ళి పోయింది.
    ఆ తర్వాత షైనీ మళ్ళీ ఎప్పుడూ లై డిటెక్టర్ టాపిక్ ఎత్తలేదు.
    "పొతే పోనీ -- వెధవ మిషన్ " అనీ ఆడామగా కూడా చిరాకుపడటం మొదలుపెట్టారు.
    ఆ తర్వాత మా కమిటీ వాళ్ళం చాలా సీక్రెట్ మీటింగ్స్ కండక్ట్ చేశాం గానీ -- ఆ మిషన్ ని అంత తెలివి తేటలతో మాయం చేసిందెవరో తెలీలేదు.
    "ఇది ఆ స్టూడెంట్స్ పనే బ్రదరూ! ఆ సుష్మిత లవ్ టెస్ట్ పెడతానందని భయపడి మిగతా ఫ్రెండ్స్ తో కలసి నాటకమాడి ఉంటారు --" అన్నాడు కృష్ణమూర్తి.
    "నా అనుమానం ఏంటంటే లావణ్య అన్నలే ఆ పని చేయించి ఉంటారని అనిపిస్తోంది . లేకపోతే తమ చెల్లెలి జీవితం ప్రమాదంలో పడుతుందని అనుకుని ఉంటారు -" అన్నాడు విజయ్ యాదవ్.
    కాని లాస్ట్ లో అసలు విషయం సీక్రెట్ గా తెలిసింది మాకు.
    అది షైనీ ఆడిన నాటకం - అని !
    "ఆ లై డిటెక్టర్ వల్ల లేడీస్ కే ఎక్కువ సమస్యలు వస్తాయని తెలుసుకుని అలా చేసి ఉంటుంది" అన్నాడు శంకరమూర్తి.
    ఏదేమయితేనేం! మా రామ్ భరోసా అపార్ట్ మెంట్స్ తాలుకూ మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపొయింది.

 

                 

 Previous Page Next Page