ఆమె చూపుల్లోని సంచలనాన్నతడు గమనించి "కాసేపట్లో మనం గుల్మార్గ్ వెడుతున్నాం" అన్నాడు.
"అక్కడాట్టే చలి వుండదా!"
"పహార్ గాట్ కంటే ఎక్కువ చలి...."
"మరైతే ఈ పంచెకట్టు....?"
"చలి శరీరానికే, మనసుక్కాదు. నా మనసు నీ దగ్గరుంటుంది."
"మనసుకు స్వెట్టరక్కర్లేదా?"
"అక్కర్లేదు...."
హాస నవ్వింది.
"గుల్మార్గ్ లో మన పెళ్ళి. చాలా చిత్రంగా వుంది. ఎక్కడి వాళ్ళమో ఇక్కడికొచ్చాం."
"ఈ ప్రపంచమే అంత! అడవిలోని ఉసిరికాయ సముద్రంలోని ఉప్పుతో కలిస్తే ఊరగాయ అయింది. దాన్ని అంతా తినేస్తారు...." అని నిట్టూర్చింది హాస.
"ఉత్సాహంలోంచి విషాదాన్ని తెచ్చావు...." అన్నాడు రమణ.
"ప్రేమ కథలెప్పుడూ అంతే! ప్రేయసీ ప్రియుల్లో ఒకరు ఉసిరికాయ ఒకరు ఉప్పు. ఈ ఊరగాయను ప్రేక్షకులకో, పాఠకులకో పంచిపెట్టి నిర్మాతలో, ప్రచురణ కర్తలో లాభాలు గడిస్తారు. ప్రేయసీ ప్రియులది విషాదగాధే! లైలా పోయింది. పార్వతి పోయింది...." అంది హాస.
"కానీ మన కథ అలా కాదు...."
హాస నవ్వి "చూద్దాం" అంది.
అప్పుడు బాత్రూంలోంచి సుభద్ర వచ్చింది.
* * * *
కారు గుల్మార్గ్ చేరుకునేసరికి తిరుపతి కొండెక్కిన అనుభూతి కలిగింది హాసకి. అంతా ఓ చిన్న తోటలాంటి పార్కులో దిగి కూర్చున్నారు.
దూరంగా గెస్ట్ హౌస్ కనబడుతోంది. పక్కనే చాలా హోటళ్ళున్నాయి. అక్కడ అన్నింటికీ మించి మసాలా దోసెకే గిరాకీ ఎక్కువగా వుంది.
వాళ్ళ చుట్టూ జనాలు మూగారు.
మంచు బూట్లు, ఓవర్ కోట్లు అద్దెకు తీసుకుని గుర్రాలమీద విహారము చేస్తారు యాత్రీకులక్కడ.
సుభద్ర తను రానంది.
మూడు గుర్రాల మీద పురోహితుడు, హాస, రమణ అశ్వవిహారానికి బయల్దేరారు.
ఆ ప్రయాణం చాలా అద్భుతంగా తోచింది హాసకు.
అవి పెద్ద గుర్రాలు కాదు. గుర్రప్పిల్లలు. అందుకే అవి నడిచే మార్గాన్ని పోనీట్రాక్ అంటారు. పోనీలాట్టే ఎత్తులేవు. జాకీ సాయంతో హాస కూడా సులభంగానే ఎక్కింది. పురోహితుడు మాత్రం కాస్త కంగారుపడ్డాడు.
జాకీ పక్కనే వుండి పోనీని నడిపిస్తున్నాడు. అప్పుడప్పుడు ఉత్సాహం కోసం పోనీని పరుగెత్తిస్తున్నాడు. పోనీ పరుగు కూడా హాసకు భయం పుట్టించలేదు.
ఆమె ప్రకృతి కోసం పుట్టిన కన్యలా, తన జన్మస్థానం చేరుకున్న దివ్యకన్యలా పరిసరాలను ఎంజాయ్ చేస్తోంది. జాకీ ఏం చెబుతున్నాడో ఆమె వినడంలేదు.
వారి బాట ఎత్తుపల్లాల మిశ్రమం.
మధ్యలో ఒకచోట ఆమె, రమణ రోప్ వేలో కాసేపు తిరిగారు.
"నాలుగు రోజుల్నించి బాగా వేడిగా వుంటోంది. అందువల్ల ఐస్ స్కేటింగ్ కి అవకాశం లేదు" అన్నాడు జాకీ రమణతో. రమణ హాసకు చెప్పాడు.
పదహారు డిగ్రీల టెంపరేచరు.... అదే బాగా వేడిగా వుండడం....
హాస తనలో తనే నవ్వుకుంది.
వారి పోనీ యాత్ర సుమారు మూడుగంటలుంది. అది ముగిసేక జాకీ రమణతో "మీ విహారం తృప్తికరంగా సాగిందా?" అన్నాడు హిందీలో.
"ఊఁ" అన్నాడు రమణ.
అప్పుడు ముగ్గురు జాకీలూ వరుసగా పక్కపక్కన నిలబడి చేతులు జాపారు.
"డబ్బు ముందే మీ యజమానికిచ్చేశాను."
"ఖుష్ కరో!" అన్నారు వాళ్ళు ఏకకంఠంతో.
మారు మాట్లాడకుండా రమణ వాళ్ళకు తలో అయిదూ యిచ్చుకునేసరికి పోనీల యజమాని వచ్చి "వాళ్ళకు డబ్బిచ్చారేం?" అని కూడబలుక్కుని ఇంగ్లీషులో అన్నాడు.
"ట్రిప్పు బాగా అయింది" అన్నాడు రమణ.
యజమాని చటుక్కున చేయి సాచాడు.
"నీకు ముందే డబ్బిచ్చేశానుగా."
"కానీ ట్రిప్పు బాగా అయిందిగా, ఖుష్ కరో!"
అతడికి పదిరూపాయలిచ్చాడు రమణ.
* * * *
ముగ్గురూ సుభద్ర ఒక్కర్తీ ఎలాగుంటోందోననుకుంటూ పార్కులోకి వెళ్ళేసరికి అక్కడ సుభద్ర ఎవరితోనో ఉత్సాహంగా కబుర్లు చెప్పేస్తోంది. హాసను చూసి "రావే, రా! నీ గురించే అనుకుంటున్నాం.... వీళ్ళెవరో కాదు, మన వాళ్ళే!" అంది.
"తో, ఖుష్ కరో!" అంటూ చేయి సాచింది హాస.
సుభద్రతో కబుర్లు చెబుతున్న వాళ్ళిద్దరూ వృద్ధ దంపతులు. వాళ్ళు నవ్వి "చస్తున్నాం- ఈ ఖుష్ కరో మాట వినలేక! ఇక్కడ తిప్పు అడగని వారంటూ వుండరు" అన్నారు.
హాస వాళ్ళిద్దర్నీ పరీక్షగా చూసింది. ఇద్దరూ కలిసి అప్పజెప్పినట్లుంది.... చాలా చాలా అన్యోన్య దంపతులయ్యుండాలి వాళ్ళు అనుకుందామె.
"చిదిమి దీపం పెట్టుకోవచ్చు. అమ్మాయి చాలా బాగుంది. ఏదీ యిలా దగ్గరగా రామ్మా!" అంది ముసలావిడ.
"వెళ్ళు. మనవాళ్ళే!" అంది సుభద్ర.
ముసలావిడ పరిచయాలు, సంబంధాలు వివరించి "నేను నీకు బామ్మనవుతాను. అర్ధమయిందా?" అంది.
హాస బుద్ధిగా తలూపింది.
"మన కుటుంబాల్లో ఆడ సంతెక్కువ. పెళ్ళిళ్ళనేసరికి మగ కుర్రాళ్ళు దొరక్క చస్తున్నాం" అందావిడ సుభద్రను తనతో కలుపుకుంటూ.
హాస ముఖం చిట్లించింది.
"ఏమ్మా, నా మాట నచ్చలేదా?" అందావిడ.
"ఇప్పుడాడపిల్లలు రాజ్యాలేలుతున్నారు. వాళ్ళ పాలన బాగుండడం వల్ల ఒకోచోట ప్రజలు వాళ్ళనే కోరుతున్నారు. ఇంగ్లండులో మార్గరెట్ థాచర్, ఫిలిప్పిన్స్ లో శ్రీమతి అక్విన్....ఆఖరికిప్పుడు జపాన్లో కూడా అమ్మాయి ఆధ్వర్యంలో అపోజిషన్ పుంజుకుంటోంది. వీరు ఆడపిల్లల్ని మగాళ్ళతో పోల్చి చిన్న బుచ్చడం బాగోలేదు. అందులోనూ మనం మనం ఆడవాళ్ళం, మనమంతా ఒకటే. మనం లేకుండా ఈ మగాళ్ళేమైనా చెయ్యగలరా చెప్పండి బామ్మగారూ!" అంది హాస.
ముసలాయన నవ్వి, "ఈ కబుర్ల కేంలే పాపా, ఇప్పుడు నువ్వన్నమాట మీదే ప్రతి ఆడపిల్లా నిలబడితే ఏ సమస్యా ఉండదు మనదేశంలో. ఆడపిల్లలకి అందమైన మొగుడుండాలి. వాడు బాగా సంపాదించాలి. తనకో పనిమనిషినీ, వంటమనిషినీ పెట్టాలి. పిల్లలకి మూడేళ్ళొచ్చే సరికి వాళ్ళ బాధ లేకుండా వేలకొద్దీ డొనేషన్లు కట్టి నర్సరీ స్కూళ్ళకు తోలేయాలి. చదవడానికి పత్రికలూ, ఇంట్లో సినిమాలు చూడ్డానికి వీడియోలూ కావాలి! ఇన్నింటికి ఒక్కడి మీద ఆధారపడి వాడితో సమాన గౌరవం రావాలంటే ఎక్కణ్నుంచొస్తుంది?" అన్నాడు.
"మీరు కొందరి సంగతి చెప్పారు. కానీ మగాడితో సమంగా ఉద్యోగాలు చేస్తూ కూడా ఇంట్లో అన్నిపనులూ చేసే ఆడాళ్ళ సంగతేమిటి....?" అంది హాస.
"ఎక్కణ్ణించో ఏ పోలీసులో వచ్చి వేసిన బేడీలు కాదమ్మా మన సంప్రదాయపు శృంఖలాలు? ఎవడో వచ్చి వాటిని బద్దలు కొట్టి రక్షిస్తానని ఎదురు చూడ్డం తెలివి తక్కువ చనువు, సంపాదన ఉన్న ఆడపిల్ల తన శృంఖలాలను తనే ఛేదించుకోవాలి. ఈ కాలం ఆడపిల్లలు మా ఆవిణ్ణి చూసి నేర్చుకోవాలి. ఆఫీసులో రిటైరై అయిదేళ్ళయింది కానీ పెళ్ళయిన నాలుగేళ్ళకే యింట్లో రిటైరైపోయాను. మా ఆవిడ తన సంకెళ్ళు విడగొట్టుకోడమే కాదు, నాకే బేడీలు వేసేసింది" అన్నాడు ముసలాయన.
ముసలావిడ ముచ్చటగా సిగ్గుపడింది.
అప్పుడు ముసలాయన మరింత ఉత్సాహంగా, "ఇప్పుడు చూడు.... ఇద్దరు కొడుకులూ, కోడళ్ళూ, పిల్లలూ పోనీలెక్కి వెడుతూంటే నాకూ వెళ్ళాలనిపించింది. నా వంట్లో శక్తి వుంది, తనకి లేదు. తను వెళ్ళొద్దంది. మానేశానంతే!" అన్నాడు.
"ఊఁ....చాలెండి...." అంటూ మరింత సిగ్గుపడిందా ముసలావిడ. ఆడదాని సిగ్గు అందానికి, వయసుతో నిమిత్తం లేదనడానికా క్షణం ఓ ఉదాహరణ.
అప్పుడు రమణ ఆమెను చూసి "హాసా, ప్లీజ్....ఒక్కసారి!" అన్నాడు.
ఆమె లేచి అతడికి దగ్గరగా వెళ్ళింది.
"ఈ వృద్ద దంపతులు మన పెళ్ళికి సాక్షులవుతారు. పెళ్ళి కాగానే వారి దీవెనలు పొందుదాం" అన్నాడు రమణ.
"పెళ్ళి ఎప్పుడూ, ఎక్కడ?" అంది ఆమె.
"ఇప్పుడే, ఇక్కడే!"
"పెళ్ళి మండపమేది? పురోహితుడేడి? సరంజామా ఏది?"
రమణ నవ్వి "అన్నీ క్షణాలమీద వస్తాయి చూడు...." అన్నాడు.
"ఎలా వస్తాయి?"
"ఇన్ స్టంట్ కాఫీలాగే ఇన్ స్టంట్ మ్యారేజస్సూ వుంటాయి. సైన్సు ఎంత అభివృద్ధి చెందినా సంప్రదాయానికి తోడు కాక తప్పదు...." అన్నాడు రమణ.
"ఆ ఏర్పాట్లు చూడాలని నాకూ సరదాగా వుంది" అంది ఆమె.