"ఈశ్వర్ వర్మకు బోలెడు రకాల వ్యాపారాలున్నాయ్. మన ఆంధ్రప్రదేశ్ లోనే చాలా పవర్ పుల్ వ్యక్తీ అనుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో బ్రహ్మాండమైన ఇన్ ఫ్లుయేన్స్ ఉంది. మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నా కేంద్రం ఇంకా మనపట్ల ఉదారంగా వుండటానికి కారణం చాలావరకూ ఈశ్వర్ వర్మగారనే చెప్పుకోవచ్చు. ఈ పట్నంలో కూడా అయన సంస్థలు, అన్నీ అయన చేతికింద వున్నట్లు లెక్కే" త్వరత్వరగా వివరాలు చెప్పాడతను.
సృజన్ కేమీ అంతుబట్టటం లేదు.
"అయన దగ్గరే మీ అన్నయ్య ఉద్యోగం చేయడానికి వచ్చాడని నువ్వెలా అనుకుంటున్నావ్?"
"అన్నయ్య సెట్లో ఒక మందుల స్ట్రిప్ దొరికింది. అందులో పది కాప్యుల్స్ వున్నాయ్. దాని మీద డాక్సీ మైసిన్ విత్ విటమిన్ సి అని రాసి వుంది. వాటిని ఈశ్వర్ ఫార్మానుటికల్స్ వారు తయారుచేశారు"
విశ్వేశ్వరయ్య ఆలోచనలో పడ్డాడు.
"ఒకవేళ వాటిని మీ అన్నయ్య తానే వాడటానికి కొన్నాడేమో"
"ఇంపాజిబుల్ సార్ అలాంటిది కొనాల్సివస్తే వాటిని అంత సీక్రెట్ గా దాచాల్సిన అవసరం లేదు."
"అవును! ఆ మాట కూడా నిజమే"
సృజన్ కాసేపు అతని వంకే చూస్తూ కూర్చుండిపోయాడు.
ఏమీ పాలుపోవటం లేదతనికి. ఎంత ప్రయత్నించినా తన ఒక్కడుగు కూడా ముందుకేళ్ళడం లేదు.
"థాంక్యూ సార్! ఇంకవెళ్తాను-----"
సృజన్ లేచి నిలబడ్డాడు.
"ఏం ఫరవాలేదు . వెల్ కమ్"
సృజన్ తో పాటు భారతి బయటికి వచ్చింది.
"ఇవాళ వెళ్ళి పోతున్నారా?"
"అవును లేకపోతె రేపు నన్ను జైల్లో పడేస్తానని మళ్ళీ బెదిరించారు పోలీసులు.
భారతి ఆశ్చర్యపోయింది.
"మళ్ళీనా?"
"అవును"
"ఎప్పుడది?"
"ఇందాక మీ ఆఫీస్ నుంచి బయటకు రాగానే బయట జీప్ లో నా కోసం ఎదురు చూస్తున్నారు."
"కేవలం ఈ వార్నింగ్ ఇవ్వటానికా?" నమ్మలేనట్లు అడిగిందామె.
"కాదు, నేను ఈశ్వర్ ఫార్మానుటికల్స్ కంపెనీ కెళ్ళి ఏదో గొడవ చేసినట్లు వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చారుట---"
"ఆశ్చర్యంగా ఉంది! వాళ్ళెందుకలా చేసి ఉంటారు?"
"అదే అర్ధం కావడం లేదు"
కొద్ది క్షణాలు ఇద్దరూ మౌనంగా వుండిపోయారు.
"నేను మా ఇంటి కెళ్ళగానే మీ డబ్బు మనియార్డర్ చేస్తాను. మీ ఫ్రెండ్ కిచ్చేయండి."
"అలాగే! కానీ దాని కోసమని ఎక్కువ యిబ్బందులు పడకండి. ఒకవేళ మీరు పంపలేకపోయినా నేను ఆమెను బ్రతిమాలి ఎలాగోలా నేనే మానేజ్ చేసుకుంటాను" ఆప్యాయంగా అందామె.
సృజన్ ఆమె వేపు అభిమానంతో చూసాడు.
"ఇప్పటికే మీరు చేసిన సహాయాలకు ఎంతో ఋణపడిపోయాను భారతిగారు! ఇలాగే అలాంటి పని చేసి ఆ బుణాన్ని పెంచేసుకోవటం నాకు న్యాయం కాదు."
"మళ్ళీ ఎప్పుడొస్తారు?"
"తీలీదు - కానీ తప్పకుండా మిమ్మల్ని చూడ్డానికయినా అప్పుడప్పుడు వస్తుంటాను."
"ప్రామిస్?" చటుక్కున అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.
"ప్రామిస్"
ఆమె ముఖంలో అనందం స్పష్టంగా కనిపిస్తోంది.
"గుడ్ నైట్"
"గుడ్ నైట్"
అతను వచ్చేశాడు. తను చాలా దూరం వచ్చేవరకూ ఆమె గడప లోనే నిలబడి ఉండటం గమనించాడతను.
క్లోక్ రూమ్ లో సూట్ కేస్ తీసుకుని రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. చాలాదూరం నడవటం వల్ల కాళ్ళు కదల్చటానికి వీల్లేనంత నొప్పులు పుడుతున్నాయ్. రైల్లో సీట్లో కూర్చునే వరకూ, అతనికి స్పృహ వుంది. హటాత్తుగా సుభద్ర గొంతు వినిపించిందతనికి. "సృజన్ !సృజన్"
ఆ గొంతు ఎక్కడి నుంచి వినబడుతుందో అర్ధం కావటం లేదతనికి. "వదినా! నేనిక్కడే వున్నా వదినా!" అంటూ ఆమె కోసం వెతకసాగాడతను.
"నాయనా సృజన్ నేను వెళ్ళిపోతున్నా! జాగ్రత్తగా ఉండు"
"వదినా! వదినా! ఎక్కడి కెళ్తున్నావ్? ఎక్కడున్నావ్ నువ్వు"
ఆమె దగ్గరగా ఏడుస్తున్న శబ్దం......
ఎవరో భుజం తట్టేసరికి చటుక్కున నిద్రలోనించి ఉలిక్కిపడి లేచాడు. రైలు హైదరాబాద్ పొలిమేరలు చేరుకుంటోందప్పుడే.
"ఏమిటయ్యా! ఏదో కలువరిస్తున్నావ్?" పక్కనున్నడతను అడిగాడు.
సృజన్ కి నమ్మబుద్ది కావటం లేదు. అది కలంటే కళ్ళ వెంబడి నిజంగానే నీళ్ళు కారుతున్నాయ్. చప్పున కర్చీఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడతను. ఎంత భయంకరమయిన కల.