16
పన్నెండేళ్ళు గడిచిపోయాయి.
చిన్మయి మద్రాసు విడిచిపెట్టి వెళ్ళలేదు. ఎక్కడికని వెళుతుంది? ఎక్కడని ఆశ్రయం తీసుకొంటుంది?
రాజీవ్నుండి విడిపోగానే తల్లికి ఉత్తరం రాసేసింది.
"అమ్మా!
ఎంతో జాగ్రత్తగా పదిలంగా పెంచుతూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ వస్తోన్నా నా జీవితం పగిలిపోక తప్పలేదు. నన్ను నేను కాపాడుకోలేక పోయాను.
మనిషికి తనమీద తనకు ఎంత ఆప్తులైనా ఇతరులకీ కొంతవరకూ ప్రభావం వుంటుందే తప్ప సాధికారం ఇవ్వలేదని నా ఉదాహరణతో అర్ధమైంది.
ఎంతో అందంగా గడపాలనుకొన్న జీవితాలు పరిస్థితుల ప్రాబల్యంవలన ఎంత విస్తృతంగా రూపురేఖలు దిద్దుకుంటాయో తెలుసుకున్నాను.
జైర్గిపోయిందేదో జరిగిపోయింది. నేనెలాగో ఓలా బ్రతకక తప్పదు. నేను మిమ్మల్నెవర్నీ కలుసుకోను. నా దగ్గరకు మీరెవరూ రావద్దు. వస్తే కలుసుకునే అవకాశమివ్వను.
మీకో నాకో అవసానదశలో వచ్చినప్పుడు ఫార్మాలిటీస్ కోసం ఎలానూ తప్పదు.
చిన్మయి.
చిన్మయి రాజీవ్ నుండి విడిపోయాక వెంటనే ఆ ఇంటిలోనుండి వెళ్లిపోయింది. తెలిసిన వాళ్ళు ఎవరూ ప్రక్కన వుండకూడదు. ఈ లొకాలిటీ వాళ్ళకసలు కనిపించకూడదు.
చింతాద్రివేలులో చౌకగా దొరికిన రెండుగదుల పోర్షన్ తీసుకొని అందులో వుంటోంది.
అతన్నుండి విడిపోయేటప్పుడు "కిరణ్ ని మీరు తీసేసుకోండి. ఈ బరువు నేను భరించలేను" అని వేడుకొంది.
ఈ సమస్యను గురించి రాజీవ్ ఎంతో ఆలోచించాడు. తన ఆలోచనలన్నీ బయటకు చెప్పకుండా "సారీ" అన్నాడు ఒక్కముక్కలో.
చిన్మయి ఇంకేమీ వాదించలేదు.
* * *
సాయంత్రం ఐదైంది. చిన్మయి ఆఫీసునుండి వచ్చి కాఫీ త్రాగి కిరణ్మయికోసం గబగబ టిఫిన్ తయారుచేసి ఎదురుచూస్తూ కూర్చుంది.
ఓ అరగంట తర్వాత కిరణ్మయి వచ్చింది. ఆమె ఇప్పుడు బి.ఏ. ఫస్టియర్ చదువుతోంది.
తల్లి అంటే ఆమెకు పంచప్రాణాలు.
రాగానే బుక్స్ టేబుల్ మీద పెట్టేసి ఆమెని గట్టిగా కౌగలించుకొని బుగ్గమీద ముద్దు పెట్టుకుంటుంది.
"మమ్మీ! ఆకలేస్తోంది" అంది కిరణ్ గారాబంగా.
చిన్మయి టిఫెన్ ప్లేటు తీసుకొచ్చి ఆమెకు అందించింది.
"మమ్మీ! నువ్వింత బాగా వంటలూ, అవీ తయారుచేస్తావు. నాకు నేర్పించామంటే నేర్పించవేం."
"కిరణ్! నువ్వు ఇవన్నీ నేర్చుకోవలసిన అవసరం లేదు. ఇవి నేర్చుకోనందువలన వచ్చిన నష్టమేమీ లేదు. నువ్వు బాగా చదువుకోవాలి. పైకి రావాలి. అదే నా ధ్యేయం."
"చదువుకుంటాను మమ్మీ నేనేమి కావాలని అనుకుంటున్నావో చెప్పు. అయి తీరతాను" అంది కిరణ్మయి శపధం చేస్తున్నట్టుగా.
చిన్మయి నవ్వింది.
"నాకు ప్రత్యేకమైన రూపకల్పనలేమీ లేవు కిరణ్. ఒక డాక్టరైతేనే, లేక ఇంజనీరైతేనే, లేకపోతే ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అయితేనే పైకి వచ్చినట్టు లేకపోతే కాదు అనుకునే మనస్తత్వం కాదు నాది పైకి రావాలంటే ఎన్నో రకాల ఉద్యోగాలూ, ప్రొఫెషన్సూ వున్నాయి. టాలెంట్ వుంటే ఎందులోనైనా షైన్ అవచ్చు."
తల్లి ఏమి చెప్పినా కిరణ్మయికి నచ్చుతాయి.
ఆమె కూతురికి ఎంత గారాబం చేసినా, ఎంత ప్రేమగా చూసినా కొన్ని విషయాలలో మాత్రం చాలా కఠినంగా వుంటుంది. కిరణ్మయి కాలేజీనుండీ తిన్నగా ఇంటికి రావలసిందే. ఫ్రెండ్స్ ఇళ్ళనీ, పార్టీలనీ అటూ ఇటూ తిరిగితే ఒప్పుకోదు. గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరుపడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తే ఒప్పుకునేదికాదు. ఒక్కచూపుతో తన విముఖత్వాన్ని తెలియచేసేది. కొంతమంది ఆడపిల్లల్తో కూడా వాళ్ళ మాటలుగాని, ప్రవర్తనగాని నచ్చకపోతే వాళ్ళతో స్నేహం చెయ్యనిచ్చేదికాదు.
తల్లిధోరణికి మనసులో ఏమనుకుందో గాని బయటకు మాత్రం ఎదురు చెప్పేది కాదు కిరణ్మయి. ఆమె ఇష్టప్రకారమే నడుచుకునేది.
"కిరణ్! నువ్వు చదువుకుంటూ వుండు. నేను మార్కెట్ కి పోయి సరుకులు తీసుకొస్తాను" అని బజారు బయల్దేరింది చిన్మయి. ఆమెకారోజు జీతమొచ్చింది.
కూతురు చదువు పాడవుతుందని ఎప్పుడోగాని తనతో బయటకు తీసుకెళ్ళేది కాదు.
మార్కెట్ లో భుజంమీద చెయ్యిపదేసైర్కి తలత్రిప్పి చూసింది.
ఆనంద!
"మీరా!" అంది చిన్మయి కొంత ఆశ్చర్యంతో, సంతోషంతో.
"అబ్బ! ఎన్నాళ్ళయింది చూసి."
ఈ పన్నెండు పదమూడేళ్ళ కాలంలో ఆమె తనకెప్పుడూ తటస్థపడలేదు. తెలిసిన వారెవరూ కనబడకుండా వుండాలనే మెయిన్ మార్కెట్స్ కి వెళ్ళకుండా చిన్న చిన్న వాటికి వెళుతూ వుంటుంది. ఈ వైపు షాపింగులకు ఎవరూ రారుకూడా.
ఆనందలో చాలా మార్పువచ్చింది. మునుపటికన్న వొళ్ళు, మోహంలో మోటుతనం మాటమాత్రమలాగే వుంది.
"బావున్నారా? ఈ మధ్య ఎన్నోసార్లు గుర్తొచ్చారు. ఎడ్రస్ తెలుసుకుని రావాలనిపించింది కూడా. ఎవరూ సరిగా చెప్పలేదు. అసలు నేను ఇటు వైపులకి రాను. ఇక్కడకు కొత్తగా బంధువులొస్తే కార్లోవచ్చి యింట్లో కొన్ని అయిపోయినట్లు గుర్తురావటంతో వచ్చాను. ఈమధ్య... యీ మధ్యేమిటి అయిదారేళ్ళయిందిలెండి కారు కొన్నాము. మీరేమిటి యిన్నేళ్ళయినా అలానే వున్నారు. ఇంతచక్కగా పాతికేళ్ళమ్మాయిలా కనబడుతున్నారు. రండీ! మా ఇంటికి వెళదాం" అంటూ భుజంపట్టుకుని లాగింది.