"బేబీ!" ఆ పిలుపు ఈశ్వరిది! నిలబడితే కూచోలేని దశలో నిలువెల్లా వణుకుతూ వచ్చింది.
"నాన్నమ్మా!" సంభ్రమంతో అని అంతలో సర్దుకొని "క్షమించండి!" అంది.
"ఏమిటే చిట్టీ! ఎందుకమ్మా ముసలిదాన్ని ఇంకా హింస పెడతావు? నిన్నొదిలి వుండలేక, మీ నాయనమ్మ ఎలా అయిపోయిందో చూశావా? నేనో మతిలేని దాన్ని తల్లీ! నాకు కావలసిందేదో నాకు తెలీలేదు. నువ్వు దూరమయ్యాక నువ్వు గుర్తురాని క్షణంలేదు. నిన్ను ఇంటినుంచి తరిమేశాక నిన్ను గుర్తుచేసుకొని ఏడవని రోజు లేదు.
"ఇప్పుడు తెలిసిందే. నాకు కావలసింది నువ్వు. పరువుప్రతిష్టల్ని పొయ్యిలో పెట్టనీ? నువ్వు నా కొడుక్కే పుట్టావో, మరెవరికి పుట్టావో ఆ దేవుడినే తేల్చనీ! నాకు మాత్రం నువ్వు కావాలి బేబీ! నీకు దెబ్బలు తగిలాయని విన్నాక, నువ్వు ప్రాణాపాయ దశలో వున్నావని తెలిశాక, అప్పుడు నాకు తెలిసిందీ, నువ్వు తప్ప నాకు ఇంకేమీ అక్కరలేదని, నిన్ను బాగుచెయ్యకపోతే, నేను పూజించే దేవుళ్ళందరినీ, నిలదీసి అడుగుతాను. వాళ్ళు దేవుళ్ళేకాదు. పొమ్మంటాను. నేను మొక్కుకున్నానే? నువ్వు బాగుపడిపోతావు. బాగుపడిపోతావు."
"నాన్నమ్మా!" ఫ్రీగా వున్నా ఒక చేత్తో వణుకుతున్న ఈశ్వరి చెయ్యి పట్టుకుంది. ఈశ్వరి మొక్కుల గురించి బాగా తెలుసు గనుక, "ఏం మొక్కుకున్నావని" అడగలేదు.
"అమ్మా! ఇంటికి పోదాం రా!" తల్లిని లేవదీయబోయాడు శర్మ.
"వద్దురా! బేబీ దగ్గరే కూచోని? నాకు ఇంటికి వెళ్ళాలని లేదు."
"ఫరవాలేదమ్మా! బేబీకి నయమైపోతుంది. రెండు రోజుల్లో లేచి తిరుగుతుంది.
"బేబీ వస్తావా!"
"వస్తాను."
"నామీద కోపం లేదుగా!"
"పో నాన్నమ్మా! నీ మీద నాకు కోపమా?"
"రా అమ్మా!" ఒక రకంగా బలవంతాన అక్కడి నుంచి నడిపించుకొంటూ తీసుకుపోయాడు శర్మ.
ఆ మరునాటికె శకుంతల కాస్త లేచి నడవ గలిగింది. ముందు రాజవల్లి దగ్గర కెళ్ళింది.
ఊపిరి పీల్చటానికి అవస్థపడుతోంది. మంచంలో వున్న రాజవల్లి.
"అమ్మమ్మా!"
ఆ పిలుపుకు నిర్జీవమయిన చూపులలో చురుకుదనం వచ్చింది బేలగా శకుంతలను చూసింది.
"అమ్మమ్మా! నువ్వు తొందరగా కోలుకోవాలి మన ఊరుపోదాం! నువ్వు లేకపోతే, నేనేమైపోతాను?
ఆ మాటలు మంత్రంలా పనిచేశాయి. శకుంతల చెయ్యి గట్టిగా పట్టుకుని లేవటానికి ప్రయత్నించింది. ఆ తరువాత శకుంతల సేవలో రాజవల్లి త్వరలోనే కోలుకుంది. ఎన్నడూ రాజవల్లీనగర్ వదిలి రాని ఆ వృద్దురాలు, చక్రాల కుర్చీలో తప్ప కదల్లేని అనారోగ్యస్థితిలో తనకోసం ఇంతదూరం వచ్చింది. కోలుకున్న తర్వాత జరిగిన సంగతులు తెలిశాయి శకుంతలకి. తనకు స్పృహ తప్పగానే కాల్పులు ఆగాయి అప్పటికే. ఐదారుగురు మరణించారు రమేష్, ప్రభాకర్ ఇద్దరూ ఒంటిమీద తెలివిలేని తనను రాజవల్లి దగ్గరకు తీసుకొచ్చారు.
మనను ఎంతగా క్షోభించిపోతున్నా ఆవిడ అసాధారణచాతుర్యంతో ప్రవర్తించింది. రెండు జీప్ లు సిద్దం చేయించి, ఒక స్థానిక వైద్యున్నికూడా జీప్ లో ఎక్కించుకొని, అతివేగంగా హైదరాబాద్ చేరుకొని తనను మహావీర్ నర్సింగ్ హోమ్ లో చేర్పించి శర్మకు ఫోన్ చేయించింది. సమయానికి ఇంత శక్తిసామర్ధ్యాలు చూపించినా ఆ తర్వాతమాత్రం నిలదొక్కుకోలేక పోయింది. తాను లేకపోతే, శకుంతల అనాథ అయిపోతుందనే ఆందోళన మాత్రమే ఆ వయసులో ప్రాణాలు నిలిపింది.
అంతలో శర్మవచ్చి ఈశ్వరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందనీ "బేబీ!" అని కలవరిస్తోందనీ చెప్పాడు. రాజవల్లి తానీ శకుంతలను ఈశ్వరి దగ్గరకు వెళ్ళమని ప్రోత్సహించింది. రాజవల్లిదగ్గర ఆమె దాసీలున్నారు. శకుంతల వెంటనే శర్మతో బయల్దేరింది. ఈశ్వరి మృత్యుముఖంలో వుంది. ఆమెనోట మాటతప్ప మరొకటి రావడంలేదు. కొడుకునూ భర్తనూ కూడా తలవటంలేదు.
శకుంతల "నానమ్మా!" అని పిలవగా శకుంతల కన్నీళ్ళు తుడిచింది. పాత దేవుడిగది చూపించి అతికష్టంమీద మాట్లాడుతూ_"ఇదివరకు మీఅమ్మ ఆ గదిలో దేవుడికి దీపం వెలిగించేది. మీ అమ్మ వెళ్ళిపోయాక ఆ గదికి తాళం వేసేసాను. ఒక్కసారి నువ్వా గదిలో దీపం వెలిగించు!" అంది.
శకుంతల ఆ గదిలో తలుపులు తెరిచేసరికి అప్పటివరకూ దేవుడితో సహవాసం చేస్తూన్న అనేక బొద్దింకలు బిలబిలలాడుతూ బయటకొచ్చాయి. గదంతా వాసన. గోడలనిండా బూజులు ఆ గదిలోకి ఈశ్వరి పనిమనిషిని రానియ్యదని గుర్తొచ్చింది శకుంతలకి. తనే చీపురు తీసుకుని ఎలాగో ఆ గది శుభ్రం చేసింది, గది కడగలేక ఇన్ని పసుపునీళ్ళు చల్లింది. మకిలి పట్టిపోయిన వెండిదీపపు సెమ్మాలను పైపైన కడిగి నూనెపోసి వత్తులు వెలిగించింది.
"నేను కూచుంటాను." అంది ఈశ్వరి.
ఆవిడ జీవితం ఇంకా కొన్ని గంటలు మాత్రమే అని డాక్టర్ చెప్పారు. అంచేత శర్మ, సేతుపతులు ఆవిడని లేవదీసి కూర్చోబెట్టారు శకుంతల దగ్గిరగా వచ్చి కూచుంది.
దేవుడిముందు జ్యోతిని చూస్తూ, "అబ్బాయ్! కోడలేదీ?" అంది. శర్మ కంగారుగా చూసాడు. 'తెలివిలో ఉండి మాట్లాడుతోందా?'
"అమ్మాయి చాలా మంచిదిరా! ఏడిపించకు ఆణిముత్యంలాంటిది."
మాటలు ముద్దముద్దగా వస్తున్నాయి. 'జ్యోతినే చూస్తోంది. దేవుడిని చూస్తోందా? తనకు కనపడని మరే లోకాలో చూస్తోందా?' అన్నట్లుంది. ఆ చూపు అలా చూస్తూనే, ముందుకు వాలిపోయింది శకుంతల వళ్ళోకి నిర్జీవంగా.
తనపట్లా తన తల్లిపట్లా ఆ ఛాందసురాలి మనసులో ఉన్న మమకారానికీ విస్తుపోయింది శకుంతల. అంతరంగానికీ, ఆచారాలకూ మధ్య ఏర్పడిన వై విద్యంలో ఒక దశలో ఆచారాలే గెలిచాయి. కానీ చివరకు అంతరంగం తన జీవితాన్ని నిలుపుకొంది.
శవ సంస్కారాలయ్యాక సేతుపతి, "బేబీ! ఇకముందు ఇక్కడే ఉంటావా?" అన్నాడు-యధాలాపంగా అడుగుతున్న ప్రశ్నలో అభ్యర్ధన జోడించి.
శకుంతల ఇబ్బందిగా తండ్రిని చూసింది. "నో, బేబీ! నువ్వు రాజవల్లిగారి దగ్గిరే ఉండు. ఎలాంటి పరిస్తితుల్లోనూ, ఆవిడ మనసు నొప్పించకు!" అన్నాడు.