వేలాడిపోతున్న జయంతిని పట్టుకుని తీసుకొస్తున్న దమయంతిని గోపాలకృష్ణ చూసి తలుపు తీసిన పద్మావతి గాభరాపడిపోయింది. 'ఏమయింది, ఏమిటిలా ఉంది ఏం జరిగింది' అని కలవరపడిపోయింది.
'ఏం లేదమ్మాబాగా జ్వరంగా వుందట రెండురోజులుగా-ఇంటివాళ్ళు ఫోను చేస్తే ఇప్పుడే తెలిసింది మాకు, వెళ్ళి తీసుకొచ్చాం' అంటూ దమయంతి జయంతిని తీసికెళ్ళి గదిలో మంచం మీద పడుకోబెట్టింది. పద్మావతి దుప్పటి కప్పి నుదురు మీద చెయ్యి వేసి 'అబ్బ మండిపోతూంది వళ్ళు ఏం జ్వరం...ఎప్పుడొచ్చిందట....చెప్పనైనా చెప్పలేదు మనకు' ఆదుర్దాగా అంది.
'ఆది శనివారం నించి వళ్ళు తెలియకుండా గదిలో పడుంటే చాకలామె వచ్చి తలుపు తడితే తీయకపోతే ఇంటి వాళ్ళని పిలిచిందిట. అంతా కల్సి తలుపులు బాదితే ఎలాగో తీసిందట. వాళ్ళకి మనెవరి అడ్రసు, ఫోను తెలియలేదు. వాళ్ళే పాపం డాక్టరుని పిలిచి మందులిప్పించారుట.... శని, ఆదివారాలు కావడంతో బ్యాంకు సెలవుగదా, ఇవాళ ఫోను చేస్తే దివాకర్ దొరికాడట. -అతను మా ఆయనకి ఫోను చేశాడు' అంతా చెప్పుకొచ్చింది.
దీని ఖర్మ తగలెయ్య - ఇంత మందిమి వుండి దిక్కులేని దానిలా అలా గదిలో పడుందా రెండు రోజులు ఆవిడ గొంతు రుద్దమయింది.
'అత్తయ్యగారూ నేవెళ్ళి ఈ డాక్టరుని పిలుచుకొని వస్తాను, ఏవో టెస్టులు చేయాలన్నారట. టెంపరేచరు 103, 104 ఉంది. తగ్గనేలేదు. నేవెళ్ళి తీసుకువస్తాను' అని వెళ్ళాడు. తల్లి కూతురు జయంతి పంతం పట్టుదల గురించి బాధపడ్తూ కూర్చున్నారు. సాయంత్రం ఆఫీసునుంచి వచ్చి కూతురి సంగతి విని చాలా బాధపడ్డారు వెంకటేశ్వరరావు.
ఆజ్వరం పదిరోజులకిగాని తగ్గుమొహం పట్టలేదు. మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ ఏదీ తేల్చి చెప్పకుండా పదిరోజులు టెంపరేచర్ తగ్గకుండా అందరిని గాభరాపెట్టింది-టెస్టుల మీద టెస్టులు చేశారు- డాక్టరుని మార్చారు, మందులు మార్చి మార్చి వాడారు. ఆఖరికి పదోరోజు టెంపరేచర్ తగ్గుముఖం పట్టి పన్నెండోరోజుకి నార్మల్ కి వచ్చింది. జయంతి కళ్ళు వెళ్ళుకొచ్చి బుగ్గలు లోతుకుపోయి ఎముకల గూడులా తయారయింది. పదమూడోరోజు చారు అన్నం, బీరకాయ కూరతో పధ్యం పెడితే ఆవురావురుమని తింది. కాస్త టెంపరేచరు తగ్గిందగ్గిరనించి ఇంట్లో తల్లి తండ్రి పడే ఆదుర్దా, దమయంతి గోపాలకృష్ణ రోజూ వచ్చి ఏం కావాలో చూసి కనుక్కుని రావడం గోపాలకృష్ణ అయితే డాక్టర్లచుట్టూ తిరగడం, టెస్టుల రిపోర్టులు తీసుకురావడం...మందులు మార్చినపుడల్లా తెస్తూ వుండటం అన్నీ బయట పనులు చేశాడు. 'ఈ గోపాలకృష్ణ ఎంత సయం చేస్తాడు. ఏ కొడుకు పనికి రాడు పాపం కబురు వినగానే పరుగెత్తికెళ్ళి జయంతిని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంత మంచివాడిని వదులుకుంది, 'ఓరోజు కళ్ళు మూసుకు పడుకున్న జయంతి నిద్రపోయిందని తల్లితండ్రి మాట్లాడుకోడం విన్న జయంతి, అతను చేస్తున్న సాయం చూస్తూ తను అతన్ని నిరాకరించి పొరపాటు చేసిందన్న భావం మొదటసారిగా ఆమె మనసులో నాటుకుంది.
జయంతి పూర్తిగా కోలుకునేసరికి ఇరవైరోజులు పైన పట్టింది. ఆమె బాగా జ్వరంలో వుండగా దివాకర్ ఓసారి గోపాలకృష్ణని వాకబు చేసి జ్వరం అది తగ్గలేదని విని ఓసారి ఇంటికి వచ్చాడట. ఆమాట తర్వాత విన్న జయంతిలొ మళ్ళీ చిన్న ఆశ. అంతలోనే ఏదో బ్యాంకులో తన కింద పనిచేసే ఉద్యోగి అని. గోపాలకృష్ణ చుట్టం అంతే కాక ఒకటి రెండుసార్లు కారులో వెళ్ళిన పరిచయంతో వచ్చి వుంటారు అనుకుంది.
జ్వరం తగ్గి పథ్యం తిన్న మూడోరోజు వంట్లో నీరసం తగ్గకపోయినా ఏదో ఎవరింట్లోనో ఉండి, ఇంక వుంటే బాగుండదన్నట్టుగా ఉండి, 'ఇంటికెడతాను ఇంక జ్వరం తగ్గిందిగా' అంది తల్లితో నెమ్మదిగా - వెళ్ళాలని లేకపోయినా ఏం అంటుందో చూద్దాం, ఈ వంకనన్నా ఇంక ఇక్కడుండిపోతే చాలు అని మనసులో వున్నా అందరి ముందు పూర్తిగా తగ్గిపోవడం ఇష్టంలేక అంది జయంతి. పద్మావతి కూతురి వంక చురచుర చూసింది. 'నోరుమూసుకుని వుండిక, దిక్కుమొక్కులేకుండా రెండు రోజులు పడి వున్నా ఇంకా బుద్దిరాలేదానీకు, ఇంటికెడుతుందిట- మహా సంపాదించింది ఇల్లు. అట్టే మాట్లాడితే మీ నాన్నకాళ్ళు విరగొడ్తానని చెప్పమన్నారు. ఏదో నిన్నలా వదిలేస్తే బుద్ది తెచ్చుకుని దారికి వస్తానని అప్పుడనుకున్నారు మీ నాన్నగారు. అందరూ ఏమంటారో తెలిసి కూడా మేం నిన్నలా వెళ్ళనిచ్చాం అంటే నీకు కష్టం సుఖం, వంటరితనంలో బాధ, ఇబ్బందులు తెలిసి దారికి రావాలని వదిలాం. నీకు బుద్దిరాలేదంటే ఇంక నీకీ జన్మకి రాదు. అంచేత ఎక్స్ పరమెంట్లు చాలు, ఇంట్లో పడివుండు, అట్టే మాట్లాడకుండా' పద్మావతి చేత్తో వారిస్తూ 'ఇంకా నీకక్కడ ఇల్లేం లేదు- మీ నాన్నగారు దమయంతిని గోపాలకృష్ణ ని పంపి ఇంట్లో సామానులు తెప్పించేసి, అద్దె అది కట్టి ఖాళీ చేయించేశారు. ఇంకేం మాట్లాడకు. అని ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. జయంతికి ఒక్కసారిగా ఏదో రిలీఫ్ ఫీలింగ్ వచ్చింది.
* * *
దివాకర్ కి ఇప్పుడు ఎప్పుడూ ఒకటే ఆలోచన. మనీషాకి తన మనసులో మాట ఎలా తెలియచెప్పాలి. తనకి ఆమె మీద ఉన్న ప్రేమ ఎలా చెప్పాలి. తనతో పెళ్ళి ప్రపోజల్ తెస్తే ఏమంటుంది. ఈ మాట అడగడానికి ఇంకా ఆగాలా. ఇపుడే అడగచ్చా. అసలామెకి ఇలాంటి ఉద్దేశం వుందా? లేదా? మనీషా ప్రవర్తన ద్వారా అతనికి ఆమె మనసులో ఏముందో, తన గురించి ఏ అభిప్రాయం, ఏ ఆలోచనలు వున్నాయో అర్ధం కావడంలేదు. ఫోను చేసి మాట్లాడితే సరదాగా మాట్లాడుతుంది. ఇంటికెడితే మర్యాదలు చేస్తుంది. ఎప్పుడన్నా తమ్ముడుని తల్లి తండ్రులని డిన్నర్ కి పిలిస్తే వస్తుంది.