పెళ్ళి అయిన తొలిరోజుల్లో నా భర్త చాలా అందగాడని అనుకునే దాన్ని. కొంచెం పాతపడ్డాక ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. నీకు నేనైనా అంతే. ఇప్పుడు రంభలా అనిపించినదాన్ని రేపు రంగమ్మలా అనిపిస్తాను"
అతను నా మాటలకు అడ్డు తగిలాడు. "ఇవన్నీ సహజమైన విషయాలు. వీటిని అసహజంగా అనుకొని నిట్టూర్చడమే మనమంతా కామన్ గా చేసే తప్పు."
"పోనీ అవన్నీ వదిలేద్దాం. రేపు నా భర్తకు ఇదంతా తెలిస్తే నువ్వు నన్ను ఏలుకుంటావా? నాకు నమ్మకంలేదు. అందుకు కారణం నువ్వు చెడ్డవాడివని కాదు, నీ పరిస్థితు.
బంగారంలాంటి భవిష్యత్తు వదులుకోలేవు. మాటలకేం వుంది? ఎన్నయినా చెప్పగలం. తీరా చేతలకొచ్చాక వెనకడుగు వేస్తాం. అంతెందుకు- నీకు చాలా ఇష్టమయిన జుట్టుని నాకోసం వదులుకుని బోడిగుండు చేసుకోగలవా? చేసుకోలేవు. ఎందుకంటే నీ జుట్టు నీకు చాలా అందం ఇస్తుంది కాబట్టి. అందువల్ల నన్ను ఇక మరచిపో, ఎప్పుడూ కలుసుకోవాలని ప్రయత్నించకు. నా మాట మన్నిస్తానని నమ్మకం" ఎంతో సీరియస్ గా చెప్పాను.
అతను ఏదో మాట్లాడాలన్న ప్రయత్నాన్ని అడ్డుకున్నాను. నా మాటల ఎఫెక్టు అలా కొనసాగాలంటే ఇక సంభాషణను పొడిగించకూడదు. అందుకే అక్కడ నిలబడి వున్న రిక్షాను రమ్మనమని సైగ చేశాను.
రిక్షావాడు పరుగు పరుగున వచ్చాడు.
అందులో ఎక్కి కూర్చుని 'గుడ్ బై' అని ముఖం తిప్పేసుకున్నాను. అతను బాగా షాక్ తినేశాడేమో శిలాప్రతిమలా చూస్తూ నిలబడిపోయాడు. నాకు కావాల్సింది కూడా అదే.
రిక్షా కదిలింది.
అతను ఇక రాడన్నది సుస్పష్టం. అంతగా నిలదీసి బెదిరిస్తే జంకని మగవాడు అరుదు. అందుకే భవిష్యత్తు గురించి భయంకరంగా చెప్పి హడల గొట్టేశాను. కానీ ఈ శూన్యాన్ని నేను భరించగలనా అన్న కొత్త అనుమానం కలిగింది. అయితే ఆ అనుమానం నిజం కాకుండా నేను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది.
నేనూ వూహించినట్టుగానే జయంత్ రాలేదు. ఈపాటికి అతనూ నన్ను భయంకరంగా తిట్టుకుని మరిచిపోయి వుంటాడనుకున్నాను.
రెండు రోజులు గడిచిపోయాయి.
మూడోరోజు మధ్యాహ్నం తిరిగి పిల్లల్ని స్కూలుకి పంపాక రెస్టు తీసుకుందామని అనుకున్నాను. మగతగా నిద్ర పట్టేసింది.
ఎవరో తలుపు తడుతున్నారు. ఇది కలా, నిజమా అని తర్కించు కుంటూ చుట్టూ చూశాను.
మళ్ళీ చప్పుడు. ఈ వేళప్పుడు ఎవరా అనుకుంటూ లేచాను. ఒంగోలు నుంచి ఉదయమే ఆయన ఫోన్ లో మాట్లాడారు. రెండు రోజుల తరువాత వస్తానన్నారు కాబట్టి ఆయనకాదు. మరెవరా అనుకుంటూ తలుపు తీశాను.
ఎదురుగ్గా వున్నది ఎవరో ఒక్కక్షణం పోల్చుకోలేకపోయాను. నున్నటి గుండుతో చెమటలు కార్చుకుంటూ నావైపు తదేకంగా చూస్తున్న జయంత్ ను చూస్తుంటే ఏదోలా అయిపోయాను.
నా మాటల్ని సీరియస్ గా తీసుకొని నాకోసం గుండు గీయించుకుని ఎదురుగా నిలబడ్డ అతన్ని చూస్తుంటే నా గుండెను మడతపెట్టేసినట్లనిపించింది. రక్తనాళాలు శరీరంలో నుంచి చొచ్చుకొని రక్తం కారిపోతున్నట్లుంది. పెద్ద గాలి అల తలకు విసురుగా తగిలినట్లయింది. నా భ్రమలన్నీ పటాపంచలయ్యాయి.
ఏమీ మాట్లాడకుండా లోపలికి రమ్మన్నట్లు దారికి అడ్డం తోలిగాను.
లోపలికొచ్చాడు.
హాల్లో ఒకరికొకరు ప్లాట్ గా చూసుకుంటూ నిలబడ్డాం.
అప్పుడు చూశాను అతడి తలను, గుండుమీది ఎర్రటి గాట్లు. చేత కానివాడు గుండు గీసినట్లు తలంతా గాట్లు. రక్తం గడ్డకట్టడంవల్ల గీతలు ఎర్రగా కనిపిస్తున్నాయి.
"ఏమిటిదంతా?" అని అడిగాను. ఎవరో నొక్కేస్తున్నట్లు కీచుమంటూ మోగింది నా కంఠం,
"గుండు గీసుకున్నాను. మిమ్మల్ని మధ్యలో వదిలిపోననీ, మీరంటే నాకెంతో ఇష్టమని చెప్పడానికే ఇలా తయారయ్యాను. మీరు చెప్పింది. నేనే చెయ్యాలనే తపనతో నాకు నేనే గుండు గీసుకున్నాను. అందుకే గాట్లు కాస్త ఎక్కువయ్యాయి. మిమ్మల్ని నమ్మించబోతున్నానన్న ఆనందంలో నొప్పి తెలియలేదు."
అప్పుడు ఏడ్చాను నేను. జీవితంలో చాలా ఏళ్ళ తరువాత మనస్ఫూర్తిగా ఏడ్చాను. మనసులోని కుళ్ళంతా కరిగిపోయేటట్లు ఏడ్చాను. నా ఇష్టమంతా కన్నీళ్ళతో తెలియజేయడానికి ఏడ్చాను. ఆ అభిమానానికి, ఆ పిచ్చి ప్రేమకూ, అందాన్ని కూడా చాలా సులభంగా తృణీకరించగలిగిన ఆ మోహావేశానికి కదిలిపోయి ఏడ్చాను.
ఒకడుగు ముందుకువేసి జయంత్ చేయి పట్టుకుని సోఫాలో కూర్చుంటూ లాక్కున్నాను. ఊహించని ఈ సంఘటనకు అతను పూర్తిగా నామీద వాలిపోయాడు.
అది హాలనీ, తలుపు మూయలేదనీ, ఎవరైనా వస్తే రెడ్ హ్యండెడ్ గా పట్టుబడతామనీ ఏమీ తోచలేదు ఆ క్షణంలో భయమంటే ఏమిటో దగ్గరకు రానివ్వలేదు మనసు. ఏమిచ్చి అతన్ని సంతోషపరుద్దామనే ఆలోచనంతా.
అతని దిగులునీ, అతని బాధనీ, అతని కోరికనూ, అతని తపననూ, అతని ఉద్వేగాన్నీ, అతని ఉద్రేకాన్నీ క్షణంలో తీర్చేయాలన్నంత ఆత్రుతతో మరింత దగ్గరకు లాక్కున్నాను.
నన్ను నేను అర్పించుకున్నాను.
* * *
ఇలాంటివి చాలారోజులు దాగవు. మౌనంగా సంభాషించుకునే ఓ చూపు. ఆత్మీయనంతా రంగరించుకున్న చిన్న పలకరింపు. ఆ వ్యక్తి కనబడగానే ముఖంలో ఎగజిమ్మే వెలుగు, అతని సాన్నిహిత్యంలో శరీరం తిరిగే వంపూ, ఇవన్నీ ఎదుటివాళ్ళకు మన రహస్యాన్ని ఈజీగా పట్టిస్తా యనుకుంటా.
మా సంబంధం ప్రారంభమైన ఆరునెలలకి కాబోలు నా భర్తకి విషయం తెలిసిపోయింది.
"ఏమిటిదంతా?" అని అడిగాడు.
ఇలాంటి సందర్భానికి ఎప్పుడో ప్రిపేర్ అయిపోయాను.
"ఏం చేయను! తప్పలేదు"
నావల్లకాదు. మెత్తటి మనిషి. అందుకే దీన్ని ప్రపంచంపు సమస్య చేయలేదు.
"ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైతే ఏం చేయాలో మనం విడిపోదాం. మీకు తెలియకుండా రహస్యంగా జయంత్ తో గడపడం నాకు మొదటి నుంచీ ఇష్టంలేదు. కాని చెప్పానుగా. తప్పలేదనీ" ఎదురుగా వున్న గోడను చూస్తూ చెప్పాను.