ఆయనలో చిన్న కదలిక.
"అతనితో వుంటావా?" కాసేపు మౌనం తరువాత అడిగారు.
"బహుశా వీలు కాదనుకుంటాను. మా ఊరు వెళ్ళిపోతాను."
"పిల్లలు?"
"మీరు వాళ్ళను చూసుకోలేరు. డ్యూటీలో బిజీగా వుండే మీకు వాళ్ళ పోషణ చాలా కష్టం. అందుకే నేను తీసుకుపోతాను. వేసవికాలం సెలవులకో, పండగలకో మీ దగ్గరికి పంపిస్తాను."
"ఇక మాట్లాడవలసింది ఏమీలేనట్లు ఆయన బయటికి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక బయల్దేరి ఈ ఊరు వచ్చేశాను. అమ్మా వాళ్ళకు నేనొక్కదాన్నే సంతానం. అందుకే మొదట్లో బాధపడ్డా తర్వాత సర్దుకున్నారు."
* * *
"జయంత్ కి మరుసటిరోజు తెలిసింది విషయమంతా. తెలిసిందే తడవుగా పరిగెత్తుకు వచ్చాడు నా దగ్గరికి.
ఊరికి వచ్చీ రాగానే "బయల్దేరు" అన్నాడు.
"ఎక్కడికీ?"
"ఎక్కడ కేమిటి? ఎక్కడికైనా. మనం కలిసి వుందాం. ఇలాంటి పరిస్థితి వస్తే నేరుగా మా ఇంటికి వచ్చెయ్యమని చెప్పాను గదా" నొచ్చుకుంటూ మాట్లాడాడు.
"ఎలా రాను జయంత్? ఆవేశం తగ్గించుకుని ఆలోచించు. నువ్వు ఇంకా కుర్రాడివి. ఎంతో భవిష్యత్తు వుంది నీకు. నీతో వచ్చేసి దాన్నంతా ధ్వంసం చేయనా? వద్దు. అలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు మానుకో. హాయిగా యింటికి వెళ్ళిపో. చక్కగా పెళ్ళి చేసుకో. ఇంకా పై చదువులు చదువు. రీసెర్చ్ చేస్తానని చెప్పావుగా. ముందు ఆ పని చెయ్."
అతను ఒప్పుకోలేదు. నన్ను వదిలి వెళ్ళడానికి ఎంతో కన్విన్స్ చేయాల్సి వచ్చింది. దాదాపు నాలుగు గంటల సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం నన్ను వదిలి వెళ్ళడానికి అతి కష్టం మీద ఒప్పుకున్నాడు.
అతన్ని సాగనంపడానికి బస్టాండ్ వరకూ వెళ్ళాను.
దూరంగా వస్తున్నా బస్సు కనిపించగానే ప్రయాణీకులమతా హడావుడిగా లేచారు.
"ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందాం" అర్థిస్తున్నట్లు చేయి పట్టుకున్నాడు.
"వద్దు జయంత్.... నువ్వు ఇక్కడికి వచ్చి గొప్ప సహాయం చేశావ్. మనుషుల మీద నమ్మకం పెంచావ్. అంతకంటే నాకేం కావాలో చెప్పు. ప్రేమ, అభిమానం, ఆత్మీయత- ఇవన్నీ ఒట్టి గాలి కబుర్లు కావని నిరూపించావ్. మనుషుల మీద గొప్ప నమ్మకాన్ని పెంచావు. మనుషుల మీద ప్రేం పోయాక ఎలా బ్రతకడం? ఇప్పుడు అలా కాదు. మిగిలిన జీవితాన్ని నా చుట్టూ వున్న మనుషుల మధ్య అద్భుతంగా గడిపే ఉత్సాహాన్ని ఇచ్చావ్. నువ్వు చేసిన ఈ సహాయానికి జీవితాంతం ఋణపడి వుంటాను" ఏదో తెలియని ఉద్వేగంతో నా కళ్ళు వర్షిస్తున్నాయి.
బస్సు వచ్చి ఆగింది.
జయంత్ ని చేయి పట్టుకుని బలవంతంగా ఎక్కించాను. బస్సు కదులుతూ వుంది.
"ఇక నిన్ను చూడడం నీ పెళ్ళిలోనే" గట్టిగా అరిచాను.
నా చెంపలమీద జారుతున్న కన్నీళ్ళను చూడలేక తల తిప్పుకున్నాడు జయంత్.
బస్సు రేపిన దుమ్ము నన్ను పూర్తిగా కప్పేసింది.
* * *
తిలోత్తమ చెప్పడం పూర్తి చేసింది. ఆనంద విశాదాల్ మిశ్రమంలా కళ్లల్లో నీళ్ళు ఊరాయి. పైటతో కళ్ళు అద్దుకుని బలవంతంగా నవ్వడానికి ప్రయత్నించింది.
గోపాలకృష్ణ పరిస్థితి కూడా అదే. అతను ఆమె చెప్పినదానికి బాగా కదిలిపోయాడు.
"తిలోత్తమా! మీ ముగ్గురికి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన మిమ్మల్ని తలుచుకుంటుంటే మానవజాతి మీదే గొప్ప ప్రేమ కలుగుతోంది. ఈ భావనల్ని ఇలాగే గుండెలో అణిచేసి, వాటి ఒత్తిడికి చిప్పిల్లే అనుభూతినంతా ఒంటరిగా అనుభవించాలనుంది" అన్నాడు.
"ఇక్కడికి వచ్చింది నాతో ఇంతకాలం నిక్షిప్తమైన ఆ అనుభవాన్ని చెప్పడానికే గోపాలకృష్ణా! నీతో గడిపి సిరిసంపదలను పొందాలన్న ఉద్దేశ్యం నాకు లేదు. మనుషుల మీద గొప్ప నమ్మకం, ప్రేమ వుండడంకంటే వేరే సిరిసంపదలున్నాయా! అవి పుష్కలంగా వున్న నాకు ఇక మీ అక్కరలేదు. నేను వస్తాను గోపాలకృష్ణా!"
ఇద్దరూ లేచి బయటికొచ్చారు.
వర్షం ఇంకా ఆగలేదు. చినుకులు జోరుగానే పడుతున్నాయి.
తెల్లవారుతోంది. నల్లటి ఆకాశం సిమెంట్ రంగులోకి మారుతోంది.
"వర్షం బాగానే పడుతోంది. నేను వచ్చి ఇంటి దగ్గర దిగబెట్టనా?"
"వద్దు"
"పోనీ గొడుగైనా తీసుకెళ్ళు"
"ఇంత తెల్లవారిపూట వర్షంలో తడిసి చాలా రోజులైంది" అని అడుగు ముందుకు వేసింది.
ఎంతో ఆరాధనతో ఆమెవైపు చూస్తూండిపోయాడు అతను.
12
'కళ్ళు మూసినా నీవాయె, కళ్ళు తెరిచినా నీవాయె' అన్నట్లుంది గోపాలకృష్ణ పరిస్థితి. ఒకప్పుడయితే అలాంటి పాటలను వింటూ నవ్వుకునే వాడు. సినిమా పాటల్లో ప్రేయసిని ప్రియుడు, ప్రియుడ్ని ప్రేయసి పొగుడుకోవడం తప్ప ఏమీ లేదనుకునేవాడు. అవి అసహజంగా కూడా వున్నాయని భావించేవాడు. కానీ ఇప్పుడు తన అభిప్రాయం తప్పు అని తెలుసుకున్నాడు.
ప్రేమించనంతవరకు మన పరిధి విశాలంగా వుంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే మన పరిధి చాలా కుంచించుకుపోతుంది. ప్రేమించిన వ్యక్తే ప్రపంచమైపోతుంది. ప్రపంచమే ప్రేమించిన వ్యక్తిగా దర్శనమిస్తుంది. ఈ కారణంవల్లనే ప్రేమికులు మిగిలిన ప్రపంచానికి అంధులైపోతారు.
చిన్నగాలి తన శరీరానికి తాకినా అది ప్రియురాలి స్పర్శలా అనిపిస్తుంది. కనిపించే పచ్చటి కొండలే తన ప్రేయసి కట్టుకున్న చీర అంచు మీద డిజైన్ లా అనిపిస్తుంది. ఎక్కడో దూరంగా వినిపించే పాట తన అవస్థను చూసి గంధర్వుడు చేసే ఆలాపనలా అనిపిస్తుంది. ఒక్కో రకమైన పువ్వు అ ప్రేయసి ఒక్కో అవయవానికి ప్రతీకలా అనిపిస్తుంది.