Previous Page Next Page 
మనసున మనసై పేజి 41


    అంతవరకు బిగపట్టినట్టు కూర్చున్న మనీషా వాళ్ళిద్దరూ రాగానే చాలా కలివిడిగా, సరదాగా మాట్లాడడం మొదలుపెట్టింది. బొంబాయి నుంచి వచ్చిన సంజయ్, సునీల్ లు ఇద్దరూ గలగల మనీషాతో మాట్లాడుతున్నారు దివాకర్ సంగతి పట్టించుకోకుండా వెయిటర్ వస్తే మనీషా వాళ్ళని అడిగి వాళ్ళ తరపున ఆర్డరు చేసింది.
    'ఫుట్ ఇన్ ది సేమ్ బిల్' అంది. దివాకర్ వళ్ళు మండింది. ఈ వెధవలిద్దరూ తిన్నదానికి తను బిల్లు పే చెయ్యాలా - తను మనీషాతో ఏకాంతం కోరి వస్తే సరిగా వేళకి తగలడ్డారు. పైగా వీళ్ళందరిని మేపి తన డబ్బులు తగలేసుకోడం- దివాకర్ మూడ్ పోయింది.
    ముఖం గంటు పెట్టుకున్నాడు. తనెంత ప్రయత్నించినా మనీషా తనతో ఇలా వుండదు అని కుళ్ళుకున్నాడు. మాటలమధ్యలో సునీల్ దివాకర్ మొహం చూసి 'ఓసారి మీ ప్రోగ్రాం మేం డిస్ట్రబ్ చేయలేదుగదా- చేశావు వెధవా పైగా నీనించి నీ ప్రోగ్రాం అంతా తగలడింది.' మనసులో మండుతున్న పైకి వెర్రినవ్వు నవ్వి 'నాటెటాల్' అన్నాడు.
    మనీషా 'డిస్ట్రబ్ చేయడానికి ఏముంది, వూరికే ఇలా బైట భోంచేద్దామా అంటే ఓకే అన్నాను' తామిద్దరి మధ్య అంతకంటే ఇంకేమీలేనట్టు అంది మనీషా.
    భోజనం ఎలాగో అయిందనిపించాడు దివాకర్. ఇంక కూర్చోలేక 'ఇఫ్ యూ ఎక్స్ క్యూజ్ మీ మనీషా, రెండవుతుంది ఆఫీసులో పనివుంది' అంటూ లేచి అంతలోనే బాగుండదన్నట్టు 'వెయిటర్ బిల్లు' అన్నాడు వెయిటర్ని పిలిచి.
    'డోంట్ వర్రీ మిస్టర్ దివాకర్, ఐవిల్ సెటిల్ ద బిల్, మీకు పని వుందేమో వెళ్ళండి, సునీల్ డ్రాప్ చేస్తాడు నన్ను. నీ కోసం మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళాలి' అంది మనీషా.
    మనసులో అమ్మయ్య అనుకుని ఇంకేం రెట్టించకుండా 'ఓకె దెన్ బై' అంటూ వెళ్ళిపోయాడు.
    కార్లో వెడుతూంటే అతనికి చాలా ఆశాభంగంగా మూడ్ అంతా పాడయి పోయింది. రోజంతా వేస్ట్ అయింది. మనీషా సంగతి అతనికి సరిగా అర్ధమవటం లేదనిపించింది. ఆ అమ్మాయి ఉద్దేశం అంతుబట్టడంలేదు. తనంటే ఇష్టం వున్నట్టా లేదా, తను ముందుకు ప్రొసీడ్ అవ్వాలా వద్దా. ఈ రోజు తనతో వున్నప్పుడు ఇబ్బందిగా ఉంద. వాళ్ళు రాగానే ఎంత రిలాక్స్ డ్ గా సరదాగా ఉంది. తను ఆమె ఉద్దేశం త్వరగా తెలుసుకుంటే మంచిదేమో! తనేదో వెర్రి మొర్రి ఆశలు పెట్టుకుంటున్నాడేమో....ఆమెకి అసలు అలాంటి అభిప్రాయం లేదేమో-తనవి వాళ్ళవి కులం, భాష, సంస్కృతి అన్నీ వేరు. అన్నింటిని మించి మనీషాతో పోలిస్తే తను తన ఫ్యామిలీ వాళ్ళ స్టేటస్ కంటే తక్కువ. అది ఏమన్నా మనీషాకి వుందేమో. తనని కేవలం తన బావగారి ఫ్రెండులా, మర్యాదగా తిరస్కరించలేక తనతో మాట్లాడుతూందా- ఇదేదో తొందరగా తేల్చుకుంటే మంచిది- వన్ సైడెడ్ గా తను దూరం వెళ్ళి భంగపడడుగదా-మనీషాని అడిగి తేల్చుకుంటే మంచిది. మరీ వ్యవహారం దూరం తీసికెళ్ళితే ఆమెకా ఉద్దేశం లేకపోతే తను ఇంకా ఆశాభంగం చెంది బాధపడటం కంటే తొందరగా తాడోపేడో తేల్చుకుంటే మనశ్శాంతి ఉంటుంది. దివాకర్ అవకాశం చూసి తొందరలోనే అడిగేయాలని నిర్ణయించుకున్నాడు.
    
                                   * * *
    
    జయంతి ఇరవై రోజుల తర్వాత ఆఫీసుకెళ్ళింది. నీరసం కొంచెం వున్నా ఇంట్లో తోచడంలేదంటూ బయలుదేరింది. పద్మావతి ఇంకో వారం పది రోజులు ఆటోలో వెళ్ళి రమ్మంది. జయంతికిపుడు ఇంట్లో వుండటంతో ఒక విధమైన నిశ్చింతగా వుంది. ఉషారాణి వెళ్ళాక వంటరిగా ఉన్నప్పటి గుబులు అది పోయి ఏదో ఆసరా దొరికినట్లు మనసుకి తృప్తిగా ఉంది.
    దివాకర్ పదకొండు గంటల వేళ ఆఫీసుకి వచ్చి తన ఛాంబర్ లోకి వెడుతూ టేబిల్ దగ్గర జయంతిని చూసి ఒక్కక్షణం ఆగి 'ఆర్ యూ ఆల్ రైట్ నౌ నెలాఖరువరకు సెలవు పెట్టకపోయారా' అంటూ పలకరించాడు. 'నాకిపుడు బాగానే వుంది. సెలవు అనవసరంగా, వృధా చేసుకోడం ఎందుకు' అంది నెమ్మదిగా అతని వంక చూడకుండా, దివాకర్ 'ఒకే, యాజ్ యూ విష్' అంటూ వెళ్ళిపోయాడు. దివాకర్ ని చూడగానే ఇది వరకు మాదిరి జయంతికి ఏమీ అనిపించలేదు. చాలా నిర్లిప్తంగా అతను వెడ్తుంటే వెనక నించి చూసింది. మనీషా అతని జీవితంలోకి రాకపోతే తనకేమన్న ఛాన్సు ఉండేదేమో ఇప్పుడింక ఆశ ఏమి మిగలలేదు ఆమెలో.
    ఇంట్లో తల్లిదండ్రులు మళ్ళీ సంబంధాల వేటలో పడ్డారు. పేపర్లలో వివాహ సంబంధాల ప్రకటనల్లో తమకి సరిపోతాయనిపించినవి టిక్కులు పెట్టుకుంటూ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిస్తున్నారు. ఆ విషయం గమనించనట్టే జయంతి వూరుకుంది. తన దాకా వచ్చినపుడు ఆలోచించొచ్చు అనుకుంది. ఓ పక్క దమయంతి, గోపాలకృష్ణ కూడా ఈ సంబంధం, ఆ సంబంధం అంటూ మాట్లాడుతున్నారు. గోపాలకృష్ణ దమయంతి సాధారణంగా ఆదివారం ఇంటికి వస్తూంటారు. వాళ్ళిద్దరిమధ్య ఉన్న అండర్ స్టాండింగ్, గోపాలకృష్ణ ఆమెని ఎంత అభిమానిస్తూ గౌరవిస్తాడో చాలాసార్లు మాటల్లో, చేతల్లో చూసి గోపాలకృష్ణ పట్ల ఆమె విముఖత నెమ్మదిగా కరిగిపోసాగింది. దమయంతి నెల తప్పిందగ్గరనుంచి ఆమెని ఇంకా అపురూపంగా చూసుకుంటున్నాడతను. 'దమయంతి అదృష్టవంతురాలు అంటూంది తల్లి తరచు - ఆడదానికి అనురాగం పంచే భర్త కంటే ఇంకేం కావాలి అంటుంది జయంతికి పరోక్షంగా చెప్తున్నట్టు-ఇప్పుడు కాదు అని గట్టిగా ఇది వరకులా వాదించడం లేదు జయంతి.

 Previous Page Next Page