Previous Page Next Page 
షా పేజి 39

 

    :నేను బయట హోటల్లో భోజనం చేయగలను -- మీరు తెచ్చుకున్నది నాకు సగమిస్తే మీ ఆకలి ఎలా తీరుతుంది?"
    "మనం సంతోషంగా వున్నప్పుడు ఆకలి వేయదు కదా"
    "మీరు సంతోషంగా వున్నారా?"
    "అవును. మీతో కలిసి ఫలహారం చేయటం - చాలా హాపీ ఫీలింగ్ కలిగిస్తోంది."
    అతను ఆమెతోపాటు తినసాగాడు.
    "ఏం జరిగింది రాత్రి?"
    "అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోయింది. సమయానికి మమత అనే అమ్మాయి సహాయం చేయటం వల్ల " అంటూ జరిగినదంతా చెప్పాడతను.
    భారతి నిశ్చేష్టురాలయి వింటుండిపోయిందతని మాటలు.
    "నాకూ అనిపిస్తోంది. ఎక్కడో ఏదో గొడవుంది." అందామె.
    "నాకేమనిపిస్తోందంటే అసలీ ఈశ్వర్వర్మ తాలుకూ పూర్తీ వివరాలు తెలుసుకుంటే గానీ - మనకు ఏదొక ఇన్ ఫర్మేషన్ దొరకదని"
    "ఈశ్వరవర్మ గురించి తెలీందేవరికిక్కడ. ఎవర్నడిగినా చెప్తారు. కోటీశ్వరుడతను. కేంద్రప్రభుత్వంలో చాలా మంఛి పలుకుబడి ఉందట అతనికి. పార్టీ ఫండ్స్ కూడా లక్షల కొద్దీ ఇస్తుంటాడని బాబాయ్ చెప్తారు-"
    "బాబాయ్ అంటే?"
    "అవును మా బాబాయే! అన్నట్లు మా బాబాయ్ పని చేసేది కూడా ఈశ్వర్ వర్మ వాళ్ళ క్లబ్ ఆఫీస్ లో నేగా?"
    "ఏ ఆఫీస్?"
    "వాళ్ళ క్లబ్ ఒకటుంది సీషోర్ లో. చాలా పెద్ద క్లబ్. కేవలం కొటీశ్వరులే ఆ క్లబ్ మెంబర్స్ -- ఆ క్లబ్ పేరేదో వుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా ముఖ్యమయిన పట్టణాల్లో ఆ క్లబ్ లున్నాయ్. అవన్నీ ఈశ్వరవర్మవే. ఇక్కడి క్లబ్ లో ఎకౌంటెంట్-"
    "ఏమిటా క్లబ్ పేరు?" ఉత్సాహంగా అడిగాడతను.
    "లంబాడా"
    "లంబాడానా? చాలా సేక్యులియర్ గా ఉందే పేరు-"
    "అవును"
    "అయితే మీ బాబాయ్ ని అడిగితె మనకు కొంత యిన్ ఫర్మేషన్ దొరకవచ్చు -"
    "అవును"
    "మీ బాబాయ్ ని ఇవాళ రాత్రికి కలుసుకుంటాను -- ఎన్ని గంటలకు ఇంటికోస్తారాయన?"
    "సాధారణంగా పదకొండూ, పన్నెండవుతుంది. ఒకోసారి త్వరగా కూడా రావచ్చు -"
    "మీ మాట వినటం లేదనుకోకండి! యివాళ రాత్రికే వెళ్ళి పోతాను మా వూరు . వెళ్ళేముందు మీ బాబాయ్ ని కలుసుకుంటే కొన్ని వివరాలు తెలుస్తాయన్న ఆశ! అంతే-"
    "థాంక్యూ " అందామె.
    ఇద్దరూ లేచి కౌంటర్ దగ్గరకెళ్ళి కాఫీలు తెచ్చుకుని తాగాసాగారు.
    "భారతీ! మీరో సహాయం చేయగలరా! అడిగాడతను.
    "ఏమిటో చెప్పండి! నేను చేయగలిగిందేది కాదనను"
    "నాకూ ఇక్కడేదయినా ఉద్యోగం దొరుకుతుందా?"
    ఆమె నవ్వింది.
    "ఉద్యోగం దొరుకుతే నిజంగా ఇక్కడి కొచ్చేస్తారా?"
    "అవును! అందులో అనుమానమేముందీ?"
    "ఎందుకిక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు?"
    సృజన్ ఆమె కళ్ళల్లోకి చూశాడు . ఆమె ఎలాంటి జవాబు కోరుకుంతొందో అర్ధమయిందతనికి. తన దగ్గరున్న జవాబు కూడా అదే.
    "ఇక్కడయితేనే మీరుంటారు కాబట్టి-"
    ఆమె కళ్ళల్లో వెలుగు కనిపించిందతనికి.
    "నాకు అంత ఇన్ ఫ్లుయేన్స్ లేదు. అయినా నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. మా బాబాయే ఏమయినా సహాయం చేయగలగాలి."
    "థాంక్యూ!"
    ఇద్దరూ కాంటీన్ బయటికొచ్చారు.
    "అయితే రాత్రి మా ఇంటి కొస్తారా?"
    "అవును! రెండు గంటలకు రైలుంది. వెళ్ళేలోగా మీ బాబాయి గారితో మాట్లాడితే బాగుంటుంది.
    "వెల్ కమ్ -"
    "వస్తాను కాసేపలా బీచ్ లో కూర్చుని తర్వాత వస్తాను ---" అతను వెళ్ళిపోయాడు.
    భారతి కొద్ది క్షణాలతని వేపే చూసి తన రూమ్ లో కెళ్ళిపోయింది.
    సృజన్ ఆఫీస్ బయటి కొచ్చేసరికి ఎదురుగ్గా జీప్ ఆగి వుంది. పోలీస్ జీప్ -- లోపల ఇన్ స్పెక్టర్ రాహి , మరికొంత మంది కానిస్టేబుల్స్ కూర్చుని వున్నారు.
    సృజన్ కి అనుమానం వచ్చేసింది. వాళ్ళు తనకోసమే వచ్చి ఉంటారా?"
    రాహి జీప్ దిగి సృజన్ కి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు.
    "జీపెక్కు" అన్నాడు అధికారస్వరంతో.
    "ఎందుకు?" నిర్లక్ష్యంగా అడిగాడు సృజన్.
    "ముందు జీపెక్కు -- ప్రశ్నలు  తరువాత వేద్దురుగాని -"
    "కారణం తెలీకుండా నేను ఎక్కడికీ రాను" మొండిగా అన్నాడతను.
    "రాకపోతే బేడీలు వేసి లాక్కెళ్ళాల్సి వస్తుంది."
    "మీ ఇష్టం! బలవంతంగా మీరేమయినా చేసుకోవచ్చు. యిష్టపూర్వకంగా మాత్రం నేనురాను."
    రాహి కి కోపం పెరిగిపోతోంది.

 Previous Page Next Page