"అమ్మా! నువ్వు కోర్టుకు రాకూడదు. ఏమీ చెప్పకూడదు. నా మీద ఒట్టే."
"ఇదేం త్యాగంరా?" దీనంగా అన్నది.
"ఇది త్యాగం కాదమ్మా పరిస్థితులూ, సాక్ష్యాలూ నన్ను నిర్దోషిగా నిరూపిస్తే నేను మళ్ళీ నీ కొడుకుగా వస్తాను."
"బాబూ!"
"లేదా నేను ఏ ఆరేల్లో జైలు కెల్తాను. అన్నయ్యను నా స్థానంలో స్వీకరించు. అతడిలో నన్ను చూసుకో."
"ఇక మాట్లాడకు, వెళ్ళు. వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. పోరా! ఫో!" పిచ్చిగా అరిచింది అన్నపూర్ణమ్మ.
గౌతం తల వంచుకొని బయటికి వచ్చాడు.
అన్నపూర్ణమ్మ రెండు చేతులతో ముఖం కప్పుకొని నిండు కుండ బద్దలైనట్టు భోరున ఏడ్చింది. కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. కుమిలి కుమిలి ఏడ్చింది.
14
రవి ఆస్పత్రికి వచ్చేసరికి అరుణ ఉన్న గదిలో కలకలంగా ఉంది.
అరుణ అరుస్తోంది.
డాక్టర్ ఇంజెక్షన్ చేసింది.
రవికి ఏం జరిగిందో అర్ధం కాలేదు. క్రితం రోజు సాయంత్రం అరుణ కొంచెం కుదుటపడింది. ఎబార్షన్ అయినందుకు బాధపడింది. రవి సర్దిచెప్పాడు.
"డోంట్ డిస్ట్రబ్ హర్!" అన్నది డాక్టర్ సునందతో.
"అలాగే డాక్టర్."
"ఆ రోగ్ మళ్ళీ రాకుండా చూడండి. బాగా బెదిరించినట్టున్నాడు. పోలీసు కంప్లయింట్ ఇవ్వండి. ఇంతదారుణం చేసినవాడికి జామీన్ ఇవ్వడం ఏమిటి?" అని డాక్టర్ వెళ్ళిపోయింది.
రవి సునంద ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూశాడు.
"మీ అన్నయ్య జామీన్ మీద వదిలారా?" సునంద అడిగింది.
"అవును."
"ఎప్పుడు?"
"ఉదయం. ఏం? ఏం జరిగింది?"
"నేను పది గంటలకు నర్సును కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళాను. పద కొండున్నరకల్లా వచ్చాను. అంతలోనే ఇంత అనర్దం జరిగింది. గౌతమ్ లో ఇంతటి రాక్షసుడు దాగి ఉన్నాడని నాకు తెలియదు. గోముఖ వ్యాఘ్రం." కోపంతో సునంద ముఖం ఎర్రబడింది.
రవికి సునంద చెప్తున్నదేమిటో అర్ధం కాలేదు. గుడ్లప్పగించేశాడు.
"గౌతం కు పిచ్చెక్కిందేమో!" కసిగా అన్నది సునంద.
"ఏం జరిగింది ఆంటీ?"
"పదకొండు గంటలకు అరుణ రూంలోకి వచ్చాడట. అతన్ని చూడగానే అరుణ కెవ్వున అరిచిందట. కత్తిచూపించి నర్సును కూడా అరవకుండా భయపెట్టాడట. 'ఇదుగో! అరుణా! నేను రేప్ చెయ్యలేదని కోర్టులో చెప్పాలి. గౌతం పేరు కావాలని ఇందుమీద జెలసీతో చెప్పానని చెప్పాలి తేలిసిందా? అలా చెప్పకపోయావో రవిని చంపేస్తాను. జాగ్రత్త!' అని సుడిగాలిలా బయటకు వెళ్ళిపోయాడట. నర్సు తేరుకొని డాక్టర్ ను పిలిచే సరికి అతడు వెళ్ళిపోయాడు. ఆ దెబ్బతో మళ్ళీ అరుణ పరిస్థితి మొదటికి వచ్చింది" సునంద బాధపడుతూ చెప్పింది.
రవి ఆలోచనలో పడ్డాడు.
అన్నయ్య పదకొండు గంటలకు తనతోనే ఉన్నాడు. అంటే వాడు వచ్చాడన్నా మాట! వాణ్ని ఈ పని చెయ్యమని తను పురమాయించలేదే! ఎందుకొచ్చినట్టు?
"రవి?"
"ఏమిటాంటీ?"
"నువ్వు వెంటనే వెళ్ళి పోలీసు రిపోర్టు ఇవ్వు."
రవి సునంద ముఖంలోకి మౌనంగా చూశాడు.
"అరుణ మనకు దక్కాలంటే గౌతం బయట ఉండకూడదు. జామీను మీద బయటకు వచ్చిన రెండు గంటల్లోనే అతడు చేసిన దారుణం గురించి రిపోర్టు ఇవ్వు. వెంటనే అరెస్టు చెయ్యాలని వ్రాయి.'
"దానికి రుజువు?"
"అరుణ."
"అరుణకు భ్రమ కలిగించడానికి అవకాశం ఉంది. అరుణ మానసికంగా బాగా దెబ్బతిన్న సంగతి అందరికీ తెలుసు."
"నర్సు కూడా ఉంది."
"నర్సు గౌతమ్ ను గుర్తుపడ్తుందా?"
"ఆ అతన్ని గుర్తుపడుతుంది. సాక్ష్యం ఇస్తుంది. అవసరం అయితే."
"రిపోర్టు ఇచ్చినంత మాత్రాన మళ్ళీ అరెస్టు చేస్తారంటావా?"
"చెయ్యాలి. ఎవరికోసం చేస్తారు?" రవీ, సునందా గిర్రున తలలు తిప్పి చూశారు.
ఇందుమతి నిలబడి ఉంది.
"నువ్వెప్పుదోచ్చావ్?" సునంద గాభరాగా అడిగింది.
"రవి వెనకే వచ్చాను. అంతా విన్నాను." రాగ విరాగాలకు అతీతంగా ఉంది ఆమె ముఖం.
"ఇందూ!" ఏదో అనబోయి రవి ఆగిపోయాడు.
"పద వెళ్దాం!" అన్నది ఇందుమతి.
"ఎక్కడికి?"
"పోలీసు స్టేషన్ కు."
రవి ఇందు ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. స్వచ్చమైన ఆ ముఖంలో నిర్మలమైన ఆమె మనసును చూశాడు.
తను ఏం చేశాడు? ఇద్దరు మంచి మనుషులకు ద్రోహం - తీరని ద్రోహం చేశాడు.
అన్నయ్య_____
ఉదయం ఆన్నయ్యను చూడగానే తను భయపడ్డాడు. తనను తిడతా డనుకొన్నాను. కొట్టినా ఆశ్చర్యపడేవాడు కాడు. కాని అంతకంటే పెద్ద శిక్ష విధించాడు. ఒక్కమాట పరుషంగా అనలేదు.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
"ఇప్పుడు పోలీసు రిపోర్టు ఇవ్వడం అంత అవసరం అంటావా?" అన్నాడు రవి.
"అవును. అవసరమే! నువ్వొస్తావా, రావా? నేను వెళ్తున్నాను." వెనక్కు తిరిగింది ఇందుమతి.
"ఇందూ!"
"ఏమిటమ్మా!"
"రవి రిపోర్టుకు ఎక్కువ విలువ ఉంటుంది. నువ్వు రిపోర్టు ఇస్తే వెంటనే అరెస్టు చెయ్యక పోవచ్చును."
"ఎలా చెయ్యరో చూస్తారు. అలా చెయ్యకపోతే స్టూడెంట్సుతో ఊరేగింపు తీయిస్తాను. ఆడపడుచులకు జరుగుతున్న అక్రమాలను ముఖ్య మంత్రి నోటీసుకు తీసుకొస్తాను. వెంటనే గౌతం ను అరెస్టు చెయ్యల్సిందిగా డిమాండ్ చేస్తాను." ఆవేశంగా అని చరచర బయటికి వెళ్ళిపోయింది ఇందుమతి.
రవి స్థాణువులా కొద్దినిముషాలు నిలబడి పోయి, చిన్నగా బయటికి వెళ్ళాడు.
15
రవి స్కూటర్ వేగంగా నడుపుతున్నాడు. అంతకంటే వేగంగా అతడి బుర్రలో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. అతడి బుర్రలో ఏదో రొద. ఆ రొదలో స్కూటర్ రొద కలిసిపోతున్నది.