టిఫిన్ చేసి........
విడియోలో వస్తున్న 'క్రేజీ గర్ల్' ఇంగ్లీస్ మూవీ చూస్తున్నాడు ఇంతలో ఏవో రెండు మూడు ఫోన్స్. ఒకటి మద్రాసు నుంచి, రెండోది డిల్లి నుంచి.
మద్రాసు నుంచి ఇంకో ప్రొడ్యుసర్ షూటింగ్ షెడ్యుల్ గురించి మాట్లాడాడు.
డిల్లీ నుంచి విమల్ తండ్రి , ఏమ్ .పి. జయేంద్ర దత్.
పార్లమెంట్ మీటింగ్స్ వల్ల నెలాఖరుకి వస్తానని చెప్పి, విమల్ హెల్త్ గురించి ఎంక్వయిరీ చేసి ఫోన్ పెట్టేశాడు.
ఇక్కడ పదిరోజుల షెడ్యుల్ తర్వాత, మద్రాసు ప్రొడ్యుసర్ కి డేట్స్ ఇవ్వాలి. మద్రాసు ప్రొడ్యుసర్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. అనుకున్న టైం కి ఈ షెడ్యుల్ పూర్తవుతుందా........ఒకసారి కో డైరెక్టర్ ని కనుక్కోవాలి అనుకుంటూ-------
తన షూట్ లోంచి బయటకొచ్చి కో డైరెక్టర్ రూమ్ వైపు నడిచాడు . ఆరూమ్ కాలింగ్ బెల్ నొక్కబోయి ఆగిపోయాడు.
కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ మాట్లాడుకుంటున్నారు.
"నిన్న మన హీరో గారి అవుటాఫ్ మూడ్ వల్ల వన్ డే వేస్టయింది. ఏదో డైరెక్టర్ నోటికి ఝాడిసి ప్రొడ్యుసర్ ఊరుకున్నాడు. లేకపోతే మొత్తం పిక్చర్ కేన్సిల్ చేసేసే రకం. ఈ పరిస్థితిలో హీరోయిన్ మాధురి డాడీకి సీరియస్ గా ఉందని టెలిగ్రాం వచ్చింది. ఇప్పుడీ విషయం హీరోయిన్ తో చెప్పెమే అనుకో ......షూటింగ్ ఎన్ని రోజులు కేన్సిలౌవుతుందో తెలీదు. ఏం చేద్దాం......." అసోసియేట్ డైరెక్టర్ ని అడిగాడు కో డైరెక్టర్.
అతని చేతిలో అప్పుడే మద్రాసు నుంచి మాధురికి వచ్చిన టెలిగ్రాం ఉంది.
ఈ పరిస్థితిలో చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది......." అసోసియేట్ డైరెక్టర్ తన అభిప్రాయం చెప్పాడు.
"నేను అదే అనుకుంటున్నాను. మాధురీ డాడీ ఎన్నాళ్ళ నుంచొ సిక్ పర్సనే కదా.....చూద్దాం......మరీ అర్జంటనుకుంటే ......ఫోనోస్తుంది.......అప్పుడు చెబుదాం ఏమంటావ్......?"
ఆ మాటలు వినగానే మరి ముందు కెళ్ళలేదు విమల్. వాళ్ళ మీద విపరీతమైన కోపం వచ్చింది. గబగబా తన షూట్ కొచ్చాడు. డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు.
* * * *
ఒకప్పుడది హైదరాబాద్ నిజాం వేసవి కాలం విడిది ఊటీలో నిజాం పేలస్.
ఆ పేలస్ లో బాల్కనిలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
హీరో విషయమై, హీరోయిన్ , ఆమె తండ్రి మధ్య సీన్లవి. హీరో అంటే హీరోయిన్ తండ్రికి ఇష్టం లేదు. అలాగని కూతురిని కాదనలేని మనస్తత్వం.
ఆ సీన్ లేడీస్ ని ఎట్రాక్ట్ చేస్తే చాలు. పిక్చర్ హండ్రడ్ డేస్ ......అని భావించే డైరెక్టర్ హై పిచ్ డైలాగ్స్ రాయించాడు.
తండ్రీ, కూతుళ్ళ మధ్య వరసగా డైలాగులు.
"ఈ డైలాగులకి దియేటర్ పేలిపోతుంది" ప్రొడ్యుసర్ తో చాలా సార్లు అన్నమాటే అయినా మరోసారి నవ్వుతూ అన్నాడు డైరెక్టర్.
ఈ సినిమాకి మాటలు కూడా ఆయనే.
"ఎమోషనల్ సీన్లకు మీ తర్వాతే గదా........" కంప్లిమేంటి చ్చాడు ప్రొడ్యుసర్.
డైరెక్టర్ తనలో తనే నవ్వుకున్నాడు.
* * * *
షూట్ లోంచి గబగబ బయటికొచ్చి వేగంగా వెళ్తున్న హీరో విమల్ ను చూసి, అవాక్కయ్యారు అసోసియేట్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్.
వరండాలో చివర రూమ్ దగ్గర నిలబడ్డ వాళ్ళిద్దరూ , "సార్ , సార్" అంటూ పరుగు, పరుగున వచ్చారు.
అప్పటికే లిప్ట్ లో కెళ్ళి పోయారు విమల్.
ఈయనకి మూడ్ ఎప్పుడోస్తుందో, ఎప్పుడు పోతుందో తెలీదు......పదకొండు గంటలకి సీను..........అతని కోసమే మనమిక్కడ కూర్చున్నాం గదా.......మూడ్ వచ్చినట్టుంది.....లగేత్తుతున్నాడు .......పద ......పద.......మనమూ వెళ్దాం........." ప్రొడక్షన్ మానేజర్ శ్రీకాకుళం ప్రాంతం వాడు. మాములుగా సినిమా భాషే మాట్లాడినా, సడన్ గా అనుకోనిది ఏదైనా జరిగితే తన 'స్లాంగ్' లోకి దిగిపోతాడు.
హీరోని అందుకోడానికి ఇద్దరూ ఆఘమేఘాలమీద మెట్లు దిగారు. అప్పటికే మారుతి కారు రోడ్ మీద సర్రున రోడ్డుమీద దూసుకుపోతోంది.
* * * *
"చూడమ్మా మాధురీ.........ఇవి తండ్రీ కూతుళ్ళ సీన్లు.......వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎమోషనల్స్ సీన్స్ . తండ్రీ, కేరెక్టర్ రెచ్చిపోతుంది కదా ......నువ్వూ రెచ్చిపోవాలి. హీరోని ఆ కేరక్టర్ ఎంత ద్వేషిస్తుందో నువ్వంతగా ప్రేమిస్తున్నావన్నమాట...అది..........అది...... ఈ సీన్ లో ఎస్టాబ్లిష్ కావాలి.........అండర్ స్టాండ్ ........." డైరెక్టర్ హీరోయిన్ తో చెప్తున్నాడు. "ఒరిజినల్ తమిళ సినిమా సీన్ నే, యాజిటీజ్ గా తీసేస్తే , మన తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకోరేమో సార్......." తన డౌటు వ్యక్తం చేసింది మాధురి.
"ఆ తమిళ సినిమా సీన్ ని నీకు చూపించడం నాకు తప్పయింది........ఆడియన్స్ రెస్పాన్స్ , దేనికిస్తారో ఎందుకిస్తారో , ఎలా ఇస్తారో నాకొదిలెయ్."
డైరెక్టర్ ముఖం చికాగ్గా పెట్టి అనడంతో, మాధురి మరోమాట మాట్లాడలేదు.
"కెమెరా అన్.........." కేకేసాడు డైరెక్టర్.
.....అప్పుడే ఎనభై కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చిన మారుతీ కారు నిజాం పేలస్ ముందు ఆగింది. సర్రున డోర్ తెరచుకుని దిగి, పరుగు పరుగున మెట్లెక్కుతున్నాడు హీరో విమల్.