Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 39

 

    "అంత దిగడం చేతకానివాడివి అసలు ఎందుకు ఎక్కావు!" అని విసుక్కుంటు "ఊ! దిగు" అని రెండు చేతులూ రాజా నడుం మీద వేసి దింపబోయాడు భైరవన్.


    కానీ-


    కూర్చున్నచోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేదు రాజా !


    నుదురు చిట్లించి రాజా వైపు ఓ చూపు చూశాడు శాండో భైరవన్. ఈసారి ఇంకాస్త బలం ఉపయోగించి రాజాని దిమ్పబోయాడు.


    ఉహూ!


    ఎక్కడ కూర్చున్నాడు అక్కడే ఉన్నాడు రాజా!


    ఈసారి తన బలం మొత్తం ప్రయోగించి రాజాని కిందికి దిగలాగేయాలని చూశాడు భైరవన్.


    అయినా కూడా రాజా కదలలేదు!


    మెదలలేదు!


    అతని పెదిమల మీద అదోరకం చిరునవ్వు!


    శాండో భైరవన్ మొహం అవమానంతో నల్లబడింది.


    అతను ఈసారి రెండు చేతులతో రాజాని పట్టుకుని, రెండు కాళ్ళు గోడకి తన్ని పెట్టి "హూమ్మని' మూలిగి రాజాని కిందికి లాగడానికి చూశాడు.


    అబ్బే!


    రిజల్టేమీ కనబడలేదు.


    చిన్నగా నవ్వాడు రాజా.


    ఇంక తిక్కరేగిపోయినట్లయింది భైరవన్ కి. అప్పటికే యూనిట్ మెంబర్స్ లో చాలా మంది మందగా చేరి, నోరెళ్ళబెట్టి ఈ అద్భుతాన్ని చూస్తున్నారు.


    భైరవన్ వెర్రిగొరిల్లాలాగా రాజా నడుము పట్టుకుని ఊగుతూ వినేవాళ్ళకి భయం కలిగేటట్లు కేకలు పెట్టడం మొదలెట్టాడు.


    అయినా ఏ మాత్రం లాభం లేకపోయింది.


    అప్పుడు

    
    కన్నుమూసి తెరిచేలోగా ,


    అంత బరువున్న భైరవన్ నీ అతి లాఘవంగా పైకి లాగేసి, గోడమీద తన పక్కన కుదేశాడు రాజా.


    "కాసేపు రెస్టు తీసుకో! ఉపిరందాక మళ్ళీ ట్రై చేద్దువు గానీ!" అన్నాడు.


    అప్పటికే భైరవన్ బుర్ర పనిచేయడం మానేసింది. కళ్ళప్పగించి , నోరెళ్ళబెట్టి చూస్తూ, "నువ్వసలు మనిషివా? భూత ప్రేత పిశాచానివా! మనుషులకి ఇంత బలం వుండటం నేనెప్పుడు చూడలేదు!" అన్నాడు.


    నవ్వాడు రాజా.


    "నేను మాములు మనిషినే. అందులో డౌటేం లేదు. నువ్వే అవతారం చూస్తే గొడ్డులా వున్నావు!"


    "మనిషినే అయితే నీకింత బలం ఎలా వచ్చింది. బలంకోసం ఏం తింటావ్!" అన్నాడు భైరవన్.


    "నువ్వేం తింటావ్!" అన్నాడు రాజా.


    గబగబ లిస్టు చదవడం మొదలెట్టాడు భైరవన్. "ప్రొద్దున్నే కోడి! తర్వాత నాలుగు లీటర్ల పాలు, ఒక కిలో బాదంపప్పు, అరకిలో నానబెట్టిన శనగలు - అరకిలో పిస్తా! యాభై కోడిగుడ్లు! - మధ్యాహ్నం భోజనానికి ఒక పూర్తి గొర్రెపొటేలు, సాయంత్రం టిఫినుకి ఒక డజను దోసెలు, రాత్రికి తేలిగ్గా రెండు కోళ్ళతో లైట్ భోజనం " అన్నాడు.


    "రెండు కోళ్ళతో లైట్ భోజనమా?" అన్నాడు రాజా.


    "అంతేగా మరి!" అన్నాడు భైరవన్.


    "నీకు బకాసురుడు తెలుసా?"


    "ఒక సినిమాలో ఆ కారెక్టర్ వేశా!" అన్నాడు భైరవన్.


    "వేశావు గదా - అది రాక్షసులు తినే తిండి - మనుషులు అట్లా తిన కూడదు!"


    "ఇదివరకు కింగ్ కాంగ్ అనే ఫైల్వన్ అట్లాగే తినేవాడుగా!" ఆన్నాడు భైరవన్.


    "కానీ అపరిమితంగా తిండి తినే కింగ్ కాంగ్ ని మన దారాసింగే ఎప్పుడూ ఓడిస్తూ ఉండేవాడు! ధారాసింగు ఇట్లా దెయ్యపు తిండి తినేవాడు కాదు." అన్నాడు రాజా.


    అప్పటిదాకా గొరిల్లాలా వున్న భైరవన్ గొర్రెపిల్లలా మెత్తగా అయిపోయాడు. దేబెలాగా చూస్తూ అడిగాడు. "తిండి వుంటేనే కండ! కండ ఉంటేనే బలం - మరి నువ్వూ తిండి తినక , పెద్దగా ఒళ్ళు పెంచక ఇంత బలం ఎలా సంపాదించావ్!"


    "బలం కంటే టెక్నిక్ ముఖ్యం! అదలా ఉంచు! నేను బలం కోసం లక్నో పప్పు తింటాను!" అన్నాడు రాజా.


    "పప్పు! పప్పా!" అన్నాడు భైరవన్ ఆశ్చర్యం పట్టలేక!


    "అవును పప్పే! లక్నో పప్పు!" అన్నాడు రాజా.


    "రోజుకి ఎన్ని శేర్లు తింటావ్?" అన్నాడు భైరవన్ ఆశ్చర్యంలో నుంచి తేరుకోకుండానే.


    "లక్నో పప్పు రోజుకో ముద్ద తినగలిగితే అదే ఘనం!" అన్నాడు రాజా.


    అపనమ్మకంగా నవ్వాడు భైరవన్.


    "నేను అరబస్తా ఉఫ్ మని ఉదేస్తా!" అన్నాడు రాజా.


    అపనమ్మకంగా నవ్వాడు భైరవన్.


    "నేను అరబస్తా ఉఫ్ మని ఉదేస్తా!" అన్నాడు.


    "అరముద్ద తిన్లేవు" అన్నాడు రాజా.


    "పందెం?" అన్నాడు భైరవన్.


    "పందెం ?" అంటూ గోడమీద నుంచి కిందికి దూకాడు రాజా.


    "మా భీంసెయిన్ తో చెప్పి చేయిస్తా లక్నో పప్పు! ఒక్క ముద్ద కూడా నువ్వు తిన్లేవు" అన్నాడు.


    "ఎంత చేయిస్తే అంత తింటా! మీ ఓపిక!" అన్నాడు భైరవన్.


    ఈలోగా -


    మెగా ప్రొడ్యుసర్ అటు వచ్చాడు.


    రాజాని చూడగానే అతనే పాలెస్ కి ఒనరని గుర్తుపట్టాడు నటరాజన్ కూడా .


    అతని బుర్ర చాలా షార్ప్ - భైరవన్ బుర్రలా మట్టి బుర్ర కాదు.


    నమస్కారాలు పూర్తీ అయ్యాక అన్నాడు నటరాజన్.


    "మీరు మా భైరవన్ కి ఏదో పాఠం నేర్పిస్తున్నట్లు ఉన్నారే!"


    "ఏదో చిన్న పాఠం!" అని నవ్వాడు రాజా. "కాని నాకు మీ దగ్గర పెద్ద పాఠాలు నేర్చుకోవాలని వుంది."


    "నన్ను ఎక్కువ చేస్తున్నారు. నేనెంత!" అని విన్రమంగా అని, వెంటనే మాటమార్చేస్తూ అన్నాడు నటరాజన్, "మీ ట్రస్టీ సుందరం నాకు పాత పరిచయం! ఇదివరకోసారి కూడా ఈ పాలెస్ లోనే షూటింగ్ చేశాం. ఈ కొత్త పిక్చర్లో రెండు యూనిట్లు ఉన్నాయి. ఒక యూనిట్ రోడ్డుమీద షూటింగ్ చేస్తోంది. రెండో యూనిట్ ఇక్కడ మీ పర్మిషన్ తో మేం షూటింగ్ స్టార్ట్ చెయ్యొచ్చా? రేయ్! సార్ కి చెయిర్ వెయ్యండి!"


    "అబ్బే! నాకు మర్యాదలు వద్దు - మీ పని కానివ్వండి" అన్నాడు రాజా.


    అయిదు నిముషాల్లో షాట్ రెడీ అయింది.


    రాజుగారి సైన్యం, ఏనుగులూ, గుర్రాలు, ఒంటెలు, రధాలతోబాటు సింహాలు, రెండు పులులూ కూడా కవాతులో పాల్గొనే దృశ్యం! ఆ సీన్లో రెండువందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు.


    షాట్ అరేంజ్ చెయ్యడమే ఎంతో కష్టమైపోతుంది. చెడిపోతే మళ్ళీ అంత పర్ఫెక్ట్ ఫార్మేషన్ కుదరడం వెరీ వెరీ డిఫికల్ట్!


    ఆ షాట్ పాడయిపోతే మళ్ళీ తీయడం కష్టమని తెలిసిన నటరాజన్ ముందు జాగ్రత్తగా నాలుగు దిక్కులలో నాలుగు కెమెరాలు పెట్టించాడు. ఒకవేళ ఒక కెమెరా దృశ్యాన్ని సరిగ్గా క్యాచ్ చెయ్యలేకపోయినా కూడా మిగతా మూడు కెమెరాల్లో ఆ సీను రికార్డు కావాలని అతని ఉద్దేశ్యం (హాలివుడ్ క్లాసిక్ "బెన్ హర్" లో రధాల పోటీ దృశ్యాన్ని ఇలాగే పదమూడు కెమెరాలతో చిత్రీకరించారు)

    
    రెడీ అయిన షాట్ ని మళ్ళీ ఒకసారి పరిశీలనగా చూశాడు నటరాజన్. డైరెక్టరూ, కెమెరామెన్ కిండర్ గార్డెన్ పిల్లల్ల్లా నటరాజన్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు. చాలా యునిట్లలో ప్రొడ్యుసర్ అసలు వాల్యూ ఉండే ఉండదు. చివరికి టీ అందించే కుర్రాళ్ళు కూడా స్టార్స్ కి, టేక్నిషియన్లకి తెగ మర్యాదలు చేస్తారే తప్ప ప్రొడ్యూసర్ ని పట్టించుకోరు.


    కానీ నటరాజన్ యూనిట్ లో అలా కాదు. అతని ప్రొడక్షన్ కి అతనే కింగ్! అతనేం చెబితే అది వేదవాక్కే!


    "ఎన్నడా! అంతా రెడీనా? ఎడయిపోతే మళ్ళీ రాదు సీను!" అని ఇంకోసారి అందరిని హెచ్చరించి "స్టార్ట్" అనబోయాడు నటరాజన్.


    అయితే -


    అదే క్షణంలో


    ఇతమిద్దంగా ఇదీ అని చెప్పలేని ఓ జంతువూ తాలూకు అరుపు వినబడింది! మరణావస్థలో ఉండి, అతి దుర్భరమైన బాధతో అరుస్తున్న అరుపు అది!


    దాని గొంతు మహా విచిత్రంగా ఉంది!


    ఇదివరకు ఇంగ్లీషు టార్జాన్ చిత్రాలలో టార్జాన్ అరిచే చిత్రమైన అరుపుకు ఒక టెక్నిక్ కనిపెట్టారు. టార్జాన్ అరుపుకోసం ఎలుగుబంటి అరుపూ, సింహం గాండ్రింపూ వగైరాలన్నీ మిక్స్ చేశారు. అదే టార్జాన్ అరుపుగా ఫేమస్ అయింది.


    అలా వుంది ఈ గొంతు కూడా!


    అది విని వినగానే -

 Previous Page Next Page