Previous Page Next Page 
హిమసుందరి పేజి 39

    ఆ దెబ్బతో మళ్ళి మితృలతో వారం రోజులు మాట్లాడలేదు. వాళ్ళు ఎక్కిరించుకోలేదు. వేళాకోళం చేశారు. అయినా నేను పట్టించుకోలేదు. తర్వాత ఆ విషయం మరుగున పడిపోయింది. సీతా! జరిగిందేదో జరిగింది. పనిగట్టుకుని ఈ విషయం నీతో చెప్పి నిన్ను బాధపెట్టి నేను బాధపడి ఎందుకొచ్చిన గోల అని నోరు మూసుకున్నాను.....

    జరిగింది వరసగ చెప్పుకుపోతున్న రామకృష్ణకి అనుమానం వచ్చింది. తను చెప్పింది సీత వింటున్నదా లేదా అని.

    "విన్నావు కదా సీతా! జరిగిందాంట్లో నా తప్పు ఏమైనా వుందా?" రామకృష్ణ అడిగాడు.

    సీత మాట్లాడలేదు. పుస్తకం లాగా అలాగే పడుకుని వుంది.

    ఇంతకీ సీత నిద్రపోతున్నదా మేలుకున్నదా?

    రామకృష్ణ సీత భుజం మీద చేయివేసి కుదుపుతూ "సీతా!" అన్నాడు.

    సీత వక్క విదిలింపు విదిలించి కాస్త దూరం జరిగిపడుకుంది.

    అమ్మయ్య సీత మేలుకునే వుంది.

    రామకృష్ణ సంతృప్తి చెందాడు మళ్ళి మొదలుపెట్టాడు ఆలస్యం అమృతం విషం అనుకుంటు

    "ఆ రోజు జరిగింది చెప్పా కదా సీతా! మరి ఈ రోజుది కూడా చెప్పాలి కదా! లేకపోతే నీకు అనుమానం వస్తుంది. నేను మందు పుచ్చుకోను అన్న సంగతి ఫ్రెండ్స్ అందరికి తెలిసిపోయింది. వేళాకోళాలు ఎక్కిరింతలు కొన్నాళ్ళు సాగి వాళ్ళు మర్చిపోయారు. మూడు నెలలు పూర్తి అయాయి.

    ఈ రోజు మా ఆఫీసులో వకతనికి ప్రమోషన్ రావటం పార్టీ యిస్తున్నాడని చెప్పటం నీకు తెలిసిందే బ్రదర్! నన్ను బాధపెట్టవద్దు మందు పార్టీ అయితే నేను రాను అని చెప్పాను. అలా యిలా కాదు కచ్చితంగా చెప్పాను.

    "చూడు బ్రదర్! కొందరు మందు పార్టీ అడిగారు. మరి కొందరు నీ బోటివాళ్ళు మందు పార్టీ అయితే రాము అని చెప్పేశారు. అందుకని రెండు పార్టీలు యిస్తున్నాను. ఓ స్వీటు హాటు రెండు పెగ్గుల మందు. ఆ జాతికి మీ జాతికి స్వీటు హాటు గోల్డ్ స్పాటు. కనుక నీ యిష్టం వచ్చింది తీసుకోవచ్చు" అని చెప్పాడు.

    అలాంటప్పుడు అభ్యంతరం ఏముంది? సరేనన్నాను. పార్టీలో పిచ్చివేషాలు వేస్తే తలా నాలుగు చివాట్లు పెట్టి వద్దామనుకున్నాను. కాని వాడు రెండు రకాల పార్టీలు అరేంజ్ మెంటు చేశాడు.

    పార్టీ మొదలైంది. నాలాంటి కొందరికి స్వీట్ హాటుతో పాటు కేంపకోలా నీకు తెలిసిందే కదా మామూలు డ్రింకు. స్వీటు హాటు తిని కేంపకోలా తాగాను సరీగా తెలియలేదు గాని వేరే రుచిగా వున్నట్లు అనిపించింది. మనం ఎప్పుడూ గోల్డ్ స్పాట్ తాగుతాం. ఒకే ఒక హరీ కాబోలు కేంపకోలా తాగాము. ఆ రుచి నేను మర్చిపోయాను. అది అలాగే వుందేమో అని అనుకున్నానో లేదో -

    అక్కడో బాంబు పేలింది.

    సీతా! బాంబు అంటే నిజంగా బాంబు కాదు. బాంబు పేలటం లాంటిమాట.

    "బ్రదర్! కళ్ళు తిరుగుతున్నాయా? వళ్ళు తూలుతున్నదా? మాట తడబడుతున్నదా? జగమే మాయ పాట ఎత్తుకుంటావేమిటి!" తలోమాట అన్నారు. వాళ్ళంతా వకటే ఇక ఇకలు పక పకలు.

    "ఏమిటి మీరనేది?" అడిగాను. అప్పటికే నా శరీరం నా ఆధీనం తప్పుతున్నట్లు తెలుస్తున్నది.

    "బ్రదర్! సగం సీసా కేంపకోలాలో  సగం మాత్రమే మందు కలిపాము. డోంట్ వర్రీ" అన్నాడు ఇకిలిస్తూ.
   
    నా బుర్ర రెండు రకాలుగ  తిరగటం మొదలుపెట్టింది. ఆవేశంగా లేచివెళ్ళి వాడి పీక పట్టుకున్నాను. అందరూ వచ్చి విడిపించారు.

   "మేమేదో వెధవలం అయినట్లు  ఆ ఫోజెందుకు బ్రదర్! నీవు తాగుతావో లేదో మాకు తెలియదు. ఆ రోజు ఆఫీసులో పార్టీ యిస్తే మందు దక్కినందుకు  సంతోషించక మా అంత దుబారా పనికిమాలిన వెధవలు ఈ ప్రపంచంలో మరొకరు లేనట్లు నీ అంత సుగుణాశీలుడు వేరొకడు లేనట్లు లెక్చరు దంచావు.
   
    మందు వకసారి పుచ్చుకుంటే  మనిషి చెడిపోయినట్లు కాదు.

 Previous Page Next Page