Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 3


    రెండు చేతుల్తో ముఖాన్ని కప్పుకోవాలని అనుకున్నప్పుడు కుడిచేతిలో సగం ఫోటో కనిపించింది. అప్పుడు ఆశ్చర్యపోయింది. ఆ సగం ఫోటో ముక్కలో వున్నది తన ముఖం కాదు- తనెంతగానో యిష్టపడే  మధుది. ఆ ఫోటో వేపు చాలాసేపు చూసింది ప్రేమ.

 

    "మనిద్దరం పెళ్ళి చేసుకుందామా?" అంతకు కొన్ని నిమిషాల ముందు అనుకున్న మాటలు, ఆమెకు జ్ఞాపకం వచ్చాయి. "అవును...... ఎప్పటికైనా పెళ్ళి చేసుకుందాం" తన్మయంగా అనుకుంది ప్రేమ ఆరాధనగా.

 

        
                                           *    *    *

 

    మధుకి ఏం తోచడంలేదు.

 

    పదిరోజులుగా ప్రేమ కనిపించకపోవడంతో కాలుగాలిన పిల్లిలా వీధి అరుగుమీద తిరుగుతున్నాడు. ప్రేమ  ఊరెళ్లిందా? ఇంట్లోనే వుందా? ఇంట్లో వుంటే కనీసం తనని పలకరించకుండా ఎలా వుంటుంది?

 

    గత కొన్నిరోజులుగా చాలామంది చుట్టాలు ప్రేమ ఇంటికి రావడం చూస్తూనే వున్నాడు.

 

    ఇంతమంది ఆడచుట్టాలు, వాళ్ళింటికి ఎందుకెళుతున్నారు? వాళ్ళకేం పనీ పాటా లేదా? వాళ్ళింట్లో పనీ పాట లేకపోవడంవల్లే చుట్టాలు ఎవరింటికైనా వస్తుంటారా?

 

    ఎవరూ చూడకుండా మధు ప్రేమ ఇంటి వెనక్కి వెళ్ళి, గోడ ఎక్కి, చెట్టుచాటు నుంచి లోనికి తొంగిచూశాడు.

 

    ఇంటి వెనక  చిన్న అరుగుమీద , ఈతరేకుల చాపమీద, పట్టు పరికిణీతో ముచ్చటగా కనిపించింది మధుకి.

 

    ఆమె చుట్టూ ఎవరో అమ్మలక్కలు.

 

    "ప్రేమా......" నెమ్మదిగా పిలిచాడు.

 

    ఆ పిలుపు ప్రేమకు వినిపించలేదు. అమ్మలక్కలు కాసేపయ్యాక, నవ్వుకుంటూ లోనికెళ్ళిపోయాక-

 

    మళ్ళీ  పిలిచాడు "ప్రేమా......"

 

    ప్రేమ తలెత్తి  చూసి, చిన్నగా నవ్వింది.

 

    ప్రేమ నవ్వడం చూడగానే, మధు గోడ దూకి ఆమె దగ్గరికి పరుగెత్తాడు.

 

    "ఏయ్...... నా దగ్గరకు రావద్దు....." నెమ్మదిగా అంది ప్రేమ.

 

    "నీతో మాట్లాడాలి. ఆడుకుందాం రా....." ఆమె చేతిని పట్టుకోబోయాడు మధు.

 

    ఆ చేతికి దొరక్కుండా దూరంగా జరుగుతోంది ప్రేమ.


    
    "ఏయ్..... రమ్మంటే..... రావేం...... కొడతాను....." అంటూ ముందుకెళ్ళ బోయిన మధు నుంచి తప్పించుకోవడానికి పక్కకు లేచి, వెళ్ళబోయిన ప్రేమ- పక్కనున్న రాయిమీద కాలు జారి పడిపోయింది.

 

    ఆమె నుదుటికి దెబ్బ తగిలింది. మధు కంగారుగా అటూ ఇటూ చూశాడు. ఆమె నుదురు చిట్లి రక్తం కారుతోంది.

 

    ఏం చెయ్యాలో తోచక, షర్టుని చింపి, ఆమె నుదుటికి కట్టుకడుతున్న సమయంలో ఎవరో ఒకావిడ అక్కడకు రావడంతో-

 

    "జాగ్రత్త మళ్ళీ వస్తాను....." అని పరుగెత్తి, గోడెక్కి బయటకు దూకేసి, తన ఇంటికి పారిపోయాడు- వణుకుతున్న శరీరంతో వెళ్ళి, బెడ్ రూమ్ లో దాక్కున్నాడు.

 

    అతనికి రక్తం కారుతున్న ప్రేమ నుదురే గుర్తుకు వస్తోంది.

 

    అయిదు నిముషాల తరువాత ప్రేమ వాళ్ళ అమ్మ వచ్చి మధు తల్లితో గొడవ పెట్టుకోవడం వినిపించింది.

 

    "పెద్దమనిషైన పిల్లని కొట్టిపోవడమా..... మీ వాడి అల్లరి మరీ  ఎక్కువైపోయింది..... కొంచెం బుద్ది చెప్పమ్మా....." తల్లి కోపంగా ఇంట్లో మధును గదిలోంచి బైటకు లాగి నాలుగిచ్చింది.

 

    "నేను ప్రేమను కొట్టలేదు....." అంటూ ఏడుస్తున్నాడు.

 

    "మధు...... నన్ను కొట్టలేదు....." ప్రేమ వాళ్ళమ్మతోనూ చెప్పింది.

 

    ఆ మాటను ఎవరూ నమ్మలేదు. ఆ రోజు రాత్రి మధు అన్నం తినకుండానే  నిద్రలోకి జారుకున్నాడు.

 

    మూడురోజుల పాటు ఇంట్లోనుంచి బయటకు రాలేదు.

 

    తర్వాత-

 

    తెల్సిన విషయం విని ఆశ్చర్యపోయాడు మధు.

 

    ప్రేమ వాళ్ళకు ఢిల్లీ ట్రాన్స్ ఫరై  పోయిందట...... మొదట ప్రేమ, వాళ్ళమ్మ వెళ్ళిపోయారట.....

 

    మధు మనసు ఆ మాటతో మూగపోయింది.

 

    ప్రేమ మళ్ళీ  కనిపించదా.....? జీవితంలో అసలెప్పుడూ కనిపించదా....? బాధగా అనుకోని క్షణం లేదు.

 

    ప్రేమ కూడా-

 

    రైలెక్కడానికి ముందు రోజంతా మధు కోసం ఎదురుచూసింది.

 

    రైల్వేస్టేషన్ లోనూ ఎదురుచూసింది.

 

    తను వెళ్ళిపోతున్న విషయం తెలిసి, మధు స్టేషన్ కి వస్తాడనుకుంది.

 

    ఆ విషయం మధుకి తెలీదు.

 

    ఆమె ఎప్పుడైనా కనిపిస్తుందని మధు ఆశ.


    
    అందుకే ఆమె ఫోటో అంటే మధుకి ప్రాణం.

 

    ఆ ఫోటో అతని మనసులో గూడుకట్టుకున్న చిన్ననాటి చెప్పుకోలేని ఆరాధనకు, అభిమానానికి కొండంత గుర్తు.

 

    కొన్ని గుర్తులు కనిపించకుండా గాయాల్లా బాధపెడతాయి.

 

    నిజమైన ప్రేమ కూడా అంతే.....!

 


                                            *    *    *

 

    పెదపాడు......

 

    దాదాపు అయిదువందల ఇళ్ళున్న పెదపాడు ఊరి మధ్యలో రెండకరాల పొలంలో, మేట్లు వేసిన గడ్డి వాములమీద కూర్చున్నాడు ఏభై ఏళ్ళ భీమవరం సోమరాజు.

 

    పనిమనుషులకు చేసే పనుల గురించి చెబుతున్నాడు.

 

    "ఒరేయ్..... రాఘవా......" అని పిలిచాడు.

 

    నలభై ఏళ్ళ రాఘవ ముందుకొచ్చి, చాలా వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

 

    "ఆ బాలమ్మ ఎక్కడుందిరా?" అడిగాడు.

 

    "దానితో తమకేవైన అర్జంటు వ్యవహారమా బాబూ....." అడిగాడు రాఘవ.

 

    "దానితో నాకర్జంటు వ్యవహారాలేం వుండవ్..... ఇంటికెళ్ళి టిఫిన్ తెమ్మన్నాను..... గంటైంది..... ఆడవాళ్ళని గంటసేపు ఒంటరిగా వుంచకూడదు..... ప్రమాదాలు జరిగిపోతాయ్...... అదేం చేస్తోందో, ఒక్కసారి చూసోచ్చేయ్...." అని తన అనుమానాన్ని వ్యక్తపరచుకుండా, సహజ ధోరణిలో నర్మగర్భితంగా అన్నాడు.

 

    'గంటసేపు ఒంటరిగా వుంచకూడదా? నాకు తెలీదే..... మా ఆడమనిషి..... రోజంతా..... ఇంట్లో ఒంటరిగా వుంటుందే. ఏ ప్రమాదాలు జరిగిపోతున్నాయో.....' అని మనసులో అనుకుని ఒకసారి ఇంటికెళ్ళి పెళ్ళాన్ని చూసి, ఆ తరువాత బాలమ్మ విషయం కనుక్కుందామని గబగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

 

    అదే సమయంలో బాలమ్మ ఇంకో దారిగుండా అక్కడకొచ్చింది.

 

    "మీరు టిఫిన్ తెమ్మనారు గదండీ! అమ్మగారు భోజనం యిచ్చి పంపారు."

 

    "భోజనం పంపింది గదా. టిఫిన్ పంపలేదు కదా! దానిక్కూడా ఇన్నాళ్ళకు జ్ఞానం వచ్చింది. నాకిప్పుడు చాలా ఆనందంగా వుంది" అని ఆ బాలమ్మ ఇచ్చిన  కేరియర్ ను అందుకుని విప్పి తినసాగాడు సోమరాజు.

 

    "బాబూ! చాలాకాలం నుంచి నాకో సందేహం. మీరు భోజనం టైమ్ లో టిఫిన్. టిఫిన్  టైమ్ లో భోజనం చేస్తారేంటండీ?" అని అడిగింది బాలమ్మ అమాయకంగా.

 

    ఓసి పిచ్చిమొహా! అన్నట్టు బాలమ్మవైపు చూశాడు సోమరాజు.

 

    "ఓసి బాలమ్మా- టిఫిన్ ఎన్నిగంటలకి చేస్తారు? ఉదయం ఏడు, ఎనిమిది గంటల మధ్య. అదే  పట్నంలో అయితే ఎనిమిది, పది గంటల మధ్య, భోజనం పదకొండూ రెండు గంటల మధ్య. నేనేం చేస్తాను...... పదకొండూ రెండు గంటల మధ్య భోజనం చేసేస్తాను. అంటే దానర్థం ఏమిటి?"

 

    "భోజనం చేస్తారని."

 

    "భోజనమే. దాని అర్థం ఏంటని?"

 

    "టిఫినీ చెయ్యరని."

 

    "అంటే దానర్థం ఏమిటి?"

 

    "ఏంటో బాబూ- నాకు తెలీడం లేదు."

 

    "టిఫినీ చెయ్యను. అంటే రోజుకి టిఫిన్ ఖర్చు అంటే ఇడ్లీయో, ఉప్మాయో, కుడుం ఖర్చు ఎంత? ఎంత తక్కువ ఖరీదు వేసినా  పదిరూపాయలు. గత  పాతికేళ్లుగా లెక్కేసుకో" అన్నాడు భీమవరం సోమరాజు మన్ మోహన్ సింగ్  లెవల్ లో ఫోజ్ పెడుతూ.

 

    ఆ లెక్కలేవీ అర్థం కాలేదు పనిమనిషి బాలమ్మకు.

 

    అప్పటికే ఎండ బాగా  ఉండటం వల్ల కిందకు దిగిపోయాడు సోమరాజు.

 

    "బాలమ్మా! నేనింటికెళ్ళిపోతున్నాను. మన రాఘవగాడితో చెప్పుల్ని ఇంటికి పంపించెయ్" అని ఆర్డర్ వేసి ఇంటిదారి పట్టాడు సోమరాజు.

 

    "చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు గదా" అని గొణుక్కుంది బాలమ్మ.

 

    ఆ మాట సోమరాజుకి వినబడింది.

 

    "వెళ్ళొచ్చు. ఆ చెప్పులు అరిగిపొతే మళ్ళీ నువ్వు కొంటావా? నీ మొగుడు కొంటాడా? నా పెళ్ళికి కొన్న చెప్పులవీ....." అని విసుక్కున్నాడు సోమరాజు. పదేళ్ళుగా ఆయన దగ్గర పనిచేస్తున్నా, ఆయన లెక్కలేమిటో ఏమీ అర్థంకాలేదు.

 


                                          *    *    *

 

    విశాలమైన నాలుగు లోగిళ్ల ఇల్లు. ముందు పెద్ద ప్రహరీ. ఆరు బెడ్రూమ్ ళు, ఏడు బాత్ రూములు, పెద్ద హాలు, అద్భుతమైన ఫర్నిచరు, ఏడుగురు పనిమనుషులు.

 

    "ఒరేయ్ - దసరాబుల్లోడా..... ఎక్కడ చచ్చావ్ రా?" అని వినిపించిన పెద్ద అరుపుకి బెదిరిపోయి, గేటు దగ్గర చుట్టు కాల్చుకుంటున్న దసరా బుల్లోడు అని పిలవబడే సుబ్రహ్మణ్యం పరుగు పరుగున వచ్చాడు.

 

    వాడికి ఎదురొచ్చింది సూర్యాంబ. సూర్యాంబకు నలభై ఐదు ఏళ్ళుంటాయి. ఆరోగ్యంగా, పుష్టిగా నిగనిగలాడుతూ వుంటుంది. ఐశ్వర్యం అంటే సూర్యాంబ అనుకునేటంతగా, అందరూ అసూయపడేటట్టుగా వుంటుందావిడ.

 

    సూర్యాంబ స్వయానా సోమరాజు భార్య.

 

    "ఏరా- నువ్వు దొరబాబుగా ఫోజులు కొడుతున్నావ్. చిన్నబాబు ఎం.కాంలో చేరడానికి కాలేజీకి వెళుతున్నారు తెలుసుకదా. ఆ పిసినారి సోమరాజుని రమ్మని చెప్పాను. చెప్పావా..... ఆ కారుని తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చావా?" కోపంగా  అడిగిందావిడ.

 

    "ఆ పిసినారి సోమరాజుని పిలిచానండీ" అంటూ నాలిక కరుచుకుని "అయ్యగారికి కబురు పంపానండీ" అన్నాడు సుబ్రహ్మణ్యం.

 

    "వీడు నాకు కబురు పంపాడట" అదే సమయంలో లోనికొచ్చిన సోమరాజుకు వినిపించలేదు. అందుకే అతను బతికిపోయాడు.

 

    "ఆ కారుని వెంటనే తీసుకొనిరా...... ముహూర్తం దాటిపోతోంది" కసురుకుంటూ అంది సూర్యాంబ.

 

    దసరా బుల్లోడు వెనక్కి పరిగెత్తాడు.

 

    "ఏమిటీ...... కారంటున్నావ్?" అని అటూ ఇటూ చూస్తూ ప్రశ్నించాడు సోమరాజు.

 Previous Page Next Page