భార్యా విధేయుడు ఎప్పుడూ బాగుపడడు.
పెళ్ళాం అన్నం పెట్టకపోతే పెనిమిటి వీధిన పడనక్కరలేదు.
మందు మగువ మగాడి జన్మహక్కు.
ఇలా వాళ్ళంతా ఇష్టం వచ్చినట్లు వాగటం మొదలుపెట్టారు. వాళ్ళంతా ఒకటి, నేఒక్కడినీ ఒకటి. విసురుగ యివతలికి రాబోయాను. శరీరం నా అధీనంలో లేకపోయింది. వాళ్ళు నా తిట్లని జోక్ గ తీసుకుని మరింత మందు బలవంతాన నా నోట్లో పోశారు. నాకు గుర్తు లేదు. గుటక వేశానో వాళ్ళ ముఖాన వుమ్మేశానో.
గంటో రెండు గంటలో సోఫాలో పది నిద్రపోయాను. లేచి చూద్దును కదా, సగం మంది కక్కుకుని దానిలోనే పొర్లాడుతున్నారు. కొంతమంది పక్క గదిలో చేరి అద్దెకి తెచ్చిన ఆడదానితో అవసరం తీర్చుకుంటున్నారు. వాళ్ళంతా పసువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. నా వూసు ఎవరూ పట్టించుకోలేదు. నేను బైటికి వచ్చేశాను.
రోడ్లన్నీ గంటసేపు షైర్ కొట్టి చాలా తీవ్రంగ ఆలోచించి యింటికి వచ్చాను.
ఈ విషయం నీతో చెప్పాలా వద్దా! యిదే ఆలోచన. చెప్పటం మంచిది కాని నీవు అపార్ధం చేసుకుంటే కష్టం. అందుకే చెప్పలేదు. యింటికి వచ్చిం తరువాత యింతవరకు ఏం జరిగింది నీకు తెలుసు. ఇప్పుడు చెప్పు సీతా! నాది తప్పో వప్పో!" అంటూ రామకృష్ణ మొత్తం వివరించి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.
సీత వింది భర్త చెప్పిందంతా.
సీత దీన్ని గురించే ఆలోచించింది.
లీలగ..... ఎక్కడో..... రాంగ్....
"సీతూ!" సీత మాట్లాడకపోయినా ప్రేమగా పిలిచాడు రామకృష్ణ.
సీత అతని ప్రేమకి కరిగి నీరయి అమాంతం పైకి లేచి అతని విశాల వక్షస్థలం మీద తలవాల్చుకోలేదు. క్షమించండి మిమ్మల్ని అపార్ధం చేసుకున్నాను. మీ పాదాలకింద (చెంత) యింత చోటు ఇవ్వండి అనలేదు.
సీత చాలా దీర్ఘంగ ఆలోచిస్తున్నది.
రామకృష్ణ మరో రకంగా అర్ధం చేసుకున్నాడు.
సీత సిగ్గు పడుతున్నది.
సీత సిగ్గు పడుతున్నది.
సీత పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నది.
అని -
భర్త ఎప్పుడూ భార్య విషయంలో ఓ అడుగు ముందుకు వేస్తుండాలి. సిగ్గు బిడియం స్త్రీకి ఎక్కువ. అందుకని భర్త చనువుగ ఆమెకి చేరువ అవుతుండాలి. తప్పుచేసిన స్త్రీ గాని పశ్చాత్తాపంతో కుమిలే స్త్రీగాని నిజం గ్రహించిన తర్వాత కూడా ఏమీ చేయలేక నత్తగుల్లల్లా ముడుచుకుని వుంటుంది. అప్పుడు భర్త ఆమెని దగ్గరకు తీసుకోవాలి. అలా చనువుగ దగ్గరకు తీసుకున్నా ఆమె సిగ్గుతో తోసి వేస్తుంది. అలా అని అప్పుడు ఆ భర్త మిన్నకుండకూడదు. మగతనం ప్రదర్శిస్తూ కాస్త బలవంతానైనా సరే ఆమెని లొంగదీసుకోవాలి.....
ఇలా అని బజారులో రూపాయి పావలాకి దొరికే "భర్త విధులు- కర్తవ్యం" అనే బుల్లి పుస్తకంలో రాసి ఉంది. ఆ పుస్తకాన్ని ఓసారి రామకృష్ణ చదివాడు.
అదిప్పుడు గుర్తుకొచ్చింది రామకృష్ణకి.
అలా యిప్పుడు చేద్దామనుకున్నాడు రామకృష్ణ.
ఆ ప్రయోగం సీతమీద చేస్తే అసలుకే ఎసరు. వ్యవహారం బెడిసికొట్టోచ్చు అని రామకృష్ణకి బొత్తిగా తట్టలేదు.
"ప్రేయసీ! మనొహరీ! నా సీతామనోహరి!" కూని రాగం తీస్తూ రామకృష్ణ సీత భుజంమీద చేయివేశాడు.
సీత కోపంతో గుర్రుమంటూ పైకి లేచింది.
చటుక్కున రామకృష్ణ సీతని కౌగిలిలోకి తీసుకున్నాడు.
17
సీతని గాడంగా చుంబించి వదిలేస్తూ "రతీదేవిలాగా వున్నావు సీతూ!" అన్నాడు రామకృష్ణ.
"వదలండి!" అంది సీత భర్త కౌగిలిలోంచి పెనుగులాడుతూ.
భార్య కోపంగా వుంటే ఆమె మాట వినకూడదు. ఆమె ఏమీ మాట్లాడుతున్నా పెడచెవిన పెడుతూ, మీ పని మీరు కానిస్తూ ప్రసన్నురాలిని చేసుకోవాలి - " అని ఆ దిక్కుమాలిన పుస్తకం "భర్త విధులు - కర్తవ్యం" లో రాసి వుంది.