Read more!
 Previous Page Next Page 
డాళింగ్ పేజి 3

 

    "హోటల్ కి వెళ్దాం.....పదండి" దూరంగా మసకలా కన్పిస్తున్న విమల్ వేపే చూస్తున్న హీరోయిన్ మధురితో అన్నాడు డైరెక్టర్.
    ముందుగా డైరెక్టర్ వైట్ ఎంబాసిడర్ కారు దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది.
    విమల్ ని వంటరిగా వదిలేసి , వెళ్ళాలని లేదు మాధురికి.
    హీరో విమల్ ని ఇలాంటి పరిస్థితిలో చూడటం ఇదే మొదటిసారి.
    మూడడుగులు ముందుకు వేసింది.
    మళ్ళీ ఏమవుతుందో ఏమో, వేగంగా వెనక్కి తిరిగి తన కారు వేపు నడిచింది.
    మరో నిమిషంలో నీలపు మారుతీ కారు అక్కడ నుంచి కదిలింది.
    

                                                *    *    *    *

    తలెత్తి చూసిన విమల్ కి, అస్పష్టంగా ఏవేవో దృశ్యాలు కనిపిస్తున్నాయి . తన వేపే చూస్తున్న ఏవో రెండు కళ్ళు ........ఆ కళ్ళల్లో ఆర్ద్రంగా మెదిలే భావాలు......చిన్న కన్నీటి తెర........
    ఎందుకో విమల్ కళ్ళు చటుక్కున కన్నీళ్ళతో నిండిపోయాయి.
    "అమ్మా" అతని మనసు మారుమూల అరలో తీపి కేక"
    అమ్మే ........అమ్మ......అమ్మ.....
    తర్వాత ఇంకో దృశ్యం.
    అభిమానంగా , ప్రేమగా తనని రమ్మని పిలుస్తున్న రెండు చేతులు ఆ చేతుల్లో ఓ చిన్నారి బాబు. ఆ బాబు బోసి నోటిలో పాల నవ్వు.
    కింద పచ్చిక మెత్త - ఉంది పచ్చిక వాసన మత్తుగా ఉంది. గాలి చల్లగా ఉంది.
    ఆకాశం నిండా మబ్బులు --- అకస్మాత్తుగా చీకటి కమ్మేసినట్టుగా వుంది.
    అలా పచ్చిక మీద బోర్లా పడుకున్నాడు.
    నిశ్శబ్ధమైన ఆకాశంలో పక్షులు ఎగరడం, మేఘాలు కదలటం..........
    అలా ఎంతసేపు చూస్తూ గడిపారో తెలీదు.

                                                   *    *    *    *

    రాత్రి తొమ్మిది గంటలైంది.
    ఫెర్న్ హిల్ ప్యాలెస్ హోటల్ సందడిగా వుంది.
    హోటల్ సెకెండ్ ఫ్లోర్ డీలక్స్ రూంలో వున్న హీరోయిన్ మాదురి అప్పుడే డిన్నర్ పూర్తీ చేసింది.
    కాసేపు టీవీలో పిక్చర్ చూసి , టీవీ ఆఫ్ చేసి పక్కనే వున్న ఏదో మేగజైన్ అందుకుంది.
    కాసేపు తిరగేసింది -------ఏం తోచడం లేదు .....ఏదో అలజడి లోలోన.
    పుస్తకం పక్కన పడేసి , బాల్కనిలో కొచ్చింది.
    మెత్తటి మంచువాన తెల్లటి తెరలా వుంది. ఎక్కడ నుంచో గుసగుసగా విన్పిస్తున్న మాటలు.
    అక్కడక్కడ వెలుగుతున్న వీధి దీపాల వేల్తురులో, వెళ్ళిపోతున్న మనుషుల మసక నీడలు....
    కాసేపటికి రోడ్డు మీద లైట్లారిపోయాయి.
    అప్పుడు రోడ్లనిండా కృత్రిమ వెలుతురు లేదు. రోడ్లు మంచు వెన్నెలను కప్పుకున్నాయి.
    ఆ దృశ్యం అందంగా వుంది ------మనోహరంగా వుంది.
    అలా ఎంతసేపు చూసిందో తెలీదు.
    దూరంగా నల్లగా కన్పిస్తున్న లోయలు ....లోయల మధ్య బండ రాయి మీద ఏదో ఆకారం.........
    ఎవరిదా ఆకారం?
    "పేకప్" తర్వాత హోటల్ కి రావడం - తర్వాత ఎవరో విజిటర్స్ - ఆ తర్వాతర్వాత వస్తూ పోయే మనుషులు ----ఈ హడావుడిలో హీరో విమల్ గురించి అసలు మర్చిపోయింది మాధురి.
    విమల్ ఇంకా అక్కడనుంచి రాలేదా?
    దూరంగా కన్పిస్తున్న ఆ అస్పష్ట ఆకారం విమలేనా?
    ఒక్కసారి మాధురి హృదయం గుబగుబలాడింది.
    ఏం జరిగింది విమల్ కి ఈవేళ?
    పరీక్షగా చూసింది.
    అవును.......ఆ బండరాయి మీద ......
    మంచు తుంపరల మధ్య........
    ఎవరో వ్యక్తీ.
    వెంటనే లోనికెళ్ళి ......రగ్గు తీసుకుని భుజాలమీద కప్పుకుని, నైట్ గౌన్ లోనే కిందకు దిగి లాన్ దాటి రోడ్డు మీద కొచ్చింది.
    నిశ్శబ్దపు చీకటి మంచు రోడ్డు మీద మధురి అడుగుల చప్పుడు......పరిగిడుతోంది.....
    లోయల్లోని బండరాయికి పదడుగుల దూరం నుంచి చూసింది.
    అవును.......
    ఆ బండరాయి మీద వున్నది విమలే.......
    మోచేతిని నుదుటిమీద పెట్టుకుని.
    మంచులో పూర్తిగా తడిసిపోయి విమల్......
    "విమల్" గట్టిగా పిలిచింది.
    విమల్ పలకలేదు.
    పరుగున దగ్గరకెళ్ళి తట్టి పిలిచింది.
    "విమల్, విమల్"
    నెమ్మదిగా కళ్లిప్పాడు విమల్, తలతిప్పి పక్కకు తిరిగి చూసాడు. యోగనిద్రలోంచి బయటకు వచ్చినట్టుగా వుంది అతనికి తనని తట్టి లేపింది ఎవరో అర్ధం కాలేదు.

 Previous Page Next Page