అమ్మమ్మ నా తల నిమిరి "వేదవతి అత్తయ్య కొడుకు ఆనంద్ ని పెళ్ళిచేసుకుంటావా తల్లీ?" అని అడగగానే తల వూపేశాను.
మాధవి ఈ విషయం విని మండిపడింది.
"ఆ ఆనంద్ కి ఎవరో పెళ్ళయిన స్త్రీతో సంబంధం వుందనీ, అందుకనే పెళ్ళి వద్దంటున్నాడనీ నువ్వే చెప్పావు కదే! అలాంటివాడిని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావ్? అంతకన్నా ఎందులోనైనా పడి చావరాదూ!" అంది.
నేను కన్నీళ్ళతో "అమ్మా నాన్నా చిన్నప్పుడే పోతే ఎంతో కష్టపడి అమ్మమ్మ నన్ను ఇంతదాన్ని చేసింది. వేదవతి అత్తయ్య వచ్చి అమ్మమ్మ చేతులు పట్టుకుని ఏడ్చేస్తే అమ్మమ్మ ఒప్పేసుకుని మాటిచ్చింది. ఇప్పుడు నేను కాదంటే అమ్మమ్మ పరిస్థితి ఏమిటి?" అన్నాను.
"కాటికి కాళ్ళు చాచుకున్న ఆవిడ మాటకన్నా నీ నూరేళ్ళ బ్రతుకు ముఖ్యమే? నీ జీవితాన్ని నిప్పుల గుండంలో తోసి తన ముచ్చట తీర్చుకుంటానంటుందేమిటి మీ అమ్మమ్మ?" అని నెత్తీనోరూ కొట్టుకుంది.
ఆ రోజు రాత్రి అన్నం పెడుతూ అమ్మమ్మ అంది - "ఆనంద్ గురించి రకరకాల మాటలు విని అతన్ని చేసుకోవడానికి భయపడుతున్నావేమో...చిన్నతనంలో మగవాడు ఎవరో ఒకరి ఆకర్షణలో పడి తిరగడం దీపం చూసి శలభాలు ఆకర్షితమవడమంత సహజం. అతన్ని తనవైపు తిప్పుకోవడమే భార్య కర్తవ్యం. అదేమంత కష్టం కాదు. పెళ్ళయ్యాకా ఏదో ఒక వ్యవహారం పెట్టుకోని మగాళ్ళు చాలా అరుదు. అటువంటప్పుడు భార్యలు గొడవచేయడమో, సర్దుకుపోయి కాపురం చేయడమో చేస్తున్నారు. అలాంటిది ఇతనికి పెళ్ళికి ముందే ఏదో వుందని తెలియడంచేత మనం ఇంత ఆలోచిస్తున్నాం. తెలియకపోతేనో! నోర్మూసుకుని మురిసిపోతూ చేసుకునేదానివి కాదూ! మీ తాతయ్య ఏ ఊరెళ్తే ఆ వూళ్ళో ఓ ఇంటికొచ్చేటప్పటికి స్వర్గాన్ని తలదన్నేటట్లు ఇంటిని వుంచేదాన్ని. ఆఖరాఖరికి సుగుణ మణీ!....నీలాంటి ఉత్తమురాల్ని కష్టపెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది.....అని ఏడ్చేవారు. ఆ రోజుల్లోనే అంత పరివర్తన తేగలిగాను. చదువుకున్నదానివీ, ఈ రోజుల్లోదానివీ నీకెందుకొచ్చిన భయం?" అంది.
"ఇప్పుడీ సంబంధం కాదని మాత్రం నేను ఒరగబెట్టుకునేదేముంది అమ్మమ్మా? ఇంకోడూ నా రాత బాలేకపోతే ఇలాగే చేస్తాడు" అన్నాను. అన్నం సహించలేదు. చెయ్యి కడిగేసుకున్నాను.
"అయ్యో! మజ్జిగపులుసు నీకిష్టమని పెట్టానే. అప్పుడే అయిపోయిందా?" అంది కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ.
"బోలెడు ఆస్తి.....జీవితం హోదాగా, సుఖంగా గడిచిపోతుంది. అయినవాళ్ళు కూడానూ! ఆ పరంధాముడి చేతిలో నేనింత బుగ్గి అయిపోతే నీ గురించి వాడే చూసుకుంటాడు" అని అసలు సంగతి మెల్లగా బయటపెట్టింది.
'స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్' అంటే ఇదే! మావయ్య తనని పెద్ద వయసులో చూస్తాడని అమ్మమ్మ ఆశ. ఇంకోడైతే అమ్మమ్మని దగ్గర ఉంచుకోకపోవచ్చు.
నన్ను పెళ్ళికూతుర్ని చేసారు. మెడలో దండ వేసి పసుపుకుంకాలు పెట్టి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళే గొర్రెపోతులా అలంకరించారు.
పెళ్ళికి మాధవీ, రేణుకా, మంజులా అందరూ వచ్చారు. ఆనంద్ ని చూసి షాక్ తిన్నారు. ఆనంద్ నాకంటే అందగాడు మరి!
నేను చామనచాయలో సన్నగా, పొట్టిగా వుంటాను. నా కళ్ళు చాలా బావుంటాయని చూసిన ప్రతివాళ్ళూ అంటుంటారు. మాధవి మాత్రం 'సన్నని పెదవులతో నవ్వే నీ నవ్వు అద్భుతంగా వుంటుందే.... దేన్ని వదిలిపెట్టేసినా దాన్ని మాత్రం నాకోసం వదలకు" అంటుంది. అందుకేనేమో నేను కన్నీళ్ళు పెట్టాల్సిన సందర్భాల్లో కూడా నవ్వి వూరుకుంటాను.
ఆనంద్ ఇష్టంలేని పెళ్ళి చేసుకుంటున్నట్లు ధుమధుమలాడుతూ లేడు. ఫ్రెండ్స్ తో జోక్స్ వేస్తూ నవ్వుతూ, సరదాగా, హుషారుగా వున్నాడు. పొడుగూ, పొడుక్కి తగ్గలావూ, మంచి రంగూ....అందమైన హెయిర్ స్టయిల్....సూట్ లో చూస్తే మేల్ మోడల్ లా వున్నాడు.
మాధవి నా చేయి నొక్కి "ఐ విష్ యూ ఎ వెరీ హేపీ మేరీడ్ లైఫ్! అంది.
"ఏది ఏమైనా నేను హేపీగానే వుండదలుచుకున్నాను" అని నేను మాటిచ్చేశాను.
అత్తయ్యా, మామయ్యా చీరల షాపునే ఇంటికి పిలిపించినన్ని చీరలు కొన్నారు. అత్తయ్య నగలన్నీ పెట్టి నన్ను శోభనానికి అలంకరించింది.
జయంతి మా ఆడబిడ్డ. ఆమె భర్త డాక్టర్ వినోద్. వారికి ఒక బాబు ఎక్కువగా జయంతి పుట్టింట్లోనే వుంటూ వుంటుంది. అతనూ ఆమె కోసం వచ్చి ఇక్కడే వుంటూ వుంటాడు. అందుకే ప్రత్యేకంగా అల్లుడని ఎవరూ మర్యాదలు చేయరు.
ఆ రాత్రి నేను గదిలోకి వెళ్ళేముందు అమ్మమ్మ నన్ను దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుని "నే చెప్పినవి గుర్తున్నాయిగా" అంది. ఆ తర్వాత జయంతి వచ్చి తీసుకెళ్ళి గదిలో వదిలిపెట్టింది.
ఆనంద్ ఏదో వ్రాస్తున్నాడు. బహుశా డైరీ అనుకుంటా....నన్ను చూడగానే..." రా సుమతీ...కూర్చో!" అన్నాడు.
నేను వెళ్ళి మంచంమీద కూర్చున్నాను.
"నీకన్నీ తెలుసుగా..... ఈ పెళ్ళి లోకం కోసం మాత్రమే. నువ్వు ఆస్తినీ, అంతస్థునీ అనుభవిస్తూ పరంధామ్ గారి కోడలిగా మాత్రమే వుంటావు. డోంట్ ఎక్స్ పెక్ట్ మోర్ దేన్ దట్., చదువుకున్నదానివి, ఇంతకన్నా విప్పి చెప్పక్కర్లేదనుకుంటా" అని సిగరెట్ వెలిగించుకున్నాడు.
నేను పెద్దగా షాక్ అవలేదు. కానీ ఎక్కడో శూలంతో పొడిచినట్టు బాధపడ్డాను. "బావా! మరి ఎందుకీ పెళ్ళి చేసుకున్నారూ?" అన్నాను.
"మీ అబ్బాయి ఇన్నేళ్ళొచ్చినా పెళ్ళెందుకు చేసుకోడు అనడగుతుంటే అమ్మానాన్నలకి చిన్నతనంగా వుంటుందిట. అందుకూ" అన్నాడు.
డబ్బుంటే ప్రెస్టేజ్ కూడా కొనుక్కోవచ్చని నాకప్పుడే తెలిసింది. ఇంక ఇప్పుడు ఎవ్వరూ అడగరు. కళ్ళముందు ఒంటెడు నగలతో, పట్టు చీరలతో నేను అత్తయ్య వెనకాల తిరుగుతుంటాను కదా!
ఆనంద్ తో ఇంకా మాట్లాడాలనిపించింది కానీ అతను "గుడ్ నైట్...నా రూంలో చాలా మేగజైన్స్ వున్నాయి నిద్రపట్టకపోతే చదువుకోడానికి" అన్నాడు.
"నిద్ర మాత్రలున్నాయా?" అడిగాను.
అతను ఆశ్చర్యంగా "వాట్?" అన్నాడు.
"ఒకవేళ అవసరం అయితే..." అన్నాను.
"ఏది కావాలన్నా తెప్పించి పెట్టడానికి కరీం వున్నాడు. అతనికి చెప్తే చాలు" అన్నాడు.
కరీం అతని డ్రైవర్ మాత్రమే కాదు, నమ్మినబంటు అని కొద్దిసేపట్లోనే నాకు తెలిసింది.
సెల్ ఫోన్ మ్రోగగానే ఆనంద్ నెంబర్ చూసి బయటికి వెళ్ళిపోయాడు.
నేను అలాగే కూర్చుని వున్నాను.
అతని కారు గేట్ దాటి వెళ్ళిపోయింది.