ఈ సోకాల్డు ఆర్ట్ సినిమాల గెడ్డం నిర్మాతలూ, దర్శకులూ -
అసలు వాళ్లవల్లే విదేశాల్లో ఇండియన్ ఇమేజ్ మరింతగా దిగజారిపోతోంది.
మసాలా సినిమాల విజయానికి ఒక చెత్త బాక్సాఫీసు ఫార్ములా ఉన్నట్లే, మన ఆర్ట్ ఫీలిం ల సక్సెస్ కి కూడా "దరిద్రపు ఫార్ములా ఉంది.
"దరిద్రపు ఫార్ములా!" నిజమే! మన దరిద్రాన్ని విదేశీయులకీ చూపించి, వాళ్ళకి గిలిగింతలు పెట్టి సొమ్ము చేసుకోవడం!
రెండర్ధాల డైలాగులూ, ఎక్స్ పోజింగు, పిచ్చి సెంటిమెంట్లు - ఇవన్నీ ఉంటేనే మసాలా సినిమాలు హిట్టయినట్లుగా, మన దేశంలో ఉన్న దరిద్రం, కంపు మురికి వీటన్నింటిని ఆర్టిస్టిక్ గా చూపించగలిగినవాళ్ళకే ఇంటర్నేషనల్ అవార్డులు వస్తాయి.
విదేశీయులు ఇండియాని అలా ఉహించుకుంటారు -
వాళ్ళ ఉహలకి తగ్గట్లు ఇండియాని అలాగే చూపించి అవార్డులు కొట్టేసి, గెడ్డాలు పెంచేసి , మేధావులుగా చెలామణి అయిపోతారు ఈ కేటగిరి నిర్మాతలూ, దర్శకులూ కూడా!
వాళ్ళకి కావాల్సింది అవార్డులు!
ఆ అవార్డులతో బాటు వచ్చే రివార్డులు!
అంతేగాని, దేశం ఎమయిపోతుందో అన్న దుగ్ధ వాళ్ళకి లేడుగాక లేదు!
ఓ ఉరకుక్క తాలూకు గజ్జిపుండు మీద ముసిరిన పురుగులని చూసినట్లు అయిష్టంగా , అసహ్యంగా అక్కడున్న వాళ్ళందరిని చూస్తూ, రాజాని తనవైపు రమ్మని సైగ చేశాడు క్లయివ్.
క్లయివు దగ్గరికి వచ్చాడు రాజా.
తన చేతులతో రోడ్డు రోలర్ ని పక్కకి తోసేయ్యగలిగిన బలశాలి అతను! భైరవన్ లాంటి శాండో కదిలించినా కూడా కదలకుండా ఉండగలిగినవాడు. సింహాన్ని ఒంటిచేత్తో అదుపుచేయ్యగలిగిన ధీశాలి.
అతను తలుచుకుంటే క్లయివుని, జరసందుడిని భీముడు రెండుకాళ్ళు పట్టుకుని విరిచేసినట్లు విరవగలడు!
కానీ క్లయివు కేవలం ఒక వ్యక్తీ!
అతన్ని చంపితే లాభం లేదు.
ఇతని వెనక వున్న శక్తిని మట్టుపెట్టాలంటే క్లయివుతో కలిసి కొన్నాళ్ళపాటు ఈ దొంగనాటకం ఆడక తప్పదు.
పాలెస్ లాన్స్లోనే ఒకచోట పెద్ద రంగురంగుల గొడుగు అరేంజ్ చేసి వుంది. దాని నీడలో తెల్లటి పెయింట్ వేసిన నగిషి ఇనుపకుర్చీ, గ్లాస్ టాప్ టేబులు ఉన్నాయి.
అక్కడికివెళ్ళి కూర్చున్నారు ఇద్దరూ.
"వాట్ న్యూస్?" అన్నాడు రాజా, లేని ఉత్సాహం తెచ్చుకుంటూ -
"ప్లెంటీ! మీ పురాణాలు చాలా చదివాను నేను! యాదవకులంలో ముసలం పుట్టిందంటారే - అలా ఇప్పుడు ఇండియాని సర్వనాశనం చేయడానికే మీ వాళ్ళలో కులగజ్జి భలే పెరిగిపోతుంది! ఇది మన డివైడ్ అండ్ రూల్ పాలసీకి చాలా మంచిదే!" అన్నాడు క్లయివు ఆనందంగా.
కోపాన్ని తొక్కిపట్టి , పెదిమలు బిగపెట్టి వింటున్నాడు రాజా.
క్లయివు కులాసాగా అన్నాడు.
"ఇండియాకి స్వాతంత్రం వచ్చాక ఇక్కడి జనం ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు చస్తారని ప్రపంచానికంతా ముందే తెలుసు! అయితే నలభై ఏళ్ళకే ఈ స్థితి వస్తుందని మాత్రం చాలామంది ఉహించలేదు!" అని అంతలోనే ఇంకేదో గుర్తొచ్చినట్లు నవ్వాడు క్లయివు.
"ఏమిటి?" అన్నాడు రాజా.
బాక్ వార్డ్ నెస్ - వెనకబడినతనం అంటే మీ వాళ్ళకి ఎంత మోజో అని తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది" అన్నాడు క్లయివు.
నుదురు చిట్లించి చూశాడు రాజా.
నవ్వాపుకుంటూ అన్నాడు క్లయివు.
"మనం ఇరవైఒకటో శతాబ్దంలోకి అడుగు పెడుతున్నాం .......నో నో నో .......మనం అనిచెప్పి మీ ఇండియన్సుని కూడా మాతో సమానం చేసి మాట్లాడం చాలా తప్పు . మేము ఇరవై ఒకటో శతాబ్దంలోకి ప్రవేశిస్తున్నాం - మరి మీరేమో మహా వేగంతో చీకటి మధ్యయుగాలలోకి వెళ్ళిపోతున్నారు. మా వాళ్ళు ఎలక్ట్రిసిటి కనిపెట్టారు - టేలిఫోన్ లు కనిపెట్టారు - అణువును బద్దలు చేశారు. అంతరిక్షయానాలు చేస్తున్నారు - లేబొరేటరీలలో కృత్రిమంగా ప్రాణాన్ని సృష్టించడానికి సిద్దంగా ఉన్నారు - ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టికి ప్రతి సృష్టి చెయ్యడానికి కూడా సర్వ సన్నద్ధంగా ఉన్నారు మావాళ్ళు. కానీ మీరో!" అని మళ్ళీ అపహాస్యంగా నవ్వాడు క్లయివు. "మీ ఇండియాలో ప్రతివాళ్ళ కోరికా ఏమిటంటే , మేం వెనకబడిపోతాం! మమ్మల్ని వెనకబడినవాళ్ళుగా గుర్తించండి" అని అవునా? వెనుకబడినతనం అంటే సిగ్గుపడడం పోయి ఆ వెనుకబడి ఉండడమే అదొక క్వాలిఫికేషన్ గా భావించడం కామన్ అయిపొయింది మీ దేశ జనాభాలో చాలా మందికి!" అని కాసేపు ఆగాడు క్లయివు.
తర్వాత మళ్ళీ అన్నాడు క్లయివు.
"అలా అయిపొయింది మీ దేశపరిస్థితి" కానీ ఇప్పటికి కూడా మేము వెనుకబడ్డవాళ్ళం అని చెప్పుకోవడానికి రిజర్వేషన్ ఉద్యోగాలకి ఇష్టబడని వర్గాలు మీలో రెండే వున్నాయి."
"తెలుసు! ఆంగ్లో ఇండియన్స్ - పార్సీలు" అన్నాడు రాజా ముక్తసరిగా.
"యా! మీ దేశంలో ఈ రెండు వర్గాలు మాత్రమే చాలా పౌరుషంగా చెప్పుకుంటాయి - మేము చాలా ముందున్న వాళ్ళం! మాకు ఎవ్వరి దయాధర్మాలు, ఏ రిజర్వేషన్లు అక్కర్లేదని! ఆంగ్లో ఇండియన్ ల నాయకుడు ఫ్రాంక్ ఆంధోనీ తన జీవితంలో చెబుతూనే ఉండేవాడు. తమ కోసం రిజర్వేషన్లు పెట్టడం అంటే తమ డిగ్నిటీ కి భంగం కలిగించడమే అని! అలాగే పార్సీలు - పార్సీలు కూడా అందరూ అన్నటిని స్వయంకృషితోనే సాధిస్తారు. ఏ రంగంలో చూసినా టాప్ లెవల్లో కనీసం ఒక్క ఫార్సీ అన్నా ఉంటాడు - తమాషా ఏమిటంటే - మీ ఎనభై కోట్ల జనాభాలో పార్సిల సంఖ్య ఎనభై వేలు కూడా ఉండదు - ఆంగ్లో ఇండియన్స్ ఇంతే - అయితే కేవలం ఆంగ్లో ఇండియన్సు, పార్సీలు మాత్రమే ఇంత పౌరుషంగా ఎందుకు ఉంటున్నారో తెలుసా?" అన్నాడు క్లయివు.
ఎందుకన్నట్లు చూశాడు రాజా.
"వాళ్ళకి అంత పౌరుషం ఎందుకంటే ఆంగ్లో ఇండియన్ లలో ఇంగ్లీషు రక్తం ఉంది. పార్సీలు ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు - అందుకే వాళ్ళకి అంత ఆత్మాభిమానం!" అన్నాడు క్లయివు. మీ ఇండియన్స్ లో ఆత్మాభిమానం హుళక్కి!......అనే అర్ధాన్ని అందులోనే పలికిస్తూ.
రాజా ఏదో అనేలోగానే ,
ప్రపంచంలోని విషాదమంతా తన మొహంలోనే గూడు కట్టుకుని ఉన్నట్లు కనబడుతున్న జస్వంతరావు అక్కడికి వచ్చాడు.
ఇండియాలోని కులాల లుకలుకలని గురించి అసహ్యంగా చెబుతున్న క్లయివు కాసేపు కుర్చీలో విశ్రాంతిగా వెనక్కి వాలి, చేతులు తల వెనక పెట్టుకుని, అర్ధానిమీలిత నేత్రాలతో అలాగే వుండిపోయాడు.
అతనివైపు పరిశీలనగా చూశాడు రాజా.
భవిష్యత్తులో భారతదేశం కులమత వర్గ వైషమ్యంతో చిన్నాభిన్నమయిపోయే దృశ్యాలని తన మనోఫలకం మీద ప్రాజెక్ట్ చేసుకుని అనందిస్తున్నాడా ఈ క్లయివు! ఈ విదేశీయుడు!
"అవును! దాదాపు అలాంటిదే!" అన్నాడు క్లయివు రాజా మనసులోని భావాలని తను చదివేస్తున్నట్లుగా.
"రాజా! రువాండాలోని డెవలప్ మెంట్స్ ఫాలో అవుతున్నావా నువ్వు"
"ఆ అఫికన్ కంట్రీ చాలా దయనీయమైన స్థితిలో వుంది" అన్నాడు రాజా ఉద్విగ్నంగా.
"నిజమే! అక్కడ మెజారిటీ తెగ హుటులు, మైనారిటీ తెగ టుట్సీలు. వాళ్ళకి వాళ్ళకి మధ్య ఇక్కడ మీ ఇండియన్స్ కి వున్నట్లే భాషా, సాంస్కృతిక, వర్గవైషమ్యాలు వున్నాయి. రువాండాకి ప్రెసిడెంట్ జూవేనల్ హబ్యారిమానా ఓ ప్లేన్ క్రాష్ లో చనిపోవడంతో ఇంక ఈ రెండు తేగల మధ్యా కార్పణ్యం కట్టలు తెగిపోయింది. పరమ కిరాతకంగా ప్రజలని చంపడం జరుగుతోంది. తుపాకులు దొరక్కపోతే కత్తులతో, కొడవళ్ళతో కూడా ఒక్కళ్ళని ఒకళ్ళు నరుక్కుంటున్నరు. శులారోహాణం చేయించి ఒక్కసారిగా పదిమంది పసిపాపలని గుచ్చి చంపుతున్నారు. ఆయుధాలు ఏమీ దొరకని వాళ్ళు గొంతులు పిసుక్కుని ఒకళ్ళని ఒకళ్ళు చంపుకుంటూన్నారు. మీ దేశంలో ఇప్పుడు జరుగుతున్న కులవైషమ్యలు ఇండియాని కూడా అతి త్వరలోనే రువాండాలాగా చేసేస్తాయి. అది తప్పదు! ఆ రోజు ఎంతో దూరంలో లేదు. కొన్నాళ్ళ తరువాత ఇక్కడ కూడా రువండాలాగా ప్రజల దోవన ప్రజలు కొట్టుకు చస్తుంటారు. మనమేమో మన దోవన మనం దేశాన్ని దోచుకుంటాం! వాట్ సే యూ!" అన్నాడు క్లయివు.
తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టమైపోతుంది రాజాకి. అయినా తప్పదు. మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. ఈ ఒక్క వ్యక్తిని నిర్మూలించడం వల్ల ఈ మహా సమస్యకి పరిష్కారం దొరకడు. వ్యక్తిని కాదు, ఇతని వెనక వున్న శక్తినే నిర్వీర్యం చేయాలి. అందుకుగానూ తను ప్రస్తుతం ఓపిక పట్టాలి. చిన్నప్పుడు విశ్వనాధం మేష్టారు గారు నేర్పించిన దేశభక్తి గీతం ఒకటి గుర్తు వచ్చింది. అందరిలాగా క్లాస్ రూం లో పాఠం చెప్పేవారు కాదు అయన. స్కూల్ కాంపౌండ్ వాల్ దగ్గరున్న పెద్ద చెట్టుకింద పిల్లలని కూర్చోబెట్టి పాతకాలపు గురుకులం వాతావరణం సృష్టించి పాఠాలు చెప్పేవారు. పాటలు పాడించేవారు. అందులో ఒకటి........
".........కులము మత సంకుచిత భావము
లలమనీయక మానసమ్మున
కలలుగాంచిన భరతఖండము
గాగా భారతభూమి చేయగా
భారతీయ కుమార వీర ప్రతిన గైకొనరా!"
ఏవీ! ఇప్పుడలాంటి ఉదాత్తమైన సెంటిమెంట్స్! ఎవరిలోనూ ఎక్కడా కనబడదెం!
సన్నగా విజిలేయడం మొదలు పెట్టాడు క్లయివు, అన్నివైపులా ఒకసారి పరికించి చూశాడు.
అతని కళ్ళకి అక్కడే వున్న ఒక పులి కనబడింది. నటరాజన్ యూనిట్ తాలూకు సినిమా పులి అది!
"ఓహ్! టైగర్! మై ఫేవరేట్ యానిమల్! అన్నాడు క్లయివు ఎగ్జయిటేడ్ గా. ఆ వాక్యం ముగియకుండానే మళ్ళీ అతనే అన్నాడు. "పులి ఎముకలతో చేసిన మందులకి మీ తూర్పు దేశాలలో మంచి గిరాకీ వుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పులి ఎముకలకి కిలోకి యాభై వేల రూపాయల చొప్పున గిట్టుబాటు అవుతుంది. నేను యావరేజ్ ణ సంవత్సరానికి ఐదొందల పులులని చంపించి, కావాల్సిన వాళ్ళకి సప్లయి చేస్తుంటారు. అయితే ఇంకేన్నాళ్ళు లే! నువ్వు ఇండియాకి రాజైపొతే నేను ఆటోమేటిక్ గా రెసిడెంట్ నయిపోతా! అప్పుడింక ఈ చిల్లర వ్యాపారాల జోలికి వెళ్ళనక్కరలేదు. నీ ఖజానా తాళానికి డూప్లికేట్ ఒకటి ఎప్పుడూ నా దగ్గరే వుంటుంది! అవునా!" అన్నాడు పెద్దగా నవ్వుతూ.
"నీ ప్లాన్ సక్సస్ అవుతుందని నమ్మకం నీకు వుందా!" అన్నాడు రాజా.