ఏనుగులు భయభ్రాంతమైపోయాయి. గుర్రాలు కట్లు తెంచుకు పారిపోయాయి! ఇంటెలు విరుచుకుపడిపోయాయి! రధాలు తలకిందులైపోయాయి!
క్షణాల్లో అంతా అల్లకల్లోలం అయిపొయింది.
ఓ యమ్మో! ఏమిటది?" అన్నాడు భైరవన్ అదిరిపడి.
రాజా ఇంతకుముందు ఓసారి ఇలాంటి అనుభవానికి గురి అయి ఉన్నవాడే కాబట్టి , క్షణాల్లో తేరుకుని అన్నాడు.
"మీరేం భయపడకండి! అది మా ఆస్థానగాయకుడు తాన్ సెయిన్ ఉరఫ్ సుబ్బిరాజ్ కంఠం! బహుశా మీ ముందు ఓ పాట పాడి సినిమా ఛాన్సుల కోసం ట్రై చేద్దామనుకుంటున్నాడెమో!"
"మురగా! మురగా!" అంటూ నటరాజన్ పడీ పడీ నవ్వడం మొదలెట్టాడు.
అదే టైం లో.
ఆ గందరగోళానికి భయపడి, ఒక సింహం అదుపుతప్పి అటూ ఇటూ పరిగెత్తడం మొదలెట్టింది.
మాములుగా అయితే సినిమాల్లో సింహాలకు నోరు కుట్టేస్తారు - వాటివల్ల ప్రమాదం ఏమి లేకుండా!
కానీ నటరాజన్ పద్దతి అదికాదు -
అతనికి జంతువులంటే పంచప్రాణాలు -
అందుకనే అతను జంతువులకి మాగ్లిమమ్ ట్రైనింగ్ ఇస్తాడు గానీ, నోళ్ళు కుట్టేయ్యడం లాంటి అనాగరికపు పనులు చెయ్యడు.
అందువలన -
నోరు కుట్టివేయబదకుండా , బలంగా , కోపంగా , అయోమయంగా ఉన్న ఆ సింహం జనం మధ్యలో పడింది.
వెరీ డేంజరస్ సిచ్యుయేషన్!
అదే టైంలో -
వేరే ప్లేస్ లో -
అప్పటిదాకా రాతి బొమ్మలా కూచుని వున్న జస్వంతరావులో కదలిక వచ్చింది.
అతను తన మనసులో ఏదో గుణించుకూని ,
"ఈ సమస్యని సాల్వ్ చెయ్యాలంటే , సరిగ్గా నాలుగువేల ఆరువందల సంవత్సరాలు పడుతుంది - కనీసం నాలుగువేల ఆరువందల సంవత్సరాలు!!" అనుకున్నాడు నిస్పృహగా!
గతంలో సినిమా షూటింగులు చాలా వరకూ స్టూడియోలలో వేసిన సెట్ లలోనే జరిగేవి. చివరికి ఉద్యానవనం వగైరా సెట్ లు కూడా స్టూడియోలోనే వేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
కాలక్రమేణా స్టూడియోలలో సినిమా షూటింగులు చేయడం తగ్గిపోయి నిజమైన ఇళ్ళలోనూ, రోడ్లమీద , పార్కులలో అక్కడా తీయడం ఎక్కువైపోయింది. ఈ రెండు పద్దతులలో కూడా దేనిలో ఉండే సౌలభ్యాలు దానిలో వున్నాయి. దేనిలో వుండే కష్టనష్టాలు కూడా దానిలో వున్నాయి.
ఇళ్ళలోను అక్కడ సినిమా షూటింగులు జరుగుతున్నప్పుడు, ఆ షూటింగులకి అవసరమైనంత మేర ఖాళీ చేసి యూనిట్ కి అప్పగించి, మిగతా భాగంలోనే ఓనర్లు టెంపరరీగా సర్దుకుని ఉండడం రొటీన్ గా జరుగుతూ ఉంటుంది. షూటింగు జరుగుతున్నప్పుడు ఇంటి ఓనరు తాలూకు మనుషులు కుతూహలంగా ఓ పక్క నుంచి షూటింగు చూస్తూ ఉండడం కూడా చాలా కామనే!
ఇవాళ రాణీపూర్ పాలెస్ లో కూడా అదే తంతు జరుగుతూ వుంది.
షూటింగ్ చూస్తున్న వాళ్ళతో బాటు తను కూడా చూస్తూ నిలబడి ఉంది అయేషా. ఆమె అక్కడ అలా నిలబడి ఉండడంలో ఇంకో అంతరార్ధం కూడా ఉంది.
అయేషాకి తన మీదా, తన అందం మీదా చెప్పలేనంత నమ్మకం ఉంది! అందులోను తను మిస్సిండియా! మిస్సిండియాలకు నెక్స్ ట్ స్టెప్ ఏమిటి? సినీ రంగ ప్రవేశమే కదా!
"ఈ మెగా ప్రొడ్యుసర్ నటరాజన్ దృష్టి ఒక్కసారి తనమీద పడిందంటే చాలు."
"మరుక్షణం సినీ ఛాన్సు వచ్చి తన కాళ్ళ దగ్గర వాలుతుంది అనుకుంది అయేషా.
బంగారం లాంటి సినీ ఛాన్సు బదులు బలిష్టమైన ఒక సింహం తనమీదికి లంఘిస్తుందని కలలో కూడా అనుకోలేదు అయేషా!
గుండెలు పగిలేలా గాండ్రిస్తూ తనమీదికి లంఘించిన ఆ సింహాన్ని చూడగానే అయేషా పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి!
సింహం పంజా ఇంకో క్షణంలో అయేషా వక్షాన్ని చీల్చేస్తుందనగా -
హటాత్తుగా అక్కడికి ఉరికాడు రాజా -
షేక్ హాండ్ ఇస్తున్నట్లు సింహం పంజాని తన చేత్తో అందుకున్నాడు. అతి లాఘవంగా సింహాన్ని గాల్లోనే గిర్రున తిప్పి, కింద పడేశాడు.
ఈలోగా నటరాజన్ కూడా రంగంలోకి దూకాడు "కామాక్షి !" అన్నాడు సింహాన్ని పేరు పెట్టి పిలుస్తూ.
నటరాజన్ గొంతు వినగానే , "కామాక్షి" అనే ఆ సివంగి , మళ్ళీ లేవబోతున్నదల్లా పిల్లిపిల్లలా అయిపోయి, నటరాజన్ కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడింది.
కామాక్షి అనే సివంగిని కంట్రోలు చేశాక నటరాజన్ త్వరత్వరగా రాముడు, భీముడు, సోముడు అనే ఏనుగలనీ, షణ్ముగం అనే గుర్రాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి అటువైపు పరిగెత్తాడు!
కొద్ది నిమిషాలలో గలభా సర్దుమణిగింది. సుబ్బిరాజ్ గాత్రంతో భయపడిపోయిన జంతువులన్నీ కూడా నటరాజన్ బుజ్జగింపులతో మళ్ళీ మాములుగా అయిపోయాయి. జంతువులని అదుపు చేయడంలో నటరాజన్ కి రాజా బాగా సాయం చేశాడు.
సివంగి కామాక్షిని దువ్వుతూ, రాజాతో ఆర్ద్రంగా చెప్పాడు నటరాజన్. "రాజా! ఇవి జంతువులు కావు! ఇవన్నీ నా పిల్లలు. ఇదిగో - ఈ కామాక్షి ఉందా! ఇది నా కూతురు లాంటిదే? ఈ అమ్మాయికి నేనంటే ఎంత పితృభక్తో చెప్పలేం! ఎవడో మూర్ఖుడు వేట పేరుతొ దీని తల్లిని చంపేశాడు. అడవిలో కామాక్షి అనాధ అయిపొయింది. నేను తెచ్చి గారాభంగా పెంచాను. నా దగ్గరే వుంచేసుకున్నా!"
"ఇంతకీ ఆ దొంగ మూతివాడెవడో పాటపాడితే - అని ఇంకోసారి నవ్వి - ఇంత గలభా ఎట్లా జరిగిందయ్యా -" అన్నాడు.
రాజా ఏదో చెప్పబోయేటంతలోనే -
షూటింగ్ చూడడానికి గాను వంటపని మానేసి అక్కడికి వచ్చేసిన బీంసెయిన్ అతి ఉత్సాహంగా చెప్పాడు.
"నాకు తెల్సు సార్!"
"ఏమయింది?" అన్నాడు రాజా.
"మీకు చిక్కడు దొరకడు తెలుసా సార్?"
"చిక్కడు - దొరకడు ఎవరు?" అన్నాడు రాజా.
"చిక్కడు - దొరకడు అంటే , అది పందిలాగా బలసిన పందికొక్కు సార్! ఈ పాలెస్ లో నేను వండిన వాటిల్లో సగం అదే తినేస్తుంది! దాన్ని పట్టుకొని చంపాలని చూస్తే దొరికి చావందే! అందుకే దానికి చిక్కడు - దొరకడు ' అని పేరు పెట్టేశా! దాని అంతం చూడాలనే పట్టుదలతో పాషాణం అనే పరమ భయంకరమైన విషంతో రకరకాల స్వీట్లు చేసిపెట్టినా , ఆ పందికొక్కు గ్రహించి విషం ఉన్న వాటిని మాత్రం తినకుండా వదిలేస్తుంది. ఇవాళ జరిగిన గొడవ వల్ల తెలిసింది. పందికొక్కు గారి కాపరం పాడుబడిన బురుజులోనే అని!" అన్నాడు భీంసెయిన్.
"ఇంతకీ ఇప్పుడు జరిగిన గొడవకీ చిక్కడు - దొరకడు అనే పందికొక్కుకి సంబంధం ఏమిటి?" అన్నాడు రాజా.
"చాలా వుంది సాబ్! పందికొక్కు పరమాన్నం తిని బురుజులో పవ్వళించి ఉండగా సుబ్బిరాజ్ కూడా అక్కడే తన పాట మొదలుపెట్టాడు. అదే టైం లో , అయేషాగారి పిల్లిపిల్ల కూడా అక్కడే ఎలుకల గురించి కలలు కంటూ పడుకుని వుంది. సుబ్బిరాజ్ కర్ణకఠోరంగా పాడడం మొదలెట్టగానే పందికొక్కు అదిరిపడిలేచి ఆ కంగారులో పిల్లి తోకని కరిచింది."
"ఇదేదో రివర్స్ లో జరిగినట్లుందే! పందికొక్కు పిల్లి తోకని కరిచిందా?" అన్నాడు రాజా ఆశ్చర్యంగా.
"ఏ టూ జడ్ అంతా రివర్సే సార్! పందికొక్కు పిల్లి తోకని కరిచిందా? పిల్లి హడలిపోయి బురుజు మీదనుంచి కిందికి దూకేసి అక్కడే వున్న కుక్క చెవ్వు పీకింది. కుక్క కుయ్యోమంటూ , కల్యాణి అనే గుర్రం మీదికి దూకింది."
వింటున్న నటరాజన్ పెద్దగా నవ్వి చెప్పాడు. "మిగతాది నేను చూశా! ఆ టైం లో కళ్యాణి అనే గుర్రం మీద మా చింపాంజీ రోమియో కూర్చుని అజమాయిషీ చేస్తూ అటూ ఇటూ తిరుతుతోంది.'
"మీ జంతువులన్నిటికి దేవుళ్ళ దేవతల పేర్లు పెట్టారు కదా! మరి చింపాంజీకి మాత్రం రోమియో అని పేరెందుకు పెట్టారు?" అన్నాడు భీంసెయిన్ తికమకగా. అతను అప్పటికే యూనిట్ లో జంతువుల పేర్ల దగ్గర్నుంచి అందరి పేర్లు తెలుసుకున్నాడు. ప్రజల సినిమా క్రేజ్ అంటే అలా ఉంది.
"మురగా! మురగా!" అని మళ్ళీ పెద్దగా నవ్వాడు నటరాజన్.
"మా చింపాంజీకి రోమియో అని ఎందుకు పేరు పెట్టనంటావా? దానికి ఆడోళ్ళంటే పిచ్చ! కొంగు కనబడితే చాలు కోతి చేష్టలు మొదలెడుతుంది! అక్కడున్న జూనియర్ ఆర్టిస్టుల్లో సిల్లి లిల్లీ అనే ఓ అమ్మాయి ఉంది . ఆ పిల్ల దాని దృష్టి హీరో గారి మీద వుంది. కానీ తన్ను లవ్ చేస్తోంది రోమియో అనే కోతి అని ఆ పిల్లదానికి తెలీదు. ఆ సిల్లి లిల్లీ అందాన్ని కళ్ళార్పకుండా చూస్తోంది గుర్రం మీద ఉన్న రోమియో - గుర్రం మీదికి కుక్క దూకగానే సకిలిస్తూ వెనక కాళ్ళ మీద నిలబడింది. తక్షణం డ్రీంలాండ్ లో నుంచి కిందపడిన రోమియో కాస్తా సివంగి కామాక్షి మీదికి దూకింది. కామాక్షి ఏనుగు రాముడి కుంభస్థలం మీదికి గెంతింది" అన్నాడు పొట్ట పట్టుకుంటూ.
దానితో జరిగిపోయిన మిస్టరీ ఏమిటో అందరికి అర్ధమైపోయింది! అంతటా గలగల నవ్వులు వినబడ్డాయి.
"ఊఊ..........నవ్వులు చాలు - పని ముఖ్యం - నెక్స్ సీన్ ఏమిటి? మన విలన్ ఏడీ? అన్నాడు మెగా ప్రొడ్యుసర్ నటరాజన్.
అతను అలా అంటూ ఉండగానే! రియల్ లైఫ్ ఇంటర్నేషనల్ విలన్ అయిన క్లయివ్ స్పెన్సర్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు.
క్లయివు స్పెన్సర్ సీన్ లోకి ఎంటరవుతూనే అక్కడ జరుగుతున్న తంతంగం వైపు చాలా అవహేళనగా చాలా అసహనంగా చూశాడు.
"ఇండియాకి సంబంధించిన ప్రతిదీ నాసిరకమే!" అని వెస్టర్న్ కంట్రీస్ లో చాలా మందికి ఉండే భావమే క్లయివుకి కూడా చాలా బలంగా ఉంది.
ఒక్క చూపులోనే క్లయివు మనసులో మెదులుతున్న భావం గ్రహించగలిగాడు రాజా. అతనికి అనిపించింది.
ఈ క్లయివు ఇంకా ఫర్వాలేదు!
ఇండియాని గురించి కూలంకుషంగా తెలిశాకే అలాంటి నమ్మకం ఏర్పరచుకున్నాడు క్లయివు.
కానీ మిగతా విదేశీయులలో చాలా మంది దృష్టిలో ఇండియా అంటే ఏమిటి?
ఇండియా అంటే పాములు పట్టేవాళ్ళు , ఏలుగ్గోడ్లని ఆడించేవాళ్ళు , దిగంబర సన్యాసులు , హాఫ్ నేకేడ్ ఫకీర్లు , మేకుల పరుపుల మీద పడుకుని, వాయు భక్షణ చేసే యోగులు, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఉండే దేశం!
చాలామంది విదేశీయుల దృష్టిలో ఇండియన్ అంటే ఏ రాజానో మహా రాజానో అయి ఉంటాడు. లేదా! హాఫ్ నేకేడ్ ఫకీర్ అయి వుంటాడు!
వాళ్ళ ఉహాలోకంలో ఇండియన్ రోడ్ల మీద ఏనుగులూ, ఒంటెలు తిరుగుతూ ఉంటాయి. వేదేశాల్లో మన ఇమేజ్ ఇలా వుంటే కొంతమంది పని కట్టుకుని ఆ ఇమేజ్ ని చెక్కు చెదరనివ్వకుండా అలానే ఉండనివ్వలని చూస్తూ ఉంటారు.
ఉదాహరణకి - "బీబీసీ" నే ఉంది.
బీబీసీ అంటే బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్.
బీబీసీలో రేడియో, టెలివిజన్ కూడా ఉన్నాయి.
బీబీసీ వరల్డు న్యూస్ అంటే ఇండియన్స్ లో చాలామందికి చాలా నమ్మకం - గౌరవం కూడా.
ఆ నమ్మకం - గౌరవం ఇండియన్స్ కి దూరదర్శన్ వార్తల మీదుండదు.
ఎందుకనీ అంటే - టీవీ అన్ చేస్తే చాలు -
దూరదర్శన్ మంత్రిపుంగవులు, వారుచేసే శంకుస్థాపనలు, శ్రీవారు పూలహారాలు వేయించుకోవడాలు, సమాధులు చుట్టూ తిరిగి శ్రద్దాంజలి ఘటించడాలు, ఉద్ఘటనలు, చెప్పే అసత్యాలు, అర్ధసత్యాలు - ఇవే!
ఇవన్నీ చూసి -
లేదా - ఇవన్నీ చూడలేక ఇండియన్ ఆడియన్స్ అసలయిన వార్తల కోసం బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ వారి వరల్డు న్యూస్ సర్వీస్ ని ఆశ్రయిస్తారు.
బీబీసీ కి ఇండియాలో కరస్పాండెంట్ మార్కెటల్లీ. అతను దశాబ్దాల తరబడి ఇండియాలోనే ఉంటున్నాడు. ఇండియన్ గవర్నమెంటు అతనికి పద్మశ్రీ బిరుదు ఇచ్చింది కూడా.
ఇంతచేసినా మార్కటల్లికి ఇండియా అంటే సన్నటి ద్వేషం ఏదో ఉంటూనే ఉంది. అతను పంపించే వార్తలలో ఇండియా వ్యతిరేకత స్పష్టంగా కనబడిపోతూ ఉంటుంది.
ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలంటే -
బీబీసీ న్యూస్ లో పారిస్ వార్తల గురించి చెప్పవలసి వస్తే బ్యాక్ గ్రవుండ్ లో పారిస్ లోని ఐఫిల్ టవర్ ని చూపిస్తారు. లండన్ వార్తలు చెప్పవలసివస్తే లండన్ లోని బిగ్ బెన్ అనే ఫేమేస్ గడియారాన్ని చూపిస్తారు - కానీ డిల్లి గురించి ఏదయినా చెప్పవలసివస్తే తక్షణం బాక్ గ్రవుండ్ లో ఇరుకు, మురికి సందులు, రోడ్డుకి అడ్డంగా పడుకుని వున్న ఆవులూ, దుమ్ము ధూళీ వంటిమీద బట్టలు లేని పిల్లలూ ఇలాంటి దృశ్యాలే చూపిస్తారు.
పోనీ -
ఇండియా అన్నా ఇండియన్స్ అన్నా విదేశియిలకి ఉన్న ఈ హీనమైన అభిమానాన్ని దూరం చెయ్యడానికి మన ప్రభుత్వం ఏమన్నా ప్రయత్నిస్తూన్నదా?
ఉహూ కాదు!
డానికి తోడు -