"వద్దండీ! ఇంట్లో అమ్మాయి ఒక్కతే వుంది" అంది చిన్మయి మొహమాట పడుతూ.
"ఎంతసేపూ కారులో? ఆ ఇల్లు మేము కొనేసుకున్నాము. మీరు తప్పకుండా రావాలి. మళ్ళీ మీ యింటికి కారులో పంపించేస్తాను" అని ఆమె మాట వినిపించుకోకుండా డ్రైవర్ని పిలిచి చిన్మయి కొన్న ప్యాకింగ్స్ కారులో పెట్టించేసింది.
చిన్మయికి తప్పలేదు.
ఓ ఇరవై నిముషాల తర్వాత ఆనంద వాళ్ళ ఇంటిముందు కారాగింది.
కారులో కూర్చున్నంతసేపూ గడగడ మాట్లాడుతూనే వుంది ఆనంద.
తనగురించి ఎక్కడడుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ వుంది చిన్మయి. కాని ఏ కళనుందో ఆ సంగతి ప్రస్తావనకు తీసుకురాలేదు.
ఆనంద ఆమెను ఇంట్లోకి తీసుకెళ్ళింది. వాళ్ళు కొనుక్కున్నాక చాలావరకూ రీ మోడల్ చేసుకున్నారు. ఆ ఇంట్లో ప్రతి అణువులో ప్రతి అంచులో రిచ్ నెస్ కనబడుతోంది.
ఫ్రిజ్ లోంచి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి యిచ్చింది.
"ఇంత ఇల్లుందా! ఏంలాభం? ఒక్కక్షణం ప్రాణానికి సుఖం లేదు. పిల్లలా పుట్టకపోయె. పోనీ నా మొగుడిలో మార్పేధైనా వచ్చిందా అంటే అదీలేదు. ఇంత వయసొచ్చినా ఆ శోకిలా వేషాలూ, తిరుగుళ్ళూ, రాత్రుళ్ళు ఇంటి కాలస్యంగా రావటాలూ, ఎంత తిట్టినా, దెబ్బలాడినా దారిలోకి రాందే. నేను కాబట్టి ఇలాంటి మొగుడితో కాపురం చేస్తున్నానుగాని యింకోతైతే ఎప్పుడో ఉరేసుకుని చచ్చేది. అప్పటికి రెండుసార్లు అసహ్యమేసి పుట్టింటికి వెళ్లిపోయా. ఈ ముండాకొడుకు మళ్ళీవచ్చి కాళ్ళా వేళ్ళాపడి దేవిరించాడు. పోనీకదా అని వస్తే మళ్ళీ ఇదే తంతు. చూస్తున్నా, చూస్తున్నా ప్రాణం విసిగొచ్చిందంటే ఎప్పుడో విడాకులిచ్చి పారేస్తా..."
కంకరరాళ్ళు...
అక్కడో పావుగంటకంటే కూర్చోలేకపోయింది.
"ఇంట్లో కిరణ్ ఒక్కతే వుంది. వస్తానండి" అంటూ బయల్దేరింది.
"వస్తూ వుండండి. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. అసలు మీ గురించి అడగనేలేదు."
"ఈసారి మాట్లాడుతానులెండి" అంటూ చిన్మయి బయటికొచ్చింది.
కారులో ఎక్కబోతూండగా ప్రక్కనించి ఓ గొంతు వినిపించింది.
"ఇదేమిటి? చిన్మయిగారా?"
తల ప్రక్కకి తిప్పి చూసేసరికి మంజుభార్గవి నిలబడివుంది.
"మీరా? కాదా అని చూస్తున్నాను. అదేమిటి మా యింటికి రాకుండా వెళ్లిపోతున్నారేం?" అంటూ దగ్గరకొచ్చింది.
"అనుకోకుండా వచ్చానండీ. ఆలస్యమైపోతుందనీ..."
"ఒక్కనిముషం ప్లీజ్" అంటూ మంజుభార్గవి భుజంమీద ఆప్యాయంగా చెయ్యివేసి లోపలకు తీసుకెళ్ళింది.
మంజుభార్గవి కూడా మునుపటికన్నా వళ్ళు వచ్చింది గాని అందంగా, హుందాగా వుంది. మొహం ఓ రకం కళతో వెలిగిపోతోంది.
చిన్మయికి మంజుభార్గవి వెంట లోపలకు వెళ్ళక తప్పలేదు.
మంజుభార్గవి చాలా ఆప్యాయంగా మాట్లాడింది.
ఆమెలో మొదట్నుంచీ వున్న విశేషమదే. మనిషిలో కొన్ని లోపాలుంటే వుండవచ్చుగాక కాని ఇతరుల్నెప్పుడూ కించపరిచి మాట్లాడడు. ఎవరిమీదా ద్వేషం పెంచుకోదు. పరిచయస్థులెవరు కనిపించినా నోరారా పలకరించి, మనసారా మాట్లాడుతుంది.
"చిన్మయిగారూ! మీరు కష్టపెట్టుకోనంటే ఒకప్రశ్న అడగనా?" అంది మంజుభార్గవి.
చిన్మయి "ఫర్వాలేదు అడగండి" అన్నట్లు చూసింది.
"ఇలా ఎందుకు జరిగింది?"
ఆమె దేన్నిగురించి అడుగుతోందో అర్ధం చేసుకుంది. ఆమెకా టాపిక్ మాట్లాడటం ఇష్టంలేదు. అయినా అడిగిన తీరునుబట్టి ఎందుకో... ఏమీ కష్టం కలగలేదు.
"నాకు తెలీకుండా నా జీవితం స్లిప్ అయిపోయింది." చాలా డైరెక్టుగా తడబాటులేకుండా చెప్పింది.
మంజుభార్గవి మొహంలో చాలా వ్యాకులపాటు కనిపించింది.
"చిన్మయిగారూ! మీరంటే నాకెంతో గౌరవం. మీలాంటి ఆడవాళ్ళు ఈ కాలంలో చాలా అరుదుగా వుంటారు. మీ జీవితంలో యిలాంటి మలుపు వచ్చిందని విన్నప్పుడు మొదటిసారి ఆ షాక్ తట్టుకోలేక ఏడ్చేశాను. రాజీవ్ గారి దగ్గరకెళ్ళి దెబ్బలాడి మిమ్మల్నిద్దర్నీ ఒకటి చేద్దామనుకున్నాను. కాని మీ వ్యక్తిత్వం నాకు తెలుసు. అందుకని భయపడి వూరుకున్నాను."
గతమంతా భవిష్యత్ లోకి పొంగినట్లు చిన్మయిముఖంలో రకరకాల భావ పరంపరలు.
"ఇంకా మాలాంటివాళ్ళలో అనేక బలహీనతలున్నాయి. సొసైటీలో చాలామందితో మూవ్ అవుతాం. ఎప్పుడైనా కాలుజారటానికి అవకాశముంది. అలాంటిది మా హజ్బెండ్స్ మమ్మల్ని నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటున్నారు. మీకేమిటి ఈ కష్టాలు?"
చిన్మయి మాట్లాడలేదు.
బయట కారాగిన చప్పుడయింది. ఓ నిముషం గడిచాక నిఖిలేశ్వర్, రజనీకాంత్ కలిసి లోపలికొచ్చారు.
"మంజూ! ఈవేళ రజనీ ఇక్కడే భోంచేస్తాడు. మొదట రాయల్ సెల్యూట్. తర్వాత డిన్నర్..." అంటూ నిఖిలేశ్వర్ చిన్మయిని చూసి ఆగిపోయి గుర్తుతెచ్చుకుంటున్నట్లు "మీరు" అని ఆగిపోయారు.
"చిన్మయిగారు" అంది మంజుభార్గవి.
"ఓ! గుర్తువచ్చింది. చాలా రోజులయింది కదూ! ఏవండీ, బావున్నారా..." అనడిగాడు నిఖిలేశ్వర్ చాలా మర్యాదగా.
చిన్మయి అంతకుముందే సోఫాలోంచి లేచి నిలబడింది.