క్లయివు చెబుతూనే వున్నాడు.
నాడీ గ్రంధంలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే గతం, వర్తమానం, భవిష్యత్తు మాత్రమే గాక గత జన్మ గురించి , ముందు పుట్టబోయే జన్మల గురించి కూడా చెప్పగలగడం! అయితే ఇక్కడే ఇంకో చిక్కుముడి వుంది." అన్నాడు క్లయివు.
"ఏమిటి!" అన్నాడు జస్వంతరావు.
"ఈ జాతకుడు మధుర మీనాక్షి పేరుతొ వున్న ఆ పిల్లని పెళ్ళి చేసుకుంటే ఇంక వీళ్ళిద్దరికి ఇదే చివరి జన్మ. ఆ తరువాత మోక్షమే. చేసుకోలేకపోతారా...........చేసుకునేదాకా జన్మలు ఎత్తక తప్పదట" అన్నాడు క్లయివు.
చురుగ్గా చూశాడు రాజా.
క్లయివు మళ్ళీ అన్నాడు.
"రాజా! అన్నిటికంటే అద్భుతం ఏమిటంటే నాడీ గ్రంధాలలో రాసి వున్న నీ గత జన్మ వృత్తాంతం! గత జన్మలో నీ వెవరో తెలుసా?"
"నాకెలా తెలుస్తుంది!" అన్నాడు రాజా నవ్వుతూ,
"కుర్చీలో సరిగ్గా కూర్చో. లేకపోతే కిందపదిపోతావ్. అంతటి చండప్రచండమైన విశేషం ఇది. నాడీ గ్రంధం ప్రకారం గత జన్మలో నువ్వేవరంటే ........" అని చెప్పడం మొదలెట్టాడు క్లయివు.
క్లయివు అలా చెబుతుంటే,
జస్వంతరావు కూడా ఆసక్తిగా ముందుకి వంగి వింటున్నాడు. చాలా సీరియస్ గా చూస్తున్నాడు రాజా.
క్లయివు అన్నాడు.
"గత జన్మలో రాజా ఎవరంటే ........
"ఎవరు!" అన్నాడు జస్వంతరావు ఉద్వేగంగా.
"గత జన్మలో రాజా భరతుడు."
"వ్వాట్! అన్నాడు జస్వంతరావు పెద్దగా.
"యా! రాజా భరతుడే గత జన్మలో! మీరు గనక మీ నాడీ గ్రంధాన్ని నమ్మితే!"
కాసేపు రాజా, జస్వంతరావు ఏమి మాట్లాడకుండా ఉండిపోయారు.
ఆ తరువాత క్లయివే మళ్ళీ అన్నాడు.
"ఇది చాలా ఎక్స్ ప్లోజిన్ ఇన్ ఫర్మేషన్! పైగా మీ ఇండియన్ సెంటిమెంట్లకి ఇది బాగా దగ్గరవుతుంది! మన ప్లాన్స్ కి బాగా పనికి వస్తుంది కూడా! రాజా గత జన్మలో భరతుడు. అలా చెబుతున్నది మీ నాడీ శాస్త్రం. అంటే ఈ భరత ఖండానికి ఇప్పుడింక రాజానే వారసుడన్నమాట! మీ దేశంలో వారసత్వానికి ఉన్నంత ప్రాముఖ్యం ఇంక దేనికి లేదు గదా. నువ్వు భరతుడికి వారసుడివి కాదు. నువ్వే భరతుడివి. వాడిలో ఏమని రాసి ఉందో తెలుసా! ఇతడు భరతుడి అంశతో జన్మించిన వాడు. కాదు కాదు! ఇతడే భరతుడు అని! మీ రుషులు నిన్ను భరతుడి అంశతో పుట్టిన వాడివని చెప్పి మరుక్షణంలోనే సవరించుకుని ఇతడు భరతుడి అంశంతో పుట్టినవాడు కాదు. ఇతడే సాక్షాత్తూ భరతుడిని తేల్చారు. రాదర్ ఫాంటాస్టిక్! నో!
మౌనంగా వింటున్నాడు రాజా .
అతనికి అనిపిస్తోంది ఈ క్లయివ్ ఇంటర్నేషనల్ క్రూక్. ఇతను చెబుతున్నది నిజమేనా!
నాడీ గ్రంధాలే అసలు నిజమా కాదా అన్న ప్రశ్న ఒకటి వుంటే అందులోనూ ఈ క్లయివు చెప్పేది అసలు నిజమో కాదో అసలే తెలియదు.
టైమ్ వున్నప్పుడు దానిని గురించి తీరికగా కూపీ లాగుతాడు తాను. కానీ ప్రస్తుతానికి మాత్రం....
జస్ట్ ప్లే ఎలాంగ్! ఎలా ఆడిస్తే అలా ఆడాలి. కనీసం ఆడుతున్నట్లు నటించాలి. అదే తన స్ట్రాటజీ!
తప్పదు!
క్లయివు అన్నాడు.
"వారసత్వానికి గులాములు కావడం అనేది మీ జాతిలో వున్న గొప్ప అవలక్షణం. ఇది మరీ ముఖ్యంగా పాలిటేక్స్ లో కనబడుతుంది. ఓ తండ్రి కనక మినిస్ట్రరయితే అతని కొడుకు ఎమ్మెల్యే కాక తప్పదు .........పవర్ లోకి వచ్చాక తన అబ్బాయి, తన అమ్మాయి , తన భార్య, తన తల్లి, తన అల్లుడు - ఇలా తన వాళ్ళందరూ పవర్ లోకి ఎక్కక పొతే పెద్దవాళ్ళకి తోచదు. మా దేశాల్లో ఒకడికి ఓటు వేశామంటే వాడొక్కడే ఎన్నిక అయి పవర లోకి వస్తాడు. మీ దేశంలో అలా కాదు. మీరు ఒక్కడికి ఓటు వేస్తె అనధికారంగా అతని కుటుంబం అంతా కూడా పవర్ లోకి వచ్చేస్తుంది. మీరు ఒకడిని కుర్చీలో కూర్చోబెడితే ఆ ఇంట్లో అడంగులతో సహా అందరూ నిర్లజ్జగా అదే కుర్చీలో ఇరుక్కుని కూర్చుని మీ మీద అధికారం చెలాయిస్తారు. దానిని మీరు నిస్సిగ్గుగా భరిస్తారు కూడా. ఓ అమెరికన్ ప్రెసిడెంటు వున్నాడనుకో. అతను రెండు టర్మ్స్ కంటే ఎక్కువసార్లు ఆ పదవిలో వుండడానికి వీల్లేదు కానీ, మీ ఇండియన్స్ లో ఒకడు పదవి కేక్కడంటే ఇంక దాన్ని చచ్చేదాకా వదల్దు. పదవిలో వున్న ఒకడు చస్తే తక్షణం అతని ప్లేస్ లోకి అతని భార్యనో, కొడుకునో తెచ్చేస్తారు మీరు. తరతరాల బానిసత్వం నరనరాల్లో జీర్ణించుకుపోయింది మీకు!"
"కరక్టే" అన్నాడు జస్వంతరావు.
"ఈ లెక్కన ఇంకో ఒకటి రెండుతరాలు గడిచేటప్పటికి అప్పటి రాజకీయాల్లో ఉండేవాళ్ళందరూ కూడా ఇప్పుడున్న వాళ్ళ తాలూకు వారసులో, బందువులో అయి వుంటారు. మాములు ప్రజలకి ఇంక రాజకీయాల్లో వచ్చే ఆస్కారం వుండదు" ఆన్నాడు.
సంతోషం లేకుండా నవ్వాడు రాజా.
"డాక్టరేట్ కోసం రిసెర్చ్ చేసే వాళ్ళుంటారే వాళ్ళు అర్ధం పర్ధం లేని సబ్జెక్టుల మీద రిసెర్చి చేయటానికి బదులు వాళ్ళల్లో ఏ ఒక్కడైనా "స్వతంత్య భారత రాజకీయాల్లో వారసత్వపు కంపు! మినిస్టర్ల కొడుకుల్లో ఎంతమంది వారసత్వపు హక్కుతో మినిస్టర్లు అవుతున్నాడు!" అన్న విషయాన్ని విశ్లేషిస్తే చాలా మంచి రిసెర్చి సబ్జెక్టు అవుతుంది" అన్నాడు.
అవునన్నట్లు తల పంకించాడు జస్వంతరావు.
"టాలెంటు వున్నచోట మినహాయింపులు తప్పవు. ఒక రాజకీయ నాయకుడికి బంధువు అయినంత మాత్రాన, రాజకీయాల్లోకి రాకుండా బహిష్కరించాలనడం సబబుకాదు గానీ ప్రతివాళ్ళు అదే వాదనని అడ్డం పెట్టుకుని పదవులకి ఎగబడడం మాత్రం పెద్ద క్రైంమే.
"ఆ మాట మీ దేశంలో ఎంతమందికి అర్ధం అవుతుందీ!" అని వాచ్ చూసుకున్నాడు క్లయివ్.
"ఒకే! నేను వస్తా. ఇంక ఈ భరతఖండాన్ని మీ భరతుడికి అప్పగించే ప్రయత్నంలో నేను వుండాలి" అంటూ చటుక్కున లేచి నిలబడ్డాడు.
జస్వంతరావుకి, రాజాకి మెకానికల్ గా షేక్ హాండ్ ఇచ్చి చకచకా నడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
గేటుదాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు క్లయివు!
రాజా దగ్గర అయేషా నిలబడి ఏదో చెబుతుంది. ఆమె నిలబడ్డ భంగిమవల్లో, మరెందువల్లో గానీ ఆమెలో రాజా పట్ల వున్న కృతజ్ఞభావం కనబడుతోంది.
ఆప్రయత్నంగానే క్లయివు ఎడమచెయ్యి అతని కాలర్ మీదికి పోయింది. విషపు పురుగులాంటి అతి సన్నని చిరునవ్వు అతని పెదిమల మీద మెరిసింది.
కాకతాళీయంగా కాళ్ళజెర్రి నా కలర్ మీద కనబడినంత మాత్రానా నువ్వు నా మీద చెయ్యి ఎత్తడానికి కారణమేమిటో అర్ధం చేసుకోలేనంతటి మూర్ఖుడిని అనుకుంటున్నావా రాజా! నామీద చెయ్యి ఎత్తడమంటే ఆ చేత్తోనే నీ మరణశాసనం నువ్వే రాసుకున్నట్లు అవుతుంది గుర్తు పెట్టుకో అని మనసులోనే అనుకుని, చరచర వెళ్ళిపోయాడు.
* * *
"మీ ఋణం ఎలా తిర్చుకోనూ! మరీ పెద్ద పెద్ద మాటల్లో చెబితే అది సినిమా డైలాగుల్లా వినబడుతాయేమో!" అంది అయేషా. ఆమె కళ్ళు ఆర్ద్రతతో మెరుస్తున్నాయి.
చిన్నగా నవ్వాడు రాజా .
"నా దేముంది ! అంతా దేవుడి దయ!"
"కానీ దేవుడు మీ రూపంలో వచ్చి నన్ను రక్షించాడు."
"మీ ఇష్టం అలాగే అనుకోండి."
"ఇవాళ రాత్రి మనిద్దరం కలిసి డిన్నర్ ఎందుకు తీసుకోకూడదు!" అంది అయేషా.
జస్వంతరావు , అయేషా వైపూ , రాజా వైపూ చాలా ప్రసన్నంగా చూస్తున్నాడు.
జస్వంతరావుకి తెలుసు.
అయేషా తండ్రి ఒక లుచ్ఛా కావచ్చు.
ఈ అయేషాకి తను అందగత్తెననే అహంకారం కాస్త ఎక్కువ మోతాదులోనే వుండవచ్చును కూడా!
కానీ,
మొతానికి అయేషా మంచి పిల్లే. సద్గుణరావుది చాలా ఉత్తమ వంశం! కొన్ని తరాల క్రితం వాళ్ళు రాజా విక్రమదేవరావు ఫ్యామిలితో సమాన స్థాయిలో బతికినవాళ్ళే.
రాజా అందగాడు! అయేషా అందగత్తె!
ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చిలకా గోరింకల్లా వుంటారు నిజంగా!
కానీ-
ఈ క్లయివ్ చెప్పిన నాడీ జాతకం , దాని ప్రకారం రాజా మీనాక్షిని పెళ్ళాడే అవకాశాలు వుండడం అదంతా నిజం కాకపొతే ఎంత బావుండు.
నిజం కాకపోవడానికి "బిల్డ్ ఇన్ క్లాజు" ఒకటి రాజా జాతకంలోనే వుందని చెబుతున్నారుగా మీనాక్షికి, రాజాకి పెళ్ళి కావడానికి అనేకమైన అడ్డంకులు వుండొచ్చని!
ఆ అడ్డంకి అయేషానే ఎందుకు కాకూడదు.
అయేషా తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల!
రాజాకి మంచి జోడి!
రాణీ కాదగ్గ అర్హతలు వున్న అమ్మాయి!
వాళ్ళిద్దరిని కలపడానికి తన మంత్రాంగం ఉపయోగపడాలి.
ఏదో ఒక ఎత్తు వెయ్యాలి తను.
రాజా, అయేషా!
విన్నింగ్ కాంబినేషన్!
;లెటజ్ సీ! లెటజ్ సీ!
నవ్వుకుని ఆ పడుచు జంట మధ్యన తను వుండడం భావ్యం కాదని భావించి పక్కకి వెళ్ళిపోయాడు.
అయేషా అంటోంది.
"మనిద్దరం మూన్ లైట్ లో ప్రైవేట్ డిన్నర్ తీసుకుంటే బావుంటుంది. వాట్ డూ యూ సే! వెరీ ప్రైవేట్ డిన్నర్!
"నేను ఏ క్షణంలో ఎక్కడ వుంటానో నాకే తెలియదు!" అన్నాడు రాజా ముక్తరిగా.
"రాత్రికి మాత్రం ఇక్కడే ఈ పాలెస్ లోనే వుంటారు. తప్పదు. వుండండి. భీంసెయిన్ వస్తున్నాడు. అతను మనకోసం రాత్రికి ఏమేం స్పెషల్ చెయ్యగలడో కనుక్కుందాం!" అని భీం సెయిన్!" అని పిలిచింది.
దగ్గరికి వచ్చాడు భీంసెయిన్.
అయేషా బీంసెయిన్ ఏమీ అనడానికి అవకాశం ఇవ్వకుండా టాపిక్ మార్చేస్తూ తనే అన్నాడు రాజా.
భీం సెయిన్! నీకు లక్నో పప్పు చెయ్యడం వచ్చా?"
తక్షణం భీంసెయిన్ ముఖం వికసించింది. ఆనందంగా నవ్వాడు అతను.
"మీరు గత కాలంలో లక్నో లోని హకీం బందామహదీ మర్ హోమ్ ఇంట్లో చేసే పప్పు గురించి చెప్తున్నారా ఏం!" అన్నాడు సంబరంగా.
"ఆహా! అక్షరాలా ఆయనగారి ఇంట్లో చేసే వంటకాల గురించే చెబుతున్నా!" అన్నాడు రాజా.
అయేషా టెన్నిస్ ప్రేక్షకురాలిలా వాళ్ళిద్దరిని తల తిప్పి మర్చి మార్చి చూస్తోంది.
"హకీం సాబ్ ఒక ఉస్తాద్ కి విందు భోజనం పెట్టి శ్రుంగభంగం చేశాడు. అదేనా మీ మనసులో వున్నది" అన్నాడు భీంసెయిన్.
"అదే అదే" అన్నాడు రాజా.
"విందుకి వచ్చిన ఆ ఉస్తాద్ ప్రతిరోజూ పొద్దున్నే ఇరవై శేర్ల పాలు తాగేవాడు. ఆ తరువాత రెండున్నర శేర్ల బాదం, పిస్తా పప్పులు తినేవాడు. మధ్యాహ్నం సాయంత్రం కూడా రెండున్నర శేర్ల పిండితో రొట్టెలు చేయించుకు తినేవాడు. మళ్ళీ మధ్యలో ఒక పూర్తీ మేకపోతుని స్వాహా చేసేవాడు. అతగాడి పరాభవం సంగతేనా మీ మనసులో వుంది?"
"అవునయ్యా అవును!" అన్నాడు రాజా.
"ఈ రోజుల్లో కూడా ఆ ఉస్తాద్ లాంటి వాడేవరన్నా వున్నారా సర్!"
"ఉన్నడనుకోరాదు?"
"ఆ తెలిసెన్! భైరవన్!" అన్నాడు భీంసెయిన్ ఉత్సాహం పట్టలేక.
"మరింకేం! పరుగెత్తి వెళ్ళి పప్పు తయారు చెయ్" అన్నాడు రాజా మరింత ఉత్సాహపరుస్తూ.
చెంగున గెంతి పాకశాల వైపు పరుగెత్తాడు భీంసెయిన్.