"ఓహ్ ష్యూర్! తప్పకుండా అవుతుంది! ఇండియాని ఇప్పటివరకు అనేకమంది కొల్లగొట్టారు. మిగిలిందంతా మనం పూడ్చి పారేస్తాం! చివరికి పరిస్థితి ఎట్లా వస్తుందో తెలుసా!
ప్రశ్నార్ధకంగా చూశాడు రాజా.
"నీకు అలహాబాద్ సంగతి తెలిసే వుంటుంది!"
"ఎందుకు తెలియదు?" అన్నాడు రాజా.
"అలహాబాద్ ఇండియాకి ముగ్గురు ప్రధాన మంత్రులని ఇచ్చింది."
"అవును జవహర్లాల్ నెహ్రు, లాల్ బహుద్దూర్ శాస్త్రీ వి,పి. సింగ్" అన్నాడు రాజా.
"అవునా! మీ దేశానికి ముగ్గురు ప్రధాన మంత్రులని ఇచ్చిన అలహాబాద్ నియోజకవర్గానికి దగ్గరలోనే కొన్ని పల్లెలు వున్నాయి. వాటిలో స్పెషాలిట ఏమిటో నీకు తెలుసా!
"ఆ స్పెషాలిటీ "ఏమిటో తెలిసిన రాజా మొహం అవమానంతో ఎర్రబడింది.
అది చూసి విషపునవ్వు నవ్వుతూ అన్నాడు క్లయివు.
మీ దేశానికి ముగ్గురు ప్రధాన మంత్రులని ఇచ్చిన అలహాబాద్ నియోజకవర్గానికి దగ్గరలోనే కొన్ని పల్లెల్లో , దేశానికి స్వాతంత్యం వచ్చి నలబై ఏడేళ్ళ తరువాత ఇప్పుడు జరుగుతున్న ముఖ్య వృత్తి ఏమిటో తెలుసా! వ్యభిచారం! ఆ పల్లెల్లో ప్రజలకి పూట గడిచే దిక్కులేదు. అందుకని ఆ పల్లెల్లో వున్న ప్రతి ఆడదీ వ్యభిచారమే వృత్తిగా పెట్టుకుంటుంది. పల్లెలో వున్న ప్రతి తండ్రి తన కూతుర్ని తారుస్తాడు. ప్రతి భర్త తన భార్యని అంగట్లో బొమ్మలాగా అమ్మకానికి పెడతాడు. రాజా! నా ఆశా, ఆశయం ఏమిటంటే, ఇండియాలో ప్రతి పల్లె ప్రతి పట్నం కూడా ఆ స్థితికి రావాలి. వస్తుంది కూడా! ఇండియా ఆ స్థితికి రావడంలో మీ నాయకుల సామర్ధ్యం కూడా చాలానే వుంటుంది! అన్నాడు పగలబడి నవ్వుతూ.
ఇంక నిగ్రహించుకోలేక పోయాడు రాజా. రాయల్ బెంగాల్ టైగర్ లాగా ఒక్కసారిగా క్లయివు మీదికి లంఘించి అతని గొంతు పట్టుకున్నాడు.
ఇదంతా చూస్తున్న జస్వంతరావు కలవరపడి "రాజా!" అన్నాడు కర్తవ్యం గుర్తు చేస్తున్నట్లు.
క్లయివు మాత్రం మోహంలో ఏ భావం కనబడకుండా నదురూ, బెదురూ లేకుండా చెక్కబొమ్మలాగా కూర్చుని వున్నాడు.
జస్వంతరావు గొంతు వినగానే చప్పున వాస్తవాలు గుర్తుకొచ్చాయి రాజాకి. బట్ ఇటీజ్ టూలేట్! తొందరపడకూడని టైంలో తొందరపడిపోయాడు తను.
సరిదిద్దుకోలేని తప్పు!
ఇంకెలా!
అతనలా అనుకుంటూ ఉండగానే అదృష్టం కొద్ది అతనికో విశేషం కనబడింది.
క్లయివు కాలర్ మీద పాకుతుంది ఎర్రటి టేపు లాగా వున్న కాళ్ళజెర్రి! రాజా చేతులు క్లయివు కాలర్ ని పట్టుకోగానే ఆ కాలర్ మడతలో ఇరుక్కుని చచ్చిపోయింది అది.
"కాళ్ళజెర్రి" అన్నాడు రాజా! ఆ ఒక్క ముక్కులోనే తన హటాత్ చర్యకు ఒక కోణాన్ని ఆపాదిస్తూ.
నెమ్మదిగా లేచి నిలబడి తన కాలర్ ని దులిపి కాళ్ళజేర్రిని కింద పడేశాడు క్లయివు.
"థాంక్స్" అన్నాడు మెకానికల్ గా.
ఇదంతా చూస్తున్న జస్వంతరావు తేలిగ్గా ఉపిరి తీసుకున్నాడు.
క్లయివు లేచి నిలబడుతున్నప్పుడు అతని జేబులోంచి చిన్న నోట్ బుక్ కిందపడింది. ఒంగి దాన్ని అందుకుని దుమ్ము దులిపి దాన్ని రాజాకి కనబడేటట్లు పట్టుకున్నాడు క్లయివు. అతని కళ్ళలో నవ్వు కనబడుతోంది.
"ఇదేమిటో తెలుసా!" అన్నాడు రాజా వైపు చూస్తూ.
"ఏమిటది!" అన్నాడు రాజా.
"నీ జాతకం" అన్నాడు క్లయివు.
"నిజంగా నీ జాతకం! చూస్తావా!" అని నోట్ బుక్ ని రాజాకి అందించాడు క్లయివు.
దాన్ని తెరచి చూశాడు రాజా.
చాలా పాతకాలపు తమిళభాషలో రాసి వుంది మేటరంతా. ఆ తర్వాత పేజీలలో దాని తాలుకు తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వున్నాయి.
"ఎవరు రాసారు ఈ జాతకం!" అన్నాడు రాజా.
"సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే ఈ జాతకం చెప్పారనీ మీ వాళ్ళు అంటారు."
"అంటే........నాడీ గ్రంధాలలో నుంచి తెచ్చిన సమాచారమా ఇది!" అన్నాడు రాజా.
"ఎగ్జాక్ట్ లీ!" అన్నాడు క్లయివు.
భుజాలు ఎగరేశాడు రాజా.
"పార్వతీ పరమేశ్వరులే నిజంగా చెప్పారో లేదో గానీ పూర్వకాలంలో కొంతమంది రుషులు తమ శిష్యులకీ జాతకశాస్త్రం బోధిస్తూ ఇకముందు పుట్టబోయే కొంతమంది జాతకాల నమునాని తమ శిష్యులకి వివరించి వుండవచ్చును. అవే నాడీ గ్రంధాలు అయి వుండవచ్చును" అన్నాడు రాజా.
"మేబీ ......అండ్ మే నాట్ బీ!" అన్నాడు క్లయివు కమిట్ అవకుండా.
"ఏ నాడీ గ్రంధంలో దొరికింది నా జాతకం! దృవనాడా!" అన్నాడు రాజా. "ఎక్కడ దొరికింది! మద్రాసు మైలాపూర్లోనా, తిరుపతి బైరాగి పట్టెడ దగ్గరా! చిదంబరం దగ్గరి వైదీశ్వరన్ కోయిల్ లోనా!
"చిదంబరం దగ్గర వున్న వైదీశ్వరన్ కోయిల్ లోనే" అన్నాడు క్లయివు.
జస్వంతరావు కలుగజేసుకున్నాడు.
"అసలేం జరిగింది ఏమిటి!" అన్నాడు.
చెప్పడం మొదలెట్టాడు క్లయివు.
"మీ దేశంలో మూడనమ్మకాలు అనేకం! మూడనమ్మకాల సంగతి అలా వుంచితే ఇప్పటిదాకా మనవ మేధస్సుకి అందని అద్భుతాలు కూడా మీ దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిలో నాడీ గ్రంధాలని ప్రముఖంగా చెప్పుకోవచ్చును."
జస్వంతరావు సాలోచనగా అన్నాడు.
"మనవ మేధస్సుకి అందని వాటిలో ఈ నాడీ గ్రంధాలని చేర్చడం కరెక్టే. ఎప్పుడో ఎవరో మహా మునులు భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళ జాతకాలు రాసి పెట్టారని అనుకుంటున్నాం మనం. ఆ తాళపత్రగ్రంధాలు కొన్ని కుటుంబలలో మిగిలిపోయాయి. తమిళ ప్రాంతంలో వున్న తాళపత్ర గ్రంధాలు సహజంగానే ప్రాచీన తమిళ భాషలో వుంటున్నాయి. ఆ కుటుంబాల వాళ్ళలో చాలామందికి తెలుగు , ఇంగ్లీషు కూడా తెలిసి ఉంటుంది. తమిళంలో వున్నదానిని తర్జుమా చేసి చెబుతుంటారు" అన్నాడు.
"అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే నేను కనీసం పేరు అయినా చెప్పకుండానే రాజా జాతకాన్ని బయటికి తీసారు" అన్నాడు క్లయివు.
"వేలిముద్ర సాయంతోనా!" ఆన్నాడు రాజా.
"అవును! వేలిముద్ర సాయంతోనే!"
"నా వేలినుద్ర మీ దగ్గరికి ఎలా వచ్చింది?"
"నీ వేలిముద్ర సంపాదించడం అంత కష్టమైనా పనేం కాదుకదా! అన్నాడు క్లయివు మిస్టీరియస్ గా.
"రాజా వేలిముద్రని వైదీశ్వరన్ కోయిల్ లో ఇచ్చావా!" అన్నాడు జస్వంతరావు.
"అవును! వేలిముద్రని చూసీ చూడగానే అక్కడున్న అతను ఒక రిఫరెన్స్ బుక్కులాంటి తాళపత్ర గ్రంధాన్ని తీసుకొచ్చాడు. వేలిముద్రని సరిపోల్చి చూసాడు. ఆ తరువాత అడిగాడు మీ మనిషి పేరు "రా" తో మొదలవుతుందా అని. అవునని చెప్పాను. అతను ఇంకో పేజీ తిప్పాడు. "అతనికి పెళ్ళి కాలేదు కదా!" అన్నాడు. అవునన్నాను. ఇంకో పేజీ తిప్పి అతను రాజవంశానికి చెందినవాడా అని అడిగాడు. అవునన్నాను. ఇలా వివరాలు అన్నీ సరిపోతూ వున్న తరువాత నాడీ గ్రంధం తాలుకు ఆ మనిషి రాజా జాతకం వున్న ఇంకో తాళపత్ర గ్రంధం తెచ్చాడు. అందులో ఇతను ఎవరో, ఇతని భవిష్యత్తు ఏమిటో, ఎవరితో పెళ్ళి అవుతుందో, పిల్లలెంతమంది పుడతారో....... అంతా సవివరంగా రాసి వుంది.
చటుక్కున అడిగాడు జస్వంతరావు.
"రాజా పెళ్ళి ఎవరితో అవుతుంది!"
నుదురు చిట్లించి ఆలోచించాడు క్లయివు.
"ఎవరో మీ హిందూ దేవత పేరు వున్న అమ్మాయి."
నవ్వాడు జస్వంతరావు.
"ఇక్కడ చాలామంది అమ్మాయిలకి హిందూ దేవతల పేర్లే వుంటాయి!"
హటాత్తుగా గుర్తొచ్చినట్లు అన్నాడు క్లయివు.
"ఆ! తమిళ ప్రాంతంతోని ఓ పెద్ద ఆలయంలో వుండే దేవత!"
"కంచి!"
"కాదు!"
"మధుర!"
"యా! మధుర .....మధురలో వుండే దేవత పేరేమిటి!"
"మధుర మీనాక్షి"
"దటీజ్ ఇట్!" అన్నాడు క్లయివు ఎగ్జయిటెడ్ గా "యా! మీనాక్షి! కానీ అక్కడో అడ్డంకి వుంది."
అప్రయత్నంగానే చివుక్కున తల ఎత్తి చూశాడు రాజా.
"రాజా మీనక్షిల రిలేషన్ షిప్ ప్రణయంగా వుండవచ్చును. లేదా ప్రళయంగా కూడా వుండవచ్చును. ప్రణయమైతే పరిణయం, ప్రళయం అయితే........ఇంక చెప్పేదేంలేదు......" అన్నాడు క్లయివు.
క్లయివు చెప్పింది ఇప్పటికే సగం నిజమయినట్లు అనిపించింది రాజాకి.
మీనక్షితో తన అనుబంధం ఒక క్షణంలో ప్రేమ.......మరుక్షణంలో దూరమైపోవడం .......ఘటనా అంటే ఇదేనా! సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయన్న డానికి ఇదో నిదర్శనమా!"