అది నిజం కానందుకు ఆనందంగా వుందతనికి . అయినా కలలో వదిన అలా ఎందుకు మాట్లాడిందో!
భారతి చెప్పింది నిజమే! వదిన పక్కన ఉండాల్సిన సమయమిది! ముందు తనకు మిగిలిన తల్లి వదిన నయినా జాగ్రత్తగా కాపాడుకోవాలి! అన్నయ్య ఎలాగూ ఇంక తిరిగిరాడు. ఇప్పుడింక తల్లీ తండ్రి అన్నా కూడా వదినే! అతనికి మళ్ళీ దుఖం ముంచుకొచ్చింది. అన్నయ్య లేని ఆ ఇంట్లో ఎలా వుండాలో , ఎలా తిరగాలో అర్ధం కావడం లేదు. రైలు ఫ్లాట్ ఫారం మీద కొచ్చేసింది. అందరినీ తోసుకుంటూ రైలు ఆగకుండానే దూకి ఓవర్ బ్రిడ్జి వేపు పరుగెత్తాడతను. స్టేషన్ బయటికొచ్చి ఆటోలో కూర్చున్నాడు. అటో వేగంగా వెళ్తున్నా 'ఇంకా త్వరగా పోనీ' అన్నాడతను డ్రైవర్ తో.
అటో ఇంటి ముందాగింది.
రంగా స్వరూప్ బయటే నిలబడి వున్నారు.
అటో వాడికి డబ్బిచ్చి సూట్ కేస్ తీసుకుని ఆత్రుతగా వాళ్ళ దగ్గరకు నడిచాడతను. వాళ్ళ ముఖాలు పాలిపోయి వున్నాయ్.
సృజన్ గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలయింది.
"ఏమిట్రా అలా వున్నారు? వదినా, పిల్లలూ బాగున్నారా?"
ఆ ప్రశ్న అడగటంతోనే యిద్దరూ అతనిని కౌగలించుకొని బావురుమన్నారు.
"వదిన మనందరినీ మోసం చేసి వెళ్ళిపోయిందిరా?"
సృజన్ చేతిలోని సూట్ కేస్ జారి కిందపడిపోయింది.
ఎవరో తనను కొన్ని వందల కత్తులతో పోడుస్తున్నంత బాధ. కాళ్ళూ , చేతులూ వణికిపోతున్నాయ్.
లోపలికి నడుస్తుంటే పడకగదిలో నుంచి వినబడుతోంది - సీతా శంకు ల ఏడుపు.
"మమ్మీ - మమ్మీ......."
ఎవరో స్త్రీ లు వారిని ఓదారుస్తున్న మాటలు. గది గడపలో కొచ్చి నిలబడ్డాడతను. ఎదురుగ్గా తన మంచం మీద తలలో పూలూ, నుదుట కుంకం, మెడలో మంగళసూత్రాలతో ఆమె పెళ్ళినాటి పట్టుచీరతో -- కేవలం అలసట తో నిద్రపోతున్నట్లు--
"వదినా, వదినా వదినా వదినా ---" తనకు తెలీకుండానే హృదయం అక్రోసిస్తోంది.
అయిపొయింది.
అంతా అయిపొయింది.
తను భయపదినంతా జరిగిపోయింది.
ఇంకేముంది తనకి ప్రపంచంలో -----? ఇంకెవరున్నారు తనకీ ప్రపంచంలో! తనెందుకు బ్రతకాలింకా? అన్నయ్యా, వదినా ఇద్దరూ లేనిదే ఇంక తన జీవితానికి అర్ధమేమిటి?
"సాయంత్రం మూడయినా నిద్రలేవలేదని పాపం ఎందుకో అనుమానమొచ్చి చూశారట ఆ కుర్రాళ్ళు. అప్పటికే ఎక్కిళ్ళు వస్తున్నాయ్. కంగారుపడి మమ్మల్ని లేపి, డాక్టర్ దగ్గరకు పరుగెత్తారు. ఏం లాభం! డాక్టర్ వచ్చేసరికే అంతా అయిపొయింది."
సృజన్ విగ్రహంలా నిలబడిపోయాడు.
సరిగ్గా అదే సమయంలో తన కలలో కొచ్చి ఏడుస్తూ పిలచినట్లు విన్పించింది తనకు.
"సృజన్ , సృజన్ , " ఇంకా వినబడుతూనే ఉందా గొంతు.
"వదినా, వదినా....."
అతనిని చూడగానే పిల్లలిద్దరూ వచ్చి అతనిని చుట్టేశారు.
"బాబాయ్! అమ్మ మాట్లాడటం లేదు బాబాయ్."
సృజన్ కి ఏడుపు రావటం లేదు గానీ , కన్నీళ్లు కారిపోతున్నాయ్.
"ఆ పాయిజన్ ఎలా సంపాదించిందో, ఎప్పుడు సంపాదించిందో ఎవరికీ తెలీదు. అక్కడికి పాపం సృజన్ స్నేహితులిద్దరూ ప్రతి క్షణం కనిపెట్టుకునే ఉంటున్నారు."
గడపలోనే నిస్సత్తువగా కూలిపోయాడతను.
సీతా శంకుల ఏడుపులుఅతని హుదయాన్ని పిందేస్తున్నాయ్.
ఆ తరువాత ఏం జరిగిందో అతనికి తెలీదు.
తిరిగి స్పృహ వచ్చేసరికి తన మంచం మీద పడుకుని ఉన్నాడు. తన ముఖంలోకి ఆత్రుతగా చూస్తోంది భారతి.
"లెండి! మీకోసమే కార్యక్రమం ఆగిపోయిదది......" కన్నీరు తుడుచుకుంటూ అంటోందామె. సృజన్ కేమీ అర్ధం కావటం లేదు....." తనెక్కడున్నాడు?
వైజాగ్ లోనా? హైద్రాబాద్ లోనా?
భారతి ఎలా వచ్చింది?
ఏ కార్యక్రమం ఆగిపోయింది తనకోసం.
లేచి కుర్చున్నడతను. డాక్టర్ తనవేపే జాలిగా చూస్తున్నాడు.
"బిబ్రేవ్ మిస్టర్ సృజన్. జీవితమన్నాక ఇలాంటివి తప్పదు . ఇవాళో, రేపో అన్నదొక్కటే తేడా."
సృజన్ గది గడపలో నుంచి బయటకు చూశాడు.
బయట వదిన శరీరం నిర్జీవంగా కనబడుతోంది - -- అప్పుడే ఉదయిస్తోన్న సూర్యుడి ఎండ ఆమె ముఖం మీద పడి కాంతి వంతం చేస్తోంది.
అంతా ఒక్క క్షణంలో గుర్తుకొచ్చేసింది.
"మీరెలా వచ్చారు?" అడిగాడామేని.
"నాకు టెలిగ్రామిచ్చాను మీ రంగా, స్వరూప్ లు......వెంటనే బయల్దేరబట్టి బస్ దొరికింది."
టైము ఎనిమిది దాటింది.
అందరూ తనకోసమే చూస్తున్నారు.
మనసు బండబారిపోయినట్లుంది. లేచి బయటకు నడిచాడతను.
* * * *