Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 5


                                      3

    అర్థరాత్రి కావటానికీ మరికొద్ది క్షణాలే వుంది.
    అప్పటివరకు ఎంతో శ్రద్ధగా వీడియో చూసిన సత్యరాజు ఆవలించాడు ఒకసారి వొళ్ళు విరుచుకున్నాడు పక్కనే వున్న అనుచరుళవేపు చూశాడు.
    సత్యరాజ్ కూర్చున్న అతి ఖరీదైన సోఫాసెట్  ఎదురుగా, క్రింద పర్షియన్ కార్పెట్ మీద  కూర్చున్న అనుచరులు నలుగురూ సత్యరాజు ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
    ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో కాకలు తీరిన వాళ్ళు.
    ఒకడు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో సయితం రక్తపాతం సృష్టించగలడు. సాధు స్వభావులు, శాంతి కాముకులు, కన్సర్వేటివ్స్ మధ్య కూడా కత్తులు దూసుకొనే క్రౌర్యన్ని తీసుకురాగల క్రూరుడు__ పేరు హసీంఖాన్.
    మరొకడు లాల్ సింగ్  బిర్క్. ఇతని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఇతన్ని ముద్దుగా నరూరా అంటారు. అంటే నరరూప రాక్షసుడు అని. ఎక్కడికి వెళ్తాడో, ఎలా వస్తాడో తెలియదుగాని, డబ్బు ముట్టజెబితే చాలు, నాటు బాంబుల దగ్గర్నుంచి, భయంకర మారణాయుధాల వరకు చాలా చలాగ్గా అందించగలడు.
    మూడవ అనుచరుడు దీపక్ రాజు. చాలా సన్నగా, ఊపిరి పీల్చు కోవటానికి సయితం ఓపిక లేనివాడిలా కనిపిస్తాడు. చిన్నపిల్లలకు కూడా హాని చేయలేడన్న అభిప్రాయాన్ని కల్గిస్తాడు అతని గురించి తెలియని వారిలో. దీపక్ రాజు దగ్గర  మిత్రులుక్కూడాఅతనంటే లోలోసభయమే నవ్వుతూ, అభిమానిస్తూ, ప్రేమిస్తూనే ప్రాణాలు తీసే పథకం సిద్దం చేస్తాడు.
    ఇక నాల్గవ వాడు  అనుచరుడు కాదు. అనుచరురాలు. ఈవిడ గురించి పూర్తిగా చెబితే మొత్తం ఆడజాతే సిగ్గుపడుతుంది. ఎంతోమంది మగవార్ని ప్రలోభపెట్టి, దగ్గరకు తీసి, వారి భార్యలను కిరోసిన్ పోయించి తగలబెట్టించిన ఆమె క్రూరత్వానికి గుర్తులుగా ఓ పక్క కాలిపోయి, భర్తలకు దూరమై మగిపోతున్నారు కొందరు నిర్భాగ్యురాళ్ళు.
    చిత్రమేమిటంటే ఈమె చేరదీసిన వాళ్ళలో స్త్రీ హక్కుల గురించి, సమానత్వం గురించి బాధపడేవాళ్ళు, స్త్రీ దోపిడిగురించివాపోయే వారు, వ్యాసాలు గట్రా  రాసేవాళ్ళూ వున్నారు.
    ఆడది శారీరకసుఖం పొందాలనుకుంటే పెళ్ళే కావాలా? పెళ్ళిచేసుకున్న మగవాళ్ళను ఆకర్షిస్తే చాలదూ అని ఆమె  అభిప్రాయం. తన  వెనుక శలభంలా తిరిగే మగవాడ్ని ఏడిపించటానికి సరదాగా  మరొక  ముక్కూ మొహం తెలియని మగవాడి పక్కను పంచుకోగలంత విలువ ఉంది ఆమె శీలంపై ఆమెకు.
    ఒక్క శీలం కాపాడుకోగలిగినంత కాలం ఉండటానికి చిన్న గది కూడా దొరకలేదు. ఆ ఒక్కటీ ఒదులుకోగానే ఇల్లు, టీ.వీ, ప్రీజ్ ఎన్నో సమకూరిపోయాయి. అదే గొప్పగా చెబుతుందికూడా ఆవిడ. ఆమె పేరు సరస్వతి.
    (రచయితగా  నాకున్న ఇబ్బందులు రీత్యా అయా పాత్రలకు నిజజీవితంలో ప్రతిరూపాలైన అసలు వ్యక్తుల పేర్లు పెట్టడం లేదు. ఈ పాత్రలు సృష్టించినవి కావు. నా పరిశోధనలో నేను చూసిన వ్యక్తుల్నే ఈ నవల్లో పాత్రల్ని చేశాను.)
    సత్యరాజ్ ఏదో చెప్పేందుకు మెంటల్ గా  ప్రిపేర్ అవుతున్నాడని ఆ నల్గురూ గ్రహించారు.
    ఆ నలుగురికో భయం కూడా వుంది. చాలాకాలం నుంచి వాళ్ళు చేయాలనుకుంటున్న ఓ ప్రమాదకరమైన పనిని తెలివిగా, రక్తపాతం లేకుండానే చేస్తాడేమోనని.
    ఆ ఐదుగురి మధ్యనున్న నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ బరువైన అడుగుల చప్పుడు వినిపించింది.
    వస్తున్నది ఎవరో సత్యరాజ్ కి తెలుసు గనుక తలతిప్పలేదు.
    మిగతా నలుగురూ ఓ క్షణం మాత్రమే ఆమె వేపు చూసి సిగ్గుతో  తల వంచుకున్నారు. నిజానికి ఆ నల్గురు తాము చేస్తున్న తప్పులకి అంతగా  ఫీలయ్యేవారేం కాదు. కాని ఎందుకో ఆమెను చూస్తే చాలు వారిక తలెత్తుకాలేరు.
    తాము ఎప్పుడూ వాళ్ళ జీవితంలో కనీసం ఒక్క సారికూడా చూసి ఉండని ప్రశాంతత, నిర్మలత్వం, పవిత్రత, గంభీరత ఆమెలో కన్పిస్తాయి వారికి.
    ఆమె తెచ్చిన ట్రే అక్కడ పెట్టేసి వెనుదిరుగుతూ అంది "మరి కొన్నాళ్ళు పోతే ఈ తలలు దించుకునే స్థాయిని కూడా దాటిపోతారేమో పాపం."
    ఆ మాటలు పూర్తవుతుండగానే ఆమె లోనికెళ్ళిపోయింది.
    అప్పుడు సత్యరాజ్ తన మౌనాన్ని తనే ఛేదిస్తూ "ఎలా.....? మనకి గ్రిప్ ఎలా వస్తుంది.......?" అడిగాడు దీపక్ రాజ్ వేపు చూస్తూ.
     అప్పటికే దీపజ్ రాజ్ ప్రిపేర్ అయి ఉన్నాడు...
    "చెప్పాను గదా.....నేను సామంత్ ను  ఉసిగొల్పుతాను. మన వాళ్ళకు  చాలా అన్యాయం  జరిగిపోతోందని. అతనిమంచితనంపై, సున్నితత్వంపై, మొదటి సమ్మెటపోటు వేస్తాను........"
     దీపక్ రాజ్ మాటలకు సరస్వతి మధ్యలోనే అడ్డొస్తూ అంది "మరీ అంత మంచివాణ్ని చెడగొట్టటం అంత తేలికకాదు. ఊరికే రాజ్ సాబ్ కి  మాటివ్వకు....." తను చేయలేని పని, పైగా ఓ ఆడదానిగా తాను చేయలేని పని ఓ మగాడు చేస్తానంటున్నందుకు ఈర్ష్యగా ఉంది ఆమెకు.
    కీచుగా నవ్వాడు దీపక్ రాజ్. అతని నవ్వులో శబ్దం కన్నా శ్వాసతాలూకు ధ్వనే ఎక్కువ.
    దీపక్ రాజ్ నవ్వుకు అందరూ ఓసారి ఉలిక్కిపడ్డారు. అతని  సామర్థ్యం తెలిసినవారు గనుకే వారిలో ఆ ఉలికిపాటు.
    సరస్వతి మొఖం ముడుచుకుంది. హసీంఖాన్, లాల్ సింగ్ బిర్క్ మౌనంగా వున్నారు. వారికి తెలుసు తమ అవసరం ఇప్పుడిప్పుడే రాదని.
    "అలా బాధపడిపోకు సరస్వతీ. అన్ని వెధవ పనులు ఒక్క  ఆడ శరీరంతోనే అయిపోవు. నీ అవసరమూ వస్తుంది. కాస్త ఓపిక పట్టు" సరస్వతిని ఉద్దేశించి అంటూ అంతలోనే దీపక్ వేపు తిరిగి "నీమీద నాకు నమ్మకం వుంది. అదే నమ్మకంతో, అతని వ్యక్తిత్వం తెల్సినవాడిగా కాస్తంత అపనమ్మకం కూడా వుంది."
    "కావచ్చు రాజ్ సాబ్. ఈ లోకంలో చెడుకు గొయ్యి తీయడం చాలా  కష్టం. మంచికి గొయ్యి తియ్యటం మొదట్లో కష్టం కావచ్చు."
    "ఆఫ్ కోర్స్."
    "మరి ముహూర్తం పెట్టనా?" దీపక్ రాజ్ హుషారుగా వున్నాడు. కాలకూట విషంతో కోరల బరువు పెంచుకున్న విషసర్పం కాటు వేయటానికి ఎంత హుషారుగా ఉంటుందో అంత హుషారుగా వున్నాడు.

 Previous Page Next Page