రెండూ జరగనప్పుడు నాగరాజు ఆస్థి నాగరాజుకే వుండిపోతుంది. అందరి అదృష్టంతోపాటూ నాగరాజు తన అదృష్టం కూడా పరీక్షించుకుంటున్నాడు.
రామశేషుకు చెల్లెలిద్వారా అసలు విషయం తెలిసింది. అతడు బాగా ఆలోచించాడు.
హాసను హత్యచేస్తే వీలునామా బయటపడ్డాక పోలీసులు తనను అనుమానించే అవకాశముంది. కాబట్టి అతడిందుకు రమణ నెన్నుకున్నాడు. రమణ హాసను పెళ్ళి చేసుకుని ఎవరికీ అనుమానం కలగని విధంగా ఆమెను చంపేస్తాడు. రమణ తనను మోసం చేయడని రామశేషు నమ్మకం. అందుకు తగ్గ కారణాలతడికి వుండి వుండవచ్చు.
హాసను పెళ్ళిచేసుకుని చంపేస్తే రమణకు యాభైలక్షల రూపాయల ఆస్థికి వారసత్వం లభిస్తుంది. ఫలితంగా రమణ రామశేషుకు ఏటా రెండు లక్షలు ప్రతిఫలంగా ఇస్తూండాలి. ఏ రిస్కూ లేకుండా నికరాదాయం రామశేషుకి.
వాళ్ళు రంగంలో దిగారు. ముందుగా రమణ మంచి పేరును సంపాదించడం కోసం రవీంద్ర బృందం పథకాన్ని దెబ్బతీశాడు.
* * * *
"ఇవన్నీ నీకెలా తెలిశాయి?" అడిగాడు దేవేంద్ర.
"ఇదిగో! పుస్తకంలో చదివాను" అన్నాడు రవీంద్ర తన ఒడిలోని పుస్తకం చూపిస్తూ.
రాజేంద్ర ఆత్రుతగా ఆ పుస్తకాన్నందుకున్నాడు.
"నో జోక్స్ ప్లీజ్!" అన్నాడు దేవేంద్ర.
"ప్రతిభ చేపగా మారి నిన్నే ఎరను చేస్తే నువ్వేం చేయాలీ అనడుగుతున్నావు. నిన్నేం చేశానో నువ్వే చూశావు...."
"చాలా కష్టపడి గొప్ప విశేషమే తెలుసుకున్నావు. ఈ విజ్ఞానం వల్ల మనకు ప్రయోజనం....?"
రవీంద్ర నవ్వి, "రమణ చాలా మంచివాడు. అతడు హాసను ప్రేమించి పెళ్ళి చేసుకుందామనుకున్నాడు. రమణ మంచితనానికి ప్రతిభ, ఆమె కుటుంబం సాక్షులు. అంత మంచి రమణ ఏరికోరి పెళ్ళి చేసుకుందామనుకున్న ఆమెను యాభై లక్షల రూపాయలకోసం నిర్ధాక్షిణ్యంగా హత్య చేయించాడు రామశేషు" అన్నాడు.
"హాస చచ్చిపోయిందా?" అన్నాడు రాజేంద్ర కంగారుగా.
"ఇంకా చచ్చిపోలేదు. చచ్చిపోతుంది. ఆ పుస్తకంలో చదవలేదా?" అన్నాడు రవీంద్ర.
"ఇందులో నాకేం కనబడలేదు. నీకేమయినా కనబడుతుందేమో చూడు" అంటూ పుస్తకాన్ని రాజేంద్ర దేవేంద్రకు అందించాడు.
"అయితే రామశేషు ఆమెను చంపేస్తాడా?" అన్నాడు రాజేంద్ర.
"వెర్రి బాగులోడా! ఆమెను మనమే చంపేస్తాం. అనుమానం రామశేషు మీదకు పోతుంది. అర్ధమయిందా?"
"అందువల్ల మనకు ప్రయోజనం!"
"ఆడపిల్లల్ని వేటాడి ఆనందిద్దామనుకున్నాం మనం. అందుకడ్డు తగిలారు రమణ, రామశేషు! వాళ్ళమీద పగ తీర్చుకోవాలంటే ఒక్కటే మార్గం. పెళ్ళికి ముందే ఆమె చచ్చిపోవాలి. ఆ అనుమానం రామశేషు మీదకు వెళ్ళాలి!"
"ఆడపిల్లని అనుభవించడం వరకే నాకిష్టం. అంతం చేయడానికి నాకు మనసొప్పదు" అన్నాడు రాజేంద్ర.
"నీలో బొత్తిగా ప్రతీకార జ్వాల రాగలడం లేదు. పోనీ నీకో లక్ష రూపాయలొస్తే ఈ పని కొప్పుకుంటావా?"
"లక్షరూపాయలా, ఎందుకు?"
"బహుశా నాగరాజు తన అదృష్టం కోసం చేస్తున్న కృషి మన రవీంద్ర చేత ఈ మాటలు పలికిస్తోందనుకుంటాను" అన్నాడు దేవేంద్ర.
"నీకెలా తెలిసింది?" అన్నాడు రవీంద్ర ఆశ్చర్యంగా.
"ఇదిగో, ఈ పుస్తకంలో చదివాను" అన్నాడు. దేవేంద్ర నవ్వుతూ.
"గుడ్, తెలివైన వాడివి. అయితే ఆమెను హత్య చేసే భారం కూడా నీకే వదిలి పెడుతున్నాను" అన్నాడు రవీంద్ర.
* * * *
అదే సమయానికి శ్రీనగర్లోని మరో హోటల్ గదిలో.... ....
నడివయస్కుడు రామశేషు, రమణ ఒకరికొకరు ఎదురుగా ఉన్నారు.
ఇద్దరూ నిలబడే వున్నారు.
ఆకారాలెలా ఉన్నా వాళ్ళ ముఖాలు చూస్తుంటే అప్పుడు రాక్షసులనే అనిపిస్తుంది.
"ఒక్కసారి నవ్వు" అన్నాడు రామశేషు.
"ఎందుకు?"
"నవ్వు చెబుతాను" అన్నాడు రామశేషు.
రమణ నవ్వాడు.
"హమ్మయ్య! అని నిట్టూర్చి," నీలో వున్నట్లుండి రాక్షసుడి పోలికలు కనిపించాయి. నీ నవ్వు కూడా మారిపోయిందని భయపడ్డాను. అలా జరుగలేదు. నీ నవ్వే నీకు శ్రీరామరక్ష అని మర్చిపోకు" అన్నాడు రామశేషు.
"హాసను ఎప్పుడు, ఎలా చంపాలా అన్నది తేల్చుకోలేక పోతున్నాను...."
"బ్లడ్ కాన్సర్ పేషెంటు. ఎప్పుడయినా, ఎలాగయినా చస్తుంది." రామశేషు నవ్వాడు.
"నువ్వింట్లో కూడా యిలాగే నవ్వుతావా?" అన్నాడు రమణ.
"ఏం?"
"నీ కోల్డ్ బ్లడెడ్ నవ్వుకు నా గుండెలే అలిసిపోతున్నాయి. నీ కుటుంబం భరించగలదా?"
"నా మనసులో ఆలోచనలని బట్టి నా నవ్వు మారుతుంది. అది నాకు శాపం. మనసులో కౄరమయిన ఆలోచనలు పెట్టుకుని అమాయకంగా నవ్వడం నావల్ల కాదు...."
"సరే, జూన్ ఏడు దాకా ఆగాలా, ఈలోగా హాసను" ఆగాడు రమణ.
"అంత తొందరేం. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అందమైన పిల్ల...."
"ఆ అమ్మాయిని చూస్తుంటే అందం కాదు. బ్లడ్ కాన్సరు కనిపిస్తోంది నాకు...."
"అందుకే తొందరపడకు. అదే చంపగలదా అమ్మాయిని...."
"ఇలా పెళ్ళయిన వెంటనే అలా చంపేస్తే డ్రమెటిక్ గా ఉంటుందేమోనని!" నీళ్ళు నమిలాడు రమణ.
"ఏమిటి డ్రామా?"
"అందరికీ తెలుసు, ఆమె బ్రతుకు రోజుల్లో వుందని! అలాంటప్పుడు పెళ్ళి కాగానే చచ్చిపోతే అంతా నామీదే జాలిపడతారు...."
"కానీ అంత అందమయిన పిల్లని పెళ్ళి చేసుకుని కూడా...."
రమణ నిట్టూర్చి. "ఆ అమ్మాయి సామాన్యురాలు కాదు. వయసుకు మించిన తెలివి వుంది. అనుభవానికి మించిన వూహ వుంది. వూహకు మించిన మంచితనముంది. అందువల్లనేమో ఆమె ఎప్పుడూ నవ్వుతూ వుంటుంది. వాళ్ళింట్లో, ఆ వీధిలో, ఆమె కాలేజీలో అంతా ఆమెను నవ్వుల రాణి అంటారుట. ఆమెను చూస్తుంటే ఏ లోకానికో మహారాణి అనిపిస్తుంది. శాప వశాన భూలోకానికి వచ్చిన దేవకన్య అనిపిస్తోంది. అద్భుత శక్తులున్న మానవ కన్య అనిపిస్తోంది. ఆమె నవ్వు చూస్తూంటే అలా చూస్తూండి పోవాలనిపిస్తోంది. ఆమెను నవ్వించడం కోసం ప్రాణమయినా యివ్వాలనిపిస్తోంది. ఆమె నవ్వు నాపాలనుకునే వాడి ప్రాణం తీయాలనిపిస్తోంది" అన్నాడు.
రామశేషు గతుక్కుమని "అంటే నా ప్రాణం తీసి నువ్వాత్మహత్యచేసుకుంటావా?" అన్నాడు.
"ఎందుకూ? ఆమె నాది అన్న భావం నాలో రాకుండా వుండడానికి ఇలా వివాహం కాగానే అలా చంపేస్తే సరిపోతుంది...."
"వివాహమైతే ఆమె నీది అన్న భావం కలగదా?"
"అసలు వివాహమే నాది అనుకోవడం లేదు నేను...."
"ఓకే.... అయితే ఇలా పెళ్ళి కాగానే అలా ఎలా చంపుతాను?"
"పెళ్ళి సమయంలో నేను సగం కొరికిన కిళ్ళీ ఆమె తింటుంది. ఆ సగంలో వుంటుంది కెమికల్! అది తిన్నవారు ఆ తర్వాత ఆరు నిముషాల మాత్రమే బ్రతుకుతారు. డాక్టర్లు కూడా ఆ చావు అసహజమైనదని చెప్పలేరు...."
"ఏమిటా కెమికల్?"
"పేరు చెప్పను. ఇలాంటి రహస్యాలు ఒకరికి మించి తెలియకూడదు...."
"ఓకే.... ప్రొసీడ్!"
"రేపటితో ఆపరేషన్ కాశ్మీర్ ఫినిష్! అమ్మాయినిక్కడే దహనం చేయించాలా, లేక శవాన్ని వాళ్ళూరు తీసుకెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను" అన్నాడు రమణ.
"పురోహితుడు సిద్ధంగానే వున్నాడు కదా.... అన్నీ యిక్కడే మరి!"
రమణ నవ్వాడు.
"అదే, అదే నీకు శ్రీరామ రక్ష!" అన్నాడు రామశేషు.
30
హాస తలంటి పోసుకుని ఊర్వశిలా తల ఆరబెట్టుకుంటోంది.
అప్పుడే తలుపు తోసుకుని లోపలకు ప్రవేశించాడు రమణ.
హాస తలెత్తి అతడివంక చూసి ఆశ్చర్యపోయింది.
ఎప్పటిలాకాక పంచె, లాల్చీ ధరించాడతడు. ఆ డ్రస్సులో కూడా అభినవ మన్మధుడిలాగున్నాడతడు. క్షణంపాటు ఆమె మనసు చలించింది.
మగతనపు ఠీవి పంచె కట్టులోనే కానీ సూటుబూట్లలో లేదు.