ప్రేమికుడు అనుభవించే అద్వైత స్థితి ఇది.
గోపాలకృష్ణ వీటికి అతీతుడేం కాదు. పైపెచ్చు భావుకుడు కనుక ఈ స్థితిలో మరింత మమైక్యత పొందుతున్నాడు.
తన కనురెప్పల మీదే వర్ష కాపురం పెట్టేసినట్టుంది అతడికి. అందుకే కనురెప్ప మూస్తే ఆమె తన కళ్ళలోని రెటీనా మీద ప్రతిబింబిస్తున్నట్లు భ్రమపడుతున్నాడు. తను పీల్చే గాలిలో ఆమె అస్థిత్వపు పరిమళం కలిసిపోవడం వల్ల తన ఊపిరితిత్తుల్లో అంత అలజడి కలుగుతూ వుందని భావిస్తున్నాడు.
"వర్ష" అనే రెండు అక్షరాలు తప్ప మరో అక్షరాన్ని తనకు అయ్యవారు నేర్పించలేదేమోనని అనుమానం పడుతున్నాడు.
ఉదయం కలల దుప్పటిని తొలగించగానే అతనికి ఆమె వెచ్చ వెచ్చగా గుర్తుకొస్తుంది. పెరట్లో చెట్టుచేమల్ని నిద్రలేపుతున్న నీరెండలో ఆమె పచ్చపచ్చగా గుర్తుకొస్తుంది. ఇంటిముందు కొప్పంతా పూలు తురుముతున్న తురాయి చెట్టును చూస్తుంటే ఆమె ఎర్రెర్రగా గుర్తుకొస్తుంది. భగవంతుడు కాలు మోపడానికి అక్కడక్కడా తివాచీలను పరచినట్లుండే పంట చేలను చూస్తుంటే ఆమె వెర్రి వెర్రిగా గుర్తుకొస్తుంది. కన్ను చేస్తున్న ఇంద్రజాలంలా అనిపించే ఆకాశంవెపుఇ సారించినప్పుడు ఆమె పిచ్చిపిచ్చిగా గుర్తుకొస్తుంది.
ఏ అర్థరాత్రో ఒంటరిగా కూర్చుని వున్నప్పుడు సన్నజాజుల పరిమళాన్ని గాలి నెత్తిమీద కుమ్మరిస్తున్నా పట్టించుకోకుండా ఆమెకు తన రక్తంతో ఉత్తరం రాయాలనీ, ఆమె నడిచే దారివెంట పాదాలు కంది పోకుండా నందివర్ధనం పూలు పరవాలనీ, ఆమె కనుపాపల్లో దృశ్యంగా ఇమిడిపోవాలనీ, ఆమె పెదవులమీద ఎప్పటికి వాడిపోని చిరునవ్వుల దండలా వేలాడాలనీ ఇలా ఏవేవో ఆలోచిస్తున్నాడు అతను.
* * *
"ఏం గురుడా! ఎప్పుడూ ఏదో మూడ్ లో వుంటున్నావు? కొంపదీసి వర్షమ్మను ప్రేమిస్తున్నావా ఏమిటి? అనడిగాడు ఓ రోజు నరుడు.
దానికి అతని నవ్వే సమాధానమయింది. అతను చెప్పకపోయినా నరుడికి తన గురుడి అవస్థంతా అర్థమయింది. గురువుగారి అవస్థను చూసి అతను ముసిముసిగా నవ్వుకుంటున్నాడు.
ప్రేమ అంతే "ఇదీ" అని చెప్పగలిగిన వాళ్ళెవరూ లేరు. ఎవరైనా వున్నారూ అంతే వాళ్ళు నిజమైన ప్రేమికులు కారు. నిర్వచనంలోకి ఇమడనిది ప్రేమ. ఇది ఏమిటో తెలియదు కాబట్టే ప్రేమికుల చేష్టలు పిచ్చివాళ్ళ పనుల్లా అనిపిస్తాయి. లేకుంటే వీధిలో నడవడానికే జంకుగా ఫీలయ్యే గోపాలకృష్ణ రోజూ సాయంకాలం వర్ష కనిపిస్తుందేమోనని వీధుల్లో పచార్లు ప్రారంభించాడు. ఎప్పుడయినా ఆమె కనిపించినప్పుడు రూపాన్ని కళ్ళల్లో ప్రతిష్టించుకునేవాడు.
ఆరోజు కూడా యధాప్రకారం నిద్రలేచి, ఓ స్థంభానికి జారిగిలబడి వర్ష రూపానికి అరమోడ్పు కన్నులతో ఫ్రేము కడుతున్నాడు. రక్తంలోని ఆమె అనుభూతులకు రంగులద్దుతున్నాడు. గుండెల్లోని ఆమెకు గుడి కడుతున్నాడు. మొత్తం శరీరమంతా పరుచుకున్న ఆమె ఊహలకు వూపిరి పోస్తున్నాడు.
ఊర్లోకి వెళ్ళిన నరుడు హడావుడిగా అక్కడికి వచ్చాడు.
"గురుడా! ఏమిటింకా స్నానం చెయ్యలేదా? అక్కడ ఊరి జనమంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు దేవుడి ఊరేగింపు అన్నది గుర్తులేదా?" అని నాన్ స్టాప్ గా మాట్లాడాడు.
అప్పుడు గుర్తొచ్చింది గోపాలకృష్ణకు. ఆరోజు దేవుడి వూరేగింపు విషయం. తను వెళ్ళి మొదట దేవుడికి హారతి ఇవ్వందే వూరేగింపు పనులు ప్రారంభం కావు. అందుకే అక్కడినుంచి లేచి తయారవడం మొదలు పెట్టాడు.
మరో అరగంటకు ఇద్దరూ వూరిలోకి బయలుదేరారు.
వీళ్ళు వచ్చేసరికి రథం దగ్గర చాలామంది వున్నారు. గోపాలకృష్ణను చూడగానే జనంలో కలకలం మొదలయింది.
పంతులు ఎదురెళ్ళి ఆహ్వానించాడు.
"రండి, మీకోసమే చూస్తున్నాం. ఈరోజు సాయంకాలం వూరేగింపు. మదనకామరాజు వంశానికి చెందిన మీరు మొదట పూజాకార్యక్రమాలు నిర్వహిస్తే పనులు ప్రారంభమవుతాయి" అతి వినయంతో అంటూ అతన్ని రథం దగ్గిరికి తీసుకొచ్చాడు.
వీధి మొదట్లో వున్న రథం రకరకాల చిలుకలు వాలిన చెట్టులా వుంది. మొత్తం రథమంతా కడిగి శుభ్రం చేయడంవల్ల అది నీరెండలో ఇంద్రధనుస్సు చిట్లి ఆ రూపం ఎత్తినట్లుంది.
గోపాలకృష్ణను అక్కడ నిలబెట్టి పంతులు మంత్రాలు చదివి, ఓ పళ్ళెంలో కర్పూరం వెలిగించి, దాన్ని అతనికిచ్చాడు. హారతి అయిపోగానే తిరిగి పళ్ళాన్ని పంతులకిచ్చాడు. ఈ సమయం కోసం చూస్తున్న మంగళ వాయిద్యాలు ఒక్కసారిగా మోగాయి. పంతులు రథం ఎక్కాడు. దేవుడికి అలంకరణలు ప్రారంభించాడు.
ఊరేగింపు సాయంకాలం ప్రారంభమవుతుంది. అప్పటివరకు ఊరేగింపు ఏర్పాట్లు జరుగుతుంటాయి.
హారతి అయిపోగానే గోపాలకృష్ణ అక్కడినుంచి బయల్దేరాడు. వర్ష కనిపిస్తుందేమోనన్న ఆశ అతన్ని ముందుకు నడిపిస్తోంది ఆ వీధిలో పోకుండా మలుపు తిరిగితే తన ఇంటికి త్వరగా చేరుకోవచ్చు. కాస్త ఆలస్యమైన శివరామయ్య ఇంటిగుండా వెళదామని నిర్ణయించుకుని అటు అడుగులు వేశాడు.
ఇల్లు దగ్గరవుతుంటే రక్తప్రసరణ హెచ్చింది. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.
మెల్లగా అడుగులేస్తూ ఇంటివైపు చూశాడు.
కిటికీ పక్కన కూర్చున్న ఆమెను చూడగానే ఓ క్షణంలో వెయ్యోవంతు ఆగిపోయాడు.
ఎవరో గొప్ప చిత్రకారుడు ఆమె చిత్రం గీసి రంగులు ఆరడానికి కిటికీకి వేలాడదీసినట్లుంది.
నీలం ఆకాశం ముక్కను కత్తిరించి కిటికీగా చేసి. మధ్యలో చందమామ అతికించినట్లనిపించింది.
సముద్రపు నీళ్ళమీద పడ్డ సూర్యకాంతి అల్లా ఫ్రీజ్ అయినట్లని పించింది.
ఆమె రూపం కళ్ళల్లో రంగుల వలయాలను సృష్టిస్తుంటే మెల్లగా అక్కడి నుంచి కదిలాడు.
తను కనుపించగానే అతనిలో కలుగుతున్న మార్పులను ఆమె గమనించింది. అయితే అతని గురించి ఓ క్షణం సేపైనా ఆలోచించడం ఇష్టం లేని ఆమె తిరిగి పుస్తక పఠనంలో మునిగిపోయింది.
అతను ఇంటికి చేరుకున్నాడు.
నరుడు మాత్రం రథం దగ్గరే ఆగిపోయాడు. జనంలో కోలాహలాన్ని వదలి ఒంటరిగా అడవిలో తపస్సు చేసుకుంటున్న ఋషిలా వుండే తన గురువుగారి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు.