Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 3


    
                                      2

    అక్కడ పది సెకండ్లు నిశ్శబ్దం.
    తన చావుకు మూర్ఖత్వంతో కూడుకున్న కారణం ఉంది గనుకే అంత కరక్టుగా నిమిషాలతో  సహా  ముహూర్తం నిశ్చయింపబడిందని మనస్సులోనే అనుకున్నాడు.
    ఎంతకీ రవిచంద్ర మొఖంలో భయంగాని, ప్రేత కళ కాని కనబడక పోవటంతో ఒకింత నిరాశ చెంది "నీకేం భయంగా లేదా......?" అడిగాడు భాగ్యరాజ్.
    భాగ్యరాజ్ ఊహించే తృప్తి అతనికి దక్కకూడదనే కసితో "లేదు....." దృఢంగా నిశ్చయంగా చెప్పాడు రవిచంద్ర.
    "నీకు డబ్బు ఇప్పుడే ఈ క్షణమే ఇచ్చేస్తాను......ఇప్పుడే కావాలంటే.....లేకుంటే నువ్వు  చచ్చిపోయాక.... ఫలానా  వాళ్ళ కిమ్మంటే వాళ్ళకు భద్రంగా ఇస్తాను. ఇందులో నిజాయితీ ఉంటుంది....."
    "నీకు డబ్బు ఇప్పుడే ఈ క్షణమే ఇచ్చేస్తాను.....ఇప్పుడే కావాలంటే.......లేకుంటే నువ్వు చచ్చిపోయాక... ఫలానా వాళ్ళ కిమ్మంటే వాళ్ళకు భద్రంగా ఇస్తాను. ఇందులో నిజాయితీ ఉంటుంది......."
    "నేను చచ్చిపోయాక ఇవ్వండి" రవిచంద్ర గొంతు వణికింది ఈ మాట చెప్తుంటే...
    "ఎవరికి....ఎవరికి పంపమంటావ్...."
    "నా భార్యకి......" అన్నాడు రవిచంద్ర భారంగా
    ఆశ్చర్యపోయాడు భాగ్యరాజ్.
    "నీకు.....నీకు..... పెళ్ళయిందా?!"
    "ఆ..... అవును."
    షాక్ తిన్నాడు భాగ్యరాజ్.
    "పిల్లలా.....!"
    సమాధానం చెప్పలేదు రవిచంద్ర.
    "నీ భార్య వయసెంత?" ఇంకా షాక్ నుండి తేరుకోక ముందే అడిగాడు.
    "ఇరవై ఏళ్ళు" చెప్పాడు రవిచంద్ర గత స్మృతుల తాలూకు ఆనందం దుఃఖంగా మారి గొంతుకు అడ్డుపడుతుండగా.
    ఇద్దరి మధ్య మౌనం. అప్పటికి పూర్తిగా చీకటి పడింది.
    బంజారాహిల్స్ చీకట్లో స్నానం చేస్తున్నట్టుగా వున్నాయి.
    చాలాసేపయాక.....భాగ్యరాజ్ నోరు విప్పాడు.
    "రేపు నువ్వు చచ్చిపోయేవరకూ నువ్వు నా అతిధిగా వుంటావు.....ఎంత నీమీద నమ్మకం వున్నా....నువ్వు బయటకు వెళితే ఈ రహస్యం బట్టబయలు అవుతుందే మోనన్న అనుమానం నాకుండటంలో తప్పేం లేదుగా......అందుకు....." చెబుతూ చెబుతూ ఒకింత ఆగిమరలా అన్నాడు.
    "రేపు మధ్యాహ్నం లోపల నీకేం కావాలన్నా నేను ఇవ్వగలను" విశ్వాసంతో కూడుకున్న గర్వం తొంగిచూసింది భాగ్యరాజ్ గొంతులో.
    "నాకేం వద్దు. కానీ......"
    "ఊ......కానీ......చెప్పు......"
    "నా భార్యను ఒక్కసారి చూసోస్తాను" రవిచంద్ర గొంతు సన్నగా వణికింది.
    భాగ్యరాజ్ ఆలోచనలో పడ్డాడు.
    హఠాత్తుగా లేచి  నిలబడ్డాడు. పర్షియన్ కార్పెట్ మీద పచార్లు చేస్తూ....చేస్తూ ఠక్కున ఆగిపోయి "వెళ్ళక తప్పదా?" అడిగాడు.
    రవిచంద్ర జవాబేం చెప్పకుండా మౌనంగా, తీక్షణంగా చూశాడు భాగ్యరాజ్ వేపు.
    "ఓకే.......వెళ్ళు......కానీ నువ్వు నా కారులో వెళ్తావు. తెల్లవారు ఝాము నాలుగు గంటలవరకే ఇంట్లో వుంటావు. నీ ఇంటి బయట నా మనుషులుంటారు__నువ్వెలాగు నీ భార్యకు చెప్పవనే నమ్మకం వుంది___ కానీ ఆ టైమ్ లో బయట నుండి నిన్ను కల్సుకొనేందుకు ఎవరయినావస్తే ఆపేందుకు, నీ జీవితంలో ఆఖరిగంటలు__పైగా భార్యతో_వాటిని పాడుచేయటాన్ని ఆపేందుకు....."
    "అందుకేనని నమ్మమంటారా?" సర్ కాస్టిగ్గా అన్నాడు రవిచంద్ర.
    భాగ్యరాజ్ బిగ్గరగా నవ్వాడు. "ఆఫ్ కోర్స్.......అందుకే కాదు. నా మనుషులు నీ మాటల్ని బయట రికార్డు చేస్తుంటారు. ఈ ఆఖరిగంటల్లో నీ భార్యతో ప్రయివసీ కోరుకొనే మూడ్ లో వుండవనుకుంటాను. కనుక నీ చేతల్ని కూడా రహస్యంగా గమనిస్తుంటారు. ఈ రహస్యాన్ని నీ భార్యకయినా చెప్పావని తెలిస్తే......
    మీ ఇద్దరూ  ఒకేసారి చచ్చిపోతారు" భాగ్యరాజ్ గొంతులో కర్కశత్వం పోడచూపింది.
    ఆ కర్కశత్వానికి రవిచంద్ర నిర్లిప్తంగా నవ్వుతూ-
    "ఆమెకు తెలిస్తే ఈ యజ్ఞం ఎలా  నెరవేరుతుంది.....? నా ఆశ నెరవెర్చుకోవటానికయినా ఆమెకు చెప్పకూడదు.
    ఈ చెప్పకపోవటం అన్నది మీకేకాదు, నాకు అవసరమే____"
    "మరో గంటలో హొండా కారు రవిచంద్రను, మరో నలుగురు సాయుధుల్ని ఎక్కించుకుని తిలక్ నగర్ లో వున్న రవిచంద్ర ఇంటివైపు దూసుకుపోతోంది. ఎవరూ మాట్లాడుకోవటం లేదు.
    తన భార్యకు అనుమానం రాకుండా వుండేందుకు ఏం చేయాలో అప్పటికే రెండుసార్లు చెప్పాడు రవిచంద్ర కార్లో తన పక్కన కూర్చున్న వ్యక్తులకు. ఇరవై నిమిషాల తర్వాత ఓచోట కారాగింది. రవిచంద్ర ముందు కారు దిగాడు. ఒక్కొక్క అడుగే భారంగా వేస్తూ ఇంటివైపు కదిలాడు.
    కార్డు రివర్స్ లో వెళ్ళి వీధి చివరన ఆగింది. డ్రైవర్ కారు దిగి బాయ్ నెట్ ఎత్తి ఏదో బాగుచేస్తున్నట్లు నటించసాగాడు.
    నలుగురు సాయుధులు ఓసారి తమ దగ్గరున్న పిస్టల్స్ తడిమి చూసుకొని ఒక్కొక్కరు విడిపోయి రవిచంద్ర  ఇల్లు దృష్టిలో వుండేలా తమ స్థానాన్ని నిర్ణయించుకొని అక్కడే సెటిలయిపోయారు.
    రవిచంద్ర ఇంటిలోకి వెళ్ళిపోయాడు.
    నిముషాలు.....గంటలయ్యాయి. ఎవరూ తమ స్ధానల్లోంచి కదలటంలేదు. ఎవరికివారే రాబోయే నాల్గవ గంటకోసం ఎదురు చూస్తున్నారు.
    అర్దరాత్రి దారిపోయింది.  వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి.
    ఆ సాయుధులకి తమ బాస్ ఈ పని ఎందుకు చేయమన్నాడో, ఎవరికోసం చేయమన్నాడో తెలియదు. తాము చేయవల్సినపని మాత్రమె తెలుసు.
    మరి కొద్ది నిముషాలే ఉంది నాలుగు కావటానికి.

 Previous Page Next Page