Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 40

 

    నీకు తెలీదయ్యా! నేను వప్పుకుంటే మా ఆవిడ శాశ్వతంగా పుట్టింటికెళ్ళిపోతుంది! ఆ రిస్క్ తీసుకునే బదులు "నేను కరెక్టే -- ఆ మిషనే రాంగ్ " అనేస్తే -- నా కాపురం నిలబడుతుందిగా -- " ఆశగా అన్నాడతను.
    శంకరమూర్తి అదిరిపోయాడు.
    'అమ్మనా శాస్త్రీ! ఏం తెలివిరా నాయినా నీది !"
    షైనీ శాస్త్రిగారికి వైర్లు తగిలించేసింది.
    క్రిందటి వినాయక చవితి నాడు అనుకోకుండా నా స్కూటర్ రియర్ మిర్రర్ లో చంద్రుడిని చూశానండీ! అప్పుడే అనుకున్నా -- ఇలాంటి అపవాదేదో ఎదుర్కోవాల్సివస్తుందని -" శాస్త్రి విష్ణుమూర్తికి చెప్తున్నాడు.
    షైనీ గొంతు కవచంలా మోగింది.
    "శాస్త్రిగారూ!రాత్రి ఆ సెక్స్ డాన్స్ ల రిసార్ట్ లో పోలీసులు రైడ్ చేసినప్పుడు టి.వి కెమెరాకి కనబడకుండా మీ మొఖానికి ఎందుకు కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నాడు ? కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నంత మాత్రాన మిమ్మల్ని గుర్తించలేమనుకున్నారా?" అడిగింది చాలా తెలివిగా.
    "ఆ కర్చీఫ్ .... అహహ - అసలు టి.వి లో కనిపించింది నేను కాదండీ! ఆ టైం కి నేను బోలారంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నానని చెప్తున్నాను కదా!"
    అతని మాట పూర్తి కాకుండానే మిషన్ గుండె లదిరేలా సైరన్ మోగించింది . శాస్త్రి మొఖం వాడిపోయింది కానీ అంతలోనే పుంజుకున్నాడు.
    "ఇలాంటి మిషన్లు ఎన్ని సైరన్లు కూసినా -- నేను నిర్దిషినని ఆ భగవంతుడికి తెలుసు -- నా భార్యకు తెలుసు -"
    "ఛీ -- నోర్ముయ్ -- ఇంకా సిగ్గులేకుండా వాగుతున్నావ్!' అంటూ అందరి ఎదురుగ్గా అతని చెంప పగలకొట్టి ఉక్రోషంగా , రోషంగా ఇంట్లోకి పరుగెత్తింది వాళ్ళావిడ-
    మిగతా జనమంతా కూడా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు .
    అడాళ్ళంతా గ్రూప్స్ గా విడిపోయారు " ఈ శాస్త్రి ఇంత గ్రంధసాగుండని తెలీక రెండేళ్ళ నుంచే వాడి కాళ్ళు మొక్కుతున్నాం" అని ఒకరు -
    "వాడు ఒకటి రెండు సార్లు నా వంక కూడా అదోలాగా చూశాడు రజనీ! నాకు అప్పుడే కొంచెం డౌటొచ్చింది గానీ -- వాడి చూపే అంతేమో -- అనుకున్నాం -- " అని ఇంకోకావిడ.
    "ఇంతకూ ఇప్పుడు శాస్త్రి పెళ్ళాం ఏం చేస్తుందంటారు ?" వాడిని శాశ్వతంగా వదిలేసి పుట్టింటి కెళ్ళిపోతుందంటారా?" అని ఇంకొకరు -
    ఇలా కామెంటరీలు ప్రసారం చేస్తుండగానే ఏడుస్తూ శాస్త్రి భార్య -- తన పిల్లాడినీ , సూట్ కేస్ నీ తీసుకుని అటో ఎక్కి వెళ్ళిపోవటం -- ఆమెను వెళ్ళవద్దని బ్రతిమాలుతూ శాస్త్రి వెంటపడటం -- అందరం గుడ్లప్పగించి చూస్తుండిపోయాం.
    మా కమిటీ మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళంతా ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు .
    "ఇవాళ శాస్త్రి కాగతి పట్టిందంటే -- రేపు మనమూ లైన్లో ఉన్నట్లే లెక్క " అన్నాడు మొహిందర్ సింగ్.
    "ఉన్నట్లే లేక్కేమిటి ? ఈ లై డిటెక్టర్ వచ్చిన దగ్గర్నుంచీ నేనేం మాట్లాడినా మా మిసెస్ -- అవన్నీ అబద్దాలని కొట్టి పారేస్తోంది. అవి నిజాలని ప్రూవ్ చేయాలంటే లై డిటెక్టర్ టెస్ట్ చేసుకోవాలంట -- " చిరాగ్గా అన్నాడు శంకరమూర్తి.
    సరిగ్గా అప్పుడే మా అపార్ట్ మెంట్స్ తాలుకూ యూత్ లీడర్లు మా దగ్గర కొచ్చారు.
    "గుడ్ మాణింగ్ అంకుల్" విష్ చేశారిద్దరూ హమీద్ మియాకి.
    "గుడ్ మాణింగ్! క్యా హై భయ్! కైసే హై?"
    "మాకు ఒక ప్రాబ్లం వచ్చిందంకుల్ -- మీ హెల్ప్ కావాలి -"
    "చెప్పు -- ఏంటయ్ ?" అడిగాడు హమీద్.
    "వాళ్ళు కొంచెం సేపు నసిగి తర్వాత సబ్జెక్ట్ లో కొచ్చారు.
    "అదీ -- అదేంటంటే -- మా కాలేజ్ బాయ్స్ కి గాళ్ ఫ్రెండ్స్ ఉంటారు గదంకుల్-"
    "తెలుసు -- సిటీలో ప్రతి ఎరియాకీ ఒక గాళ్ ఫ్రెండ్ ఉంటుంది మీకు -"
    "అహహ! మీ స్టేట్ మెంట్ కొంచెం ఒవరయింది గానీ -- బట్ -- ఇద్దరు గాళ్ ఫ్రెండ్స్ ఉండటం నార్మల్ అంకుల్ -"
    "అందుకే కాలేజ్ డేస్ బెస్ట్ అనేది " అన్నాడు కృష్ణ మూర్తి.
    "ఇంతకూ మీ ప్రాబ్లం ఏంటీ ?" అడిగాడు విజయ్ యాదవ్ ఈర్ష్యగా.
    "నా గాళ్ ఫ్రెండ్ సుష్మిత మన అపార్ట్ మెంట్స్ లోనే ఉంటుంది కదంకుల్-- తనకు ఈ లై డిటెక్టర్ ని చూసిన దగ్గర్నుంచీ నా ప్రేమ సిన్సియరా, కాదా అన్న అనుమానం పట్టుకుంది. అందుకని నేను తనని తప్ప ఇంకెవ్వరినీ ప్రేమించటం లేదని , తనను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాని ఆ లై డిటెక్టర్ టెస్ట్ లో చెప్పమంటుంది.-"
    అందరం ఉలిక్కిపడ్దాం.
    అటు తిరిగి, ఇటు తిరిగి టాపిక్ మళ్ళీ లై డిటెక్టర్ మీదకే వచ్చింది.
    "చెప్పేసెయ్ - భయం ఏమున్నయ్?" అన్నాడు హమీద్ మియా .
    అతను కంగారు పడ్డాడు.   
    "చెప్తే -- సుష్మితకు వెంటనే నా లవ్ అబద్దం అని తెలిసిపోతుంది కదా! ఆ సంగతి తెలిసిందంటే నన్ను కట్ చేసి పారేసి రోహిత్ ని లవ్ చేస్తుంది "
    "రోహితా? వాడేవాడు ?"
    "రోహిత్ ఎప్పటినుంచో సుష్మిత వెంటపడుతున్న కాండేట్-"
    "అంటే నువ్ సుష్మితను సిన్సియర్ గా ప్రేమించటం లేదా?"
    "ప్రేమిస్తున్నా నంకుల్! కానీ సాగరికని కూడా లవ్ చేస్తున్నాను కాబట్టి లై డిటెక్టర్ ముందు మాట్లాడాలంటే అంతా బయటపడిపోతుంది."
    "సుష్మిత నిన్నోదిలి రోహిత్ తో పొతే పోనీ -- నీకు సాగరిక ఉంది కదా!"
    "ఉంది గానీ సాగరికకి వేరే ప్లాష్ బాక్ ఉంది -"
    "వద్దులే -- ఇప్పుడా ప్లాష్ బాక్ లన్నీ వినే ఓపిక నాకు లేదు గానీ -- మేము నీకు ఏ విధంగా హెల్ప్ చేయాలో చెప్పు -"
    'అదే -- ఆ లై డిటెక్టర్ ని ఎలాగయినా చెడగోట్టేస్తే గానీ మన అపార్ట్ మెంట్స్ కి పెద్ద న్యూసెన్స్ పోదంకుల్-"
    అందరికీ అతని ప్లాన్ ఇన్ స్టంట్ గా నచ్చింది.
    "నిజమే -- ఇది చాలా మంచి అయిడియా ' అన్నాడు కృష్ణమూర్తి.
    "కానీ దాన్ని చెడగొట్టటం ఎలా ? అది షైనీ కంట్రోల్లో -- 'లాక్ అండ్ కీ ' లో ఉంటుంది కదా !"
    'అక్కడే మన తెలివి ఉపయోగించాలంకుల్"
    "అంటే?"
    "మనం ఒక కమిటీని వేసి -- ఏం చేస్తే ఆ మిషన్ చేదిపోతుందో తెలుసుకుని ఆ పని చెయ్యాలి -"
    వెంటనే శంకరమూర్తి, కృష్ణమూర్తి , మొహిందర్ సింగ్ లతో ఒక కమిటి వేశాడు హమీద్ మియా !
    ఆ మర్నాడు 'డి' బ్లాక్ లో ఉండే లావణ్య ఇంట్లో పెద్ద్డగా ఏడుపులు వినిపించే సరికి అందరం అక్కడకు పరుగెత్తాం.
    మాములుగానే లావణ్య భర్త రాజ్ నర్సింహ లావణ్యను పట్టుకుని చావ గొడుతున్నాడు. భార్య శీలం మీద అనుమానంతో తాగివచ్చి చావగోట్టటం మామూలే!
    మేమెంతా అడ్డువెళ్ళి అతనికి వార్నింగిచ్చాం !
    "ఇదిగో చూడు ! నీకు అల్ రడీ రెండు వార్నింగ్ లిచ్చేశాం ! ఇప్పుడిది లాస్ట్ వార్నింగ్! అయినా ఇంకా నీ భార్యని కొట్టావనుకో ! పోలీసు రిపోర్టు సంగతి తర్వాత -- ముందు మేమందరం కలసి నీ చేతులు ఫ్రాక్చర్ చేసేస్తాం! దాంతో ఇక జీవితమంతా నువ్ నీ భార్యను కొట్టలేవ్! చేతులు విరగటం వల్ల నీ ఉద్యోగం కూడా పోతుంది. మేము చేసింది మంచిపనే గనుక పోలీసులు కూడా మమ్మల్ని ఏమీ అనలేరు -- ఏమంటావ్ మరి ?" బెదిరించాడు మొహిందర్.

 Previous Page Next Page