Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 4


    తలలో మల్లెపూలు బరువుగా మూలగలేదు. విరగబడి నవ్వలేదు. అవమానంతో ఎర్రబడినట్లుగా చూస్తుండిపోయాయి.
    
    ఆ రాత్రీ...ఆ తరువాత కూడా ఆనంద్ ఇంతగా మోహపడుతున్న ఆ స్త్రీని చూడాలని నాకు చాలా వుబలాటం కలిగింది. ఈర్ష్యా, అసూయా, కోపం లాంటివి ఏమీ కలగలేదు. ఒక మనిషిని ఇంతగా కట్టిపడేసిన ఆమె సౌందర్యం ఏ పాటిదా అన్న కుతూహలం మాత్రమే.
    
    తెల్లవారాక నన్ను ఎవరూ శోభనం ముచ్చట్లు అడగలేదు. ఏదో యుద్ద నిశ్శబ్దం తాండవమాడింది ఆ ఇంట్లో.
    
    మావయ్య మాత్రం "రామ్మా...టిఫిన్ చెయ్యి, నీకు ఏమిష్టమో మన వంటమనిషి దమయంతికి చెప్పు" అన్నాడు.
    
    జయంతి యమ బిజీగా మొగుడితో దెబ్బలాడేస్తోంది.
    
    అతను అన్నింటికీ తలవూపేస్తూ టిఫిన్ తింటున్నాడు. ఇంకా ఎందుకు దెబ్బలాటో నాకు అర్ధం కాలేదు.
    
    అత్తయ్య కాస్త గిల్టీగా నన్ను తప్పించుకుని తిరిగినట్లు అనిపించింది.
    
    నాలుగు రోజులు గడిచాక మావయ్య నాతో "సుమతీ... నువ్వూ ఆనంద్ వుండడానికి ఇంకో ఇల్లు కొన్నాను. అమ్మమ్మ మాత్రం మాతోనే వుంటుంది" అన్నాడు.
    
    విడిగా వుంటే ఆనంద్ ఏమైనా మారతాడేమోనని వీళ్ళ వూహ అనుకున్నాను.
    
    తొలిరాత్రి తర్వాత ఆనంద్ మళ్ళీ నాతో మాట్లాడలేదు.
    
    పెద్దగా నా ప్రమేయం ఏమీ లేకుండానే మేం ఇల్లు మారిపోయాం. జీవితంలో ఏమీ మార్పులేదు. ఆనంద్ ప్రొద్దుటపోతే రాత్రి ఏ రెండింటికో వస్తాడు. ఒక్కోరోజు రాడు. అతని సెల్ నెంబర్ నాకు తెలుసు. ఒకసారి చేసాను. డిస్ కనెక్ట్ చేసేసాడు. అతనికి మాట్లాడటం ఇష్టంలేదని తెలుసుకున్నాను.
    
    మేగజైన్స్  చదువుతూ, టీవీ చూస్తూ ఎంతసేపని గడుపుతాను. ఒకరోజు చెప్పకుండా బయల్దేరి అత్తయ్యా వాళ్ళింటికెళ్ళాను.
    
    జయంతీ, అత్తయ్యా తయారయి ఎక్కడికో వెళుతున్నారనుకొంటా నన్ను చూసి ఆశ్చర్యపడాల్సిందిపోయి కంగారుపడ్డారు.
    
    అత్తయ్య తెప్పరిల్లి "రా...రా...అమ్మమ్మ గదిలో వుంది" అంది.
    
    "ఎక్కడికైనా వెళుతున్నారా అత్తయ్యా?" అన్నాను.
    
    ఔను. ఏదో సినిమా ముహూర్తం ఫంక్షన్ కి వెళుతున్నాం" అంది అత్తయ్య.
    
    "నాకు బోర్ గా వుంది - నేనూ వస్తాను" మామూలుగా అనేశాను.
    
    అత్తయ్యా, జయంతీ ముఖముఖాలు చూసుకున్నారు.
    
    అత్తయ్య నెమ్మదిగా "అమ్మమ్మకి ఒంట్లో బాలేదు. నువ్వు ఆవిడ దగ్గర వుండు సుమతీ!" అంది.
    
    "అలాగా!" అంటూ నేను కంగారుగా లోపలికి పరిగెత్తాను.
    
    అమ్మమ్మ భగవద్గీత చదువుకుంటోంది. నన్ను చూసి ఆనందపడింది.
    
    "ఒంట్లో బాలేదుటగా!" కంగారుగా అడిగాను.
    
    "బానే వున్నానే!" అందావిడ.
    
    నేను మళ్ళీ బయటికి వచ్చేటప్పటికే జయంతి "ప్రియంవద...సెల్ ఆఫ్ లో వుంది. ఇంట్లోంచి బయల్దేరిపోయిందట..." అని అత్తయ్యతో చెపుతోంది.
    
    "ఇక్కడికే అనుకుంటా" అంది అత్తయ్య. అదోలాంటి ఆందోళన ఆమె మొహంలో కనపడిపోతోంది.
    
    "దమయంతీ చిన్నమ్మకి కాఫీ తీసుకురా" అని వంట మనిషికి పురమాయించింది.
    
    ఇంతలో కారు హారన్ వినిపించింది.
    
    "ప్రియ వచ్చేసింది" అంది జయంతి.
    
    నేను ఆసక్తిగా బయటికి నడిచాను.
    
    చుడీదార్ లో, జుట్టు విరబోసుకున్న ఒక ముప్పైఐదూ, ముఫ్ఫై ఆరేళ్ళ స్త్రీ దిగింది. ఆమె పాపిట్లో సింధూరం, పెద్దబొట్టూ దూరానికి కూడా కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. పెదవులకి బొట్టుతో మేచ్ అయ్యే లిప్ స్టిక్ వేసుకుంది. ఆమె తెల్లని ఒంటికి ఆకుపచ్చ సల్వార్ సూట్ చాలా బాగా కుదిరింది. కారు లాక్ చేసి ఆమె లోపలికి వచ్చి నన్ను ఆశ్చర్యంగా చూసింది.
    
    "రా....రా" అత్తయ్య పిలుస్తూనే "సుమతీ...వంట విషయం చూడు" అంది.
    
    జయంతి ఆమెతో "మేం సిద్దంగా వున్నాం బయల్దేరుదామా?" అంది.
    
    నేను వంటింట్లోకి వెళుతుండగా ఆమె "ఈవిడేనా ఆనంద్ ని పెళ్ళి చేసుకున్నదీ?" అనడం వినిపించింది.
    
    "ఔను! మా కోడలు" అంది అత్తయ్య.
    
    "కోడలు మాత్రమే" నవ్వింది ప్రియంవద.
    
    నేను లోపలికి వెళ్ళి దమయంతితో - "ఆవిడెవరూ?" అని అడిగాను.
    
    "ప్రియంవదగారు" అంది దమయంతి ముక్తసరిగా.
    
    "అంటే స్నేహితురాలా?" అడిగాను.
    
    దమయంతి నావంక అదోలా చూస్తూ - "మీకు తెలీదా?" అంది.
    
    "ఊహు!" అంది.
    
    ఆమె కళ్ళల్లో ఎనో భావాలని నేను చదవగలిగాను. ఆమె అంతలోనే మాట మార్చేసి- "కాఫీ త్రాగుతారా?" అంది.
    
    "నాకొద్దు. ఆవిడకి నేను ఇవ్వనా?" అన్నాను.
    
    "ఒద్దు" ఠక్కున చెప్పి థానే తీసుకెళ్ళింది.
    
    "బీదపిల్లన్నారు. అస్సలు బాగోదన్నారు. అమ్మాయిచూస్తే చదువుకున్నదాన్లా వుంది. నేను చూస్తానంటే ఫోటో కూడా చూపించలేదు. ఇందుకన్నమాట" ప్రియంవద గొంతు కఠినంగా వినిపిస్తోంది.
    
    "నేను బాగుండడం, చదువుకోడం ఈవిడకేం బాధటా?" అనుకున్నాను. నాకు వెంటనే ఏదో స్ఫురించి గబగబా బయటికి వెళ్ళాను.
    
    ప్రియంవదని అత్తయ్య బతిమాలుతున్న ధోరణిలో ఏదో అంటోంది. నన్ను చూసి ఆపేసింది.
    
    "పద...వెళ్దాం" అని జయంతిని తొందరపెట్టింది.
    
    ముగ్గురూ కలిసి వెళ్ళిపోయారు.
    
    కారు ఎక్కుతూ ప్రియంవద నాకేసి అదోలా చూసింది.
    
    నేను దమయంతిని నిలదీసి - "చెప్పు....ఆవిడెవరూ?" అన్నాను.
    
    "ప్రియంవద" అంది.
    
    "అంటే మీ చిన్నబాబు.....ఆవిడతోనే వుంటాడుకదూ!" అడుగుతుంటే నా కంఠం నాకే ఎబ్బెట్టుగా వినిపించింది.
    
    దమయంతి తల వూపింది.
    
    "వీళ్ళందరికీ ఆవిడంటే ఇష్టమేనా?" అడిగాను.
    
    "వాళ్ళాయన పెద్దబాబుగారితో బిజినెస్ పార్టనర్ ట! చిన్నబాబు చదువు కుంటున్నప్పటి నుండీ ఆవిడ ఈ ఇంటికి వచ్చేది. అని నావైపు చూసి-
    
    "ఇవన్నీ నేను చెప్పినట్లు అమ్మగారితో అనకండి. నా నోటికాడ కూడు తీసేసినవారౌతారు" అంది.

 Previous Page Next Page