Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 5


    నాకు ఎందుకో తల తిరుగుతున్నట్లూ, చాలా నీరసంగానూ అనిపించింది. ఆనంద్ కన్నా ఐదారేళ్ళు పెద్దయి వుంటుందావిడ. ఇంకా ఎక్కువేనేమో కూడానూ! ఈ పరిచయం....సంబంధందాకా ఎలా వచ్చింది? ఇదంతా తెలిసీ ఆవిడమీద ఈ ఇంటి మనుషులు ఇంత ఆప్యాయత కురిపించడం ఏమిటి? నా మనసుని కుదిపేస్తున్న సమస్య....ఆమె అందం! ఆమె మాట్లాడుతుంటేనూ....నడుస్తుంటేనూ ఇంత అందంగా వుంది. ఇక బెడ్ మీద ఎలా వుంటుందో!
    
    ఆనంద్ కి ఆమె శరీరంలో ప్రతి రహస్యం తెలుసు. ఆమెకి అతని ప్రతి అణువూ పరిచయం.....అతనికి స్త్రీ అంటే ఏమిటో తెలిసింది ఆమె ద్వారానే...నా తల పగిలిపోతోంది. ఎక్కడో వుందని తెలియడం వేరూ.... సవతిని కళ్ళారా చూడడం వేరూ! అందుకేనేమో నన్ను అంతఃపురంలాంటి ఇంట్లోకి విసిరిపారేశారు. లివింగ్ రూంలో పైన తగిలించిన చచ్చిన జింక మొహంలా నేనూ అలంకరణార్ధం ఆ ఇంట్లో వుంచబడ్డాను. ఆమె ఎంత దర్పంగా....అందంగా.... వుత్సాహంగా....సంతోషంగా వుందీ! మరి నేనో...
    
    పెళ్ళయిన నెల తర్వాత నా వివాహ విషయంలో నేను తప్పు చేశాను అనిపించింది. అప్పట్లో ఏ ఉద్యోగం దొరకకా, అమ్మమ్మని పోషించాల్సిన బాధ్యతా, సమాజంలో ఎదురయ్యే సూటీపోటీ మాటలకి తట్టుకోవడం వంటి సమస్యలు వుండడంతో ఇవన్నీ పరిష్కరించే సులువైన మార్గం ఇదే అనుకున్నాను. ఇప్పుడు కడుపునిండా తిండీ, కోరిన బట్టా, పనిలేకపోవడం వలన ఈ విషయం గూర్చి ఆలోచిస్తున్నాను అనిపించింది.
    
    ఇంటికొచ్చేసరికి మాధవి ఉత్తరం వచ్చి వుంది. దాన్లో అది నా కొత్తకాపురం గురించి వివరాలు అడిగింది. ఆనంద్ మనస్తత్వం, అతని అభిరుచులూ, ప్రవర్తనా మొదలైన విషయాల గురించి వ్రాయాలని అడిగింది. అందులో ఏ ఒక్క విషయం గురించీ తెలియని నేను ఏమని వ్రాయనూ? మాధవికి ఉత్తరంలో "నేను నా సవతిని చూశాను. డింపుల్ కపాడియాకి ఒక మెట్టు ఎక్కువగానూ, రేఖకి ఒక మెట్టు తక్కువగానూ వుంది" అని వ్రాశాను. ఆ తర్వాత ఎందుకో దుఃఖం ఆపుకోలేక చాలాసేపు ఏడ్చాను.
    
    ఆనంద్ ఆ రాత్రి ఇంటికే రాలేదు.
    
    అత్తయ్య ఫోన్ చేసి కొత్తరకం నగలేవో ఆర్డర్ ఇవ్వాలి. రేపు రెడీగా వుండు. నేను వచ్చి తీసుకెళతాను అని చెప్పింది. నాకు మొదటిసారిగా ఆరోజు "నాకు కావల్సినవి లోహాలూ....రాళ్ళూకాదు నీ కొడుకు. నా వయసే వున్న నీ కూతురు ఈ టైంలో ఏం చేస్తోందో అడిగి తెలుసుకో" అని అరవాలనిపించింది.
    
    ఇంతలో "అమ్మమ్మకి ఆయాసం ఎక్కువగా వుంది. రేపు మామయ్య కార్డియాలజిస్టుకి చూపిస్తానన్నారు" అంది.
    
    నా నోరు ఠక్కున మూసుకుపోయింది.
    
    అమ్మమ్మ ఆవిడ తురఫ్ ముక్క! నేను కృతజ్ఞత చూపించడం తప్ప ఇంకేమీ అనలేను.
    
    "థాంక్స్ అత్తయ్యా" అన్నాను.
    
    "అది మా బాధ్యత. నువ్వు ఈ మధ్య చిక్కినట్లు కనిపిస్తున్నావట! మామయ్యా చాలా దిగులు పడ్డారు. ఒకసారి డాక్టర్ కి చూపించమన్నారు" అంది.
    
    పాపం మావయ్య! నా గురించి చాలా దిగులు పడుతున్నాడు. కానీ వ్యాపారంలో పార్టనర్ తో గొడవలు రాకుండా, అతని భార్యకి వేళకి తన కొడుకుని సప్లయ్ చేస్తాడు! ఈయన సరే....మరి ఆయన మనస్తత్వాన్ని ఏమనాలి? భార్యకి అన్నీ కొనిపెట్టినట్టే ఇదీ కొనిపెడుతున్నాడా? ఆ ప్రశ్నకి సమాధానం చాలా తేలికగా నాకు స్ఫురించింది. ఇంట్లో కోడలు వుండడం వీళ్ళకి ఎంత ప్రిస్టేజ్ ఇష్యూనో ఆయనకీ యింట్లో భార్య వుండడం అంతే! గొప్పవాళ్ళు కదా....ప్రిస్టేజ్ కోసం ఏదైనా డబ్బుతో కొంటారు. కోట్లల్లో నడిచే వ్యాపారాన్ని అందుకే మావయ్యా ఆయనా సర్దుకుని నడిపిస్తున్నారు.....సో....నష్టపోయింది మాత్రం నేనొక్కతినే!
    
    మాధవి జవాబుకి బదులుగా తనే వచ్చేసింది.
    
    ఆనంద్ థాయిలాండ్ వెళ్ళాడు. వెంట ఆవిడ కూడా వెళ్ళే వుంటుంది. నేను దాన్ని చూసి చాలా సంతోషించాను. అది మాత్రం సంతోషించలేదు.
    
    "ఆ లోతుకి పోయిన చెక్కిళ్ళూ, కళ్ళకింద వలయాలూ....ఏమిటే ఈ బ్రతుకు?" అంది.
    
    "నాకేం తక్కువైందే?" బీరువాతీసి నా నగలూ, చీరలూ చూపించాను. "ఆడవాళ్ళు వీటికోసం ఎంత పిచ్చి పడతారో తెలుసా?" అన్నాను నవ్వుతూ.
    
    కానీ, నా చెక్కిళ్ళమీద నుండి నీళ్ళుకారి గుండెల్ని తడుపుతుంటే తెలిసింది నేను ఏడుస్తున్నానని!

    మాధవి నన్ను దగ్గరికి తీసుకుని "సుమా...ఆనంద్ నువ్వూ ఒకే బెడ్ రూంలో పడుకుంటారా?" అడిగింది.
    
    నేను విరక్తిగా నవ్వాను. "అసలు నైట్స్ ఇంట్లో వుంటే కదా పడుకోడానికి!"
    
    "ఇలా చెప్పడం నిజానికి నా స్వభావానికి విరుద్దం అనుకో. కానీ నువ్వు అతగాడితోనే జీవితాంతం కలిసి వుండాలనుకుంటున్నాను కాబట్టి చెబుతున్నా వయసులో వున్న ఆడపిల్లని చూసి మగాడు టెంప్ట్ అవడం చాలా ఈజీ. ట్రై చెయ్యి. అతన్ని ఆవిడ ప్రభావం నుంచి తప్పించి నెమ్మదిగా నీ దారికి తెచ్చుకోడానికి అదొక్కటే మార్గం. టెంప్ట్ హిమ్" అంది.
    
    "ఎలా?" అన్నట్లు చిన్నగా చూసాను.
    
    "చూడూ....ఆఫీసుల్లో.....బస్ స్టాప్ లలో, కాలు తగిలితే చాలు సినిమా హాళ్లలో ఈ మగాళ్ళు సులభంగా టెంప్ట్ అయిపోతుంటారు. అలాంటిది.....ఇంట్లో వున్న తన మనిషిని ఎందుకు వదిలేస్తున్నాడూ? అగ్నిసాక్షిగా పెళ్ళాడినవాడే అవకాశం దొరకగానే ఈ విషయంలో భార్యని మోసం చేస్తాడే.....అటువంటిది ఆవిడ పట్ల ఇతనెందుకింత నిజాయితీగా వుంటున్నాడూ? ఆలోచించు!" అంది.
    
    "ఫైవ్ స్టార్ హోటల్ లో తినేవాడు పాక హోటల్లో ఘుమఘుమలు చూసి ఎందుకు ఆశపడ్తాడూ?" అన్నాను.
    
    "ఆకలేస్తే అదే అత్యంత రుచి కాబట్టీ!" అంది.
    
    "ఇంకో మార్గం లేనప్పుడు!" అని గుర్తుచేసాను.
    
    ఆ విషయం గురించి అప్పటికే ఒక పెళ్ళికాని పిల్లతో చాలా అసహ్యంగా మాట్లాడేసాను అనిపించి - "ఇంకా ఈ టాపిక్ ఆపేసి....బయల్దేరు బయట ఎక్కడైనా లంచ్ చేద్దాం" అన్నాను.
    
    మాధవి కొద్దిసేపట్లోనే మామూలు మాధవైపోయి జోక్స్ చెప్పి నన్ను నవ్వించింది. అది చెప్పే జోక్స్ విని నవ్వుతూనే కావాల్సిన పదార్ధాలకి ఆర్డర్ యిచ్చాను.
    
    అంతలో నా కళ్ళు దూరంగా కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆనంద్, ప్రియంవదమీద పడ్డాయి. అంటే థాయ్ లాండ్ నుంచి వచ్చేసాడా? మరి ఇంటికి రాలేదే? అత్తయ్య ప్రొద్దుట ఫోన్ చేసినప్పుడు కూడా మాట మాత్రంగానైనా అనలేదే? వాళ్ళకీ తెలిసి వుండదా? అని ఆలోచిస్తూ ఉండిపోయాను.
    
    "సూప్ చల్లారిపోతోంది" మాధవి చేతిమీద కొట్టింది.
    
    "ఆ..." తెప్పరిల్లి సూప్ సిప్ చేసాను.

 Previous Page Next Page