యుక్తవయసొచ్చిన ఆడపిల్ల బయటకు పాదంపెడితే ప్రతి బడుద్దాయి వెధవ కళ్ళూ ఆమెమీదే వుంటాయి. ప్రపంచంలో వయసులో వుండటమే ఓ విడ్డూరంలా, వేళాకోళాలూ, వెక్కిరింతలూ, వెధవఫోజులూ, ఎవరిమటుకువారు ఓ హీరో అనుకోవటం, కాస్త అందమైన ఆడపిల్ల కనిపిస్తే వలపన్నటం, ఎలాగైనా చేజిక్కించుకోవాలనీ, అనుభవించాలనీ ప్రయత్నించటం, ప్రాణ స్నేహితుడి భార్యమీద కూడా వ్యామోహం పెంచుకుంటూ వుండటం, వంటరిగా దొరికితే...
వంకరగా మాట్లాడటం, మరదలు పిల్లమీద, వదినగార్లమీద వావి వరసలు లేకుండా కామంతో కూడిన కళ్ళను, కళలను ప్రదర్శించటం, అవకాశ మొస్తే అవతలివాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తులను నాశనం చేసి పారెయ్యటం, అర్ధం పర్ధం లేకుండా పాశవికంగా రేప్ చేసి పారెయ్యడం, ఓ మొగుడూ పెళ్ళాలు ఏ సినిమానుంచో వేళకానివేళ వస్తోంటే మొగుడ్ని తన్ని, లేకపోతే చంపిపారేసి పెళ్ళాన్ని రేప్ చేసెయ్యడం, ఏ తిరుపతినుంచో పాపం తీర్ధయాత్ర చేసుకొని కారులో ఇంటికి తిరిగివస్తుంటే, తల్లీకూతుళ్ళని, అత్తాకోడళ్ళనూ, ఆక్కాచెల్లెళ్ళనూ కలిసి సామూహికంగా మానభంగం చేసిపారెయ్యటం...
దిస్ యీజ్ హారిబుల్ వరల్డ్.
* * *
పామ్ గ్రోవ్ హోటల్ దగ్గరవున్న ఇండియన్ స్టాటిస్టిక్స్ ఆఫీసులో ఆనందమోహన్ ని కలుసుకుందామని వెళ్ళాడు.
అతను కొన్నాళ్ళుగా సెలవుమీద వున్నాడనీ, ఆఫీసుకు సరిగా రావటంలేదనీ తెలిసింది. బాయ్ ని అడిగి అతను కొత్తగా మారిన ఇంటిఎడ్రస్ తెలుసుకొన్నాడు.
కారు డ్రైవ్ చేసుకుంటూ ఆ యిల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు.
ఓ అరగంట తర్వాత ఇంటిని కనుక్కోగలిగాడు.
ఓ పెద్దయింట్లో రెండుమూడు గదులభాగం బయట తాళంపెట్టివుంది. వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే ఓ యాభయి ఏళ్ళ వ్యక్తి బహుశా ఇంటి యజమాని అయివుండవచ్చు. ప్రక్క పోర్షన్ లోంచి బయటికొచ్చి "ఎవరికోసం?" అనడిగాడు.
"ఆనంద్ మోహన్ కోసం."
"మీ పేరు?"
"రాజీవ్."
"ఒక్క నిముషం వుండండి" అంటూ ఆయన లోపలకెళ్ళి ఓ కవరుతో తిరిగివచ్చాడు.
"ఆనంద్ మోహన్ గారు రెండురోజుల క్రితమే ఊరువెళ్ళారు. మీరొస్తే యీ ఉత్తరం ఇమ్మన్నారు."
రాజీవ్ కవరందుకొని కారు దగ్గరకొచ్చి లోపలికి ఎక్కికూచొని, కవరు చింపాడు.
"రాజీవ్ గారూ!
మీకు మహాద్రోహం చేశాను. ఎవడో నీతినియమాలు లేనివాడు, ఎథిక్స్ లేనివాడు చేసేపని సెంటిమెంటల్ ఫూల్ నై వుండి నేను చేయడం క్షమించరాని నేరం. ప్రపంచంలో అతి సున్నితత్వం, మంచితనం, ఆరాధిస్తున్నామని అనుకోవటం ఇలాగే పరాభవించబడుతూ వుంటాయి. మనసుని ప్రేమిస్తున్నామని అనుకునేవారుకూడా శరీరాకర్షణలకు దూరంగా వుండలేరు. ప్రపంచ చరిత్రలో చాలా జీవితాలు నిర్దాక్షిణ్యంగా కాలిపోయాయి. యీ తేడా మీద అవగాహన లేకపోబట్టే.
రాజీవ్ గారూ!
జరిగింది తప్పని మనందరికీ తెలుసు. కాని తప్పుకు పర్యవసానం శిక్ష కాదు. క్షమాగుణం.
తప్పు చేసినవారిలో కూడా మహనీయమైన మానవత్వం వుంటుంది. అది దర్శించగలిగినప్పుడు.... దర్శించగలగాలి.
మనిషిని అక్కడక్కడాగాక సమగ్రంగా బేరీజు వెయ్యగలగాలి. అప్పుడు తప్పు మంచుయై ఆవిరియై కరిగిపోతుంది.
మీలో అంత మహోన్నతమైన క్షమాగుణం కలిగించటానికి, నాకు ఒకే ఒక మార్గం కనిపిస్తోంది..
ఆత్మార్పణ చేసుకోవటం.
ఈ ఉత్తరం మీకు అందే సమయానికి నేనీ లోకంలో వుండను.
నా నిష్క్రమణ అమర సందేశంగా రోదిస్తూ మీ ఇద్దర్నీ బంధించి వుంచగలిగితే నా ఆత్మకు అంతకన్నా సంతోషం వుండదు.
సెలవు
ఆనందమోహన్.
* * *
తర్వాత ఓ గంటసేపు రాజీవ్ పిచ్చెక్కినట్టు డ్రైవ్ చేస్తూ ఎక్కడెక్కడో తిరిగాడు. వళ్ళంతా చెమటలు, తలమాత్రం వేడెక్కిపోతోంది.
గుండెలో ఓ మహారణ్యం తగలబడుతోంది.
జ్వాలలు యింకా యింకా ఎగసి మింటికంటుకున్నాయే గాని చల్లారటం లేదు.
వాటీజ్ దిస్!?
నేను...
ఏమి... చెయ్యాలి?"
చిన్మయీ! నా ప్రియతమా! నా ప్రాణమా ఎందుకిలా... ఎందుకిలా జరిగింది?
* * *
చీకటి పడుతూన్న టైంకి ఇంటికి వచ్చాడు. ఇంటిలో దీపం వెలగటంలేదు. దగ్గరగా వేసివున్న తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లి స్విచ్ నొక్కాడు.
చిన్మయి సోఫాలో కూర్చుని వుంది.
తల ఎత్తి అతని మొహంలోకి చూసింది.
దగ్గరగా వెళ్ళాడు.
"చిన్మయీ!" అన్నాడు.
అర్ధం చేసుకుంటోంది.
"నా నిర్ణయం మారదు. మనం విడిపోతున్నాం."