Previous Page Next Page 
డాళింగ్ పేజి 4

 

    చీకట్లో మధురి, చీకటి బొమ్మలా కనిపించింది.
    "ఎవరు......."
    విమల్ గొంతులోంచి మెల్లగా వచ్చింది ఆ మాట.
    "విమల్......ఏమిటిది.....మంచులో తడుస్తూ.......మీరింకా రూమ్ కి వచ్చేసారనుకున్నాను......." చెయ్యి పట్టి లేపుతూ అంది మధురి.
    లేచి కూర్చున్నాడు.
    "రేపు షూటింగ్ వుంది. ........ఇలా అయితే .....హెల్త్ అప్ సెట్ అవుతుంది. ప్లీజ్ గెటప్. ముందు తల తుడుచుకోండి. "రగ్గుని అతని చేతుల్లో పెడుతూ అంది. అయినా విమల్ లో చలనం లేదు.
    "గెటప్ ......కమాన్' చనువుగా భుజాలు పట్టుకుంది లేవమన్నట్టుగా.
    మరో మాట మాట్లాడకుండా లేచి నిలబడ్డాడు.
    విమల్ తన చేతిని మధురి భుజాల మీద వెయ్యడంతో, మాధురికి అతని పరిస్థితి అర్ధమైంది.
    అతని వళ్ళు మంచుగడ్డలా వుంది.
    విశాలమైన లోయపాయల్లో నడుస్తూ వాళ్ళిద్దరూ హోటల్ కి చేరుకున్నారు.
    

                                                  *    *    *    *

    హోటల్ రూమ్ లో అన్ చేసిన హీటర్ వేడిని విరజిమ్ముతోంది.
    సోఫాలో వెనక్కి చేరబడి కూర్చున్న విమల్ పెదాల మధ్యన సిగరెట్ పెట్టి తనే లైటర్ వెలిగించింది.
    "వెలిగించండి.......రిలీఫ్ గా ఉంటుంది.......' నెమ్మదిగా అంది మధురి.
    గొంతు నిండా పొగ పీల్చి ....సంతృప్తిగా బయటకు వదిలాడు.
    "ఒక పెగ్ తీసుకుంటారా......నరాలు వేడెక్కుతాయి." విమల్ అన్సర్ కోసం చూడకుండా మినీ ఫ్రిజ్ లోంచి గ్రీన్ లేబుల్ బాటిల్ తీసి , ఒక గ్లాసులో ఒక పెగ్ పోసి సోడా కలిపి చేతికందించింది.
    "అంతసేపు మంచులో ఎవరైనా కుర్చుంటారా, ఎంత మూడ్ బాగులేకపోయినా......"
    తనలో తను అనుకున్నట్టుగా అంది.
    ఆ మాటకి అంచక్కటి పెద్ద కళ్ళను మధురి వేపు తిప్పి మౌనంగా చూసాడు విమల్.
    నెమ్మదిగా పెగ్ సిప్ చేస్తున్నాడు.
    మంచుముక్కలా అయిపోయిన శరీరంలో చిన్న వేడి కదలిక. "కెన్ ఐ స్లిప్ హియర్" పెగ్ తాగేసి . గ్లాసును టీపాయ్ మీద పెడుతూ అడిగాడు విమల్.
    "యూకెన్ స్లిప్ హియర్" .........వెల్........"
    షూస్ విప్పి పక్కన పడేసి, సోఫా మీదే చేరబడ్డాడు. రెండు నిమిషాల్లో అతని కంటిమీదకు నిద్ర ఉప్పెనలా వచ్చేసింది.
    నిద్రపోతున్న అతని మొహంలోకి ఒక్కసారి చూసి , తలకింద పిల్లో సర్ది లైటార్పి , మాస్టర్ బెడ్ రూమ్ వేపు నడిచింది మధురి.
    చాలాసేపు మాధురికి నిద్రపట్టలేదు.
    విమల్ గురించే ఆలోచన.
    తెలతెలవారుతుండగా మాధురికి నిద్రపట్టింది. ప్రొడక్షన్ మానేజర్ వచ్చి, కాలింగ్ బెల్ నొక్కడంతో ఆదరాబాదరాగా బెడ్ నుంచి లేచి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చింది మధురి. అప్పటికే విమల్ లేదక్కడ.
    "సరిగ్గా తొమ్మిది గంటలకు కారొస్తుంది వస్తాను" చెప్పేసి గబగబా వెళ్ళిపోతున్న ప్రొడక్షన్ మేనేజర్ ని.......
    "మరి హీరో విమల్ " ఖాళీ సోఫా వేపు చూస్తూ అడిగింది.
    "ఆయనకి చెప్పేసి ఇటోచ్చాను....నౌ హి ఈజ్ అల్ రైట్.......హోటల్ లాన్స్ లో ఎక్సర్ సైజులు చేస్తున్నాడాయన. ఇవాళ షూటింగ్ హేపీగా జరిగిపోతుందమ్మా......." ప్రొడక్షన్ మానేజర్ వినయంగా అనేసి వెళ్ళిపోయాడు.
    కనీసం చెప్పాచెయ్యకుండా .....వెళ్ళిపోయాడే.....తన గదిలో కొచ్చి లేపి చెప్పడానికి మొహమాటపడుంటాడు....అనుకుంటూ లోనకెళ్ళబోయి టీపాయ్ మీద రోజ్ కలర్లో మెరుస్తున్న హోటల్ లెటర్ పాడ్ పేపర్ ని తీసింది.
    అందులో నాలుగే నాలుగు లైన్లు, అవి విమల్ రాతని స్పష్టంగా తెలుస్తూనే వుంది.
    డియర్ మధురి,
    బాధల మబ్బుల చాటున
    బెంగల మంచుల మాటున    
    మునుగిపోయిన వాడిని ఒడ్డుకి    
    తీసి రక్షించారు థ్యాంక్స్ -
    మళ్ళీ మళ్ళీ చదువుకుంది. ఉత్తరం కవిత్వంలా రాసాడే. నవ్వుకుంది.
    "బాధల మబ్బుల చాటున, బెంగల మంచుల మాటున "సినిమా ట్యూన్ లా హమ్ చేస్తూ బాత్రూమ్ వేపు నడిచింది మధురి.


                                                    *    *    *    *

    "తొమ్మిది నుంచి పదకొండు గంటలవరకూ హీరోయిన్ ఫాదర్ మీద కొన్ని సీన్లు తీస్తారు సర్. పదకొండు గంటలకు మీరూ, హీరోయినూ కలిసే సీను సార్......" వినయంగా చెప్పి ఎదురుగా నిలబడ్డాడు అసోసియేట్ డైరెక్టర్.
    టిఫిన్ చేస్తున్న విమల్ ---
    "నైట్ సీన్లు ఏవో చెయ్యాలన్నారు ..........." తలెత్తి అడిగాడు.
    "వాటి విషయం మీతో మాట్లాడతానన్నారు డైరెక్టర్ గారు. ఒక గంట తర్వాత వస్తాను సర్......' చెప్పేసి షూట్ లోంచి బయటకొచ్చాడు అసోసియేట్ డైరెక్టర్.   

 Previous Page Next Page