హాస చూస్తూండగా కారు డిక్కీలోంచి రెండు సూట్ కేసులు బయటకు వచ్చాయి.
హిప్పీ క్రాపు మనిషి పురోహితుడిగా మారిపోయాడు.
సూట్ కేసుల్లోంచి బిల్డింగ్ బ్లాక్స్ లాంటి వస్తువులు. వాటిని ఒకదానితో ఒకటి కలుపుతూంటే పెళ్ళి మండపం తయారవుతోంది.
గుల్మార్గ్ పచ్చిక బయల్లో తెలుగు కళ్యాణ మండపం!
హోమం, పెళ్ళి సరంజమా పూలదండలు-మొత్తం అన్నీ అక్కడ సిద్ధం కావడానికి గంట పట్టిందంతే!
రమణ ఆమెకు రెండు క్యాసెట్లు చూపించి, "నా పురోహితుడు నాతోనే వచ్చాడు. అతడితో కలిసి మాత్రం చదివే మీ పురోహితుడీ క్యాసెట్లో వున్నాడు. ముహూర్త సమయంలో వేద మంత్రాలు చదివే నలుగురు వేదపండితులూ, సన్నాయి వాద్యబృందమూ ఈ క్యాసెట్లో వున్నారు. ఇవీ ఏర్పాట్లు" అన్నాడు.
ఆమె తెల్లబోయింది.
రమణ అంత పక్కా ఏర్పాట్లలో వున్నాడని ఆమె అనుకోలేదు.
ముసలాయన కిదంతా విడ్డూరంగా వుంది. అప్పటికే కళ్యాణ మండపం చుట్టూ చాలా మంది చేరారు.
"ఏమిటర్రా యిదంతా?" అన్నాడాయన.
రమణ ఏదో చెప్పబోయేలోగా, "ఐదో వ్యాపారం తాతగారూ! ఈ సుందర కాశ్మీరు వాతావరణంలో ఎన్నో ప్రేమ జంటలుంటాయి. వాళ్ళలో ఎవరైనా పెళ్ళి చేసుకోవాలనుకుంటే శాస్త్రీయమైన ఏర్పాటిది! ప్రయాణపు ఖర్చులు వెళ్ళిపోతాయి" అంది.
"హాసా!" అన్నాడు రమణ.
"ఇలారా, నీతో మాట్లాడాలి...." అంది హాస అతడితో.
ఇద్దరూ కాస్త పక్కకు వెళ్ళేక "ఏమిటి నీ బాధ?" అంది ఆమె.
"ఎవరిదో పెళ్ళంటా వేమిటి....? వాళ్ళకు మన పెళ్ళి అని చెప్పొచ్చుగా...."
"కానీ మన పెళ్ళి ఈ రోజు కాదు కదా!"
"ఈరోజేనని నువ్వే చెప్పావు...."
"నేను ఈ రోజన్నానా గుర్తుచేసుకో....రేపు అన్నాను...."
"అవును....కానీ ఆ అన్నది నిన్న...."
"అయితే నిన్నో మాట, రేపో మాట అనే దాన్ననుకున్నావా?"
"ప్లీజ్ హాసా! నో జోక్స్....ప్లీజ్ బీ సీరియస్...." అన్నాడు. రమణ కానీ అతడి మనసులో భయం చోటుచేసుకుంటోంది. ఈ హాస చాలా మొండి మనిషి. ఏమిటీమె ఆంతర్యం?
"ఐ కాన్ట్ బీ సీరియస్...." అంది ఆమె.
"ఎందుకని?"
"అసలు విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు...."
"చెప్పు....ఫరవాలేదు__"
హాస కాసేపు తటపటాయించినట్లు నటించి, "నన్నో గంధర్వుడు ప్రేమిస్తున్నాడు, నా కోసం గంధర్వలోకంలో అన్ని ఏర్పాట్లూ చేసి త్వరలోనే అక్కడికి తీసుకునిపోతాట్ట. అంతవరకూ నన్ను పెళ్ళి చేసుకోవద్దన్నాడు__" అంది.
"ఎవడా గంధర్వుడు?" అన్నాడు రమణ.
"అతడెవరో, ఎలా ఉంటాడో నాకు తెలియదు. కంటికి కనిపించడు. కానీ అతడి మాటలు చెవిలో వినిపిస్తూంటాయి.
"నో జోక్స్ ప్లీజ్!"
"జోక్ కాదు నిజం చెబుతున్నాను. కావాలంటే పరీక్షించుకోవచ్చు."
"ఎలా?"
"అతడితో ఇప్పుడు కూడా మాట్లాడగలను. నీక్కావలసిన రుజువు చెప్పు...."
రమణ ఓ క్షణం ఆలోచించి, "ఎవరో ఒకరు కాసేపట్లో నా దగ్గరకొచ్చి, మిష్టర్ రమణా! గంధర్వుడికీ పెళ్ళి ఇష్టం లేదు. హాస నిజమే చెబుతోంది అని చెప్పాలి" అన్నాడు.
ఆమె వెంటనే "హలో!" అంది.
రమణ ఆమెవంక ఆశ్చర్యంగా చూశాడు.
ఆమె చెవుల్లో గింగురుమంది "హాసా! నేనిక్కడే వున్నాను. రమణ వేయించిన కళ్యాణ మండపం కూడా చూశాను. మీ పెళ్ళి చూడబోతున్నాను. హర్టీ కంగ్రాట్యులేషన్సు...."
"మా పెళ్ళి ఈరోజు జరగదు. నాకు నువ్వో పని చేయాలి...." ఆమె రమణ అభీష్టాన్ని మాటల్లో చెప్పింది.
ఆ తర్వాత అయిదు నిముషాల్లో ఓ కాశ్మీర్ యువకుడు వారిని సమీపించాడు.
"ఆప్ కా నామ్ రమణ!" అన్నాడతడు.
"ఊఁ" అన్నాడు రమణ.
ఆ యువకుడు చేతికో చీటీ అందించాడు. అందులో, "మిష్టర్ రమణా! గంధర్వుడికీ పెళ్ళి యిష్టం లేదు. హాస నిజమే చెబుతోంది" అని వ్రాసి వుంది.
రమణ మ్రాన్పడి పోయాడు.
* * * *
కళ్యాణ మండపం గురించి ఆనోటా ఈనోటా అక్కడ చాలా మందికి తెలిసింది. అందరూ వచ్చి వింతగా చూసి వెడుతున్నారు.
అయితే అక్కడున్న ప్రేమ జంటల్లో కొందరు వివాహితులు, కొందరికి వివాహేచ్చ లేదు. కానీ చాలా మంది వివాహ వ్యవస్థను నమ్ముతున్నవారు. అందుకని సరదాకు వివాహమంటే భయపడ్డారు.
అలాంటి భయం లేని ఓ పాశ్చాత్య జంట ముందుకు వచ్చింది. వాళ్ళు చాలా కాలంగా కలిసి జీవిస్తున్నారు. కానీ పెళ్ళి చేసుకోలేదు. వారికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఎక్కువే! అయిదేళ్ళుగా కలిసుంటున్నా వాళ్ళకు పరస్పరం మోజు తీరలేదు. పెళ్ళి చేసుకుంటే విడాకులిచ్చుకుంటామన్న భయం కొద్దీ వాళ్ళు పెళ్ళి వాయిదా వేస్తున్నారు.
సంప్రదాయాలు చిత్రమైనవి!
తన ప్రేమను శాశ్వత బంధంగా మార్చుకునేందుకు హిందూ సంప్రదాయం వివాహాన్ని ఏర్పాటు చేసింది. పత్రాలు, సాక్ష్యాలు లేకుండా ఆ వివాహ బంధం బలంగా కొనసాగుతుంది.
పత్రాలు, సాక్ష్యాలతో జరిగే పాశ్చాత్య సంప్రదాయపు వివాహంలో, విడాకులు తీసుకుంటామేమోనన్న భయంతో పెళ్ళికి విముఖులవుతున్నారు యువతీ యువకులు.
హిందూ సంప్రదాయ వివాహం దంపతులు సంబంధాలని శాశ్వతం చేస్తోందని విని ఉన్న ఆ పాశ్చాత్య జంట తమ వివాహం ఆ సంప్రదాయం ప్రకారమే జరిపించాల్సిందిగా పురోహితుడిని కోరారు.
పురోహితుడు రమణ దగ్గరకు పరుగెత్తాడు.
"ఈ పెళ్ళికి మనమే పెద్దలం. ప్రారంభించు" అంది హాస.
ఒక పాశ్చాత్య జంట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న అద్భుత విచిత్ర దృశ్యాన్ని దేశ విదేశాలకూ, సర్వమతాలకూ చెందిన ఎందరో చూసి వినోదించారు. నలుగురు జర్నలిస్టులు దీన్ని వీడియోగా తీశారు.
పెళ్ళి అయ్యేసరికి మరో మూడు పాశ్చాత్య జంటలు ముందుకు వచ్చాయి.
రమణకు ఉక్రోషంగా వుంది, "నో మోర్ ప్లీజ్!" అన్నాడు.
పెళ్ళయిన జంట, "ఇట్సే వండ్రఫుల్ ఎక్స్ పీరియన్స్. ప్లీజ్ డోన్ట్ సే నోటుదెం" అన్నారు.
"వండ్రఫుల్ ఎక్సీపీరియన్సు. అయితే...." అంటూ పురోహితుడు ఆ జంట ముందు చేయి జాపాడు.
"వుయ్ పెయిడ్ ది పీస్...." అన్నాడు పాశ్చాత్య వరుడు.
"కుష్ కరో!" అన్నాడు పురోహితుడు.
అర్ధమయింది. వెంటనే ఆ పాశ్చాత్య వరుడికి. యాభై రూపాయలు యిచ్చాడు.
రమణ కిష్టం లేకపోయినా మరో మూడు పెళ్ళిళ్ళు జరిగాయక్కడ. పురోహితుడికి బాగా గిట్టింది.
ఇంకో పది జంటలు ముందుకొస్తే, ఇక కాళీలేదని రమణ కచ్చితంగా చెప్పేశాడు.
"ఈరోజు కాకపోతే రేపు, ఎల్లుండి....ఏరోజయినా సరే!" అన్నారు వాళ్ళు.
రమణ తను వ్యాపారం చేయడంలేదని వాళ్ళకు నచ్చజెప్పడానికి చాలా కష్టపడ్డాడు. పెళ్ళయిన జంటలు నాలుగూ కలిసి అక్కడున్న వాళ్ళకి విందిచ్చారు.
అన్నీ సర్దుకుని తిరుగు ప్రయాణమై హౌస్ బోట్ చేరుకునేసరికి బాగా ఆలస్యమై పోయింది.
* * * *
ఓ పట్టాన దేనికీ చలించని రమణ గట్టి దెబ్బే తిన్నాడు. ఆరోజతడి మనసు వికలమై పోయింది. దానికి తోడు ఇంతా చేసి హాస చాలా ఉత్సాహంగా వుంది. సరదాగా జోక్సు వేస్తోంది.
రమణ ముభావంగా వున్నాడు.
"భూతల స్వర్గంలో దేవతల పెళ్ళి! ఈ ఏర్పాటు చేసిన రమణకీరోజు వచ్చిన పుణ్యమింతా అంతా కాదు" అంది హాస.
"దేవతలెవరు? పాశ్చాత్యులా...." అన్నాడు రమణ.
"అవును. వాళ్ళు ఆరోగ్యంగా వుంటారు. ఎక్కువ రోజులు జీవిస్తారు. పేదరికాన్నెరుగరు. ప్రకృతి రహస్యాలు తెలిసినవాళ్ళు. తాము సాధించిన అద్భుతాలను యాత్ర మాటలలోకి మార్చి సామాన్యుడిక్కూడా అందుబాటులోకి తెచ్చే వర ప్రదాతలు. వాళ్ళు దేవతలు కారా....?" అంది హాస.
"కారు రాక్షసులు. నా పెళ్ళి మండపంలో వాళ్ళు కూర్చున్నారు" అన్నాడు రమణ.
"రాక్షసులు వాళ్ళు కాదు. వాళ్ళనక్కడ కూర్చోబెట్టిన నేను రాక్షసిని" అంది ఆమె.
రమణ తడబడి, "అయాం సారీ, నా అభిప్రాయమది కాదు...." అన్నాడు.