Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 4

 

    ఆ మర్నాడు క్లాసులో మొగపిల్లలు కూడా మొదలు పెట్టారు. "ప్రేమకి కళ్ళు లేవు. చేవుల్లేవు!" అని ఒకడు  "మరయితే ఉన్నదేంట్రా?" అని ఇంకొకడు! ఒరేయ్! అందాన్ని ఆమె కళ్ళతో చూడరా! ఏముందో కనిపిస్తుంది" అని ఒకడూ, ఇలా నలుగురు నాలుగురకాలుగా వాగటం మొదలుపెట్టారు. వాళ్ళ మాటలు వినలేక , అవహేళన భరించలేక క్లాసులోనే బావుతుమంది కౌసల్య. అదంతా విన్న పానకాలు, "ఒరేయ్ ముం....లారా! మీకేందుకురా , నేను దాన్ని పెళ్ళి చేసుకుంటాను. మీ కేంటిరా అభ్యంతరం?" అంటూ వాళ్ళ మీదకు దూకాడు పానకాలు. మొదటి వాక్యం విని ఉగ్రులై పోయిన పిల్లలందరూ తన్నడానికి తిరగబడ్డారు. కాని చివర వాక్యాలు విని మాట రాక, కాళ్ళు చేతులు ఆడక, స్థాణువుల్లా అయిపోయారు. ఆ మాటలకి , ఏడుస్తున్న కౌసల్య లేచి నిలబడి అతన్ని చూస్తూ ఉండిపోయింది పిచ్చిదానిలా.
    ఆమెకు పానకాలు మీద చచ్చేంత కోపం వచ్చింది. తను వాణ్ణి పెళ్ళి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పిందా? అసలే వీళ్ళేదో వాగుతూ ఉంటే, ఎలా చెప్పాలా వీళ్ళకి అని తను సతమతమైపోతుంటే , వీడిలా వాగుతాడా? మైగాడ్! ఈ విషయం ఇంట్లో తెలిస్తే? తను మళ్ళీ కాలేజీలో అడుగు పెట్టగలదా? "ఛీ ఇడియట్!" చివరిమాట గట్టిగానే అంది. అందరికీ వినబడేలా! దాంతో పిచ్చివాడిలా రెచ్చిపోయాడు పానకాలు.
    "నేను ఇడియట్ నా? నువ్వు నా చుట్టూ తిరగడం నిజం కాదా? అది చూసే కదా వీళ్ళు ఇలా అంటున్నారు. మీ ఇంటికొచ్చి నువ్వు నాతొ తిరిగావని కావాలంటే క్లాసులో ఎవరినైనా అడగమనీ చెబుతాను. నన్ను కాదంటే నిన్నెవరు చేసుకుంటారో చూస్తాను! జాగ్రత్త! ఇప్పుడు చెప్పు ఎవరు ఇడియేటో ! స్తుపిడో! అంటూ బయటికి వెళ్ళిపోతున్న పానకాలను చూసి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలీక గుండె పగిలిపోతుందేమోనన్నంత ఆవేశంతో రెండు చేతులతోటి గుండెని అదిమి పట్టుకొని , పిచ్చిదానిలా అందరికేసి చూస్తూ నిలుచుంది కౌసల్య.
    ఆ రోజు పోయెట్రీ క్లాసు తీసుకోకుండా వెళ్ళిపోయాడు లెక్చరర్ గారు.
    ఈ వార్త క్షణంలో కాలేజీకి పాకిపోయింది. నిముషంలో కౌసల్యా పానకాలుల ప్రణయలీలలు కధలు కధలుగా పాకిపోయాయి.
    బరువుగా నిట్టురుస్తూ, కర్తవ్యం అర్ధం కాక, కాలేజీ ప్రాంగడం నుంచి బయట పడింది కౌసల్య.
    పానకాలు అన్నంత పనీ చేశాడు. తల్లీ తండ్రి లేకుండా అన్నా వదినల అండదండలతో చదువుకుంటున్న కౌసల్య ఇంటికెళ్ళి  కౌసల్య తనను ప్రేమిస్తోందని, ఇద్దరం కలిసి సినిమాలకీ , హోటళ్ళకీ వెళ్ళేవారమనీమ్ తనని తప్ప కౌసల్య ఇంకెవరినీ పెళ్ళి చేసుకోనని మాట ఇచ్చిందని, కావాలంటే వారివురి ప్రేమ సంగతి కాలేజీ కొచ్చి తమ క్లాసు మేట్స్ ని అడిగి తెలుసుకొమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో రెచ్చిపోయిన అన్నయ్యా వదినా నానా మాటలూ అన్నారు కౌసల్యని. "ఏమే! చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఇదా నువ్వు చేస్తున్నపని? వాడి మొహం చూస్తే ఎవరైనా నువ్వు ప్రేమించావని అనుకుంటారా? వాణ్ణి చూస్తేనే కడుపులో తిప్పుతోంది. అందం వుందా? ఆకర్షణ వుందా? ఏముందే వాడిలో?" ఆమె అన్నయ్య విరుచుకుపడ్డాడు.
    "మేము నీకు పెళ్ళి చెయ్యమనుకున్నావా? వొదినగారు గిట్టక ఎవడికో ఒకడికి ముడి పెట్టాలని వీడికిచ్చి కట్టేసిందని, నన్ను అప్రతిష్ట పాలు చెయ్యాలనుకున్నావా? అమ్మా నాన్నా లేకపోయినా , వున్నదానిలో నిన్ను ఏమ్.ఏ దాక చదివిస్తూ వచ్చామే! నా పిల్లల్లో నువ్వూ ఒక పిల్లవనుకున్నాను కాని, ఇలా చేస్తావనుకోలేదు. " వొదిన గారి సాధింపు.
    కౌసల్యకు మతిపోయింది.  తనెంత మోసపోయిందీ! ఇన్నాళ్ళూ అతడొక అమాయకుడనీ, అజ్ఞానీ అనే అనుకుంది. కానీ ఇంత తెలివిగా మోసం చెయ్యగల ఘనుడని అనుకోలేదు. ఇప్పుడెలా నమ్మించగలను అన్నయ్యను వదిననీ? అసలు స్నేహితులే తనని నమ్మడం లేదే! సమయం చిక్కినప్పుడల్లా అతని దగ్గరకు వెళ్ళి మాట్టడటం, అతనితో పాటు బండి మీద బజ్జీలు తింటూ అతనికి కబుర్లు చెప్పటం నిజమే. కాని తన ఉద్దేశ్యం ఏమిటి? ఈవిధంగా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. మైగాడ్! ఇప్పుడెం చేయాలి? ఏదో చెయ్యబోతే ఏదో అయింది. తన జీవితానికే ముప్పోచ్చింది. ఇంట్లోంచి పారిపోతే? అమ్మో! అన్నయ్య గుండె పగిలిపోతుంది.
    చిన్నప్పటినుంచి ఎంతో గారంగా, అమ్మా నాన్నా లేని లోటు తెలీకుండా పెంచాడు. కుటుంబం ప్రతిష్టపాలై పోతుంది. వొదిన బెంగతో మంచం పడుతుంది. అలా చెయ్యకూడదు. మరి? మరి?..
    బాబోయ్! తను పానకాలుని పెళ్ళి చేసుకోవాలా? అతనితో సంసారం చెయ్యలా? ఛీ! కల్లో కూడా ఊహించుకోలేదు. అతడిలో పది నిముషాలు మాట్టడమే ప్రాణాంతకామే! ఎలాగో భరించింది. అతని మనస్తత్వాన్ని తెలుసుకోవాలన్న కుతూహలంతో! అంతే కానీ, అతడితో "ఓ! ....నో.....నో..." అంటూ మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది ఆరోజంతా. తెల్లారాక కోపం తగ్గాక , అన్నయ్యకి వదినకి జరిగినదంతా వివరించి చెప్పాలనుకుంది. ఆలోచనలతో బుర్ర్ర వేడెక్కి తల బద్దలయిపోతుంటే అర్ధరాత్రి ఎప్పుడో కన్ను మూసుకుంది కౌసల్య.

 Previous Page Next Page