Previous Page Next Page 
హిమసుందరి పేజి 41

    ఇదీ జ్ఞాపకం వుంది రామకృష్ణకు. అలనాటి శ్రీకృష్ణ పరమాత్మలా సీత చుబుకం పట్టుకుని - లాలనగా, ప్రేమగా "ఇదంతా కోపమే!" అన్నాడు. "కోపంలో నీవెంత అందంగా వుంటావో తెలుసా? అచ్చం జయప్రదలా వుంటావు" అని కూడా కొత్త మాట అన్నాడు.

    అది భ్రాంతో, నిజమో గాని, రామకృష్ణ నోట్లోంచి ఘుప్పున చెడువాసన వచ్చినట్లయింది సీతకి. "చీ...... వదలండి. సిగ్గులేదూ!" అంది గింజుకుంటూ.

    "కావాలి కావాలి అంటున్నది మనసు. పొందాలి, పొందాలి అంటున్నది తనువు. నా కళ్ళముందు రతీదేవి నగ్నంగా నాట్యం ఆడుతున్నది. కోపం చాలించి రావోయ్!" అన్నాడు రామకృష్ణ ఖుషీగా నవ్వుతూ.

    మనసులోనిదంతా చెప్పేసినందుకు రామకృష్ణకి చాలా ఆనందంగా వుంది. ఆ ఆనందంలో వళ్ళూ పై తెలియని స్థితిలో పడ్డాడు. సీతదంతా పై పై కోపం అనుకుంటూ ఓ అడుగు ముందుకు వేస్తున్నాడు.

    ఇదంతా రామకృష్ణ చదివిన ఆ పుస్తకం ప్రభావం.

    సీత కూడా ఓ నవలలో చదివింది. పీకదాకా మందు పుచ్చుకున్నవాడు మత్తుగా పడి నిద్ర అన్నా పోతుంటాడు. మగువ పొందుకోసం వెంపర్లాడుతూనైనా వుంటాడు. అలా కోరికతో బుసకొట్టే మగవాడు - కళ్ళు మూసుకుపోయిన కామంతో వళ్ళూ పై తెలియక, ఆడదాని పొందుకోసం ఏమయినా చేస్తాడు, ఎంతకయినా తెగిస్తాడు.

    ఇప్పుడు రామకృష్ణ అలా చేస్తున్నడేమోనని సీతకి అనుమానం వచ్చింది. అనుమానం అంటూ వస్తే అది పెనుభూతంగా కానరావటం ఖాయం.

    సీత రామకృష్ణని బలంగా విదిలించుకుని, మంచం మీద నుంచి కిందకి దూకింది. "నన్ను ముట్టుకున్నారంటే యిటు నుంచి ఇటే పరుగెత్తి బావిలో దూకుతాను" అంది.

    రామకృష్ణ బుర్రతిరిగి యధాస్థానానికి వచ్చింది. బుర్ర తిరుగుడు తగ్గటంతో మామూలు మనిషి అయాడు. సీత నిజంగానే బాగా కోపంగా వున్నదని గ్రహించాడు.

    "సీతా! నే చెప్పింది నమ్మటంలేదా?" అన్నాడు రామకృష్ణ.

    "నేను పిచ్చిదాన్ని కాదు!" సీత అంది.

    "అంటే నేను చెప్పిందంతా అబద్ధం అంటావా?"

    "అక్షరం అక్షరం అబద్ధమే!"

    "సీతా!" నిర్ఘంతపోయాడు రామకృష్ణ.

    "మీరు జోక్స్ బాగా వేయగలరు మాటలు బాగా చెప్పగలరు అని యింతవరకూ అనుకుంటూ వుండేదాన్ని. కధలు కూడా బాగా చెప్పగలరని ఇప్పుడు తెల్సుకున్నాను. మొదటిసారి గ్లాసులో పోసిస్తే కూల్ డ్రింక్ అని తాగారా! డ్రింక్ ముఖం ఎలా వుంటుందో తెలియదా! ఇన్ని సినిమాలలో చూశాను- బుసబుస సగం గ్లాసు నురుగుతో వుంటుంది. అలా అని నాకే తెలియగా లేనిది - కళ్ళముందు గ్లాసునిండా విస్కీ వుంటే మీకు తెలియలేదా?

    విస్కీ కంపు మైలు దూరానికి కొడుతుంటే- అలాంటిది కళ్ళముందు వుంది. గ్లాసుని చేతిలోకి తీసుకున్నారు. ముక్కుదాకా ఆ గ్లాసుని తీసుకు వెళ్ళి నోట్లో పోసుకున్నారు. మీకది కూల్ డ్రింక్ గా అనిపించిందా? సరే - ఆ విషయం ఇంటికి వచ్చి నాతో చెప్పొచ్చు కదా! ఉహు - నేనో పెద్దపులినయినట్లు, బ్రహ్మరాక్షసిగాను వుహించుకున్నారు. అంటే మీ మనసులో ఏదో ఒకమూల నా గురించి యిలాంటి అభిప్రాయం వుందన్నమాట....."

    "అదికాదు సీతా!" రామకృష్ణ ఏదో చెప్పబోయాడు.

    "నాకేమి చెప్పకండి. మొదటిసారి తెలియక తాగారు. మరి రెండోసారి కూల్ డ్రింక్ సీసాలో వుండబట్టి, కేంపాకోలా అని తాగారు. చాలా బాగుంది. రేపు కూజాలో నీళ్ళు వంపుకుని తాగుతారు. అదీ అంతే- మీకు తెలియకుండా ఎవరో కూజాలో నీళ్ళు తీసేసి, దాంట్లో బ్రాందీ పోసి పెట్టారు, నాకు తెలియక తాగాను అనొచ్చు - ఇలా ఎన్నయినా అనొచ్చు, చెప్పొచ్చు."

    "నా మాట వినేది లేదా సీతా!" రామకృష్ణ అడిగాడు.

    "వినటమా! హ్హూ! ఎవరైనా ఒకసారి మోసపోతారు. రెండుసార్లు మోసపోరు. ఇప్పటికే మీకు అలవాటు అయింది. ఇంకా ముందు ముందు....."

    చివరి ప్రయత్నంగా రామకృష్ణ నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు - "జరిగిందేదో జరిగింది. గతాన్ని సమాధి కట్టేద్దాము. పన్నెండు దాటింది పడుకుందాము సీతా!"

 Previous Page Next Page