"తీసుకెళ్ళి లోపల పడేయండి" కానిస్టేబుల్స్ కి ఆజ్ఞాపించాడతను. మరుక్షణం నలుగురు కానిస్టేబుల్స్ దిగి అతని చేతులకు బేడీలు వేసి ఈడ్చుకెళ్ళి జీప్ వెనుక సీట్ల కింద పడేశారు. అప్పటికే కొంతమంది జనం మూగిపోయరక్కడ. సృజన్ కి వారిని చూస్తుంటే ఆశ కలిగింది. ఏ ఒక్కరయినా ముందుకొచ్చి పోలీస్ లను ప్రశ్నిస్తారేమోనని. కానీ అందరూ తమాషా చూసి ఆనందించడానికే వచ్చినట్లు తెలిసిపోతోంది.
జీప్ బయల్దేరింది. అతి వేగంగా జనాన్ని తప్పించుకుంటూ పోలీస్ స్టేషన్ చేతుకుంది. ఇన్ స్పెక్టర్ రాహి దిగి లోపలికెళ్ళిపోయాడు. సృజన్ ని లోపలకు తీసుకెళ్ళారు వాళ్ళు.
"నీకేం చెప్పాన్రా! ఈ వూరు వదిలి మీ ఊరు వెళ్ళిపొమ్మన్నానా?" రౌద్రంగా అరిచారు రాహి. బెల్టు తీసి పట్టుకుంటూ.
సృజన్ కి భగ్గుమంది. అతడు మళ్ళీ "రా" అని సంభోదించేసరికి కానీ భారతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చేసరికి టక్కున మాట్లాడబోయి తయారయించుకున్నాడు.
"వెళ్ళిపోతూన్నానని చెప్పాను కదా" అతికష్టం మీద కోపం అణుచుకున్నాడు.
"మరి ఈశ్వర్ ఫార్మానుటికల్స్ కి వెళ్ళి అల్లరి చేశానని కంప్లెయింట్ ఎందుకొచ్చింది?"
సృజన్ షాక్ తిన్నాడు.
"అల్లరి చేశానని కంప్లెయింట్ ఇచ్చారా?"
"అవున్రా బాస్టర్డ్! నీకు వళ్ళు కొవ్వెక్కి ఇక్కడన్నీ వెధవ్వేషాలేస్తున్నావ్! మర్యాదగా ఇప్పుడు బస్ కి వెళతావా, లోపల వేయమన్నావా?"
సృజన్ అతని మాటలు వినిపించటం లేదు. మనసు ఇంకెక్కడో విహరిస్తుంది వేగంగా . ఫార్మానుటికల్స్ కంపెనీ వాళ్ళు తన మీద కంప్లెయింటు ఎందుకిచ్చినట్లు? తను అక్కడేమీ గొడవ చేయలేదే. అంటే వాళ్ళు కావాలని -- ఏదో కక్షకొద్దీ- తనమీద కంప్లెయింటు ఇచ్చినట్లు కనబడుతోంది! ఇదేదో తాననుకున్న దానికంటే లోతుగా వెళ్ళాల్సి వచ్చేట్లుంది. కానీ ఈ రాహి లాంటి ఇన్ స్పెక్టర్లు వల్ల తనకు అంతరాయాలు ఎక్కువగా కలిగేట్లున్నాయ్.
"నేను రాత్రికి వెళ్ళిపొడల్చుకున్నాను" అన్నాడు సృజన్.
రాహి లో కోపం కొంత తగ్గింది.
"సరే చూస్తాను! తెల్లారి మళ్ళీ ఎక్కడయినా నీ ముఖం కనిపించిందంటే జాగ్రత్త! ఈసారి నాకు దయాదాక్షిణ్యాలుండవ్."
సృజన్ మౌనంగా ఉండిపోయాడు.
కానిస్టేబుల్స్ అతని చేతి బేడీలు తీసేశారు.
సృజన్ బయటికొచ్చేశాడు.
అతనికేమీ అర్ధం కావటం లేదు. ఎక్కడో ఏదో చిక్కుపడి వుంది. అన్నయ్య హత్య, ఈశ్వర్ వర్మ, ఇన్ స్పెక్టర్ రాహి, బీచ్ వేపు నడవసాగాడతను.
అప్పటికే సముద్రపు గాలి తిరిగింది. సముద్రంలోకి చొచ్చుకు పోయిన కాంటీన్ లో కెళ్ళాడు.
"ఏం కావాలి?" అడిగాడు బేరర్.
"టీ----"
ఆతడు టీ తెచ్చిచ్చాడు.
సృజన్ కి వదిన గుర్తుకొచ్చింది. తక్షణం యింటికి వెళ్ళిపోవాలన్న ఆత్రుత ప్రారంభమయింది.
టీ తాగి బీచ్ లో కూర్చున్నాడు. వెల్తురు తగ్గిపోతున్న కొద్దీ సముద్రం భయంకరంగా మారిపోతోంది. బీచ్ లో జనం కూడా ఎక్కువయిపోయారు.
రాత్రి తొమ్మిదయింది. అతనికి మెలకువ వచ్చేసరికి.చటుక్కున ఇసుకలోంచి లేచి కూర్చున్నాడు. ఎప్పుడు నిద్రలోకి జారిపోయాడో తనకే తెలీదు. త్వరగా లేచి రోడ్ వేపు అడుగులు వేశాడు వడివడిగా.
భారతి ఇంటికి చేరుకునేసరికి ఆమె ఎదురు చూస్తూ కూర్చుని ఉంది తనకోసం.
"రండి! ఇవాళ మా బాబాయ్ ఆఫీసు కెళ్లలేదసలు! ఇంట్లోనే వున్నారు" అంటూ ఆహ్వానించిందామె.
"ఓ! అలాగా?"
"వంట్లో బావుందలేదని ఉండిపోయారు! కూర్చోండి పిలుచుకొస్తాను."
లోపలికెళ్ళిందామె.
సృజన్ కుర్చీలో కూర్చున్నాడు.
అయిదు నిమిషాల తర్వాత విశ్వేశ్వరరావ్ బయటి కొచ్చారు టవల్ భుజాన వేసుకుని.
"నమస్కారమండీ!" లేచి నిలబడి నమస్కరించాడు సృజన్.
"నమస్తే! కూర్చో" అంటూ తనూ ఓ కుర్చీలో కూర్చున్నాడతను.
సృజన్ కూర్చున్నాడు.
"అమ్మాయి చెప్పింది! ఈశ్వర్ వర్మ గురించి ఏదో తెలుసుకోవాలన్నావని"
"అవునండీ! మా అన్నయ్య అయన ప్రకటించిన ఉద్యోగప్రకటన చూసే వైజాగ్ వచ్చాడని నాకు అనుమానంగా ఉంది. కానీ ఇక్కడ అన్నయ్య ఏం చేశాడు? ఎందుకు ఎవరితో విరోధం వచ్చిందా ఎందుకు అన్నయ్యను చంపారు అనే విషయాలు తెలియాలంటే అన్నయ్య ఈశ్వరవర్మ కంపెనీలో చేరాడా లేదా అనే విషయం తెలియాలి. కానీ నేను ఈశ్వరవర్మ తాలుకూ ఫార్మానుటికల్స్ కంపెనీ కెళ్తే వాళ్ళెవ్వరూ ఎలాంటి వివరాలూ ఇవ్వటం లేదు. కనుక అసలు ఈశ్వరవర్మ గురించి పూర్తీ వివరాలు తెలుసుకోవాలనిపించింది."