Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 4


    కాలం భారంగా నడుస్తోంది_ అక్కడ రవిచంద్రకు, ఇక్కడ సాయుధులకు.
    3_59  నిమిషాలయింది. రవిచంద్ర ఇంటిలోంచి వస్తూన్న అలికిడి లేదు.
    ఒక సాయుధుడు అనుమానంగా లేచాడు. అతన్ని చూసి మరొకడు లేచాడు, మూడోవాడు నాలుగోవాడు వరుసగా లేచారు.
    ఒక్కొక్కడు జాగిలాల్లా రవిచంద్ర ఇంటిని నాలుగు వైపులా నుంచి చుట్టుముట్టేందుకు కదిలారు.
    అక్కడ డ్రైవర్ టైం చూసుకున్నాడు. నాలుగు కావటానికి పదిసెకండ్లే వుంది. సీరియస్ గా వచ్చి డ్రైవర్ సీటులో కూర్చుని ఇంజన్ ఆం చేసి  అసహనంగా రవిచంద్ర ఇంటివైపు చూస్తున్నాడు. కాలు యాక్సిలేటర్ మీద ఉంచాడు అనీ అననట్లుగా, కేవలం రెండు  క్షణాలు చాలు ఆ కారు  ముందుకు దూకేందుకు. రవిచంద్ర మనసుమారి తమతో రాకపోతే మారణహొమం ఎలా  మొదలెట్టాలి-ఐదుగురిలోనూఅదే ఆలోచన.
    సరిగ్గా నాలుగైంది.
    రవిచంద్ర బయటకు వచ్చాడు. నలువైపులా చూశాడు. అంతలో వెనుకనుంచి భార్యకూడా వచ్చింది. ఆమె  అప్పుడు బయటకు వస్తుందని ఊహించని సాయుధులు కంగారుగా చీకట్లోకి తప్పుకున్నారు.
    కొద్ది క్షణాలు.....రవిచంద్ర భార్యకు ఏదో నచ్చజెబుతున్నట్లుగా కనిపించింది. ఆమె లోపలకు నడిచింది. తలుపులు మూసుకున్నాయి.
    రవిచంద్ర తలొంచుకుని వడివడిగా కారున్నవేపు నడక ప్రారంభించాడు.
    మరో నిమిషంలో కారు బంజారాహిల్స్ వైపు బయలుదేరింది.
    సాయుధులకి అర్ధంకాని విషయం ఒకటుంది-అది అన్నమాట ప్రకారం రవిచంద్ర తిరిగిరావటం.......ఇంతటి నిజాయితీ పరులు ఇంకా ఉన్నారా!!
    ఉదయం పదిగంటలకల్లా రవిచంద్రకి నలుగుపెట్టి, మంగళ స్నానం చేయించారు. పూజ చేయించారు. తులసీ తీర్థం తాగించారు, నుదుట ఎర్రటి కుంకుమ తిలకం దిద్దారు. పట్టుబట్టలు తొడిగారు.
    ఈ పనులన్నీ యంత్రాల్లా చేసుకుపోతున్నారు. భాగ్యరాజ్ మనుషులు.
    తనకేం సంబంధంలేనట్లు మౌనంగా వాళ్ళు చేయమన్నట్టు చేస్తున్నాడు రవిచంద్ర.
    ఇవన్నీ తృప్తిగా చూసుకుంటున్నాడు భాగ్యరాజ్. ముహూర్తం దగ్గర పడుతోంది. ఆరోజే ప్రారంభంచేయబోయే భాగ్యరాజ్ కొత్త ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకెళ్ళారు రవిచంద్రను. ఒంటిగంటకల్లా బలిపశువు తయారయింది.
    రవిచంద్రను టెర్రస్ మీదకు తీసుకెళ్ళారు. భాగ్యరాజ్ ఆనందంగా చూసుకుంటున్నాడు తన కొత్త ఫ్యాక్టరీవేపు- రవిచంద్రవేపు.
    ఫ్యాక్టరీక్రింద కొత్తగా చేరిన కార్మికులంతా ఎప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుందా......ఎప్పుడు లోనకు వెళ్దామా అని ఆతృతగా చూస్తున్నారు.
    1-10...1-11...1-12...1-13...1-14......ఆఖరి సారిగా తలెత్తి భాగ్యరాజ్ వేపు చూశాడు రవిచంద్ర. నీ బలికి నేను సిద్దమయ్యాను-నా పనేం చేశావన్నట్లు.
    అన్నీ  సవ్యంగానే జరుగుతాయి-నీవేం శంకించాల్సిన పనిలేదన్నట్లు మందహాసం చేశాడు భాగ్యరాజ్.
    మరు నిమిషంలో జరుగబోయే మానవ మూర్ఖత్వ పరాకాష్ట సంగతి ఎవరికీ తెలియదు.
    రవిచంద్ర గుండె శబ్దం సృష్టంగా వినిపిస్తోంది అతనికి. కేవలం బలి, దోపిడి, దౌర్జన్యంవల్లే తన ఫ్యాక్టరీ అంచెలచెలుగా పైకి వెలుగుతుందని భావిస్తూన్న భాగ్యరాజ్ ఆనందంగా ఉన్నాడు, తన తెలివితేటలకి తనే మురిసిపోతున్నాడు.
    1-15 కావటానికి పదిసెకెండ్లే ఉంది. ఆ ఆఖరి ఘడియలో తన భార్యరూపం కళ్ళముందు ఓ క్షణం కదలాడింది రవిచంద్రకు.
    రెండే రెండు కన్నీటిబొట్లు రాలిపడ్డాయి కళ్ళవెంట నిశ్శబ్దంగా.
    సరిగ్గా1-15 అయింది.
    అంతే-నాలుగో అంతస్తు పిట్టగోడమీంచి గాలిలోకి డైవ్ చేశాడు. రవిచంద్ర.
    గాలిలో మెలికలు తిరుగుతూ, గుండెలవిసేలా అరుస్తూ వచ్చి క్రింద ప్రహరిగోడమీద నిలబెట్టిన బాణాలమీద పడిపోయాడు. వాడిగా వున్న ఆ బాణాలు కస్సున రవిచంద్ర శరీరాన్ని చీల్చుకొని పైకివచ్చి ఎర్రని, చిక్కని రక్తంతో మెరవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
    జరిగిందేమిటో తెలియని కార్మికులు ఆ దారుణమైన సంఘటనకి ఖిన్నులైపోయారు. గొంతులో ఒక బాణం-పొట్టలో ఒక బాణం గుచ్చుకొని పైకి కనిపిస్తూన్న ఇనుపకడ్డీలవంక, నిర్జీవంగా వేలాడుతున్న రవిచంద్ర మృత శరీరంవంక, బొట్లుబొట్లుగా వడుస్తున్న ఎర్రని, చిక్కని రక్తం వంక ప్రాణాలు ఉగ్గబట్టి  చూడటంతప్ప మరేం చేయలేని అచేతనస్థితిలో ఉన్నారు. భయంతో వారి శరీరాలు వణికిపోయాయి.
    సరిగ్గా ఇదే సమయంలో ఇద్దరు సాయుధులు ఒక సూట్ కేస్ తో రవిచంద్ర ఇంటిముందు ఆగారు. ఆ సూట్  కేసులో ఐదు లక్షల రూపాయలు భద్రపరిచున్నాయి.
    ఒకడు ఐదులక్షలతో తన మూర్ఖత్వాన్ని తృప్తి పర్చుకుంటే మరొకడు తన నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత, పెదరికాన్ని ఐదులక్షలకి తన ప్రాణ త్యాగం ద్వారా తిరిమికొట్టాడు.
    [1980లో ఈ అధ్యాయం అయిపోయింది ఈ కథ ఇక్కడితో ఆగిపోయింది. మరలా ఐదు సంవత్సరాలకు ఈ కథ ప్రారంభమవుతుంది.]

 Previous Page Next Page