Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 40


    విశ్వం ఇంటి ముందు స్కూటర్ ఆపి లోపలకు వెళ్ళి అసహనంగా బెల్ మోగించాడు. తలుపులు విసురుగా తెరుచుకున్నాయి.
    "ఓ నువ్వా?" ముఖంలోని విసుగుని దాచుకుని అన్నాడు విశ్వం అన్నయ్య. డాక్టర్ రామనాధం.
    "విశ్వం లేడా?"
    "లేడు. ఇంతవరకు నీ కోసం ఎదురుచూశాడు. ఇంటికి కూడా ఫోన్ చేశాడు. నువ్వు లేవని మీ అన్నయ్యే చెప్పాడట. జామీన్ మీద విడుదలయ్యాడటగా?" చివరి వాక్యంలో ఒక్కొక్క పదాన్నే నొక్కుతూ అన్నాడు.
    ఓ క్షణం అతడి ముఖంలోకి చిరాగ్గా చూసి గిర్రున వెనక్కు తిరిగి స్కూటర్ దగ్గరకొచ్చాడు రవి. స్కూటర్ స్టార్ట్ చేస్తూ ఓసారి వెనక్కు తిరిగి చూశాడు. రామనాధం అక్కడే నిలబడి తననే పరిశీలనగా చూస్తున్నట్టు గమనించాడు. స్కూటర్ వదిలేసివెళ్ళి, అతడి జుట్టు పట్టుకొని వంచి వీపుమీద కసిగా బాదాలనిపించింది.
    రవి స్కూటర్ బయలుదేరింది.
    విశ్వం అక్కడికే వెళ్ళి ఉంటాడు. అసలు ఇన్ని అవాంతరాలకు కారణం ఆ విశ్వంగాడే! చిన్నతనం నుంచి తనకు తెలియకుండానే తనలో స్లో పాయిజన్ లా అన్నయ్య మీద కాసిని ఎక్కించాడు. విశ్వానికి స్కూలు రోజులనుంచే అన్నయ్యంటే అయిష్టం. కారణం అన్నయ్యను అందరూ ఇష్టపడేవారు. క్లాసులో ఫస్టు వచ్చేవాడు. పైగా విశ్వం చేసే అల్లరి పనులను ఎదుర్కొనేవాడు. విశ్వం అన్నయ్యకంటే కూడా ఒక సంవత్సరం పెద్ద. తనకంటే మూడేళ్ళ ఎనిమిది నెలలు పెద్ద. అభం శుభం తెలియని తనను దగ్గరకు తీసి అతిప్రేమ చూపించేవాడు.
    హోటల్ దక్కన్ ఆవరణలోకి స్కూటర్ ప్రవేశించింది. రవి ఆలోచనలు చెల్లాచెదరైనాయి. స్కూటర్ ఓ మూల గోడవారగా ఆపాడు. చకచక రిసెప్షన్ కౌంటర్ దాటి లిఫ్టు దగ్గరకెళ్ళి నిలబడ్డాడు. పైకి చూశాడు. లిఫ్టు థర్డ్ ఫ్లోర్ లో ఉంది. పైకి వెళ్తోంది. లిఫ్టు ముందు అప్పటికే చాలామంది నిలబడి ఉన్నారు.
    లిఫ్టు కోసం ఆగే సహనం లేదు రవికి. మెట్లుకేసి నడిచాడు. రెండేసి మెట్లు ఉసిగా ఎక్కాడు. మూడో అంతస్థులోకి వెళ్ళి ఒక గది ముందు ఆగాడు. బెల్ నొక్కాడు.
    తలుపులు తెరుచుకున్నాయి.
    తలుపు తీసినవాడు విశ్వనాథం.
    "రా! రా! నీ కోసమే చూస్తున్నాం. ఇంటికి ఫోన్ చేశాను. అప్పటికే వెళ్ళిపోయావన్నారు. మీ అన్నయ్య గొంతు ఫోన్ లో విని హడలిపోయాననుకో. తిట్టేస్తాడని భయపడ్డాను. ఎంత మంచిగా మాట్లాడాడనుకున్నావ్!"
    "మా అన్నయ్య మనలాంటి లోఫర్ కాదు!" చురుగ్గా వచ్చిన మాటలు విశ్వం ముఖానికి కంకర్రాళ్ళలా తగిలాయి.
    ఓ క్షణం దిమ్మెరపోయినట్లుగా రవిని చూశాడు. రవి దాదాపు అతన్ని తోసుకుంటూనే గదిలోకి వెళ్ళాడు.
    గౌతమ్ సోఫాకు చేరబడి కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడు.
    "హల్లో! రవీ! రా! అలా ఉన్నావేం?"
    రవి గౌతమ్ ను చూడగానే జారిపోయినట్టు అయ్యాడు.
    కుర్చీలో కూర్చున్నాడు.
    అతడి వెనకే వచ్చిన విశ్వం రవి పక్క కుర్చీలో కూర్చున్నాడు. విశ్వం రవి ఇచ్చిన షాక్ నుంచి పూర్తిగా కోలుకోలేదు.
    "అలా ఉన్నావేం?"
    "ఎలా ఉన్నాను?"
    "చెప్పనా?"
    "చెప్పు."
    "బాధపడవు గదా?"
    రవి సమాధానం ఇవ్వలేదు.
    "ఎప్పుడూ కొట్టని యజమాని చేత దెబ్బలు తిన్న బొచ్చుకుక్కపిల్లలా ఉన్నావు."
    రవి ముఖం ఎర్రబడింది.
    "షటప్!" అరిచాడు.
    గౌతమ్ చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వుచూసి తుళ్ళిపడ్డాడు రవి. తన అన్నయ్య అప్పుడప్పుడు అచ్చం ఇలాగే నవ్వుతాడు. ముఖ్యంగా తను దేనికైనా బాధపడుతున్న సందర్భాల్లో అదే నవ్వు.
    "కోపం వచ్చిందా! ఏదో పెద్దవాణ్ణి. మీ అన్నయ్యలాంటి వాణ్ణి."
    "అన్నయ్యలాంటి ఏమిటి? అన్నయ్యే!" గౌతమ్ మాటను మధ్యలోనే అందుకొని అన్నాడు విశ్వం.
    రవి విశ్వం కేసి జుగుప్స కలిగించే పురుగును చూసినట్టు చూశాడు.
    "ఏమిటోయ్ అంత కోపంగా ఉన్నావ్! మీ అన్నయ్య ఏమైనా అన్నాడా?" విశ్వం జంకుతూనే అడిగాడు.
    "నువ్వు ఇవ్వాళ ఆసుపత్రికి వెళ్ళావా?" విశ్వం మాట వినీ విననట్టే గౌతమ్ కేసి తిరిగి ప్రశ్నించాడు రవి.
    "అవును. వెళ్ళాను."
    "ఎందుకెళ్ళావ్?" రవి కంఠం తీవ్రంగా ఉంది.
    గౌతమ్ రవి ముఖంలోకి తాపీగా చూశాడు.
    విశ్వం గాభరాగా చూశాడు.
    "మాట్లాడవేం?"
    "ఇదుగో రవీ. నీకోసారి చెప్పాను. గుర్తుందా అలాంటి గొంతుతో మాట్లాడవద్దని!" తాపీగా గంభీరంగా అన్నాడు గౌతమ్!
    రవి వీపుమీద చెర్నాకోల దెబ్బ ఛెళ్ళున తగిలింది.
    అన్నయ్య సరిగ్గా ఇదే మాట అంటాడు. అలా అన్నప్పుడు అన్నయ్య గొంతుకూడా అచ్చం ఇలాగే ఉంటుంది.
    రవికి కోపంగా ఉంది.
    కసిగా ఉంది.
    ఎవరిమీద? తన మీద తనకే కసిగా ఉంది.
    "ఏమిటి రవీ? ఏమైంది? మీ అన్నయ్య విడుదల అయ్యాడనే భయంతో ఏదేదో మాట్లాడుతున్నట్టున్నావ్. భయపడకు. ఈ విశ్వం అంటే ఏమనుకొన్నావ్? వెంటనే బ్రహ్మాండమైన ఎత్తు వేశాను. మనవాడు నిమిషాల్లో ఆ ఎత్తును ఆచరణలో పెట్టేశాడు. అఖండుడు. మళ్ళీ మీ అన్నయ్య కటకటాల వెనక్కు. మళ్ళీ చస్తే జామీను ఇవ్వరు."
    రవి చివ్వున లేచాడు. విశ్వం కాలర్ పట్టుకొని లాగాడు.
    అనుకోకుండా జరిగిన సంఘటనకు బిత్తరపోయిన విశ్వం యాంత్రికంగా లేచి నిలబడ్డాడు.
    "రాస్కెల్! నువ్వేనా ఈ పని చేయించింది? ముందు నాకెందుకు చెప్పలేదు?" రవి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి.
    గౌతమ్ మాత్రం తాపీగా చూస్తూ, విలాసంగా సిగరెట్ పొగ ఊదాడు.
    "వదులు. ఏమిటిది? నీకు పిచ్చెక్కిందా?" రవి పట్టునుంచి వదిలించుకొని దూరంగా జరిగి నిలబడ్డాడు విశ్వం.
    "అవును. నాకు పిచ్చెక్కింది. నిన్ను చంపేస్తాను." ఒక్కసారిగా విశ్వం గొంతు రెండు చేతులతో పట్టుకున్నాడు.
    విశ్వం కంఠం నుంచి కీచుమన్న ధ్వని వచ్చింది.
    గౌతమ్ చివ్వున లేచి రవిని లాగాడు. రెండు చేతులూ రవి భుజాల మీద వేసి సోఫాలోకి తోచాడు.
    విశ్వం భుజం తట్టి "కూర్చో" అన్నాడు.
    విశ్వం ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ రవి కేసి భయం భయంగా చూశాడు.
    గౌతమ్ కూజాలో నీళ్ళు గ్లాసులోకి వంచి విశ్వానికి అందించాడు. విశ్వం గబగబా నీళ్ళు తాగాడు. మరో గ్లాసు రవికి అందించాడు. రవి చెయ్యి చాపలేదు.
    "రవీ! తాగు! ఆవేశం తగ్గించుకో. అసలు ఏం జరిగిందో చెప్పు." గౌతమ్ రవి పక్కన సోఫాలో కూర్చున్నాడు.
    గౌతమ్ బెల్ కొట్టి మూడు కాఫీలకు ఆర్డరు ఇచ్చాడు.

 Previous Page Next Page