Previous Page Next Page 
మనసున మనసై పేజి 40


    వంటరిగా పిలిస్తే 'మాడాడీ ఏమంటారో అంటుంది. అస్తమాను పెద్దాయనని పర్మిషన్ అడగాలంటే దివాకర్ కి మొహమాటం అనిపిస్తుంది. రోజుకోసారి ఏదో విధంగా ఫోను చేసి తామిద్దరి మధ్య స్నేహం చేజారకుండా తనవైపునించి ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. ఒకసారెప్పుడో "నేనే ఫోను చేస్తాను. మీరొకసారి చెయ్యరు" అన్నాడు దివాకర్ అలిగినట్లు మాట్లాడుతూ.
    మనీషా నవ్వి రోజు మాట్లాడుతున్నారుగా, ఇంకేం వుంటాయి కొత్త సంగతులు మాట్లాడడానికి అంది. 'అంటే నేను చెయ్యకపోతే మీరు చేస్తారా' అన్నాడు ఆశగా కవ్విస్తూ 'అవసరమైతే ఎందుకు చెయ్యను' అంది.
    'అంటే ఏదన్న అవసరం లేకపోతే ఫోను చెయ్యకూడదా. నేను అవసరం వుండే చేస్తున్నానా. మీస్నేహం కోసం .... మీతో మాట్లాడాలని కదా నేను రోజూ చేస్తున్నాను' అన్నాడు. మనీషా ఏం మాట్లాడలేదు. ఏం జవాబివ్వాలో తట్టనట్టు వూరుకుంది. 'నాకనిపించినట్టు మీకనిపించదా...' అన్నాడు మళ్ళీ రెట్టించి.
    "ఏమిటి అనిపించడం" అంది మనీషా నెమ్మదిగా.
    "అదే! నాతో మాట్లాడాలని' సరదాగా కాసేపు మాట్లాడుకుందామని...' ఆశగా అన్నాడు.
    మళ్ళీ అవతలి నుంచి మౌనం. ఆమె సమాధానం మౌనం అని అర్ధం అయ్యాక ఆ ప్రసక్తి మానేసి, 'ఈ ఆదివారం లంచ్ కెడధామా, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి' అన్నాడు.
    మనీషా మామూలు పాటే పాడింది. 'డాడీ.... మమ్మీ' అంటూ.
    "కమాన్ మనీషా, మీరింత పెద్ద అయ్యారు. ఇండిపెండెంట్ గా బిజినెస్ చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలు మీ అంతట మీరు తెలుసుకోలేరా. ఓరోజు ఫ్రెండ్ తో లంచ్ కో, డిన్నరుకో వెళ్ళడానికి పర్మిషన్ కావాలా- రాత్రి అయితే మీ పెద్దవాళ్ళు అభ్యంతరం పెట్టవచ్చు- అందుకే లంచ్ కి అంటున్నాను..."
    'సన్ డే ఇంట్లో వుంటాగదా. మమ్మీకి చెప్పకుండా ఎలా వెడతాను' మనీషా గొణిగింది.
    'పోనీ వీక్ డేస్ అయితే అభ్యంతరం వుండదు గదా, మీ బుటిక్ నించి లంచ్ టైములో వెడదామా?" మనీషా కాసేపు ఆలోచించి 'చూద్దాం' అంది. అప్పటికి దివాకర్ ఇంక రెట్టించకుండా వూరుకున్నాడు.
    
                                   * * *
    
    సోమవారం ఠంఛనుగా వంటిగంటకల్లా మనీషా బుటిక్ చేరుకున్నాడు. మనీషా కాస్త తెల్లబోయింది. 'అదేమిటి అలా ఆశ్చర్యపోతున్నారు. వీక్ డేస్ ఓకే అని మీరే అన్నారుగా' మనీషా ఇబ్బందిగా చూసింది.
    'ఇవాళే అనుకోలేదు' అంది కాస్త అయిష్టంగా.
    'దీనికి పెద్ద ప్రోగ్రాం ఏముంది- పదండి అలా కాసేపు ఎటో వెళ్ళి లంచ్ చేసి వద్దాం' మనీషా ఇంకే అనలేక తన అసిస్టెంట్ తో చెప్పి, క్యాష్ డ్రాయరు తాళం వేసి బ్యాగు పట్టుకుని నడిచింది.
    హోటల్ లొ ఆర్డరు ఇచ్చాక 'ఏమిటి మీరలా ఇబ్బందిగా వున్నారు. బలవంత పెట్టానని అనుకుంటున్నారా' దివాకర్ మాటల్లో దించడానికి మొదలు పెట్టాడు. మనీషా బలవంతంగా నవ్వి 'ఎవరన్నా చూస్తే ఏమంటారోనని'
    'అబ్బ మనీషా, మీ ఆడవాళ్ళు చదువుకుంటారు. మోడర్న్ గా వుంటారు. స్వతంత్రంగా సంపాదించి ఎవరి మీదా ఆధారపడని దశకి వచ్చినా ఇంత చిన్న చిన్న వాటికి భయపడతారేమిటి. ఫ్రెండ్స్ తో భోజనం చెయ్యడం తప్పా....?'
    'తప్పని కాదు, డాడి మమ్మీకి చెప్పకుండా....' నసిగింది.
    'చెప్పండి సాయంత్రం ఇందులో భయానికి ఏముంది' రెట్టించాడు మనీషా జవాబివ్వలేదు. ఈలోగా వెయిటర్ ఆర్డరు తీసుకొచ్చి టేబిల్ మీద సర్దాడు.
    'మీరు చాలా అన్ కంఫర్ట్ బుల్ గా వున్నారు. ప్లీజ్ రిలాక్స్- ఈసారి మీ వాళ్ళని పర్మిషన్ అడిగే పిలుస్తాలెండి....' వాతావరణం తేలికపరచడానికి అన్నాడు. మనీషా స్పూనుతో భోజనం కెలుకుతుంది. ఆమె భయానికి తగ్గట్టుగానే-
    'హాయ్ మనీషా...' అంటూ వాళ్ళ పక్కింట్లో వుండే సునీల్ అగర్వాల్ మనీషాని చూసి చనువుగా వచ్చి పలకరించాడు. 'హాయ్ సునీల్ నీవిక్కడ' అంది మనీషా కాస్త తేలికపడి.
    'మా ఫ్రెండ్ బాంబే నుంచి వచ్చాడు. లంచ్ కి వచ్చాం ఇద్దరం' అంటూ తనతో పాటు వున్న యువకుడిని 'సంజయ్ అంటూ పరిచయం చేశాడు.
    మనీషా దివాకర్ ని చూపిస్తూ 'మిస్టర్ దివాకర్, మీ జీజాజీ ఫ్రెండ్, మా ఫామిలీ ఫ్రెండ్, మా బ్యాంకర్' అంటూ పరిచయం చేసింది. 'సునీల్ మా ఇంటి పక్కనే ఉంటాడు. ఇద్దరం చిన్నప్పటి నుంచి మెట్రిక్ దాకా ఒకే స్కూలులో చదివాం చైల్డ్ హుడ్ ఫ్రెండ్ షిప్' అంటూ పరిచయం చేసింది.
    దివాకర్ వీళ్ళ రాకకు ఏమాత్రం సంతోషించకపోయినా పైకి మర్యాదగా 'హలో, నైస్ టు మీట్ యూ' అంటూ ఇద్దరితో చేతులు కలిపాడు. వాళ్ళు తొందరగా వదిలితే బాగుండును అనుకునే లోపల మనీషా వై డోంట్యూ, జాయిన్ అజ్' అంటూ ఆహ్వానించింది. 'విత్ ప్లెజర్' అంటూ కుర్చీలు లాక్కుని కూర్చున్నారు ఇద్దరూ- దివాకర్ మొహం మాడిపోయింది. ఏమనాలో తెలియక వెర్రినవ్వు నవ్వాడు.

 Previous Page Next Page